రావె తటిల్లతా

  • 1147 Views
  • 0Likes

    వీటూరి భాస్కరమ్మ

  • విశాఖపట్నం
  • 9248409202
వీటూరి భాస్కరమ్మ

రావె తటిల్లతా చినుకు రాలని ఎండిన నేల తల్లికిన్‌
నీవె కదా తుషార రజనీకర రేఖవు ప్రాణి కోటికిన్‌
జీవము నివ్వవే వెలుగు జిల్గుల బంగరు సోయగాలతో
నీవరుదెంచినన్‌ పుడమి నిత్యవసంతము కాకపోవునే
భావము చల్లగా పసిడి పంటలతో సిరులొల్కి పోవగా
నీవె దిశాంచలాల కడు నేర్పుగ నర్తనమాడు వేళలన్‌
నీవగలున్‌ యొయారములు నిస్వనముల్‌గని రైతు బిడ్డలా
శావహులై పొలమ్ములకు సాగిరి చంద్రుని చుట్టియున్నరే
ఖావలయమ్ము సూచి పులకాంకితులై ‘‘అదె చందమామ తా
కోవెల గట్టె వర్షమిక కొల్లల’’టంచును బల్కె పామరుల్‌
ఆ వచనమ్ములన్‌ మృషగ అక్కట సేతువె జాగుసేయనే
లా వరణీయ జృంభిత విలాస రుచుల్‌ గగనాంతరమ్ములన్‌
ప్రోవులు ప్రోవులై చిలికిపోవగనిమ్ము ముఖాబ్జదీధితుల్‌
శ్రావణలక్ష్మికిన్‌ చినుకు సంపదలై తరళించి పోవగన్‌
తీవెలు సాగి స్వర్ణమయ దీప్తులు ధారుణియందు నింపుచున్‌
దేవతలెల్ల నిన్ను వినుతింపగ సుందర స్వర్ణరేఖలై
పావన మేఘమాలికల పంక్తుల మాటున నాట్యమాడుచున్‌
నీవరుదెంచినన్‌ సిరులు నిండి వసుంధర పుల్కరింపదే
ఆ వసుధా వికాస దరహాస విలాసము మానవాళికిన్‌
దీవెనయౌచు రంజిలగ దివ్య విరాజిత రాగహేలవై
శ్రీవిలసిల్లగన్‌ గగన సీమల దాగుడు మూతలాడుచున్‌
వే వెలుగుల్‌ జ్వలింపుచును వెల్లువయై కురిసేటి వర్షపున్‌
జీవనధారకున్‌ సొగసు చేకురునట్లుగ ప్రేమమూర్తివై
రా వొలికింపు నీ హొయలు రంజిత రాజిత నాట్యభంగిమల్‌
ఆ వినువీధులన్‌ పరచి అమృతధారలు చిల్కరింపుచున్‌
మా వగపంత తీరగను మాయగ చింతలు మంజులాంగివై
రాలె తటిల్లతా! భువన రమ్య విరాజిత! వారుణీసుతా!
నీవరుదెంచినన్‌ పుడమి నిత్య వసంతము కాకపోవునే

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


బాల్య‌పు సంక్రాంతి

బాల్య‌పు సంక్రాంతి

డా।। పి.కామేశ్వరీ జయలక్ష్మి


దృశ్యాదృశ్యం

దృశ్యాదృశ్యం

కొప్ప‌ర్తి వ‌సుంధ‌ర‌


సోపతి

సోపతి

పొన్నాల బాలయ్య


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


అమ్మ కాని అమ్మ

అమ్మ కాని అమ్మ

ఎల్‌.ఎన్‌.కావలిపాటి