బాలార్క కిరణ సంజనిత
ప్రసారంలో
ఆకు చివర నుంచి
జాలువారుతున్న మంచు బిందువులో
నితాంత సౌందర్య దృక్కోణం
మలయానిల స్పర్శతో
శరీరంలో చెప్పలేని ఆనందపుటలజడి
సప్తస్వరాలను మీటుతూ
సాగిపోయే నదీతరంగాలలో
మృదుమధుర భావాల సవ్వడి
కొమ్మకొమ్మలో నవజీవన శోభ
పువ్వుపువ్వులో అంతులేని సౌకుమార్యం
ఆ పరిమళ లహరిలో
విప్పిచెప్పలేని దివ్యానుభూతి
తుమ్మెద ఝంకారంలో
కమ్రమనోహర గీతానువాదం
పచ్చచీర కట్టుకొన్న పల్లెలో
అరముద్దుల తొలిపొద్దుల కవ్వింత
ఆకాశమంత అనురాగం
గుండెల్లో నిక్షిప్తమై
ఆశలకులాయంలోంచి
ఆశయాల పులుగులు రెక్కవిప్పి
రేపటి మేతకు సన్నద్ధమవుతున్న సందడి
మనిషి మనిషిలో ఏదో మార్పు
బతుకు బతుకులో ఇదో తూర్పు
నిట్టూర్పుకు ఓదార్పు
ఆవేదనకు సంతోషాల చేర్పు
ప్రతి వదనంలో చిరునవ్వుల జాతర
బూజు పట్టిన పాతకు పాతర
ఏమిటీ ఉత్సాహం
ఎందుకీ కోలాహలం
కాలం పాత వస్త్రాన్ని విడిచిపెట్టి
కొత్త వస్త్రాన్ని ధరించింది
పుడమి తల్లికి ఒళ్లు పులకరించింది
కొత్త సంవత్సరం విచ్చేసింది
మానవ జీవన శకటానికి
కొత్త ఇంధనాన్ని ఎక్కించింది
అందరికీ మేలు జరగాలని
జగత్తులో శాంతి నిండాలని.
మరో ప్రపంచం జ్వాలల నుంచి
రుద్రవిపంచుల ధ్యానం నుంచి
రుధిరాక్షరాల సత్యం నుంచి
వేదం నుంచి - స్వేదం నుంచి
ఖేదం నుంచి - మోదం నుంచి
నాదం నుంచి - గానం నుంచి
రాగం నుంచి
జాలువారాలి కవనం
కళ్లు తెరవాలి జనం
కుళ్లిపోవాలి కులం
పారిపోవాలి మతం
అంతమవ్వాలి అన్యాయం
వెల్లువెత్తాలి ప్రభంజనం
భారతి కావాలి నందనవనం
ఒక స్వప్నం నెరవేరిందనే సంతోషం
ఎప్పుడూ లేనప్పుడు
కలలు కని కన్నీరు కార్చటం
ఒక విషాదకావ్యం!
ఈ విషాదానికి కారకులెవరు?
నేను ఆకాశంలో విహరించటం లేదు
మెట్టుమెట్టుగా ఎక్కిన నేను
కాలుజారి నేలమీద పడటం
గాయం నిరంతర మంట
నా మనసొక అరణ్యం
నా ప్రయాణం ఆగదు
ఈ విషాదం ఇలా నవ్వనీ
ఈ గాయం ఇలాగే జ్వలించనీ
నా నడక ఆగదు
నా చూపు ఆగిపోదు
మైలురాళ్లు దాటడం నిరంతర తపన
దారిలో లేని చెట్లను ఎలా లెక్కించగలను?
చెట్లను నరికేసిన వారు ఇక్కడ వీరులు
రాత్రి కూడా విశ్రాంతి లేని నడక
ఏ గాలి ఎటువీచినా
ఏ నక్షత్రం ఎటు మెరిసినా
కన్నీరు ఉంటుంది
కలల గాజుగ్లాసు నిరంతరం పగులుతుంది
నీరు నేలపాలవుతుంది
కన్నీరు మిగులుతుంది