గోరింట

  • 98 Views
  • 0Likes

    వెగ్గలం ఉషశ్రీ

  • కరీంనగర్
  • 9440370066

ఆడపిల్లలనందరినీ ఒక్క చోట చేర్చి...
కొమ్మ కొమ్మనూ రిల్లి...
రుబ్బురోల్లతో గిరగిరా తింపేసి
ఎగదోసిన చేతుల నిండా పగడాలు నింపేసి
రకరకాలైన ఆకుల పైన చేరి
అందమైన రూపాలను అరచేతుల్లో అచ్చేసే
గోరింట తోటే అమ్మాయిలందరికీ...
ఆ జన్మ చుట్టరికం!
ఆ గోరింట...
ఆటాడే పాపాయి చేతుల్లోనేనా
ఒళ్లంతా మందారాలను విరబూయిస్తుంది!
అల్లరి అమ్మాయి అర చేతుల్లో
పచ్చపచ్చని కోకతో ఠీవీగా కొలువుతీరి
ఆకలంటూ అమ్మ చేతి కమ్మని ముద్దలు
కడుపార తినే కానుకిస్తుంది!
ఆ గోరింటే...
తన వరుని తలపులతో
సిగ్గుపడిన నవ వధువు
బుగ్గల కెంపులు
ఆమె అరచేతుల్లోన
ఎర్రని గులాబీలుగా విరబూయిస్తుంది!
అదే గోరింట...
ఆషాఢ మాసాన...
విరహవేదనతో ఒళ్లంతా సెగలైనా
కొత్తజంట తపనలను
తన చెలిమితో చల్లబరిచి
ఎదలోని ఊసులను అరచేతుల్లో
గన్నేరుగా విరబూయిస్తుంది!
పండుగైనా... వేడుకైనా...
ముత్తైదువుల చేతులను
ముద్దుగా ముస్తాబు చేసే గోరింట
ఔషధ గుణాలనెన్నింటినో
తన నిండా నింపుకున్న పెరటి మొక్క!
ఆ గోరింటే...
కాలుష్యపు కోరల చిక్కి
చిక్కిపోతూ ముగ్గుబుట్టలను తలపించే తలకట్టులకు 
కొత్త రంగులనిచ్చి
ముఖానికి కొంగొత్త అందాలనిస్తుంది!
నాటి నుంచి నేటి వరకూ
మగువలందరి మనసు మెచ్చిన
ఏకైక నేస్తం ఈ గోరింటేనేమో...!
అది ఈనాడు 
కాస్త కొత్తరూపు దాల్చి
శంఖాకారపు పొట్లాలలో ఒద్దికగా ఒదిగి
తన వయ్యారి నడకలతో
ఆధునిక వంపు సొంపుల
నయగారాలెన్నో పోతున్నా...
ఏనాడూ లలనామణుల
అరచేతులనొదలని
సహజ సౌందర్య పట్టమహీషే....!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి