కవితలు

పాపం! పసివాళ్లు!!

పాపం! పసివాళ్లు!!

లగడపాటి భాస్కర్‌

తెలుగు తల్లి

తెలుగు తల్లి

- డా।। నాగభైరవ ఆదినారాయణ

సంక్రాంతి లక్ష్మి

సంక్రాంతి లక్ష్మి

అద్దంకి రామప్రియ

పొందడం కోసమే..!

పొందడం కోసమే..!

కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

పావురాళ్లకు కెవ్వు కేకలు

పావురాళ్లకు కెవ్వు కేకలు

కోటం చంద్రశేఖర్‌

పొద్దున్నే దృశ్యాలు

పొద్దున్నే దృశ్యాలు

గూటి నుంచి పిట్ట పోయినట్టు పొద్దున్నే నడకకు బయలుదేరుతాను మైదానం దాకా నడుస్తుంటే దృశ్యాదృశ్యాలు మనసులో అక్షరాలై వికసిస్తాయి                *** ఆమె పైపుపట్టి కడిగిన బండలనే మల్ల మల్ల నీళ్లతో కడుగుతంది ఎక్కువైన నీళ్లు కన్నీళ్లై జర్రున మోరీల పాలవుతున్నాయి  ఇదివరకైతే మా అమ్మ కొప్పెరల నీళ్లు చేదుకచ్చి గుండు చెంబుతో నిమ్మలంగ వాకిలి అలుకు సల్లేది                   *** ఓ చిన్న పిల్ల నల్ల కాడ వంగి ధారగా వస్తున్న నీళ్లతో మొకం కడుగుతంది కడిగేది తక్కువ ఎల్లిపోయేది ఎక్కువ  ఇది వరకైతే మా ఊల్లె గోలెంల నీళ్లు ముంచుకొని గోరంట్ల చెట్ల కాడ చెంబుతోని కాల్రెక్కలు కడుక్కునేది                    *** ఆయన నీళ్ల పైపు పట్టి కారూ బండి చిమ్మిచ్చి కడుగుతండు ఇంటి ముందట నీళ్ల మడుగే చేసిండు ఎన్కటి కాలంల బాయిలకెల్లి బకెట్ల నీళ్లు తెచ్చుకొని లోటతోని బండీ సైకిల్లు కడుక్కునేది              *** బ్యాంకులో నగదు నిలువ భూమిలో నీళ్ల నిలువ రెండూ ఒక్కటే వినియోగించిన కొద్దీ తరుగుతయి దేనికైనా పొదుపే మదుపు నడక మైదానంలో నాలుగు చుట్లు చుట్టి ధ్యానిస్తుంటే పొద్దటి దృశ్యాలు నాలుగు కవనాలుగా దునుకుతున్నాయి
శ్రావణ మేఘపు ఒలిపిరిలో..

శ్రావణ మేఘపు ఒలిపిరిలో..

ఈ శ్రావణ మేఘం రాత్రంతా తన జలదేహంతో చివుర్లు తొడుగుతున్న చింతచెట్టుని ఆప్యాయంగా హత్తుకున్నట్లుంది వాన వెలసిన ఈ ఉదయాన చెట్టు కూడా కురిసే మేఘమైంది చిరుజల్లుల తోవలో విడిపోయిన ప్రేమికుల జంటలా ఆకాశంలో చెరోవైపునకు రెండు గువ్వలు పశువుల గిట్టలతో చిత్తడి చిత్తడిగా మారిన మట్టి దారి పక్క సన్నని పంట కాలువలో  నారుమడి తడుపును సడిచేస్తున్న కప్ప దూరంగా రైలు కూత నడుస్తున్న శబ్దం దడికట్టిన పాకలోంచి బయటికొచ్చి చీకటిని నెమరువేస్తున్న మేకపిల్లల చుట్టూ మురిపిస్తున్న తెరిపి తండ్రి భుజాలమీదకెక్కి దిగనని మారాం చేస్తున్న పిల్లాడిలా ఎదురుగా కనిపించే కొండమీదకెక్కి కూర్చున్న మబ్బు ఆకాశానికి మడి చెక్కలు పెడుతున్న సామూహిక నమస్కారాల్లా నిటారుగా నిలబెట్టిన నూజేనువోవులున్న పొలంగట్టున దట్టమైన గడ్డిమీద వెన్నెల బిందువులు ఇక వానవిల్లు ఎక్కడ తప్పిపోయిందో వెతకడానికి వెళ్లినట్లుందీ వర్షం..... అది మళ్లీ వచ్చే సమయంలోనైనా నాలుగ్గోడలమధ్య యంత్రాలకతుక్కున్న పొడిబారిన వదనాలను పిలిచి వానదారాలను చుట్టి తడిగా ముడివేయాలి.
బాల్యమా... ఓసారి నా పల్లెకు రా!

బాల్యమా... ఓసారి నా పల్లెకు రా!

పసిపిల్లల్ని కోడిపిల్లల్ని చేసి కాన్వెంట్‌ గద్దలు తన్నుకుపోతే... తల్లికోడై నా బడిశాల తల్లడిల్లుతోంది! చదువులతోటలో స్వేచ్ఛగా ఎగరాల్సిన సీతాకోక చిలుక ఇపుడు కాన్వెంట్‌ జైల్లో ఖైదీ! మూలాలు మరచిపోతున్న వ్యవస్థలో... ట్వింకిల్‌ ట్వింకిల్‌ తళుకుల ముందు నా తెలుగువాచకం తలదించుకుంటోంది! బాబా బ్లాక్‌ షీప్‌ నిగనిగలముందు నా నీతిశతకాలు నివ్వెరబోతున్నాయి! చదువుల తల్లి, సంతలో అంగడిసరుకై నిలబడ్డప్పుడు బాల్యం, కాసుల కొమ్మలకు చిక్కిన గాలిపటమై కొట్లాడుతోంది! భుజాల మీద భూగోళాన్ని మోస్తూ, వాడు బస్సు కొమ్మన వేలాడే గబ్బిలమై భారంగా ఇంటికి చేరినప్పుడు చల్లని ఒడిలో చుక్కల ఆకాశాన్ని చూపించాల్సిన, అమ్మ బబుల్‌గమ్‌లా సాగే సీరియల్స్‌ వెంట బతుకంతా పరుగెడుతుంది! వెచ్చని గుండెలమీంచి పొద్దును చూపించాల్సిన, నాన్న పచ్చనోట్ల మధ్య బతుకును వెతుకులాడుతుంటాడు! చుట్టూరా ముళ్లకంచెలా ఫెన్సింగ్‌ గేటుముందు యమకింకరుడు గూర్ఖా ఏ బంధుత్వాలూ దరిచేరని ఖరీదైన కారాగారం ఇంటిలో... ప్రాణంలేని బొమ్మల మధ్య ప్రేమను పంచలేని కదిలే బొమ్మల మధ్య కేవలం ప్రాణమున్న బొమ్మలా... వాడు! మనుషులు, నడిచే మార్కెట్లయినప్పుడు ఉట్టికెగరలేని ఊహలు ఆశల ఆకాశానికెగబాకుతున్నప్పుడు ఒత్తిడి నిండిన బాల్యం ఊదిన బెలూనై పేలిపోతుంది! మొక్క నుంచి ఆకును తుంచేసినట్టు బతుకు నుంచి బాల్యం తుంచేయబడుతుంది! నాలుగు దిక్కుల్లో విస్తరించాల్సిన తరగతి గది నాలుగు గోడలకు పరిమితమై బతుకుతెరువుకు పనికిరాని సిలబస్‌ వెంట  తరగతులై పరిగెత్తీ పరిగెత్తీ ఓసారి వెనక్కి తిరిగిచూస్తే... శిథిలమైన బాల్యశకలాల కింద శూన్యమే వెక్కిరిస్తోంది! కార్పొరేట్‌ కాన్వెంట్ల రెక్కల పహారాలో కునారిల్లుతోన్న ఓ బాల్యమా... కణకణమండే పరుగు పందెమిక చాలు! నీ పట్నం ఇనుప చట్రాల్లోంచి నీ ఆంగ్లవ్యామోహ కామినీ కౌగిళ్లలోంచి ఓసారి నా పల్లెకు రా..! అమ్మ ఒడిలాంటి ప్రకృతి బడిలో... గడ్డిపరక మీద మెరిసే జలతలంబ్రాల్లోంచి రంగురంగుల హరివిల్లు చూపిస్తాను! వేగావతీ నదీ ఇసుకతిన్నెల మీద పిచ్చుకగూళ్లు కడతాను! చైత్రమాసపు పున్నమి రాత్రుల్లో వీధి అరుగుల మీద పూసిన వెన్నెల గంధాన్ని నీ ఒంటికి పూస్తాను! పెరటికొమ్మన దొంగిలించిన జామకాయ కాకెంగిలి పెడతాను! పచ్చని తోటల్లో పసిడిపూల కాంతుల్ని చూపిస్తూ కోయిలమ్మల పాటలు వినిపిస్తాను! వేపచెట్ల నీడల్లో ఉయ్యాలలూపుతూ పారే సెలయేటిలో నీ ప్రతిబింబాల్ని చూపిస్తాను! కాలువగట్ల వెంట పడుతూ లేస్తూ పరిగెడుతూ పచ్చని జ్ఞాపకాల్ని నీ కనురెమ్మలకు వేలాడదీస్తాను! నీ తాతా తండ్రుల పాదముద్రల మీదుగా నిన్ను చిటికెన వేలుపట్టి నడిపిస్తాను! బాల్యమా... ఓసారి నా పల్లెకు రా..!  
తాబేటి కాయ కల

తాబేటి కాయ కల

అక్షరాన్ని ఆయుధంతో చెక్కడమే కవిత్వం నిరంతర తపన ముందు గడ్డకట్టిన కాలమైనా కరిగిపోదా !!? అకుంఠిత దీక్ష ముందు వణుకుతున్న వృద్ధాప్యమైనా నిటారుగా నడచి రాదా? అక్షరమే ఆయుధం - అభ్యుదయ అనుబంధం కాలం జయభేరి - కర్తవ్యం విజయభేరి ఆలోచనా కెరటాలకు అంతం లేదు అక్షర కిరణాలకు చీకటి లేదు పాతదేదైనా కొత్తగా చూడటమే మంచి దారి వెయ్యడమే ఒక కొత్త మొలకను నాటడమే ఈ ప్రపంచాన్ని జంతు ప్రేమగా పలకరించడమే అనంత శక్తిమంతమైన మట్టిని మనిషిగా నిర్మించడమే నీలోని నిన్ను మేల్కొల్పడమే అసాధ్యమైనట్టు కనిపించే దేన్నైనా సాధ్యం చేసే సంకల్పమై పయనించడం కవిత్వం అర్థం కాని జీవితాన్ని అర్థవంతంగా తర్జుమా చేయడమే కదా కవిత్వం లోలోపలి ఆశల్ని కరుగుతున్న కాలంలోకి కుదించి జరుగుతున్న వాస్తవాన్ని దట్టించి ఒక చైతన్య దీపాన్ని ముట్టించడం కదా కవిత్వం విలువల్ని బంధాల్ని పదిలపర్చుకోవడమే మానవత్వం. ఎందుకు కవిత్వమంటే భయపడిపోతున్నారు? బాధ్యతలనొదిలి పారిపోతున్నారు? బంధాలను విధ్వంసం చేసుకుంటున్నారు? ఎల్లప్పుడూ సుఖాల భ్రమల వైపు ఏంటా పరుగు? దుఃఖానంతరమేదో... ప్రవాహానంతరమేదో... చీకటి వెనకున్నదేదో... నిద్దర కలవరంలోని ఆంతర్యమేదో... అదే కవిత్వం-  తాబేటికాయలో చల్లని నదిని కూర్చోబెట్టిన మనిషి కల కవిత్వం నిన్నో యుద్ధగీతంగా మలచి నీలోంచి నిన్ను శాంతిదీపంగా పరిమళింపజేసే తపన కవిత్వం వేదన చరిత శోధన కవిత్వం
చెలికాడా!

చెలికాడా!

నను జాడ కనకోయి కనుదోయి వినదోయి     ఈడుకయిన వాడ! జోడు కాడ! నను వీడమనకోయి, నా మది వినదోయి     చొట్టబుగ్గలవాడ! సొగసు కాడ! నిను వీడి మననోయి నీ తోనె బతుకోయి     చిత్ర మానస చోర! చెలియ కాడ! నను వీడిఁజనకోయి నా జత విడకోయి     చందమామకు సరి అందగాడ! వగవు చిందు కనులు వాలుచూపులు మాని చెలిమి తోడ నీవు చేరి రాక.. వగలు చిందు తనువు వయ్యారమొలికించు  చెలియ తోడ నీవు చేరిరాగ కోటి యాశలు మదిన్‌ కోట గట్టితిని నేను     కోమలీ! విడకనీ కోరువాడ! కోటియూసుల తీపి కోయిలమ్మానిను     విడినేను మనననీ వేడువాడ! కోటి పూవులతోటి కొలిచేటి నావాడ     కలువపూ రేకుల కనులవాడ! కోట్ల సిరుల కన్న కోరేది నిన్ననీ     వదలక ననుమెచ్చి వలచువాడ! చెలియ కనుల నీట చెమ్మజూచుటతోనె కనులు చెమ్మగిల్లు కరుణనీది సఖియ యలుక జూప సాదరమ్మున జేర్చి మనసు నూరడించు మమత నీది కనుల నీరును జిల్కు కనకుంటి నీ రూపు     కనులార నిను నేను కనక జనకు  యడదంత దడలీను యడమైతె నీ నీడ     కడదాక సఖుడనా కరము విడకు  తడవడున్‌ యడుగులు తమరితోడును లేక     నడయాడు నా తోడ  నడుగువిడక మాటమూగైపోవు మానంగ నీ యూసు     మనసైన నావాడ మరువబోకు కోటి మాటలైన కోరేది నీ బాసె చేసుకున్న బాస చెదరనీకు  కోటి జన్మలున్న కోరేది నీ తోడె జన్మజన్మలోన జతను విడకు  
 నీకోసం

 నీకోసం

తిరిగి రాలేని లోకాలకి తరలిపోయిన నీకోసం నేనెదురు చూస్తే అది నిరీక్షణ ఎలా అవుతుంది...!? నువ్వింక లేవనీ తిరిగి చూడవనీ... మనసు దీనంగా రోదిస్తే... అది విరహవేదనెలా అవుతుంది....!? నిలువెల్లా వెల్లువలై ముంచెత్తిన వలపు వెన్నెల.. పంచభూతాల్లో కలిసిందంటే ఎలా అనుకోను... అది మన నీడల దోబూచులాటని...!? నీకోసం కళ్లెత్తి చూస్తే... ఆకాశం నుంచి రాలిన వాన చినుకు... నీకోసం శ్వాసిస్తే... మట్టివాసనలీనిన వెచ్చని నీ ఊపిరి... అనుభూతికోసం నేవిల్లునైతే... వేడిసెగలా నీ మోహావేశం. అలనాటి ఆనందం సై అంటే... సెలయేటి పాటకి చిందేసిన నీ ప్రణయం. ఏవీ..ఏవీ ఆ దయా ప్రసాదాలు...!? ఏవీ ఏవీ నీ పలుకుల తియ్యదనాలూ...!? నీ పథాన నీ పయనం... ముగిసిన మన కథనం... తడబడిన నా పథం.. తడుముకున్న జ్ఞాపకం... తెలిమబ్బుల గగనాన.. తెల్లపావురమై మాయమైన నీకోసం... నా నిరీక్షణకి.. అర్థ్ధముందా.. నిష్ఠురనిజానికి నిలువెత్తు ప్రమాణమే గాని... ఇదెలా విరహవేదన... ఆరని కార్చిచ్చు గాని.. నా నీడతో నా ఆటేగాని.. మనసెందుకు రాజీ పడదు.. మన ఆట ముగిసిందని...! ఇంకా ఎందుకు... అవిశ్రాంత అన్వేషణ...అవిరళ అశ్రుధారల మసకబారిన నీ సారూప్యం కోసం...!
చెరువు...!

చెరువు...!

ఇక్కడ కొన్ని జీవితాలుండాలి కొన్ని జ్ఞాపకాలుండాలి కొన్ని పండగలుండాలి కొన్ని పరమాన్నాలుండాలి కొన్ని సంబరాలుండాలి కొన్ని సంతోషాలుండాలి కలుపు పాటల కోలాహాలాలుండాలి కంకి కొడవళ్ల కోలాటాలుండాలి ధాన్యపు రాశుల దరువులుండాలి తూరుపెత్తే గాలి పాటలుండాలి గడపల నిండా పొర్లిపోయిన పంట కుప్పల గురుతులుండాలి ముంగిళ్ల ముందు ముగ్గుల ముచ్చట్లుండాలి చెరువు బంక మన్నులో తీరిన వినాయక ఉత్సవాలుండాలి ఇక్కడో ఊరుండాలి ఇక్కడో చెరువుండాలి ఏమైపోయాయ్‌ ఇవన్నీ ఎక్కడికెళ్లిపోయాయ్‌ అవన్నీ ..... చెరువంటే ఒట్టి నీటి కుండనుకునేరు చెరువంటే.... మా ఊరు... మా పల్లె మా జీవితం మా ఆశ మా శ్వాస చెరువంటే... మా పల్లె బతుకుల ఉత్సవం మా దేశ జనుల జాతకం చెరువుకు మొరవొస్తే పల్లెకు పులకరమొచ్చినట్లే పొలానికి పురిటి నొప్పులొచ్చినట్లే పంట కడుపు పండినట్లే చెరువులో చేపల వేట పల్లె జీవితానికో జాతర ఊళ్లో కొంపలన్నీ చేపల పులుసు కంపు కొడితే పల్లె బతుకులు కమ్మగా పరిమళిస్తున్నట్లే ..... ఏమైందో  నా పల్లెకు... ఈ చెరువుకు పల్లె కొంపల్లో చేపల పులుసు  ఘుమాళించడం లేదు కొన్నేళ్లయింది మా చెరువులో నీటి అలజడి కనిపించక చేపల సడి వినిపించక మా ఊరిని చూసి వాన దేవుడికి వెగటేసిందేమో చుట్టం చూపుగానూ రావడం లేదు ఎన్ని కప్పదేవర్లు చేసినా రావిచెట్టు, వేపచెట్టులకు ఎన్ని పెళ్లిళ్లు చేసినా ఊరి గంగమ్మకు ఎన్ని దున్నపోతులు బలిచ్చినా ఎన్ని పొట్టేళ్ల తలలు నరికేసినా నీళ్ల మబ్బులు ఊళ్లోకి తొంగి చూడటం లేదు చెంబుడు నీళ్లయినా పోసి చెరువు గొంతు తడపడం లేదు ఊరి పైర్ల దాహం తీర్చడం లేదు పల్లె పుడమి పలకరించడం లేదు చినుకు కోసం ఎదురు చూసీ చూసీ ఊరు కళ్లు ఒట్టిపోతున్నాయి నేల గుండెలు పగిలిపోతున్నాయి నిండు కుండలాంటి చెరువు నెర్రలై పగిలిపోయి పర్రెలై పొగలిపోయి కంపచెట్ల కంపు కొడుతోంది నీళ్లు లేక పొలం బీడై... మొలకలెత్తక మొద్దుబారిపోతోంది పల్లె జీవితం పరిగలైపోయి పట్నాలకు పారిపోయి కూలి చిత్రమై కూలిపోతోంది రతనాల సీమ రాయలసీమలో మా ఊరి చెరువే కాదు ఏ చెరువు గుండె తట్టినా ఏ పల్లె గడప తొక్కినా కనిపించేది ఇదే..కథ వినిపించేది ఇదే...వ్యథ!