కవితలు

పాపం! పసివాళ్లు!!

పాపం! పసివాళ్లు!!

లగడపాటి భాస్కర్‌

తెలుగు తల్లి

తెలుగు తల్లి

- డా।। నాగభైరవ ఆదినారాయణ

సంక్రాంతి లక్ష్మి

సంక్రాంతి లక్ష్మి

అద్దంకి రామప్రియ

పొందడం కోసమే..!

పొందడం కోసమే..!

కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

పావురాళ్లకు కెవ్వు కేకలు

పావురాళ్లకు కెవ్వు కేకలు

కోటం చంద్రశేఖర్‌

నా స్వప్నాశ్రువులు!

నా స్వప్నాశ్రువులు!

నేను జీవితాన్ని చాలా దగ్గరగా దూరం నుంచి చూశాను! నేను సముద్రంలోకి అలలను తోశాను నేను నా ముఖాన్ని మీలో చూశాను! నన్ను నేను హింసించుకున్న క్షణాలేవీ కవిత్వం కాకపోవచ్చును కానీ నా కవిత్వంలో ప్రవహించే కన్నీళ్లు మాత్రం నావే! నేను చిత్తరువును ప్రేమించినాక గానీ ప్రకృతిని ఆరాధించడం ఆరంభించలేదు! మగువ మనసు నాకు అగాధ అఖాతం! తెలిసిన తీరాలన్నీ నిన్ను మోసం చేసేవే!! ఈ పచ్చిక బయలులో పులులు పొంచిన నిశ్శబ్దం, నా కవితల్లో ధ్వనిస్తుంది! ముఖ్యంగా ఆ పులుల పసుపు చారలు!! ఈ జగత్తులో నాకు లభించినవి ఇదిగో ఈ సిరా, కొంత ఏకాంతం! అవి అనుకోవచ్చు నా సర్వస్వం!! ఈ పుస్తకాలలో, తెరిచిన వెంటనే కొన్ని లోయలలోని గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి! ఆకళించుకునేలోపు అవి మూగబోతాయి!! ఇక్కడి ఇసుకలో పాదముద్రలే తప్ప మనుషులు కనిపించరు, ఆ పాదముద్రలను అనుసరించడమే నిన్ను ఆ మనుషులను చేరుస్తుందని నా గుడ్డి నమ్మకం! ఈ ఆకాశం కాన్వాసుపై అన్నీ అసంపూర్ణ వర్ణ చిత్రాలే, నీ చూపు సోకేలోపు వాటి రూపు మారిపోతుంది జీవితమూ అంతే కదా! ఓ పాంథుడా! నీవు ఇక్కడ చెరసాలలో బందీవి, నీ దేశం వెతుకుతూ నువ్వు కన్న స్వప్నాలు ఇదిగో, ఇక్కడి మొగ్గల్లో మంచు బిందువులై ఘనీభవించాయి! అవి బహుశా పూల కన్నీళ్లు కావొచ్చు!! లేదా ఈ కవి అక్షరాల అశ్రువులు కావొచ్చు!!
వైరుధ్యాలు

వైరుధ్యాలు

తూర్పున సూర్యోదయం ఆస్వాదిస్తూ వాడు! వెల్తురు వెనక చీకటి కుట్రనేదో శోధిస్తూ నువ్వు! ముళ్ల దారైనా కొత్తగా నడవాలని వాడు! ట్రెడ్మిల్‌ మీద నడుస్తూ  నడక తెలీదని పరిహసిస్తూ నువ్వు! నీ చెంత నాలుగు అక్షరాలు నేర్చుకుంటాననుకుంటూ వాడు వాడి కక్ష్యని సైతం నిర్ణయించాలని నువ్వు! గొంతు సవరించుకుని కొత్త పాట పాడుతూ వాడు!  అది నీ గూటి పాటై ఉండాలని శాసిస్తూ నువ్వు! జంతువుల్ని ప్రేమిస్తూ వాడు మనిషిగా ఎదగలేదని వాదిస్తూ నువ్వు! సీతాకోక చిలుకవర్ణాల్లో వివశుడౌతూ వాడు ఇంకా గొంగళి పురుగనే ఊహిస్తూ నువ్వు! హృదయం అద్దంలా ఉండాలని వాడు లైబ్రరీలా ఉండాలని నువ్వు! నవ్వులో నవ్వు మాత్రమే చూసే వాడు నవ్వు వెనక విషం శోధించే నువ్వు! నీకేదీ తిన్నగా వినిపించదు వాడికేదీ నిన్నగా కనిపించదు! ఎదిగేకొద్దీ తేటతెల్లం అవుతూ వాడు కొత్త ముసుగులు తొడుక్కుంటూ నువ్వు! 
చికిలింత చిగురు సంపంగి గుబురు

చికిలింత చిగురు సంపంగి గుబురు

అతడు: చికిలింత చిగురు సంపంగి గుబురు       చినదాని మనసూ చినదాని మీద మనసూ ।।చికిలింత।। ఆమె: మనసైన చినదానికి అందానికీ  ।। మనసైన।।        కనుసైగ మీద మనసూ    అ: చెంపకు చారడేసి కనులున్న చిన్నదీ     చిన్నదాని సిగలో రేకలెన్నో గువ్వకన్ను రైక మీద చుక్కలెన్నో ఆ: ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో  ।।ఎన్నుకో।।     వన్నెచిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా     పైరగాలి ఘుమఘుమలో చెంగావి చెంగు రిమరిమలో అ: దిరిసెన పూవుమీద చిలుకూ ముగ్గులూ     చిన్నారి బుగ్గమీద చిలిపీ సిగ్గులూ     మల్లెల దొంతరలూ మరుమల్లె దొంతరలూ ఆ: మనసే.. మనసే మరు మల్లెల దొంతర అ: మన ఊసే విరజాజి దొంతర ఆ: పాలవెన్నెలలో..  అ: మురిపాల వెన్నెలలో.. ఈ పాటను మల్లాది రామకృష్ణశాస్త్రి రచించారు. ‘చిరంజీవులు’ చిత్రంలోనిది. ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో లీలతో కలిసి గానం చేశారు. ఎన్‌.టి.ఆర్, జమునల మీద చిత్రీకరించారు. సాహిత్యపరంగా చూస్తే పాటనిండా కనిపించేది తెలుగుదనమే. సొగసైన తేలికైన పదాలతో పదునైన భావాలు సృష్టించగల దిట్ట మల్లాది. ఆయన శైలి దేవులపల్లి వారి శైలిని తలపింపజేస్తుంది. ఈ పాటను పరిశీలిస్తే చికిలింత చిగురు, సంపంగి గుబురు, గువ్వకన్ను రైక, పైరగాలి, రిమరిమ, వన్నెచిన్నెలు, ఊసు, దొంతర, దిరిసెనపూవు చిలిపి సిగ్గులు, చిన్నారి బుగ్గలు, చిలికే ముగ్గులని.. ఎంత అచ్చతెలుగు భావుకత! సాహో మల్లాది అని తక్కిన కవులు ఊరికే అన్నారా! ఇక బాణీపరంగా చూసుకుంటే పల్లవిలోని వేగానికి బుడిబుడి గంతుల కుందేలు పిల్ల గమనం, చరణాల్లో హాయిగా తీసుకొనే ఎత్తుగడకి నిదానంగా పరిగెడుతున్న లేడి పిల్లల పరుగు... ఈ రెండూ కళ్ల ముందు కనిపిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత రోజుల్లో ఘంటసాల ఇలాంటి పాట మరొకటి చేయలేదేమో! 
పిరికి ఎండ

పిరికి ఎండ

చెట్టుకింద తడినీడలు పరిచింది  కుండపోతగా కురుస్తున్న ఎండ రాదారి పొడవునా ఎండముళ్లు, వీధి నిండా విచ్చుకున్న  నల్లగొడుగు మల్లెలు, వెల్లవేయని గోడలనిండా  ఎండ రంగులు దేహమంతా పూసిన  చెమటపువ్వులతో    గాజు తటాకంలాంటి ఎండ     కంచెదాటి రంకెలేస్తున్న  ఎనుములాంటి ఎండ    కొలిమి కొలనులో  నిప్పుల్లో స్నానించిన  ఇనుములాంటి ఎండ అంతోటి, ఇంతోటి ఎండ కాస్తా అవ్వ నెత్తిమీది కడవలోని చల్ల కడలిలో దూకి  ఆత్మహత్య చేసుకుంది మిరప మీసాల  బడాయి ఎండ కాస్తా సాంద్ర సాయంత్రపు చల్లగాలికి  ఉక్కిరి బిక్కిరై ఉరిపోసుకుంది. నిప్పు కత్తులు దూసిన  నిలువుటెండ కాస్తా  నల్లమబ్బుల మూకదాడితో చినుకు శూలాలు గుచ్చుకుని కడతేరింది.
కొత్త చిగురులు

కొత్త చిగురులు

మళ్లీ కనిపించిన పాతముఖాలూ వదిలివెళ్లిన స్థలాలూ వస్తువులూ తరలిపోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతాయి కాలం ధాటికి బెదిరి పారిపోయిన తడారిపోయి పొడారిపోయిన వాటిపై కాసిన్ని సంఘటనల చన్నీళ్లు చల్లి పచ్చిగా చేస్తాయి మనసు అరల్లో దాగి మాగిపోయిన అనుబంధాలను అనుభవాలను అనుభూతులను బయటికి లాగి మళ్లీ మనసుపై అద్దుకుంటాయి కోపాన్ని కొంటెగా పక్కకి నెట్టేసిన తక్కిన నవరసాల అనుభూతులన్నీ పెదవులమీదికి నవ్వునే దిగుమతిచేస్తాయి కళ్లలోకి ఎంతోకొంత చెమ్మనీ అద్దుతాయి కొండొకచో కళ్లు చెలిమెలయి నీళ్లు తొణుకుతుంటాయి నా దారి నీ దారి కాదు, అది రాదారి అంటూ కోపం కళ్లెర్రచేసి శ్వాసను వేడెక్కిస్తే శృంగారం సిగ్గుతో బుగ్గలను ఎరుపెక్కిస్తుంది కరచాలనాలూ ఆలింగనాలూ మనుషుల మధ్య మౌనంగా మార్పిడి అవుతూ ఆత్మీయతను అటూఇటూ పంపిణీ చేసేస్తే నదులైనా గదులైనా చెట్లైనా పుట్టలైనా తిరిగిన వార్డులైనా చూసేసిన బోర్డులైనా గతం తాలూకు సుగంధాన్ని పూసేసుకుంటూ సన్నివేశాల సప్తవర్ణాలు చల్లేసుకుంటూ అనుభూతుల ఆనందాల హోళీ ఆడుకుంటాయి అవును... గతం గొప్పదైనా గోరంతదైనా మనసు మూలల్లో అణువంతగా అణిగిపోయినా ఎండి మోడువారిపోయినా.... అనువైన సమయంలో అందిన మాటల చెమ్మతోనో అంటిన స్థలాల, వస్తువుల స్పర్శతోనో అలా అలా కొత్త చిగురులు వేస్తుంది మెల్లమెల్లగా ఎదిగి మానై నిలిచిపోతుంది మరింతకాలం మనసులో నిండి ఉండిపోతుంది
మనిషిని చదవాలంటే

మనిషిని చదవాలంటే

మనిషిని చదువుదామని అనుకుంటాను  కనీసం ఒక్క మనిషినైనా చదువుదామని మొదలుపెడతాను  తిరగేసే కొద్దీ పేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి  వ్యక్తిత్వవైరుధ్యాలు పూస్తూనే ఉన్నాయి పుటలు తిప్పుతుంటే  ఎన్నెన్ని  పాములు అగాధాలు  గాయాలు గమకాలు  కల్లోలాలు సంక్షోభాలు పంచదారచిలుకలు వాలిన  విరబూసిన పూలతోటలు  ఎక్కడ నుంచి ప్రయాణించి  ఎక్కడ ముగించను  పుటల నిండా పేరుకున్న  ఎత్తైన పర్వతాలు  సముద్రాలు  వాటిలోకి ప్రవహించే నదులు  కనీసం పాదాలు తడుపుకోవడమైనా కుదరట్లేదు  కురుస్తున్న హోరువానలో  ఒక చినుకునైనా ఒడిసిపడదామంటే  వీలు పడట్లేదు  కన్నీటి చుక్కై రాలిపడినపుడు ఒకలా  ఆనందసుమమై విచ్చుకున్నప్పుడు మరోలా  ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటే  పాత్రకు తగ్గట్టు  రూపు కడుతుంటే  ఎలా కొలవగలను  గుప్పెట్లో ఎలా బంధించగలను  మనిషంటే  ఎంత లోతు  ఎంత చప్పుడు  ఎంత నిశ్శబ్దం  మరెంత వింత శబ్దం  లోపల పక్షులు  గిరికీలు కొడుతున్నాయి  జలపాతాలు పాటలు పాడుతున్నాయి  ఒక మనిషి గుండెనే చదవలేము  ఇక సమూహపు నాడినెలా  పట్టుకోగలం మనిషిలోని అణువును చదవాలంటే  ఎన్ని వేలసార్లు మరణించి జన్మించాలి 
వలపు దీపం

వలపు దీపం

వలపు దీపమొకటి వెలిగింది మదిలో! కలలు కరగనీకుమా!  కలత చెందనీకుమా! నిదురమ్మా! నిదురమ్మా! చెదరిపోకుమా! చెలిని కలను కలిసేవేళ తేలిపోకుమా! పేదవాని హృదయంలోనూ  ప్రేమంటూ ఉంటుందనీ పెదవిదాటి రాలేని పలుకులు దాగుంటాయనీ చిలిపి ఊహలెన్నో చెలగిపోతుంటాయనీ వలపు తలపులెన్నో  తొలచి వేస్తుంటాయనీ ఎరుగనిదానవా! కరుణలేనిదానవా ఆదమరచి నిదరోతుంటే  సుందర తార స్వప్నాలు అందరాని నా చెలితోటి  అందమైన అనుభవాలు కనులు తెరచి మూసేలోగా  కలలు చెదరిపోతాయేమో చెలియ అలిగి కనుమరుగైతే హృదయమాగిపోతుందేమో ఎరుగనిదానవా! కరుణలేనిదానవా నిదురమ్మా! నిదురమ్మా! చెదరిపోకుమా! చెలిని కలను కలిసేవేళ తేలిపోకుమా!
‘కన్నెతల్లి’

‘కన్నెతల్లి’

మండుటెండల్లో మల్లెలు పూసినట్లు మండే నా గుండెల్లో  మమత విరిసింది... నా కన్నీటి తడిలో కరుణ కురిసింది!! ఎందుకో తెలుసా? ఓ కిరాతకుడి  దురాగతానికి బలియైన ఈ శరీరంలో ఓ ప్రాణి జీవం పోసుకుంటుందని తెలిసినందుకు... స్త్రీకి మాతృత్వం  వరమో - శాపమో తెలియని స్థితి! మాతృత్వం స్త్రీత్వానికి పరిపూర్ణతను సంతరించినా సమాజానికి సమాధానం చెప్పలేని పరిస్థితి!! ఇష్టం లేకున్నా తల్లినవడం సృష్టి చేసిన తప్పు నాకెందుకు శిక్ష? అని సమాజాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం... తండ్రి లేకుండా బిడ్డ ఉండడు తండ్రి తప్పుకుంటే తల్లిదా తప్పు? ఎవరేమనుకున్నా నా బిడ్డకు మాతృప్రేమను పరిపూర్ణంగా చవి చూపిస్తా! మాతృత్వపు మహోన్నతిని చాటిస్తా!! ‘‘క్షణకాల భోగం తండ్రి యుగకాల యోగం తల్లి’’