కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

ఆశాకిరణం

ఆశాకిరణం

దిగులుమబ్బుల్లో తప్పిపోయిన ఆలోచన శూన్యాకాశపు చూరుకు గబ్బిలంలా వేలాడుతుంది తొక్కిపెట్టిన ఆనకట్టను దాటుకుని అక్షరాలు కన్నీటిబొట్లై రాలిపడుతుంటాయి అడుగడుగునా లెక్కించలేనన్ని ముళ్లతో పాదమంతా నెత్తుటివరద ఎంత నచ్చజెప్పినా మాట వినని చిన్నపిల్లలా మెలితిరిగిన మనసు చీకటి కలుగులో ముడుచుకుంది రాత్రులను పగళ్లుగా తర్జుమా చేయలేని అశక్తత కనుపాపలపై సాలెగూడులా అల్లుకుంది మసక వెలుగుతో పడమటకు జారిపోతున్న సూర్యుణ్ని వేలెత్తి చూపిస్తూ అద్దంలోని ప్రతిబింబం వెక్కిరిస్తుంది లోపల సముద్రాలు కర్ణకఠోరంగా విరుచుకుపడుతున్న మోత శ్వాసాడని ఉక్కిరిబిక్కిరితనం చుట్టుముడుతుంది భరించలేనంత నిశ్శబ్దం నల్లని నీడలా వద్దన్నా కౌగిలించుకుంటుంది ఈదేకొద్దీ సుడిగుండం మరింత లోపలికి లాగేస్తుంది తెలియని బాధ చిక్కగా నేలంతా ఒలికిపోతుంది రెపరెపలాడుతూ కొడిగడుతున్న దీపం తనలోకి తనే చమురును ఒంపుకుని గుండెవత్తిని ఎగదోసుకుంటూ హృదయం పగలకుండా సరికొత్త వెలుతురు పాటేదో శ్రుతి చేసుకోక తప్పదు ఉన్నట్టుండి తెల్లవారు ఛాయలలో ఆశాకిరణం తళుక్కుమంటూ కర్తవ్యాన్ని బోధిస్తుంది తడితడిగా వాక్యం నడిచొస్తుంటే బరువుగుండె చప్పున తేలికపడుతుంది.
 కరోనా విలయం

 కరోనా విలయం

వీధుల్లో ఏ సడీ లేదు తలుపుల అలికిడీ లేదు సీసా తెరచి ఈ భూతాన్ని బంధించేదెవుర్రా! అని, ఒక్కొక్కరూ పడకమీద మేను వాల్చి వేడి నిట్టూర్పులు వదుల్తూ.. కాలంలో  విరుచుకుపడ్డ మహమ్మారుల  ఇనుప గజ్జెల నాట్యాన్ని నేను చూశానంటే నేను చూశానని ఒకడూ  మా అయ్య కాలంలో జరిగిందని మరొకడూ  ఇంత విపరీతం ఏనాడూ చూడలేదని... కాలజ్ఞానాలూ.. బైబిల్‌ ప్రవచనాలూ..  నెరవేరే కలికాల ఆగమ చిహ్నాలే  ఈ విషగాలులనీ మరొకరూ దిగులు చెందుతూ... దీనులౌతూ దిగుల దుప్పటి కప్పుకుని రేపటి వెలుతురు కోసం  కిటికీలు తెరిచే ధైర్యం చాలక ముసుగులూ.. మాస్కులపై అవగాహన చిక్కక గుమ్మందాటి ఇవతలకి రావద్దనే ఏలినవారి ఎచ్చరికను కాదంటే ఏటౌదాదీ..!  లచ్చుమన్నరేఖ దాటొచ్చిన సీతమ్మోరి కథ  తెరిపిన కొచ్చి ఆరగారగా గొంతు తడిపే  ముంతకల్లు మాటే మరసి వడగాలికి అల్లల్లాడే పిట్టగూడు మాదిరి జారిపోతున్న పిడతంత గుండెను దిటవు చేసుకుని ఒకే మాట పదే పదే అనుకున్నారు ఖండాలిప్పుడు ఒక్కటయ్యాయి... కారుణ్యంతో మానవులంతా ఒక గూటికిందకొచ్చారు ఆయుధాలు వదలిన చేతులే  శుభ్రత కోసం ముందుకు చొచ్చుకొస్తున్నాయి ఇప్పుడు.. ఏ విషజ్వాలా .. ఏం చేయలేదు ఈ విలయాలు ఎవ్వరినీ పడదోయలేవు మనిషికాక ఈ మారణహోమాన్ని  ఎవడు తప్పిస్తాడు! మనిషి కోసం మనిషి కాక ఈ మహా వ్యూహాన్ని ఎవడు ఛేదిస్తాడూ!! మనిషే! మనిషే!! ఎప్పటికైనా మనిషే!!!
రహస్యం

రహస్యం

ఒకసారి లోపలికి మరోసారి బయటకి తెరలు తెరలుగా దు:ఖం పొంగుకొస్తునే ఉంది. ఆ దు:ఖం వెనుకే సుఖముందనే భ్రమలో నాలో నేను చూడటం మరచి ఎదురు చూస్తూనే ఉంటే...  కాలమంతా దు:ఖాన్నే ఆవాహన చేసుకుంటూ అదేంటో మరి.. మరణయాతన అంటే మనసుండటమే అన్న సత్యం విదితమైంది.  ఆ నేనప్పుడు నేను కాదు.. ఈ నేనిప్పుడు అలా లేనేలేను.. మరణం వెనుక రహస్యం తెలిస్తే పుట్టుక సార్ధకమైనట్టే.. పుట్టుక ఎందుకో తెలిసాక  దు:ఖభారం తీరినట్టే  దు:ఖాన్ని ఆవాహన చేసుకున్న మృత్యువు రెండు చేతులూ చాపి చూస్తున్నా... నాకిప్పుడు ఏ భయం లేదు.. ఏ ఆలోచనా లేదు.. మృత్యుద్వారంలోకి అడుగేసేలోపు చేయాల్సిందంతా చేస్తూనే ఉంటాను. నా మనసు లోపల మనిషి పుట్టుక జరిగింది అప్పుడే.. అసలు రహస్యం గుట్టు తెలిసిందీ అప్పుడే..
నీ నీడలో....

నీ నీడలో....

నువ్వు వేగుచుక్కవై తెల్లవారుఝామును మేల్కొల్పుతున్నప్పుడు ఆ లేత వెలుగు రేకల్ని ఏరుకుంటూ మా నిద్రమత్తు ఆవులించేది కోటేరు వేసుకొని నువ్వు పొలం వెళ్తుంటే యుద్ధానికి వెళ్తున్న సైనికుడిలా ఉండేది నువ్వు నాగలై, కర్రై, ఎదగొర్రై మట్టిలోకి చొచ్చుకుపోయినప్పుడల్లా మట్టి; అణువణువూ తన్మయత్వంలో పులకించిపోయేది నీ చెమటలో నానిన మట్టిలోంచి కేర్‌మంటూ విత్తనం మొలకెత్తడం ఎంత కళాత్మక సృజన!! నీకోసం ఆకాశంలోంచి పొలంలోకి దిగి నక్షత్రాలు నక్షత్రాలుగా అర్రొంచడం ఎంత మనోహర దృశ్యం!! సేదదీరు తున్నప్పుడల్లా నువ్వొక హరిశ్చంద్ర పద్యానివై చీకటి ముసిరిన పల్లెను సంగీత విద్యుత్తరంగాలతో వెలిగించడం మన ఊరింకా మరచిపోలేదు లోకంలో అన్నిటికన్నా ఆకలే పెద్ద రోగమైనప్పుడు నువ్వు అన్నపు ఔషధం గావడం.... ప్రపంచమెప్పుడూ నీకు రుణపడే ఉంటుంది ఎవరన్నారు నువ్వు పోయావని? నువ్వు చెట్టువై కొమ్మలు చాచి మమ్మల్ని అక్కున చేర్చుకోవడం ఇప్పుడ గతమే కావచ్చు నువు ఇచ్చిన నీడ మాత్రం మా బతుకులకు చల్లని అండగా మిగిలే ఉంది పొలాల్ని చూసినప్పుడల్లా నువ్వు పచ్చ పచ్చగా పలకరిస్తున్నట్టుగానే ఉంటుంది.
కలల దుప్పటి

కలల దుప్పటి

నిద్రను నిషేధించాలని నిర్ణయించుకున్నాను  మరేం చేయాలి?  ఆ కదిలి కరిగే కాలం  నా కళ్లూ ఏకమై నామీదే అవిశ్రాంత యుద్ధం ప్రకటించాక! పగటి పూట ప్రాణం పోసుకున్న ఊహలకు ఊసులకు రాత్రివేళ రంగుల రెక్కలు తొడుగుతుంటే...? అందుకే నిద్రను నిషేధించాలని నిర్ణయించుకున్నాను.  నిద్రలో పుట్టి నిద్రలో పోతే  నిద్రను నిషేధించాలని అసలు అనుకునేవాణ్నే కాదు! నిద్ర లేవగానే, నిద్రలో పుట్టిన కల నా చూట్టూ కాబూలీ వాలాలా మళ్లీ మళ్లీ తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా ఊహలకూ, ఊసులకూ ఉరితాడుని ఎలాగూ పేనలేను అందుకే నిద్రను నిషేధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను! చిన్న చిన్నగా చీకటి చిక్కబడుతుంది గడియారం ముళ్లు సోమవారం బడికి వెళ్లే పిల్లాడి కాళ్లలా.... అద్దంలో కనుపాప లోతుల్లోకి తొంగి చూస్తున్నా కలల జన్మస్థానం కనబడుతుందేమోనని! అలసిన కనురెప్పలు అతుక్కోవాలని చూస్తున్నాయి.  నా కన్నులనే కప్పి కలకందామని! చెంబుడు చన్నీళ్లతో వాటిని శిక్షించాను.  నా మీద నేనే గెలుపొందాలని  చేస్తున్న కురుక్షేత్రం.. ధర్మక్షేత్రమిది! నేను గెలిస్తే, నా పగళ్లు స్వర్గధామాలౌతాయి! ఈ స్వప్నాల సన్నాయి నొక్కులిక ఉండవు  భూపాల రాగం పాడుతూ కల నన్ను మేల్కొలపదు నన్ను పగలంతా ఉడికించదూ, గేలి చేయలేదు! అసలు కలల జన్మస్థానమేది? కళ్లా? మనసా? మెదడా? అస్తిత్వమేనా? ఈ జన్మస్థానాల అన్వేషణ ఈ నేలపై పుట్టినందుకు నాలో పెరిగిందా? ఆలోచనల్లో ఉన్న నన్ను ఏదో ఒక మాయ  ఉన్నట్టుండి కనురెప్ప పాటు కమ్మేసింది! అంతే!! సమాధి మీద పూసిన గడ్డిపూవులా స్వచ్ఛంగా మరో కల విచ్చుకుని, వెక్కిరించింది నన్ను! గతంలోని గతితార్కికం  అనవసరమనిపించింది నాకు! గెలుపు ఓటముల ఆవలి ఒడ్డుకు  పరుగులు తీశాయి ఆలోచనలు అసలు కలకు కారణమేమిటో?  కల నన్నెందుకు కలవరపెడుతుందో?  ప్రతి చర్చనూ పక్కన పెట్టాను.  పక్కమీదకి వొరిగి  కలకు స్వాగతం పలికాను! కళ్లకు నా కలల దుప్పటి కప్పుకుని!
ఉగాది

ఉగాది

పాతాళగంగను పైకి రప్పించే అర్జునుడు కనబడక, బోరునీళ్లు పాతాళంలోనే ఉండిపోయాయి! కరవుతో పోరాడలేని అన్నదాతలు, కరెంటుతీగలకు వేలాడుతున్నారు శవాలుగా! మామిడి చెట్ల మీద పూత కనిపించక తుమ్మ కొమ్మల మీదే కూర్చుని కునుకు తీస్తున్నాయి కోకిలమ్మలు! వానలు, పంటలకు లంకె ఏమిటో కూడా  తెలియని కాలేజీ కుర్రకారు  క్రికెట్‌ మైదానంలో దౌడు తీస్తున్నారు అటు, యిటూ! గుళ్ల ముందు నుంచోవాల్సిన కొత్తజంటలు కోర్టుల ముందు నుంచుంటున్నాయి తెగదెంపులు చేసుకోడానికి! ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికి నల్ల కుబేరుల జాబితా వల్లె వేస్తున్నారు జాతీయ నాయకులు! ఇన్ని దుర్భర, దుస్సహ దృశ్యాల మధ్య ఇవేమీ పట్టనట్లు తెల్ల లాల్చి, పైజామా తొడుక్కుని గండు కోయిలల గురించీ పండు వెన్నెలల గురించీ కవిత్వం రాయడానికి  నా మనస్సెందుకో ఒప్పుకోడం లేదు!
శృంగార వాసంతం

శృంగార వాసంతం

కలరవామృత గానముల కోకిలమ్ములు      సృష్టిని పులకింపఁ జేయు వేళ చిగురు జొంపములు మేల్‌ చిత్రలేఖనములు      కనుల పండువు సేయఁ గడఁగు వేళ హృదయ మాధుర్యమ్ము ప్రియమార చిలికించి      విరి కన్నియలు సమర్పించువేళ శుకశారికా తతుల్‌ సుమధుర స్వరములో      స్వాగత వచనముల్‌ పలుకు వేళ అవ్యయానంద భావ విన్యాస గతుల అఖిల లోకమ్ము పరవశమందు వేళ తన్మధుర భావనలకు నిత్యత్వమొసగ అవతరించెను మధుమాస మవనియందు ఎలకోయిలమ్మ తేనెల చిల్కు గొంతులో      రాగాల చక్కెర రంగరించి నవ వధూ హృదయ నందన వనసీమలో     శృంగార మధువులు చిలుకరించి పరవశత్వముఁజెందు ప్రకృతి కాంతనుఁజేరి     ప్రణయ రాగము తోడఁ పలుకరించి మ్రోడు వారిన వృక్షముల జీవితములందు     చిగురుటాశల మేలి సొగసులుంచి కష్టసుఖములు - కాల చక్రమ్మునందు శాశ్వతములు కావనెడి వాస్తవముఁదెలిపి యెల్లరకు సేమమునుఁగూర్ప నిచ్చగించి లలిత శృంగార మధుమాస లక్ష్మి వచ్చె మరబొమ్మల వలె నరులె ల్లరు - మమతలు మఱచి - బ్రతుకులను  మిక్కిలి దుర్భర రీతి గడుపగా - ‘‘శార్వరి’’  సుఖ శాంతుల నొసంగ వచ్చెను ప్రీతిన్‌
పల్లె పాట

పల్లె పాట

పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల  ।।2।। సూరీడొచ్చి తొంగిజూసెరో మా పల్లెలోన చెర్లనీరు మెరవవట్టెరో మా పల్లెలోన బర్లమంద సాగవట్టెరో మా పల్లెలోన సద్దిమూట నెత్తికెక్కెరో మా పల్లెలోన పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।। రైతునాగలెత్తవట్టెరో మా పల్లెలోన కమ్మరి కొలిమి ఎలగవట్టెరో మాపల్లెలోన  కుమ్మరి చక్రం తిరగవట్టెరో మాపల్లెలోన సాకలి మూటలెత్తవట్టెరో మా పల్లెలోన పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।। వానచినుకు రాలవట్టెరో మా పల్లెలోన పంటచేను లూగవట్టెరో మా పల్లెలోన పంటచేతికందినాదిరో మా పల్లెలోన గా దినమే పండుగంటరో మా పల్లెలోన పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।। పడుచులంత పాడవట్టెరో మా పల్లెలోన పాటలోన కథలు సూడరో మా పల్లెలోన గా కథలె మా బతుకులురో మా పల్లెలోన మారని తలరాతసూడరో మా పల్లెలోన పొద్దుగాల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।।
తెలుగు పాట

తెలుగు పాట

ప: తెలుగుభాష తీయదనం  తెలుగుజాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకి  తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువ్వు మరచినట్టురా  ఇది మరువబోకురా             ।।తెలుగుభాష।। చ-1 అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ, డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది... మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అత్తా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ, అంకుల్‌లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు     ।। 2 ।। కాని నీ భాషలోనె నువ్వు సంభాషించు తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా  కొంత రుణం తీర్చరా మా తెలుగు తల్లికి మల్లెపూదండ... మా కన్న తల్లికి మంగళారతులు చ-2 కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు ।।2।। అది భాషా ఆచారాలను మింగేయొద్దు... తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గమాకురా... తెలుగుభాష తీయదనం తెలుగుభాష గొప్పదనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం మమ్మీ, డాడీ అన్న మాట మరుద్దామురా... అమ్మా, నాన్నా అంటూ నేటి నుంచి పిలుద్దామురా.  ప్రతిజ్ఞ పూనుదామురా చిత్రం: నీకు నేను నాకు నువ్వు;  రచన: చంద్రబోసు; సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌;  గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చరణ్‌