ఇంకా అక్కడే ఉన్నట్టు

  • 1082 Views
  • 0Likes

    అరుణ నారదభట్ల

  • మంథని, పెద్దపల్లి జిల్లా.
  • 9705015207
అరుణ నారదభట్ల

ఒక్క నదీప్రవాహ శబ్దం తప్ప
అంతా నిశ్శబ్దమే
అటు మహాలోయ
ఇటు అరణ్యపర్వతం
పాపిటతీసిన జుట్టులా రోడ్డు
అర్ధరాత్రి ఉషోదయం మా
ప్రయాణం
చల్లగా నిదురిస్తున్న కాలం
కిటికీలోంచి దూసుకొచ్చే చీకటిరాగం
కళ్లు మూతలుపడేలోపే
గతుకుల దారుల్లోంచి ఉయ్యాలలూగుతూ
లోయ అంచులనానుకొని పరుగెత్తుతున్న
నాలుగు చక్రాల్లో జీవితం
గుట్టల మధ్యన ఆగిపోయిన కేబుల్కారులా
బస్సూ నిలిచిపోయింది
జోలపాట పాడేనది
ప్రేమగా హత్తుకున్న నిశీధి
పసరు వాసనల ఔషధ వీచికల మందహాసాలు
చెట్ల కొమ్మల తీగల తీయని మౌనభాషలు
చినుకు చినుకుకూ పరవశిస్తూ
కౌగిలింతల్లో ఉనికి మరిచిన ప్రేయసీ ప్రియుల్లా
అక్కడంతా తడితడిమట్టే
యోగముద్రలో లీనమైన మునుల్లా కొండలు
పంచభూతాలనావహించిన సంజీవినిలా
ప్రశాంత హరితధార!
ఆ మట్టికి నేనంటే ఇష్టమనుకుంటా
అర్ధరాత్రి నన్నక్కడే ఆపేసింది
ఆవలి తీరపు సూర్యుడు
చిన్నగా నవ్వినట్టు మసక వెలుతురు
చెట్టుచెట్టుకూవాలే రంగురంగుల సీతాకోకచిలకలు
పక్షుల కిలకిలలు కువకువలూ
సప్తస్వరనాదంలా
పశుపతి ప్రణవంలా సో... హం!
ఆకాశం నన్ను తాకాలనుకున్నట్టుంది
ప్రేమగా పొగమంచులా మారి
అమ్మపొత్తిళ్లలోకి దూరి తలదాచుకున్న పసిపిల్లల్లాంటి పర్వతశిఖరాలను కప్పేస్తూ
నెమ్మదిగా నన్నూ అలుముకుంది నిశ్శబ్దంగా తెల్లవారేలోగా
దారంతా నిలిచిపోయిన వాహనాలే
ఒంటరితనాన్ని మోయలేక
ఆ ఆవరణ మనుషుల్ని
అలా చెక్‌పోస్టు రూపంలో కట్టేస్తుంది
అందుకేనేమో అంతటి అడవిలోనూ
భయానికి తావులేదు
బాధ్యతలూ గురుతుకురావు
ఒంటరిగా ఉన్నా
విశాల సృష్టి
తన ఆత్మీయస్పర్శతో
హత్తుకొని ఆకాశంవైపునకు నడిపిస్తున్న అనుభూతి!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


బాల్య‌పు సంక్రాంతి

బాల్య‌పు సంక్రాంతి

డా।। పి.కామేశ్వరీ జయలక్ష్మి


దృశ్యాదృశ్యం

దృశ్యాదృశ్యం

కొప్ప‌ర్తి వ‌సుంధ‌ర‌


సోపతి

సోపతి

పొన్నాల బాలయ్య


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


అమ్మ కాని అమ్మ

అమ్మ కాని అమ్మ

ఎల్‌.ఎన్‌.కావలిపాటి