చెరువు...!

  • 3043 Views
  • 1Likes

    ఎ.కిశోర్‌బాబు

  • విజయవాడ
  • 8754995544
ఎ.కిశోర్‌బాబు

ఇక్కడ
కొన్ని జీవితాలుండాలి
కొన్ని జ్ఞాపకాలుండాలి
కొన్ని పండగలుండాలి
కొన్ని పరమాన్నాలుండాలి
కొన్ని సంబరాలుండాలి
కొన్ని సంతోషాలుండాలి
కలుపు పాటల కోలాహాలాలుండాలి
కంకి కొడవళ్ల కోలాటాలుండాలి
ధాన్యపు రాశుల దరువులుండాలి
తూరుపెత్తే గాలి పాటలుండాలి
గడపల నిండా పొర్లిపోయిన
పంట కుప్పల గురుతులుండాలి
ముంగిళ్ల ముందు
ముగ్గుల ముచ్చట్లుండాలి
చెరువు బంక మన్నులో తీరిన
వినాయక ఉత్సవాలుండాలి
ఇక్కడో ఊరుండాలి
ఇక్కడో చెరువుండాలి
ఏమైపోయాయ్‌ ఇవన్నీ
ఎక్కడికెళ్లిపోయాయ్‌ అవన్నీ
.....
చెరువంటే
ఒట్టి నీటి కుండనుకునేరు
చెరువంటే....
మా ఊరు...
మా పల్లె
మా జీవితం
మా ఆశ
మా శ్వాస
చెరువంటే...
మా పల్లె బతుకుల ఉత్సవం
మా దేశ జనుల జాతకం
చెరువుకు మొరవొస్తే
పల్లెకు పులకరమొచ్చినట్లే
పొలానికి పురిటి నొప్పులొచ్చినట్లే
పంట కడుపు పండినట్లే
చెరువులో చేపల వేట
పల్లె జీవితానికో జాతర
ఊళ్లో కొంపలన్నీ
చేపల పులుసు కంపు కొడితే
పల్లె బతుకులు కమ్మగా పరిమళిస్తున్నట్లే
.....
ఏమైందో 
నా పల్లెకు... ఈ చెరువుకు
పల్లె కొంపల్లో
చేపల పులుసు 
ఘుమాళించడం లేదు
కొన్నేళ్లయింది
మా చెరువులో నీటి అలజడి కనిపించక
చేపల సడి వినిపించక
మా ఊరిని చూసి
వాన దేవుడికి వెగటేసిందేమో
చుట్టం చూపుగానూ రావడం లేదు
ఎన్ని కప్పదేవర్లు చేసినా
రావిచెట్టు, వేపచెట్టులకు
ఎన్ని పెళ్లిళ్లు చేసినా
ఊరి గంగమ్మకు
ఎన్ని దున్నపోతులు బలిచ్చినా
ఎన్ని పొట్టేళ్ల తలలు నరికేసినా
నీళ్ల మబ్బులు
ఊళ్లోకి తొంగి చూడటం లేదు
చెంబుడు నీళ్లయినా పోసి
చెరువు గొంతు తడపడం లేదు
ఊరి పైర్ల దాహం తీర్చడం లేదు
పల్లె పుడమి పలకరించడం లేదు
చినుకు కోసం ఎదురు చూసీ చూసీ
ఊరు కళ్లు ఒట్టిపోతున్నాయి
నేల గుండెలు పగిలిపోతున్నాయి
నిండు కుండలాంటి చెరువు
నెర్రలై పగిలిపోయి
పర్రెలై పొగలిపోయి
కంపచెట్ల కంపు కొడుతోంది
నీళ్లు లేక
పొలం బీడై...
మొలకలెత్తక మొద్దుబారిపోతోంది
పల్లె జీవితం పరిగలైపోయి
పట్నాలకు పారిపోయి
కూలి చిత్రమై కూలిపోతోంది
రతనాల సీమ రాయలసీమలో
మా ఊరి చెరువే కాదు
ఏ చెరువు గుండె తట్టినా
ఏ పల్లె గడప తొక్కినా
కనిపించేది
ఇదే..కథ
వినిపించేది
ఇదే...వ్యథ!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరుగు

అరుగు

డా.రంకిరెడ్డి రామ‌మోహ‌న‌రావు


మరుపురాని అద్భుతం

మరుపురాని అద్భుతం

శ్రీదేవి సురేష్‌ కుసుమంచి


ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


రాగమాలికలు

రాగమాలికలు

డా।। అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి


వాళ్ల నుంచి నేను

వాళ్ల నుంచి నేను

చంద్రబోస్‌


చెమర్చిన కళ్లు

చెమర్చిన కళ్లు

గంజాం భ్రమరాంబ