కవితలు

మా బడి

మా బడి

గరిమెళ్ళ నాగేశ్వరరావు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

మనవడి ముచ్చట

మనవడి ముచ్చట

మా గారాల మనవడు ఉంగాంగరాగాల పాటగాడు మేలిమి బంగారు తునకవాడు అమ్మతో ఆదిలాబాదు నుంచి నాలుగు రోజుల ముచ్చటకు  మా చోటికొచ్చాడు అందరినీ ఆకట్టుకొనే కనికట్టేదో పిడికిటపట్టిన బహుపెంకివాడు తూనీగ రెక్కల్లా కదిలే తన కాళ్లు చేతుల విన్యాసాలతో పడక ప్రపంచపు ప్రదక్షిణకారుడు భరతమునికి తోచని భంగిమలు చూపే  మేటిగాడు మా దగ్గరున్నది నాలుగే రోజులైనా, వాడు ఆనందాల వెన్నెల పంచిన నట్టింటి  చంద్రుడు ఆడింది అడుగున్నర ఒడినేగానీ, వాడు హృదంతరాళాలను ఆక్రమించిన  వామనుడు తప్పట్లు తారంగాలతో వాడి గుప్పెట  ఆటబొమ్మనయ్యాను పలుకే పలకని పసివాడై విసుగులేని  ఊసులు మాతో కొసరి కొసరి పలికించాడు ఉంగాంగరాగాల రంగడై మాతో ఎన్నెన్నో పాడించిన  గీతగోవిందుడు తిరిగి వెళ్తున్నాడంటే నిదురే లేదు రేతిరంతా.... ఎరుపెక్కిన కన్నయింది వీక్షణం! బరువెక్కిన బాధయింది క్షణక్షణం!! ఆరుద్రగారు జీవితకాలం లేటన్నరైలు కూసింత లేటులేక కూతకూసి గర్వంగా నా కళ్లెదుట వచ్చి వాలింది నా మనవడిని డోలలూపే ఊయలై  ఊగుతూ, తూగుతూ, నవ్వుతూ సాగింది వాడున్న నాలుగు రోజులూ వసంతం వాలిన చెట్టు అయిన గృహం ఈ వేళ ఆకులు పూలు రాల్చిన  శిశిరమయ్యింది నవ్వులూ కేరింతల నగారాలతో తిరునాళ్లుగ తేజరిల్లిన ఇల్లు ఈ వేళ నిశబ్దం నీరాజనమైన  దేవాలయమయ్యింది వాడు దొరిలింది ఈ యెద చాపపైనే గానీ ఇప్పడిలా దొలుస్తున్నాడేం  నా గుండెనీ...? వాడు దోబూచులాడింది ఈపైటతోనే గానీ ఇప్పుడిలా దొరలుకొస్తున్నాడేం  నా కన్నీటిని...? వెళ్తే వెళ్లాడు గానీ మళ్లీ తిరిగి వచ్చేదాకా తరగని అనందానుభూతుల రాశులు గుమ్మరించిపోయాడు గుండెనిండా. వాడు నా మనవడే గానీ... నాలోని అమ్మతనానికి మళ్లీ పురుడుపోసిన బాల బ్రహ్మవాడు. నాలోన యశోదత్వానికి పాదువేసి  వెళ్లినోడు మళ్లీ శెలవులకి మరిన్ని చిలిపి చేష్టలతో కొంటె కృష్ణుడై రాకపోతాడా...? మా ఇంటిని రేపల్లె చేయకపోతాడా...?
అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా

అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా

చిమ్మ చీకట్లలో దీపధారియై, నా నీడను వెతుక్కుంటూ వస్తున్నట్లనిపిస్తది దినసరి పరుగు పందెంలో పొట్రాయి తగిలిన బొటనవేలికి గెలుపు మలాం రాస్తున్నట్లనిపిస్తది అలసిన వేళ చెట్టు నీడన రాలిన పండై తీపి ఊహలు తినిపిస్తున్నట్లనిపిస్తది మొగులు కింద మూగతనపు ఒంటరి వర్షంలో తడిసినప్పుడు ముదురు వెన్నెల శెద్దరు కప్పి, జాబిల్లిని చూపి, అల్లరి నేర్పిస్తున్నట్లనిపిస్తది పీడ కలొచ్చి నిదురలో బెదిరినప్పుడు భూతాన్ని పారదోలే ఊదుపొగల వాక్యమేదో ఉచ్చరిస్తున్నట్లనిపిస్తది బాధాతప్త స్రవంతిలో కొట్టుకుపోతున్నప్పుడు చెంప మీద కారిన కన్నీటి చుక్కని నీటి ముత్యమని ఆట పట్టిస్తున్నట్లనిపిస్తది ‘‘గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు’’ అని పద్యం అందుకున్నట్లనిపిస్తది సంతోషాలు మూటగట్టుకొని వస్తున్నప్పుడు కాకమ్మై, వాడకట్టు ఇండ్ల మీద వాలి, గొప్పతనాన్ని వేయినోళ్ల పొగిడిస్తున్నట్లనిపిస్తది తప్పుటడుగులు పడి, ఓడినప్పుడు ‘‘అన్ని దిక్కులు వెళ్లు, ఆ ఒక్క దిక్కు వెళ్లకు’’ అని వేలెత్తి, చూపిస్తున్నట్లనిపిస్తది రామాయణమంతా సీతమ్మదే అయినట్లు ఈ జీవితావరణమంతా అమ్మదే అమ్మ ఒళ్లోదే సమాధి మీద రెండు పూలు యాడాదికోసారి తద్దినం తంతు ఇవి చాలా ఆమె గుర్తుకి- తన యాదిలో కదులుతూ- తను పెడుతున్న మొదటి అన్నం ముద్ద, చేతుల్లోకి తీసుకొని, గోడ మీద పెడుతూ- ఇప్పటికీ ఎదురుగ్గా కూచుని, పద్యం రాపిస్తున్నట్లనిపిస్తది అమ్మ!  
మా ఊరు- అయిదురెట్లు

మా ఊరు- అయిదురెట్లు

కోడి హెచ్చరికతో పంట తరగతిలోకి ప్రవేశిస్తుంది మా ఊరు ఊరంతా చెమట ప్రవహిస్తోంది ఆశల కన్నుల్లో కోటి దీపాల్ని వెలిగిస్తూ సంతోషంగా లే సూరీడు గ్రామ ముత్తైదువ నుదుటి తిలకమైనాడు కొలనులో పిల్లతామరలు జలకమాడాయి అనునిత్యం ఉగాది పచ్చడికి ప్రత్యామ్నాయం పిండొడియమే మా నాల్కలపైన అక్షరమిచ్చే గుడిలేని దేవుని ఒడిలోకి పలకలు పరుగులు తీస్తున్నాయి ఆరోగ్యంగా వర వర్ణినుల రంగవల్లికల అంతరంగాలు రవివర్మ మతిని పోగొడితే సిగ్గు మొగ్గలు కడవలపై కడవలెట్టి చెరువు పొదుగు నుంచి జీవజలాల్ని పిండుకొస్తున్నాయి కదిలే బాపూ బొమ్మలవుతూ సంతృప్తిగా ఏవేవో మత సుగంధాలు గోపురాల పైకెక్కి ఉదయాన్ని సూక్తులు సూక్తులుగా వర్ణిస్తున్నాయి తల్లికందరూ బిడ్డలే మానవతా గొడుగులో చేరి శాంతి కచ్చేరి చేయమంది భద్రతకై తెలుగు వెలుగుల బతుకు బంధం పూరేకుల చందమని కళలు పండుగను చేసుకుంటున్నాయి భరోసాగా ఇక ఆకలి రక్కసి జాడేదీ?
తను - నేను

తను - నేను

తన నవ్వుని గాలి అలలమీద నా మనసు తీరంలోకి పంపిస్తూ నా ఎదురుగానే కూర్చుంటుంది ఓ ఆకాశమై నా చూపుల చేతులతో తన కన్నుల కాగితాలపై ప్రేమలేఖ రాస్తూ కళ్లముందే కదలాడుతుంటాను ఓ సాగరమై తనకి నాకు మధ్య కొన్ని అడుగుల దూరమున్నా తన పెదాలపైన నా పేరెప్పుడూ చందమామై విరబూస్తూనే ఉంటుంది తనకి నాకు మధ్య కొన్ని మౌనాలున్నా నా ఆలోచనల్లో తన రూపమెప్పుడూ పడవై సాగుతూనే ఉంటుంది తన పలకరింపులో ఓ ఉదయాన్ని మోసుకొచ్చి హృదయానికి జతచేసి జలపాతమై మురిసిపోతుంది నా ప్రేమలో ఓ పూలవనాన్ని కోసుకొచ్చి తన కొప్పులో అలంకరించి ఓ చినుకునై సంబరపడిపోతాను అబద్ధపు అద్దాల మేడలో జీవించడం తనకి, నాకు నచ్చదు స్వార్థపు బాటలో నడవడం తనకి, నాకు ఇష్టముండదు అందుకే మా మనసుల్ని నగ్నంగా  ఒకరి ముందు ఒకరం ఆవిష్కరించుకుంటాం ఒకరి కలల్ని ఒకరి కళ్లలోకి ప్రేమగా అనువాదం చేసుకుంటాం నేను తన అడుగులు వెతికే తీరం తను నా జీవితమంతా వ్యాపించిన మమకారం.
అస్మిత

అస్మిత

‘మగాడిగా పుడితే బావుణ్ను’ అంటూ అలవోకగా ఆమె అన్నమాట కమ్చీలా తగిలి ఆత్మ విమర్శ ఆరంభమైంది. ఆ మాట... తృప్తికీ, ఆనందానికీ కొత్త అర్థాలు వెతుక్కోమని వెక్కిరిస్తోంది. ఒంటి పూట కూడా సెలవెరుగని ఇంటి పేరు సైతం మార్చుకున్న మా యింటి మారాణి ఒళ్లు హూనమై, ఒంటి దేహమై అలసట శిఖరాలపైనుంటే అలసత్వపు లోయల్లో బద్ధకానికి బానిసలమై మేమంతా... బదులుగా మురిపెమంతా ముద్దగాజేసి, ఆమె నుదుట మెచ్చుకోలుగా ముద్రిస్తే అలసటంతా మరచి నవ్వుల నదిలో బతుకు నౌకకి సరంగులా ఆమె మారిపోతుంటే తన బృహద్విన్యాసాల ముందు కుబ్జరూపులమై మేమంతా... ...‘మగాడిగా పుడితే బావుణ్ణు’ అన్న ఆమె తలపుని తరిమేయాలంటే నాలో ఆమె సగమైనట్లే, ఆమెలో నేనూ సగమవ్వాలి. తనకి నేనెంతో, నాకు తను అంతకంటే ఎక్కువేనన్న వాస్తవం ఆమె ముందు వ్యక్తపరచాలి. న్యూనత పంజరం నుంచి విముక్తమయ్యేలా ఆమెకు ఆత్మ విశ్వాసపు రెక్కలు తొడగాలి. స్ఫటికం లాంటి ఆమె వ్యక్తిత్వం గుండా చైతన్యం పరావర్తనం చెందాలి. నక్షత్రం లాంటి ఆమె వెలుగులవల్ల మెరుస్తున్న గ్రహశకలంలాంటి నేను ప్రకృతికి పర్యాయమైన ఆ ప్రజ్ఞాశాలిని చూసి ‘ఆడ జన్మ ఇంత అద్భుతమైనదా!’ అని అబ్బురపడాలి.
ఉలికిపాటు

ఉలికిపాటు