కవితలు

మా బడి

మా బడి

గరిమెళ్ళ నాగేశ్వరరావు

భూమాతకో ప్రేమ ముద్దు

భూమాతకో ప్రేమ ముద్దు

డా।। చిట్యాల రవీందర్‌

వర్షానికి ప్రేమలేఖ

వర్షానికి ప్రేమలేఖ

వెంకటేష్‌ పువ్వాడ

నిరుద్యోగి

నిరుద్యోగి

యస్‌.సూర్యనారాయణ

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

తూర్పు ముఖానికి ఎర్రబొట్టు పెట్టిన ‘‘పడుచుపల్లె’’ ప్రపంచీకరణ విషపు కౌగిలిలో కరిగి ఉడిగిపోయింది రోజూ సూర్యుణ్ని ప్రసవించే చెరువు ఎండిపోయింది ఏట్లో కాలుష్యం మనసులలోకి పాకింది నాగలి నాట్యానికి నవ్వే నేలని రియలెస్టేట్‌ ఆబోతులు ‘‘మేసేసాయి’’ ఉత్తరాన చింతతోపుకి సెజ్‌ పురుగు కుట్టింది ఇక్కడ మనిషి వాసన వచ్చే మట్టి గోడలు స్వార్ధపు వరదలో కొట్టుకుపోయాయి ఇప్పుడన్నీ గట్టిగోడలు పరాయి మనుషులే కాదు మనసులూ రాలేవు ఒకడి గొండెకోతకు  ఊరంతా పొగిలి ఏడ్చిన పల్లె ఇప్పుడు రాజకీయ జెండాల కింద చీల్చబడింది పాలిచ్చిపెంచిన పట్నం ఇప్పుడు పల్లెని పాలిస్తోంది ఉన్నవన్నీ ఊడ్చిపెట్టాక పల్లె మనుషులను ఎగుమతి చేస్తోంది ఇక్కడ పట్నానికి కలిపే దారులన్నీ ‘‘వన్‌ వే’’లు ఇప్పుడది పల్లె కాదు ‘‘విలేజ్‌’’ ఇప్పుడొక నిర్మాణం కావాలి మనిషి నిలబడాలి పల్లె నిర్మించబడాలి
మరో విత్తు

మరో విత్తు

కాంక్రీట్‌ జంగిల్‌ అవతల అప్పుడెప్పుడో నేనే బ్రహ్మనై నీకు జీవం పోశాను నువ్విప్పుడు నాకే అందనంత ఉన్నతంగా ఎదిగావు ప్రేమపక్షులకు ప్రేమావాసమై వలస పక్షులకు స్థిరనివాసమైనావు! నాడు నీ ఆకలి తీర్చమని నా వంక బేలగా చూసిన నువ్వు నేడు పూటగడవని వాడి ఆకలి తీరుస్తున్నావు! భాస్కరుడి తీక్షణ వీక్షణాలు మనిషిని నిలువునా దహించివేస్తుంటే ఆ తాపాన్ని చల్లార్చే లేపనమవుతున్నావు! విషవాయువులను నువ్వు పీల్చి మా ప్రాణాలు నిలబెడుతూ ఆ గరళకంఠుని తలపిస్తున్నావు గ్యాస్‌ గుదిబండ మోయలేని పేదవాడికి ఇంధనం అవుతున్నావు నగరీకరణం పేరుతో నీ ఊపిరి తీయాలని ప్రయత్నిస్తున్నా  మౌనంగా భరిస్తున్నావు! పదునైన గొడ్డలి దెబ్బకు నీ దేహం ఛిద్రమై నువ్వు కార్చే కన్నీళ్లే సంద్రంగా మారి మా పాపాల ఒత్తిడికి అది సునామీ కెరటంలా ఈ లోకాన్ని ముంచెత్తక ముందే నేను ఏదో ఒకటి చేయాలి? ఏం చేయగలను? మరో విత్తు నాటడం తప్ప!
నేను

నేను

దేహం నేను, దాహం నేను మేఘావృత సందేహం నేను ఖడ్గం నేను, యుద్ధం నేను ఖడ్గ చాలన కౌశలం నేను నేను విసిరిన ప్రశ్నల పరంపరకు కుత్తుక తెగిన సమాధానం కూడా నేను స్నేహం నేను, ద్రోహం నేను మానవ సంబంధ సందోహం నేను వేదం నేను, భేదం నేను యజ్ఞవాటికన హవిస్సు నేను నేను ఎగిసిన నభస్సు సభన ప్రభవించిన ప్రచండ తేజం నేను తెగిపడిన ఏకలవ్యుడి బొటన వేలిలో తలవంచని వీరత్వం నేను సీల ఊడిన కర్ణుడి రథచక్రాన పోరుకు వెరవని శూరత్వం నేను నేనొక సేద్యం, నాదొక వైద్యం నా హృది నెత్తుటి పూజా పుష్పం నేనొక అశ్వం, నాదొక స్వప్నం నా గుడి వాకిట గంటా శబ్దం నేను నడిచిన నట్టడవుల తోవల మిన్నాగులూ, మణిమాణిక్యాలూ నేను చూసిన మస్తిష్క కుహరాన చీకటి నీడలు, చీడలు, పీడలు ఒకరినొకరు హత్తుకుపోతూ ఒకరి కుత్తుకలొకరు కోస్తూ ఒకరికొకరు అత్తరు పూస్తూ ఒకరి నెత్తురు ఒకరు చూస్తూ మానవ దానవ సంగర రంగాన మానవత్వపు తుదికేళి హననాన భగవద్గీతలు, భక్తి రాతలు నుదుటి గీతలు మార్చని క్షణాన నేనిలా మిగిలా జీవన చదరంగాన రాజులు, శకటులు, రాణి, బంటులూ మంత్రతంత్రాలు, శక్తులు, కుయుక్తులు రాక్షస క్రీడలు సలిపే రణాన ఏది ధర్మం? ఏది అధర్మం?  ఏది న్యాయం? ఏది అన్యాయం?  ప్రశ్నకు పుట్టే ప్రశ్నను నేను కర్మకు పుట్టే జన్మను నేను జన్మను దిద్దే కర్మను నేను సత్కర్మను నేను!
ఆణిముత్యాలు... ఆదర్శ నేస్తాలు

ఆణిముత్యాలు... ఆదర్శ నేస్తాలు

జాబిలమ్మని చూడగానే తలపుకొచ్చే జోలపాట అమ్మనే పిలుపెంతో మధురమైన వెన్నముద్ద. నిశిరాత్రి వెన్నెల జడిలో నా మది మిణుగురై ఎగురుతున్న వేళ, రూపమెరుగని చిరుగాలికే ఎదురీదే నా ఊహల గానం. కసిగా నాపై కత్తి దూసిన కాలమా ఒక్కసారి వెనక్కి మరలు ఏరుకోవాలెన్నో మధుర స్మృతులు. పలకరిస్తాయో, లేదో నా చిరునేస్తాలు. కోడికూత, వేపపుల్ల, బావినీరు, చద్దిమూట పైరగాలి, లేగపరుగు, గోధూళివేళ... అయ్యో, ఎప్పుడనగా వదిలి వచ్చేశాను. బడి మానేశాక, బతుకు బండిని లాగే పనిలో పడి, అడుగడుగునీ శాసించే, ఆధునికతకు ఒరవడి, విధి ఆడే వింతనాటకంలో మిమ్మల్ని విలువలేని పాత్రని చేసేశాను. మళ్లీ ఎప్పుడైనా మారాం చేస్తుందేమోనని, మది గొంతుని కూడా నులిమేశాను. భారమైన ఈ యాంత్రిక జీవనంలో ఉడిగిపోతున్న జవసత్వాల మధ్య, ఎప్పుడైనా తలచుకొంటే, అదో రంపపుకోత. అప్పుడు... అప్పుడే అనిపిస్తూంటుంది. ఇవే ఎప్పుడూ పల్లెఒడిలో ఒదిగిపోయే ‘ఆణిముత్యాలని’... నా ఎదలోతుల్ని వదిలిపోని  ‘ఆదర్శ నేస్తాలని’...
ఆమ‌ని సొబ‌గులు

ఆమ‌ని సొబ‌గులు

పొగమంచు మేలి ముసుగు పరదాలో పుడమితల్లి ముద్దు మోము దాచగా భానుని ఉదయారుణ తరుణకిరణం కొనగోటిని ముసుగును తొలగించగ అరుణరాగ శోభిత తరుణభాను కిరణము పుడమితల్లి పెదవులపై ముద్దిడువేళ మధుపము మకరందము గ్రోలినట్లుగ అధరామృత మధురసుధారసముల గ్రోలగ గాఢ పరిష్వంగమున చెలరేగిన హుతాశన జ్వాల పుడమి తనువు నంతటినీ నులివెచ్చగ చేయగ ఆమని ఇంకా ఏమని రాలేదని గోముగ ఎదురుచూసి ఎరుపెక్కిన కన్నులతో శిశిరమందు ఎడబాటును భరియించక మూగదైన కోయిల విరహముతో వేగలేక మోడువారి నిదురించిన మామిడి తోట మంచుతెరల తాకిడితో మరలా చిగురించగ చిగురాకుల తిన మరిగిన ఎలకోయిల మైమరచి గానముతో వసంతునే పిలువగ పిలుపు విని వసంతుడే సుమదళములు ఏరితెచ్చి కిసలయతల్పము పరువగ హరిత వర్ణ చీరలోన నేలతల్లి సోయగాలు వేయికన్నులున్నగాని చూడ తనివి తీరదుగా
సమీకరణాలు...

సమీకరణాలు...

కళ్లల్లో వత్తులేసుకున్నాక కాలిపోతాయనే భయమెందుకు? కత్తుల వంతెన దాటక తప్పనప్పుడు ఒరలో కరవాలాలెందుకు? నిప్పులగుండం ఎదురైనప్పుడు గుండెను రాయి చెయ్యాల్సిందే? సునామీని ఎదుర్కోక తప్పనప్పుడు సముద్రానికి తలవంచాల్సిందే నిరాశల కొలిమిలో కాలుతున్నప్పుడు కన్నీళ్ల ఆసరా కోరాల్సిందే! కష్టాల శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు పడిపోతామన్న ఊహే ఓడిస్తుంది స్వప్నాల్లో ఊరించిన రహదారులు  తెల్లవారితే చెదిరిపోతాయి! ఆకాశాన్ని తాకిన ఆశలు కళ్లముందే నేలకూలతాయి కనిపించని అత్యాశల చెదలు ఎదను తొలుస్తూనే ఉంటుంది కనబడని పిడుగులు పచ్చగడ్డిని సైతం కఠినంగా కాల్చివేస్తాయి సమిధగా మారక తప్పనప్పుడు సమీకరణాలు అవసరమా?