కవితలు

మా బడి

మా బడి

గరిమెళ్ళ నాగేశ్వరరావు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

తెలుగింటి సంక్రాంతి

తెలుగింటి సంక్రాంతి

తెలుగు లోగిలి వెలిగిపోతోంది, రంగురంగుల రంగవల్లుల, సోయగాలతో హొయలుపోతూ, ఇంటింటి వాకిలి మెరిసిపోతోంది! కుంకుమలద్దిన పసుపు గడపలు, తోరణాలై మామిడాకులు, వేలాడుతున్న వరికంకెలతొ, సింహద్వారాలు స్వాగతించాయి! తెలుగు కట్టూ, తెలుగు బొట్టూ, సంప్రదాయపు తీరుతెన్నులు, కొలువుతీరి, మరులు గొలిపాయి, పరుగులెట్టి పెద్దపండగ అరుగులెక్కిందీ! భోగిమంటలు మింటినంటే ఆనందమిచ్చాయి; బళ్ల నిండుగ ధాన్యరాశులు ఇంట చేరాయి, దండిగా, గోమాత లింటను పూజలందుకున్నాయి! బంధుజనుల కలయికలతో, నిండుగా నట్టిళ్లు నవ్వాయి! పిండివంటల ఘుమఘుమలతో వంటిళ్లు వెలిగాయి! పట్టు పావడాలు కట్టి కన్నెలు గొబ్బిళ్లు పెట్టి, కనువిందు చేశారు! ఆటలాడే గంగిరెద్దులు, ఆనందమిచ్చాయి, హరిదాసు పాటలు చెవులసోకి, ఆహ్లాదమిచ్చాయి! భోగిపళ్ల సందడులతో సంధ్యసుందరి సందడించింది! పసుపుకుంకుమ పంచుకొనగా అతివలంతా పేరంటమెళ్లారు! అలిగి అలుగక అల్లుళ్లు ఇంటను పేకాటలాడి పరవశించారు, అల్లర్లు చేసే మరదళ్లతోను సరసాల తేలారు! కనుల పండగ కాగా మనసు తేలిపోయింది, చిరకాల కోరిక తీరగా ఎద ఉప్పొంగిపోయింది! ఒక్కపెట్టున కన్నులింతగ విచ్చుకున్నాయి, చూసి మురిసినదంత ‘కల’యని నొచ్చుకున్నాయి.
ఇంటిగాలి

ఇంటిగాలి

హాస్టల్లో కుర్రాడికి ఇంటివైపు గాలి మళ్లింది. అన్నం తినబుద్ధి కాదు రెక్కలు లేనందుకు మొదటిసారి దుఃఖమొచ్చింది. మూడు రోజులుగా ఒకటే వాన. వానలోకి వాడు చెదిరిపోతున్నాడో వాడిలోకి వాన వ్యాపిస్తుందో అర్థం కాదు. చెరపట్టిన మబ్బుల్ని వదిలించుకొని కాల్వలుగా మారిన నీరు వడివడిగా నదివైపు పరుగులు పెడుతుంది. లేగదూడ అంబా అని అరిస్తే ఉలికిపాటు, ఏ రైలు కూత విన్నా అది వాళ్లూరికే వెళ్తున్నట్టు ఆ చీమలబారుకు మొదలెక్కడోగాని అన్నీ ఒకే బొరియలోకి వెళ్లిపోతున్నట్టు, పైకెగిరి మళ్లీ అతుక్కోలేని ఆకులు కిందనే మూల్గుతున్నట్టు. ఇంటివైపు గాలి మళ్లింది. అన్నం తినబుద్ధి కాదు వాడిని నా రెక్కల మీద ఎత్తుకొని పోయి వాళ్లమ్మ ముందు దించి రావాలని ఉంది.
విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మి

విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మి

విశ్వశాంతి సువర్ణ సుప్రభాత కిరణాల్లో భువిని సమతా పతంగాలు రివ్వున ఎగరగా, గుండె వాకిళ్ల మమతల తోరణాలు వ్రేలగా, స్వర్ణరథంలో వచ్చే సంక్రాంతి కల్యాణీ! స్వాగతం!! తెలుగు గుమ్మాల ముంగిట ముత్యాల ముగ్గుల్లో ముద్దుగా పూబంతుల గొబ్బెమ్మలను పేర్చి ‘గొబ్బిలక్ష్మి’ని పూజించే - కన్నెలను దీవించగా వేగవచ్చే - సర్వమంగళ‘దాయని’కి సుస్వాగతం!! గంగిరెద్దు కాలి మువ్వల - శుభకర స్వరాలు, బుడబుక్కలవాని - డమరుక - ధ్వనులు హరిదాసు - భక్తి కీర్తనలు - శుభాలందీయ సాగి వచ్చే - ‘సౌభాగ్యలక్ష్మి’కిదే స్వాగతం!! రైతన్నల - కష్టం ఫలించ - పంటసిరులనిచ్చి, పసిపాపలపై భోగిపళ్లు - శుభములై కురియ, ‘సర్వే జనాః సుఖినోభవంతు’- అని ఆశీర్వదించ తరలి వచ్చే- ‘శ్రీమహాలక్ష్మి’కి సుస్వాగతం!! కుల మత భేదాలు భోగి మంటల్లో కాలగా, అవినీతి బకాసురులు - అంతమొందగా యువజనులలో- చైతన్యకాంతులు విరియగా వేగవచ్చే - ‘సకలజన హితైషిణి’కి స్వాగతం!! తెలుగు కలాలు - పసిడి కాంతులు తేజరిల్ల ప్రతిగుండెలో అహింస, శాంతులు విరాజిల్ల తెలుగు వెలుగుల - స్వర్ణ క్రాంతి రథంలో విచ్చేస్తున్న - ‘విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మీ’! సుస్వాగతం !!
మకర సంక్రమణం

మకర సంక్రమణం

మార్గశిరం మొగ్గ తొడిగింది పుష్యమి మళ్లీ పురుడు పోసుకుంది ధనుర్మాసం ధాన్యలక్ష్మిని వదిలివెళ్లింది పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంటే సకల జనులే కాదు పంటచేలూ అభ్యంగన స్నానాలాడుతున్నాయి తుషార బిందువులతో! సంక్రాంతి సూర్యుడు కొత్తగా ఉదయించాడు. గోరువెచ్చని కిరణాలతో భోగిమంటలు పోటీపడుతూ తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని అనుభూతిని అందిస్తున్నాయి! బుడబుక్కలవాని డమరుకం నిద్రమత్తును గమ్మత్తుగా వదిలిస్తుంటే జంగమదేవరల జానపదాలు సుతిమెత్తగా సుప్రభాతం పాడుతున్నాయి డూడూ బసవన్నల విన్యాసాలు బద్ధకాన్ని అందంగా పారదోలుతున్నాయి ‘హరిలో రంగ హరి’ ఆలపిస్తూ హరిదాసు పాశ్చాత్య సంగీతాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తున్నాడు ఆహ్లాదమంతా ఆరుబయట నాట్యం చేస్తోంటే పాపాయిలా పండగ బోసినవ్వులు రువ్వుతోంది! అందుకే అన్నారు. భోగి భోగభాగ్యాలకు నిలయం! మకర సంక్రమణం మధురానుభూతుల సమ్మేళనం! కనుమ పాడిపంటల ప్రతిఫలం! ఇది నిత్యనూతన సత్యం.
ఆనాటి మా పల్లెతల్లి

ఆనాటి మా పల్లెతల్లి

ఎడ్లబండిపై నేవెళుతుంటే ఏరు పిలుస్తోంది. ఏడుపుట్ల వరి ధాన్యము తోడుగా వూరు పిలుస్తోంది. ॥ఎడ్లబండి॥ కాడిగట్టిన జోడెద్దులు కదలి సాగిపోతుంటే మెడలో కట్టిన గంటల శబ్దపు హోరు పిలుస్తోంది. ॥ఎడ్లబండి॥ గ్రామ చావళ్లు, రచ్చబండలు, ఎదురుచూసే లోగిళ్లు తాత కళ్లకు, తడి తగలంగానే... బోసినోరు పిలుస్తోంది. ॥ఎడ్లబండి॥ ముత్యాల్లా నెత్తిన రాల్చిన ఇంటి పైకప్పు చినుకుల్తో నన్ను చూచి గుర్తొచ్చినట్టుగా, మా ఇంటిచూరు పిలుస్తోంది ॥ఎడ్లబండి॥ పండరి భజనలు, కోలాటాలు, పడుచుల జంటలు కూడుకొని అడుగుల్లో అడుగులేసిన, ఆ నడకల జోరు పిలుస్తోంది ॥ఎడ్లబండి॥ ఏరు స్వర్ణముఖి సాగుతుంది ఒక పూలరథంలాగా దాహం తీర్చుకుపొమ్మంటూ ఆ ఏటి నీరు పిలుస్తోంది ॥ఎడ్లబండి॥ కలగంటూనే కావ్యజగతిలో కరిగే వెందుకు ఓ ‘‘మౌని’’ అలనాటి వైభవం వెలిగించండని... మా గుడి తీరు పిలుస్తోంది. ॥ఎడ్లబండి॥ ఎడ్లబండిపై నేవెళుతుంటే ఏరు పిలుస్తోంది ఏడుపుట్ల వరి ధాన్యము తోడుగా వూరు పిలుస్తోంది.... ॥ఎడ్లబండి॥
కొత్త ఇంధనం

కొత్త ఇంధనం

బాలార్క కిరణ సంజనిత ప్రసారంలో ఆకు చివర నుంచి జాలువారుతున్న మంచు బిందువులో నితాంత సౌందర్య దృక్కోణం మలయానిల స్పర్శతో శరీరంలో చెప్పలేని ఆనందపుటలజడి సప్తస్వరాలను మీటుతూ సాగిపోయే నదీతరంగాలలో మృదుమధుర భావాల సవ్వడి కొమ్మకొమ్మలో నవజీవన శోభ పువ్వుపువ్వులో అంతులేని సౌకుమార్యం ఆ పరిమళ లహరిలో విప్పిచెప్పలేని దివ్యానుభూతి తుమ్మెద ఝంకారంలో కమ్రమనోహర గీతానువాదం పచ్చచీర కట్టుకొన్న పల్లెలో అరముద్దుల తొలిపొద్దుల కవ్వింత ఆకాశమంత అనురాగం గుండెల్లో నిక్షిప్తమై ఆశలకులాయంలోంచి ఆశయాల పులుగులు రెక్కవిప్పి రేపటి మేతకు సన్నద్ధమవుతున్న సందడి మనిషి మనిషిలో ఏదో మార్పు బతుకు బతుకులో ఇదో తూర్పు నిట్టూర్పుకు ఓదార్పు ఆవేదనకు సంతోషాల చేర్పు ప్రతి వదనంలో చిరునవ్వుల జాతర బూజు పట్టిన పాతకు పాతర ఏమిటీ ఉత్సాహం ఎందుకీ కోలాహలం కాలం పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించింది పుడమి తల్లికి ఒళ్లు పులకరించింది కొత్త సంవత్సరం విచ్చేసింది మానవ జీవన శకటానికి కొత్త ఇంధనాన్ని ఎక్కించింది అందరికీ మేలు జరగాలని జగత్తులో శాంతి నిండాలని.
కన్నీరయిన స్వప్నం

కన్నీరయిన స్వప్నం

ఒక స్వప్నం నెరవేరిందనే సంతోషం ఎప్పుడూ లేనప్పుడు కలలు కని కన్నీరు కార్చటం ఒక విషాదకావ్యం! ఈ విషాదానికి కారకులెవరు? నేను ఆకాశంలో విహరించటం లేదు మెట్టుమెట్టుగా ఎక్కిన నేను కాలుజారి నేలమీద పడటం గాయం నిరంతర మంట నా మనసొక అరణ్యం  నా ప్రయాణం ఆగదు ఈ విషాదం ఇలా నవ్వనీ ఈ గాయం ఇలాగే జ్వలించనీ నా నడక ఆగదు నా చూపు ఆగిపోదు మైలురాళ్లు దాటడం నిరంతర తపన  దారిలో లేని చెట్లను ఎలా లెక్కించగలను? చెట్లను నరికేసిన వారు ఇక్కడ వీరులు రాత్రి కూడా విశ్రాంతి లేని నడక ఏ గాలి ఎటువీచినా ఏ నక్షత్రం ఎటు మెరిసినా కన్నీరు ఉంటుంది కలల గాజుగ్లాసు నిరంతరం పగులుతుంది నీరు నేలపాలవుతుంది కన్నీరు మిగులుతుంది