కన్యాదానం

  • 1214 Views
  • 0Likes

    ఐతా చంద్రయ్య

  • సిద్ధిపేట
  • 9391205299
ఐతా చంద్రయ్య

పద్దెనిమిదేళ్లు ఆపై
ముద్దుల గారాలపట్టి ముగ్ధ తనయ, వా
క్శుద్ధిన విద్యలు నేర్వగ
బుద్ధిగ కల్యాణ ఘడియ, పొలుపుగ వచ్చెన్‌
బుద్ధిమంతుడు వరుడని బోధపడగ
కన్యకామణి మనసంత కమ్మనాయె
వలపు తలుపులు తెరిచియు పిలిచినంత
పెళ్లి పందిరి వేదికై కళ్లు కలిసె
సుమంగళం, సుఖాసనం, సుశోభితం, విరాజితం.
సమాంతరం, సుహాసితం సుజాత సిగ్గు బుగ్గలే
ప్రమాణమందు అగ్ని జ్వాల ప్రజ్వరిల్లె సాక్షిగా
అమాంతమొక్కటైన రెండు ఆశయాల సంగమం
నాదస్వరములు మ్రోగెను
వేదమ్ముల మంత్ర మహిమ వెతలను బాపెన్‌
మోదమ్ముగ సూత్రధారణ
వేద ప్రమాణముగ జరిగె వేడుక తోడన్‌
వధువు కన్నవారల ఎద బాధ తీపి
అన్నదమ్ముల గుండెల అలజడాయె
బంధు మిత్రుల హృది సింధు మంథనమ్ము
అప్పగింతల సమయాన ఆత్మఘోష
బోసి నవ్వులు విరబూసిన వేళలో
      నేలన పారాడ నేర్పినాము
అమ్మ-నాన్న మరియు అత్త-మామలటంచు
      చిన్నారి మాటలాడించినాము
బుడిబుడి నడకలు వడిగ ఉండొద్దని
వేలుబట్టి అడుగు లేయసాగె
పట్టంచు జాకెట్టు, పావడాలను వేసి
      ముక్కుకు పెట్టాము ముక్కుపుల్ల.
పాఠశాల విద్యలు నేర్చి పల్లవించె
పెద్ద కాలేజికంపాము పిల్లనపుడు
వంటపనులన్ని నేర్పించ ఇంటిలోన
పసిడి బొమ్మగా పెరిగింది మిసిమిసొగసు
ముసిముసి నవ్వులన్ని విరమోముకు ముత్యపు కాంతులద్దగా
రుసరుసలాడు వాలుజడ రోషముతో పరువాలు చిందగా
మిసమిసలాడు సొంపులవి మీనములాయెను కంటి చూపులే
గుసగుసలాడు గుండెలను గుమ్ముగ దాచెను వోణిసోయగాల్‌
అనుచు వధువు కరములనువుగా చేపట్టి
వరుని చేతికిచ్చె పరువు, గుండె
గంగ-యమున నదుల సంగమమైపోయె
కడుపులోని పొంగు కనులకొచ్చె
నరముల స్వరఝరి నందున
వరుసగ కరుణారసమ్ము వంకలు దిరిగెన్‌
తరుణి తల నిమిరి ఆత్మలు
దరువుగ దీవించి వరుని బతిమాలిరిగా
పోయిరావమ్మ పోయిరా! హాయిగాను
పుట్టినింటి పరువు నిల్పు మెట్టినింట
భార్య భర్తల బంధము భారతాన
సూర్యచంద్రులు మెచ్చిరి సురలతోడ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత