జీవన వ్యాకరణం

  • 408 Views
  • 0Likes

    పుట్టి గిరిధర్‌

  • మహబూబ్‌నగర్‌
  • 9491493170

మనమిప్పుడు
అక్షరాలుగా విడిపోయాం,
భాషాభాగాలు మాత్రమే పదిలమై
భావాలు ఎదసంద్రంలో కల్లోలమౌతున్నాయి!

వ్యాకరణం కట్టుబాట్లు
మన మధ్య సంధిని కుదర్చడంలేదు,
విభక్తులను తారుమారుచేస్తూ
విగ్రహవాక్యాలను కూల్చేస్తున్నాయి!

తత్సమమై, తత్భవమై
ఉద్భవించే మనిషి
పద్యమై, గేయమై, కవితై
వరదలా కొట్టుకుపోవడం ఎంతసేపు!

యతిప్రాసలు చూసుకునేలోపు
గణవిభజన చేసిన మనిషిపద్యం
కన్నీటి రాగమెత్తుతుంది,
శృతిలయలు నేర్పిన ఛందస్సు
అదుపుతప్పి ఆవేదనలో మునిగింది!

గాలిలా ఎగరాల్సిన గొంతులు
దుఃఖజీరతో కూలబడుతున్నాయి,
నవరసాలు ఒలికించాల్సిన ప్రక్రియలు
ఒకే రసాన్ని బృందగానం చేస్తున్నాయి!

శబ్దలేవీ సరైన అర్థాలివ్వనప్పుడు
ఎన్ని అలంకారాలు ఒడిసి పట్టుకున్నా
ప్రకృతిలోంచి వికృతాలంకారమే పుట్టి
గుండెపదం ఘొల్లుమంటుంది!

రాసిన వాటిని తప్పులుగా తలచి,
ఖాళీ కాగితాలను కళ్ళతో తిరగెయ్యాలి,
కాలమే కలమై స్వీయచరిత్రను రాసి
భవితను హెచ్చరిస్తుంది!

విజయ గ్రంథాలను గుట్టలుగా పేర్చినా
కఠిన హృదయాలను రంజింపజేయలేము,
కాలం కత్తి పట్టినప్పుడు
మనిషి కొత్త కావ్యంతో ఎదుర్కోక తప్పదు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌


వసంత విహారం

వసంత విహారం

నందిరాజు శ్రీనివాస్‌


హాస్యాస్పదం

హాస్యాస్పదం

కాసుల రవికుమార్