మా ఇంటి ముందరున్న పరుపుబండ
ఆత్మీయ పలకరింపులకు వేదిక తాత
పొద్దువొడువంగ బండమీద కూసున్న తాతతో
బతుకు ముచ్చట్లు గడిచిన జ్ఞాపకాలు
స్మృతులన్నీ తవ్వుడే ఏకరువు వెట్టుడే
ఎదుర్కొన్న అనుభవాలు నెమరువేసుకునుడే
బారెడు పొద్దెక్కిన బతుకు కథ ఒడువదు
విచారంతోనున్న మనిషిని చూస్తే
ఓదార్పు మాటలతో భరోసానిస్తడు
బతుకు భాష్యాన్ని తెలిపి
జీవనంపై ఆశలు చిగురింపజేస్తడు
కొత్తగా జంటైన సోరోళ్లు కనబడితే
కడుపు పండేదెప్పుడంటూ ఆటపట్టించి
చల్లని దీవెనలు ఇస్తడు
సమాజపు పోకడలను ఏకరువు పెడతాడు
మనుషుల మనసుల అంతరంగాలను అంచనా వేస్తాడు
నాటి నేటి కాలానికి అతనొక వారధి
తన పరివారానికి తానొక సారథి