వాళ్ల నుంచి నేను

  • 1231 Views
  • 2Likes

    చంద్రబోస్‌

  • సినీగేయరచయిత,
  • హైదరాబాదు
చంద్రబోస్‌

భాషంటే మన గతపు గుండె ఘోష
భాషంటే మన వర్తమాన శ్వాస
భాషంటే మన భవితపైన ఆశ

ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు
తిక్కన్న చక్కంగ చెక్కింది తెలుగు
అన్నమయ్య పున్నమై వెెలిగింది తెలుగు
త్యాగయ్య తీగలై సాగింది తెలుగు
పోతన్న పూతలై పూసింది తెలుగు
అన్నన్న అందరికి ‘పెద్దన్న’ తెలుగు
ఎఱ్ఱన్న సోమన్న మన రామకృష్ణన్న
శ్రీ తెలుగు తరుణికి నాథుడున్నాడన్న
విశ్వనాథుడు నిలిచె తెలుగు శిఖరాగ్రాన
విశ్వ సత్యాలెన్నో వివరించె వేమన్న
అవనిపై అభిమానమతని అడుగుల జాడ
నడిచాడు అందరినీ నడిపాడు  గురజాడ

అంగనల స్వేచ్ఛకై అచంచలము
అంగలేసిన కలం పేరు ‘చలము’
కవితయను కన్యకి పోరాట పురుషుడికి
పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ
పంట చేలల్లో పద సంచారి నండూరి
సుజ్ఞాన పీఠికలు సినారె రావూరి
భావ కవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి
జాను తెనుగుల బోధ మాను మల్లాది
తల్లి భాషకి అడుగు ముళ్లపూడి బుడుగు
గ్రామీణ యాసకు గొడుగు పట్టెను ‘గిడుగు’
తెలంగాణాలెగసె శరథి మన ‘దాశరథి’
సరస్వతి సంతకం ‘మధురాంతకం’

అంత్యప్రాసల ముద్రకాది ‘ఆరుద్ర’
తెలుగు తలపై క్రౌను ‘ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌను’
అమృతం కలిపిన అంబలి
ఆ కవనమాలి పింగళి
సత్యమౌ సాహిత్య మౌక్తికాల
నిత్య నిలయం సప్త ‘సముద్రాల’
తన పాట తెలియని గాలేది నేలేది
మన బాధ తన భావమైన జాలాది
కాలమను కడుపులో కాలితే ‘కాళోజి’
గాయాల గుండెపై చద్దరే ‘గద్దరు’
పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్య
మనసు ఆకలి తీర్చు మన సుకవి ‘ఆత్రేయ’
వేలవేల గంగల వాగ్ఝరి ‘వేటూరి’,
వెన్నపూతల అగ్నికీల ‘సిరివెెన్నెల’
యుద్ధాల యాసతో గొంతెత్తె సుద్దాల
ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి
పాటలే వూరేటి వెంకన్న గోరేటి
నా తాత అయ్య కారు పండితులు
నా బంధుమిత్రులు కారెవరు కవులు
నాకైత నా పాట స్వయం సంపాద్యం
అంతా అనుశృతం కొంత అనుశీలనం
అణువంత కలిగింది వాణి అనుగ్రహం
పైవాని అనుగ్రహం...
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌