మనసుకు మనసుకు మధ్య రహదారి

  • 863 Views
  • 0Likes

    - ఈతకోట సుబ్బారావు

  • నెల్లూరు,
  • 9440529785

కనుపాపల్లో స్నేహ జలదాలు కమ్ముకోవాలి
వెన్నెల జలంతో కడుక్కున్న ముఖంలో
పెదవులపైన పూలు పూచే తీగలు అల్లుకోవాలి
చేతులు రెండూ సముద్రమంత విశాలంగా చాచి
ఛాతీని ఆకాశంలో పరచి ఆహ్వానించాలి
స్కూలు పిల్లలు ఆడుకొనే ఆట మైదానంలా
ఎదటి పక్షం గాయపడకుండా పచ్చికై పరుచుకోవాలి
ఎంతైనా మానవ మాత్రులం ఎంగిలాకులం
ఎండమావుల వెనక పరిగెత్తి పరిగెత్తి సంతులనం కోల్పోయిన వాళ్లం
పోగేసిన వంచనాటవిలో మోసపోయి
స్వార్థ సంకుచిత వ్యథార్థ వృథాకేళిలో ఓడిపోయినా
వీడని ఆశానిరాశల క్రీనీడలో నిల్చున్న వాళ్లని
ఏ పరిష్వంగంలాంటి సంజీవకరణి ప్రయోగమో చేయాలి
మనిషిని జయించే పుష్పకృపాణం కదా చిరునవ్వు
నమ్మకాలెండిన ఊటబావి మోట వద్ద ఒంటరిగా నించున్నప్పుడు
ఒక చిన్న ప్రహారం చాలు మనిషిని జయించటానికి
విశ్వమానవ సామ్రాజ్య చక్రవర్తిగా నిలబెట్టడానికి
ఆలోచన లేకుండా ఏ పనీ చేయలేనప్పుడు
అనాలోచితంగా హృదయ ద్వారాలు తెరచుకొని
వేణుగాన లాహిరి ఏదో లోలోపలకి ప్రవేశిస్తున్నప్పుడు
సిరిసిరి మువ్వల గువ్వల చప్పుళ్లతో
సుతి మెత్తని ఊపిరి అడుగులేవో గుండెని స్పృశిస్తున్నపుడు
శాద్వలాలనాడించే లేలేత చిరుగాలిలాంటి చిరునవ్వు కృపాణంతో
పాషాణ ద్వేషాన్ని వజ్రకాంతిలా సంహరించాలి
మనసుకు మనసుకు మధ్య మమతల రహదారి కోసం
నిరీక్షిస్తున్న ప్రతిహారిని ఆత్మసంగమంతో కౌగిలించాలి!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చైత్ర గంధం

చైత్ర గంధం

సాంధ్య‌శ్రీ‌


నవ యుగాది

నవ యుగాది

బందరు శ్రీదత్త


పుట్టిన ఊరు గుర్తుకొస్తుంది

పుట్టిన ఊరు గుర్తుకొస్తుంది

అడిగోపుల వెంకటరత్నమ్‌


జీవిత శిల్పం

జీవిత శిల్పం

శైలజామిత్ర


సమయం నీది కానపుడు

సమయం నీది కానపుడు

బి.అనిల్‌ డ్యాని


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ