కవితలు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

మల్లెమొగ్గ

మల్లెమొగ్గ

జి.రామకృష్ణ

ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

కన్రెప్పల్ని తడిపేసే కన్నీళ్లలోనూ ఆనందాశ్రువులు అన్వేషించడం... భరించరాని బాధల్లోనూ సరదాలు వెతుక్కోవడం... పెల్లుబికే విషాదాల్లోనూ వెల్లువెత్తి వినోదించడం... ఓవైపు గుండె జ్వలిస్తున్నా... చూపులు వెలిగించుకోవడం... మధ్యతరగతి మానవుడిని కదా! అమావాస్యలోనూ పున్నమి కోసం వెతుకులాట పన్నెండు గంటల నీరవ నిశీధిలోనూ ఉషస్సు కోసం వెంపర్లాట వైఫల్యాలు వరిస్తున్నాయని... విజయాల్ని పలవరించమా? నైరాశ్యం కబళిస్తోందని ఆశని శ్వాసించమా? దారంతా ముళ్లుంటే ఏం? పాదాలకు గాయాలైనా పరుగాపని నైజం నాది! నిర్దేశించుకున్న గమ్యం కోసం అలుపెరుగని గమనం నాది!!! వేదనల్తో సాహచర్యం చేస్తూ ‘నేడు’ నిన్నలో కలిసిపోతున్నా... రేపటి తూర్పున ఉదయించే అరుణారుణ కాంతి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆశగా నిరీక్షిస్తున్నా! ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌! అచ్చం అతడిలా... గళంలో గరళం ఉన్నా... అమృతాల నదిలో తలారా స్నానిస్తున్నా! *    *    *
ఆ చెట్టు

ఆ చెట్టు

నమ్ముతారో లేదో గాని ఆ చెట్టుతో నాకు స్నేహం కుదిరింది పొద్దున్నే దాని దగ్గరికి వెళ్తాను వెళ్లగానే కొమ్మలు చాస్తుంది ఆకులతో పలుకరిస్తుంది పువ్వులతో చిరునవ్వుతుంది మీకు యాదృచ్ఛికమనిపించవచ్చు గాని దాని గుసగుసలు వినిపిస్తాయి నాకు ఆ భాషను ఎంతసేపయినా వ్యాఖ్యానిస్తాను నేను వెళ్లకముందు దానిని గమనించండి సమీపించగానే దాని నిగారింపు ఎంతగా పెరిగిందో! మిగిలిన చెట్లనూ దాన్నీ పోల్చి పరిశీలించండి నేనూ అంతే దాని చుట్టూ తిరుగుతూ నేనే ఒక నడిచే చెట్టునవుతాను లేదా చెట్టే నా కాళ్లతో సంచరిస్తున్నట్టుంటుంది గాలి వేళ్లతో నా ఒళ్లంతా నిమురుతుంది మకరందంతో నాతో అనుబంధాన్ని పెంచుకుంటుంది ఆ పూల వర్ణ సమ్మేళనాన్ని ఏ రంగుల నిపుణుడూ చెప్పలేడు ఒక్కొక్క పువ్వూ ఒక్కొక్క పెయింటింగ్‌ ఎంత గొప్ప చిత్రకారుడైనా దానికి దండ వెయ్యాల్సిందే దాని నీడ కొంచెమే కావచ్చు ఇద్దరం కలిస్తే అదో పెద్ద బతుకుగూడుగా మారుతుంది రండి నా మిత్రుణ్ని పరిచయం చేస్తాను చెట్టు నా ధ్యానం చెట్టు నా గానం చెట్టు నా మనుగడ చెట్టు నా కవిత్వపు తలగడ! 
వాళ్ల నుంచి నేను

వాళ్ల నుంచి నేను

భాషంటే మన గతపు గుండె ఘోష భాషంటే మన వర్తమాన శ్వాస భాషంటే మన భవితపైన ఆశ ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు తిక్కన్న చక్కంగ చెక్కింది తెలుగు అన్నమయ్య పున్నమై వెెలిగింది తెలుగు త్యాగయ్య తీగలై సాగింది తెలుగు పోతన్న పూతలై పూసింది తెలుగు అన్నన్న అందరికి ‘పెద్దన్న’ తెలుగు ఎఱ్ఱన్న సోమన్న మన రామకృష్ణన్న శ్రీ తెలుగు తరుణికి నాథుడున్నాడన్న విశ్వనాథుడు నిలిచె తెలుగు శిఖరాగ్రాన విశ్వ సత్యాలెన్నో వివరించె వేమన్న అవనిపై అభిమానమతని అడుగుల జాడ నడిచాడు అందరినీ నడిపాడు  గురజాడ అంగనల స్వేచ్ఛకై అచంచలము అంగలేసిన కలం పేరు ‘చలము’ కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ పంట చేలల్లో పద సంచారి నండూరి సుజ్ఞాన పీఠికలు సినారె రావూరి భావ కవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి జాను తెనుగుల బోధ మాను మల్లాది తల్లి భాషకి అడుగు ముళ్లపూడి బుడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను ‘గిడుగు’ తెలంగాణాలెగసె శరథి మన ‘దాశరథి’ సరస్వతి సంతకం ‘మధురాంతకం’ అంత్యప్రాసల ముద్రకాది ‘ఆరుద్ర’ తెలుగు తలపై క్రౌను ‘ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌను’ అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగళి సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త ‘సముద్రాల’ తన పాట తెలియని గాలేది నేలేది మన బాధ తన భావమైన జాలాది కాలమను కడుపులో కాలితే ‘కాళోజి’ గాయాల గుండెపై చద్దరే ‘గద్దరు’ పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్య మనసు ఆకలి తీర్చు మన సుకవి ‘ఆత్రేయ’ వేలవేల గంగల వాగ్ఝరి ‘వేటూరి’, వెన్నపూతల అగ్నికీల ‘సిరివెెన్నెల’ యుద్ధాల యాసతో గొంతెత్తె సుద్దాల ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి పాటలే వూరేటి వెంకన్న గోరేటి నా తాత అయ్య కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు కవులు నాకైత నా పాట స్వయం సంపాద్యం అంతా అనుశృతం కొంత అనుశీలనం అణువంత కలిగింది వాణి అనుగ్రహం పైవాని అనుగ్రహం...  
అద్భుత దృశ్యావరణం

అద్భుత దృశ్యావరణం

విశాలంగా పర్చుకున్న పంటచేల మధ్యన ఎన్నిమార్లు తిరిగినా అంతుబట్టని రహస్యమే వెంటాడుతుంది విడవని నెచ్చెలిలా రాలుతున్న ఎండుటాకుల గలగలలు నిటారుగా ఆకాశం వైపునకే తలలెత్తిన చెట్లు నేలపైన సేదతీరుతున్న నివాసాలు మైదానాల మీంచి వీస్తున్న చల్లని గాలులు ప్రయాణాలు బాగుంటాయి మనసును దోచుకుంటాయి కొత్త అందాలు పరవశింపజేస్తాయి ఊహల రెక్కలతో కమనీయ రమణీయమైన కనువిందుచేసే ప్రదేశంలో వాల్తాం భుజంపైన తువ్వాలుతో చేతిలో కర్రతో మనుషుల అలికిడి లేని ప్రాంతాల్లో సాగిపోతున్న బాటసారి నడకను  గమనిస్తే జీవనయానమంటే ఇదేనేమో సెలయేరులను దాటుతూ వంతెనలను దాటుతూ పచ్చని చెట్లతో స్నేహం చేస్తూ పొద్దును గడిపే వాళ్లు మానవ నాగరికతకు ప్రతీకలు మనిషి కదలాలి ఉన్నచోటు నుంచి కదులుతూనే ఉండాలి అదే అన్నింటికి మూలం చలనశీలమే మార్పునకు దిక్సూచి కొండలపాదాలను ముద్దాడుతున్న పల్లెలు ఇళ్లకప్పులను ముద్దాడుతున్న శిఖరాల నీడలు లక్షల సంవత్సరాల అనుబంధమది అద్భుత ప్రకృతి చిత్రాలు తీరని దాహమే అతి జాగ్రత్తగా లోయల్లోకి దిగాల్సిందే పట్టుతప్పితే అంతే, ఒడుపుగా బతుకీడుస్తున్న ఆ ప్రజలెంత నేర్పరులంటే ప్రావీణ్యం కల్గిన ఇంజినీర్లకు ఏ మాత్రం తీసిపోరు ఎరుపుపూల వనం నీలాకాశంలో వెలిసిన అరుణిమలా శోభిల్లుతూ ఆకట్టుకుంటుంది నిప్పుకణికల తేజోమయ కిరణాలు చూపరులకు స్వాగతం పలుకుతున్నట్లుగా స్మృతివనమంతటా వ్యాపిస్తాయి కేరింతలు కొట్టే పిల్లలు వాళ్లను అదుపు చేసే గురువులు విహంగవీక్షణం చేస్తున్న పక్షులు పొలం పనులకు వెళ్తున్న పడుచులు మంచెలను, కంచెలను చూస్తూ ప్రవాహంలా సాగిన గమనానుభవాలు పసిమనసులపైన పచ్చబొట్టులా ముద్రితమైంది శాశ్వతంగా ఆ చిరస్మరణీయ దృశ్యావరణం  
వెన్నెలమ్మ మాట

వెన్నెలమ్మ మాట

ఇంటి ముందు చెట్టు; ఇంకుడు గుంతలు ఉన్నవారి ఘనత యెన్న తరమె జలసిరులను బొందు సులభ మార్గమ్మిదే వెన్నెలమ్మ మాట వెలుగు బాట.      చేరువైన మనిషి దూరమైపోవును      నమ్మకమును తాను వమ్ము జేసి      చెట్టు చెంత జేర చుట్టమై నిలుచురా      వెన్నెలమ్మ మాట వెలుగుబాట. దారి వెంట చెట్లు వరుసగా నాటించి చరిత పుటల నిలిచె చక్రవర్తి ఆ అశోకుడు మనకాదర్శ మూర్తిరా వెన్నెలమ్మ మాట వెలుగు బాట.      చెట్లు పండ్లు గాయ చేతరాయిని బట్టి      రాల్చగలడు నేటి రాతి మనిషి      విత్తు నాటు బుద్ధి వీసమంతగ లేదు      వెన్నెలమ్మ మాట వెలుగు బాట. ఆకు బెరడు, వేరు ఆ కొమ్మలే గాదు తరువు తనువునంత పరులకిచ్చు త్యాగ జీవి చెట్టు తపనతో కాపాడు వెన్నెలమ్మ మాట వెలుగు బాట.
వసంతాగమనం

వసంతాగమనం

ఎలమావి చిగురులు ఇంపుగా మెసవుచు      కోకిల కమ్మగా గొంతు సరిదె, విందుగా మామిడి పిందెలు పొడుచుచు      కిలకిల రవముల చిలుకలలమె ఎక్కడో ఘనగర్జ వక్కళించినదని      వనమయూరమ్ము నర్తనము సలిపె, చిరుగాలి తెరలుగా చిలుకుచుండుట చూచి      నింగి విహంగాలు నిక్కి పరచె, ప్రకృతి ఆమని సొబగుల పరవశించి రంగురంగుల కోకల రంగరించె ఏదొ క్రొత్త సోయగము పృథ్వీతలాన దుర్ముఖి ఉగాదినాడు మదులను దోచె! మామిడి ముక్కల మధుర పరిమళము      వేపపూతల చిరుపూపచేదు, తీపి బెల్లములోని తీయందనమ్మును      తింత్రిణీ ఫలమిచ్చు తేట పులుపు, చిమచిమలాడు పచ్చిమిరప కారమ్ము      పసమించి అలరించు గసగసాలు, జిహ్వల కిష్టమౌ చెరకు తుంటల చేర్పు      లేకున్న చెరకుపాలే యొకిన్ని, మిశ్రమంబయి బహు రుచులాశ్రయింప గా, ఉగాది పచ్చడిగా జగాన జనుల జీవితానుభూతుల కొక చిహ్నమగుచు బోధ గరపించెడు, ఉగాది పుణ్యమూర్తి!
దుర్ముఖి

దుర్ముఖి

మల్లియలారబోసిన తెలుగు పల్లవముల మృదురవం గున్న మామిళ్ల కాలి అందియలై కవి హృదయాన్ని ఘల్లున మోగించి మెల్లమెల్లని వసంత వీచికలు అల్లనల్లన కోయిల గొంతున ఝల్లున రాలే పూల పరిమళాల సుమధుర తేనెల మార్దవంతో షడ్రుచుల సోయగమై వీనుల మీటిన పసందయిన వీణగా అలరారి పచ్చని తరుల తోరణాలే వెచ్చని వనకన్యల నుదుటి బాసికమై నును సిగ్గుల గుత్తుల వేప పూతలు ప్రకృతి కాంత తీగ నడుమును ఆర్తిగా సృష్టించి చుట్టిన పుప్పొడి కవితల సింగారాలై మందారపు బుగ్గలపై మంచు గంధపు నలుగు కిరణాలు మరో కొత్త వాకిలిని తెరచి వేసంగి వెన్నెల విందుకు స్వాగత గీతాలు పలుకుతుంటే నలుదిశలా ‘చంద్రముఖి’వై సాక్షాత్కరిస్తూ అరుదెంచుమా నీ నామమేదైన వగయక మా మనసు లోగిళ్లను గెలుచు ‘దుర్ముఖీ’!