పాపం! పసివాళ్లు!!

  • 1066 Views
  • 0Likes

    లగడపాటి భాస్కర్‌

  • విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు
  • శ్రీకాళహస్తి, చిత్తూరు
  • 9885470889

ఆటలాడెడు వయసున - అర్భకులను
ఆడుకోనీరు ఈనాటి - అమ్మ-నాన్న!
మూడు ఏండ్లైన నిండని - ముద్దుబిడ్ల
ఏల ఎల్‌కేజీలో తోసి - ఇండ్లనుంద్రొ!

బతుకుకోసము ఎప్పుడూ - బయట తిరుగు
తండ్రికైతేను తనవృత్తె - తలకు మించు
ముద్దు మాటల, ఆటల - ముదము కూర్చు
బాలకృష్ణులు, రాధలు - బడికిపోతె,
తల్లి టీవీని చూడొచ్చు - తన్మయముగ!

ఆటలాడేటి వయసులో - ఆటె సొగసు!
బాల్యమందలి అల్లరి - బలము కూర్చు
పిల్లలరుపులు, పరుగులు - పెంచు శక్తి!
బడిని బంధించి చదివించు - పాపమెద్దు!

శిశువు దశలోన రక్షణ - సేయదగును!
బాల్య దశలోని భాషణే - భాగ్యమగును!
తల్లిదండ్రులు, ఆ దశ - పిల్లవాండ్ర
చేర్చి అక్కున మురిపాలు - కూర్చ వలయు!

బడికి పంపాలి, చదువేమొ - వస్తదాడ!
చదువు వంటను బట్టించు - చర్యలింట
తల్లిదండ్రులు చేపట్ట - తగును ముందు!
‘మూడు - ఐదేండ్ల’ మధ్యది-ముఖ్యమౌను!

చిన్ననాటనె సంస్కారి - చేయవచ్చు,
మనము కన్నట్టి బిడ్డను - మనసుపెట్టి!
కేకు కోయుట, ఆర్పుట - కేండిలూది 
జన్మదినమును పండుగ - జరుప తగున?

ఆడుకోనిండు ఐదేండ్ల - ఈడుదాక,
అపుడు చదువుల తల్లికి - అప్పగించి
బాలవాక్కులు పల్కంగ - పలుక, వింటు
సంతసించండి తలిదండ్రి - సంతుజూచి!

బడికి పంపాలి క్రీడగా - బాలలను
శిక్షకారాదు చిననాడె - శిక్షణెపుడు!
చిన్నవాళ్లకు చదువును - చెప్పు గురుడు
తాను చిన్నగ మారుట - తగును ముందు!

ఆటపాటల బాలల - అలరజేసి
నేస్తమన్నట్టు జతకట్టి - నేర్పు మీర,
చిన్నవారికి చదువులు - చెప్పినపుడె
విష్ణుశర్మంత గురునికి - పేరు వచ్చు!

గురుకులాలని చెప్పుతూ - గొప్పపేళ్లు
పెట్టుకుంటున్న బడులలో పేదలరుగు!
ధనము కలిగిన వాళ్ళకే - దక్కు విద్య, 
వాసికంటెను ఉందాడ - వైభవమ్మె!

పుస్తకాల సంచి - బువ్వ, డబ్బానీళ్లు
సాక్సు, బూట్లు, టైలు - చాల కలవు!
ఇంటిముందుకొచ్చి - ఎక్కించుకొనిపోవు
వాహనాలు కలవు - వారి కౌర! 

బరువు సంచులు మోస్తారు - బాల్యమందె!
మెడలు, వీపులు, నడుములు - సడలిపోవ?
ఎంత చదివేరొ! ఈ మోత - కేమి ఫలమె,
పాపమనిపించు పసివారి - పాటు జూస్తె!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత