సమీప దూరాల సఖ్యతలు
సరిహద్దులు గీస్తుంటే
మినహాయింపుల్లేని మనుషుల మధ్య
అగుపించని నిషేధాజ్ఞలు
రసవత్తర నాటకాలకు
తెరలు తీస్తుండగా
నొసళ్లవెక్కిరిస్తున్నా
ఆత్మలు లేని దేహాలనుంచి
దాహాలు తీర్చలేని మాటల ప్రవాహాలు
నమ్మకమైన అపనమ్మకాల మధ్య
మాటలన్నీ అవసరాలకు పూసిన
నకిలీ పూలే
అనగా అనగా మనిషి
మాటమీదే నిలబడే వాడట
ఇప్పుడు మాటలూ చేతలూ
సమాంతరంగా సాగుతుంటాయి
తేనె పూసిన మాటల వెనక
గరగరమనే చేదు పాట
అందరం ఒకే ఆకాశం కింద
తల దాచుకుంటున్న వాళ్లమేగా
ఎల్లలు లేని సమూహ సమాజాలను
స్వప్నిస్తే మాత్రం తప్పేముంది
ఊపిరి తీసిన ప్రతిసారీ
కాసింత ప్రేమను విశ్వసిస్తే పోయేదేముంది
నాకిప్పుడు
పొదుగు నుంచి జారి లేగ కడుపు నింపే
పచ్చిపాల లాంటి మాట కావాలి
చీకటి కప్పుకున్న దుఃఖాలపై
వెలుగు వాగులా ప్రవహించే
కాంతిమంతమైన మాట కావాలి
నల్లమల కొండలపై విచ్చుకున్న
అడవి పూల సుగంధం లాంటి
స్వచ్ఛ సహజమైన మాట కావాలి
డొల్లమాటల మాయాజలతారు
ప్రవాసాలు నాకొద్దు
మొగ్గలై విచ్చుకునే
మాటల జనప్రమోదాల్లో
తేలిపోవడమే నాకిష్టం
మాటంటే మనిషి మాత్రమే ధరించే
మణిమయ మకుటం కదా!
మాటంటే మనుషుల మధ్య అల్లుకునే
ఆత్మీయ సేతు బంధనం కదా!