అవును.... నేనొక ఇనుపముక్కనే అయితేనేం! నాకు తెలియని అయస్కాంతం నన్ను చేరుకొని ఉంది ఇక నాకు ఎదురేముంది?
అవును....
నేనొక ఇనుపముక్కనే
అయితేనేం!
నాకు తెలియని అయస్కాంతం నన్ను చేరుకొని ఉంది
ఇక నాకు ఎదురేముంది?
కొండల్ని పిండి కొట్టగలను
ఆకాశపు అంచుల్ని చుట్టిరాగలను
సూర్యునిలోని అగ్నిని, చందమామలోని అమృతాన్ని కలబోసుకొని తాగగలను
ఒక క్షణాన....
నా అయస్కాంతం నాకు దూరమయింది
లోకం అంధకారమయింది
నా అయస్కాంతం కోసం భూమిలో వెతికాను
వెండిబంగారాలు వెలాతెలా పోయాయి
ఆకాశాన వెతికాను
చుక్కలన్నీ ఫక్కున నవ్వాయి
ఎలుకమ్మను పెంచి,
దానికి లోకోత్తరుడైన భర్తకోసం వెతికిన
మునివర్యుడి కథ గుర్తుకు వచ్చింది
నాకు స్ఫురించింది....
నా అయస్కాంతం నాలోనే ఉంది
దాని మెరుపులు మనసును వెలిగిస్తున్నాయి
దాని మహత్తర శక్తి నాలో నవ చైతన్నాన్ని నింపింది
అందుకోవాలని చేయి చాపాను
‘‘నేనున్నాను’’ అంటూనే చేతికందదు.
కొంచెం దూరమే!
భూమీ ఆకాశాల మధ్య ఉన్నంత!
ఒక పక్క చలి చిక్కగా ముసురుకుంది మరో పక్క వెచ్చటి ప్రభాత గీతాన్ని ఆలపించే భానుడి స్పర్శ మెల్లగా తాకుతోంది
ఒక పక్క చలి చిక్కగా ముసురుకుంది
మరో పక్క వెచ్చటి ప్రభాత గీతాన్ని ఆలపించే
భానుడి స్పర్శ మెల్లగా తాకుతోంది
ఇంటిగోడ నానుకుని పెరిగిన
కాగడా, కనకాంబర, గులాబీ మొక్కలు
ఒక్కసారి ఒళ్లు విరుచుకున్నాయ్
అప్పుడే పుట్టిన పసిపాపలా ఒక్కో మొగ్గా బిడియంగా
మృదువుగా విచ్చుకుంటోంది
ఆర్భాటం లేని చిరునవ్వు విసిరి
హృదయాలతో కరచాలనం చేసి కల్మషాన్ని కడిగేస్తాయి పూలు
ఆహ్లాదపు అందాల వల వేసి కట్టేసి చుట్టూ తిప్పుకుంటాయ్
మాయ చేసి మత్తుజల్లి
గమ్మత్తుగా ఎత్తుకెళ్లి మకరందాల జల్లుల్లో తడిపేస్తాయి
కదలని కాలానికి నడక నేర్పిస్తాయి
అగాధాల్లోకి కూరుకున్న కళ్లకు కలలు రప్పిస్తాయి
ఉదయం, సాయంత్రం పిలిచి మనసు తలుపు తెరచి
తలపుల తివాచీ పరచి
ఓలలాడించి వలపుల నావలో అలా అలా తిప్పేస్తాయి
చిత్రమైన పూలు
మరో విచిత్రం
కళ్లనూ, మనసునూ బంధించిన ఆ అపురూప అందాలు
మరునాటికి నిస్సారమైనా అదే నవ్వు పెదాలపై
ఒంటరి రహదారిపై జంటగా రాలుతూ వర్ణాలద్దుతాయ్
మత్తైన కళ్లతో అలౌకికానందాన్ని అందిస్తాయి
కళాపిపాసి కవితాక్షరాలకు చిరునామాలౌతాయి
జడివానలో తోడై, నీడై, జవరాలై జావళీలు పాడతాయి
అందమైన పూలు ప్రకృతి ప్రేమికుల పెదవులపై చెరగని
చిరునవ్వుల చేవ్రాలు..!
మోడైన హృదయం ఒంటరి దారుల్లో దుఃఖపు ఆనవాళ్లని మోసుకోని దిక్కుల వెంట శూన్యంగా దిగులు మబ్బులతో జీవితాన్ని వెంటేసుకొని సంచరిస్తుంటే స్పందన కరువైన హృదయానికి ప్రతిస్పందనగా ఊపిరి పోసి జీవితానికి ప్రాణమైంది..!!
మోడైన హృదయం ఒంటరి దారుల్లో
దుఃఖపు ఆనవాళ్లని మోసుకోని
దిక్కుల వెంట శూన్యంగా దిగులు మబ్బులతో
జీవితాన్ని వెంటేసుకొని సంచరిస్తుంటే
స్పందన కరువైన హృదయానికి ప్రతిస్పందనగా
ఊపిరి పోసి జీవితానికి ప్రాణమైంది..!!
కొన్ని పలకరింపులతో చిగురు తొడిగి
నిరాశ కొమ్మకి ఆయువు పోసింది..
రాలిపోయిన ఆశలకి వసంతమై అల్లుకుంది..
వర్ణాలన్నీ కలిసి కొత్తగా అభివర్ణమైంది..!!
మనసు పొదరింటిని ఎపుడు తడుముతూ
నేనున్నానంటూ ఓదార్పు గాలులు గుండెసడిని
తాకి పోతుంటే
కష్ట నష్టాల బేరీజులో ఓడిపోయే జీవితాన్ని
గెలిపించే హస్తం ఆపన్న హస్తమైన
జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆదుకుంది..!!
అనిర్వచనీయ అనుభూతికి
అక్షరాల పోగులు గాఢంగా ముడి వేసుకుని
పదాల పులకింతలతో వాక్యాల రెక్కలు విప్పింది..!!
కాలానికి మంత్రం వేసినట్టు
వాడిపోని విడిపోని బంధంగా
పరిమళాన్ని అద్దుకుని నిత్య యవ్వనిలా
ఒక కొత్త ఋతువు ఆహ్వానించింది
ఒకే ప్రాణమై స్నేహ రుతువుగా వికసించింది..!!
ఎందుకో ఈరోజు ప్రేమ పుట్టింది ఇన్ని కల్లోలాల మధ్య ఇన్ని కలహాల మధ్య ఇన్ని విధ్వంసాల మధ్య
ఎందుకో ఈరోజు
ప్రేమ పుట్టింది
ఇన్ని కల్లోలాల మధ్య
ఇన్ని కలహాల మధ్య
ఇన్ని విధ్వంసాల మధ్య
ఇన్ని కుట్రల మధ్య
ఇంత సుకుమారమైన ఊహ
ఎలా సాధ్యమనుకుందో ఏమో-
ఈరోజు వింతగా ఇలా ప్రేమ పుట్టింది
అసలు ఈ ప్రేమకోసమే కదా!
ఇన్ని విద్యలు నేర్చుకున్నది
ఇన్ని సర్దుబాట్లు చేసుకున్నది
ఇన్నిసార్లు ఓపిక తెచ్చుకొన్నది
ఇన్ని విధాలుగా సంధికూర్చుకున్నది
ఇంత సముదాయించుకున్నా
ఎప్పుడూ ఈ ప్రేమ
ఆమడ దూరంగానే ఉంది.
ఎందుకనిపించిందో ఈరోజు
సజల నయనాలతో, మెత్తని కౌగిలితో
నడుస్తుంటే ముందు ముందుకు వచ్చి
జీవితం ఉన్నదే నవ్వడానికని
చీకట్లో దీపం వెలిగించి
అద్దంలో ముఖం చూపించి
ఏమైందో ఈరోజు
నామీద నాకే
గొప్ప ప్రేమ పుట్టింది.
నీటి అల ఒడ్డున పాకుతున్న ప్రతిబింబంలోకి దగ్ధమయ్యే దేహపు ఎడారిలో కొంత చీకటిని.. ఒక చిగురును వదలివెళ్లినట్టు అతడొక స్వప్నగీతాన్ని రాసి...
నీటి అల ఒడ్డున పాకుతున్న ప్రతిబింబంలోకి
దగ్ధమయ్యే దేహపు ఎడారిలో
కొంత చీకటిని.. ఒక చిగురును వదలివెళ్లినట్టు
అతడొక స్వప్నగీతాన్ని రాసి...
ఈ ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాడు
వేల సిరాచుక్కల మెదడు కదలికల్లో
చైతన్యమంతా రంగరించి... మసిపూసిన మారేడుకాయ లాంటి
డొల్లబతుకులో... అమృతభాండమేదో కవ్వమేసి చిలికినట్టు...
కొన్ని అలికిడులను... కొంత మార్మిక వేదనను
గాయపడిన ప్రతి ఎదపై చిలకరిస్తూ
అతడు... అస్తమించని సూరీడై వెలిగిపోయాడు!
మట్టిపాదాల రేణువులపై
పచ్చని పువ్వొకటి పుప్పొడి రాల్చినట్టు
అతడు... మనిషి నుంచి మనిషిలోకి
సాంద్రత ప్రయాణమై నిరంతరంగా ప్రవహిస్తాడు
సలపరించే గుండె కోతల్లోనూ
గుక్కపట్టి ఏడ్చే ఎక్కిళ్లు బతుకు దుఃఖంలోనూ
క్షతగాత్రపు ఒంటరి రాత్రుల నిట్టూర్పుల్లోనూ
అతడొక సామూహిక స్వరమై ప్రతిధ్వనిస్తాడు!
అపశ్రుతులతో వెంటాడే జీవిత కాలపు
దివారాత్రాల నడుమ వెలిగిపోయే వేగుచుక్కలా..
నీలోని కవి ఎవడో
నిరంతరంగా నిన్ను వెలిగిస్తునే ఉంటాడు!!