కవితలు

విషాద చిత్రం

విషాద చిత్రం

పిన్నంశెట్టి కిషన్‌

ఆర్ద్రత

ఆర్ద్రత

శిష్ట్లా మాధవి

చిగురు వెలుగు

చిగురు వెలుగు

నల్లా నరసింహమూర్తి

మణిపూసలు

మణిపూసలు

వెన్నెల సత్యం

ఎదుగుతున్నప్పుడు

ఎదుగుతున్నప్పుడు

ఎన్‌.వి.రత్నశర్మ

పఠితగా

పఠితగా

మనసు తననే వేదికగా చేసుకుని సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నది. జనం సమక్షంలో బహిరంగ ప్రసంగం చేయాలంటే వినే చెవులు లేవు. ఎవరికి వారే ఎలుగెత్తి ప్రసంగిస్తున్నారు. మనసు శ్రోతల కోసం అన్వేషణ సాగించింది. కొద్దిపాటి శ్రోతలు ఓ క్షణంపాటు విన్నట్టే విని తమ చెవులు దులుపుకుని ఆకాశం వైపు చూస్తూ వక్తలుగా మారిపోతున్నారు. అనే వాళ్లు తప్ప వినే వాళ్లు లేని లోకంలో తాను ధరించిన వక్తృత్వ పాత్ర వ్యర్థమని అర్థం చేసుకున్న మనసు శ్రోతగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అసంఖ్యాక బాహిరంగిక ప్రసంగాలను ఆంతరంగిక ప్రసంగాలను వింటూపోయింది. ఆ ప్రసంగాల్లోని వైవిధ్యానికి పరస్పర వైరుధ్యానికి విస్తుపోయింది. మనసు తెలుసుకుంది. వక్తగా ఉన్నా శ్రోతగా ఉన్నా తన భూమికలకు సార్థకత లేదని. అది ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది సువిశాల పృథ్వీమండలం గుప్తలిపిలో రాసుకున్న విశేషాంశాల లోతులను పఠించే పఠిత పాత్ర ధరిస్తానని.
వానొచ్చింది

వానొచ్చింది

రాత్రికి వానొచ్చింది నింగి నుంచి నేలపైకి  వెలుగు వాగు పొంగింది. ఆకాశాన్నెవరో బాంబులతో పేల్చినట్టు మేఘ సమూహం ఒక్కసారి కూలినట్టు రెండు గంటలపాటు తీన్మార్‌ ఆడింది. చెట్లు ఆకులు ఓణీలు జారిపోతుంటే నిలువెల్లా పరవశిస్తూ నాట్యమాడాయి మంచంపైన ముసలి ప్రాణాలు మారాకు తొడిగాయి. రోడ్ల పక్కన గుల్మొహర్లు  రంగుల వేడుకకు సిద్ధమైనాయి మట్టిపొరల గింజల స్వప్నాలు పచ్చటి సీతాకోకలైనాయి. వానొచ్చింది వీళ్లెవరో పిల్లాళ్లలా సంబర పడుతున్నారు మొయిళ్ల నుంచి జారిన ఆశలను ఏరుకుంటూ సరంజామా సర్దుకుంటూ నాగళ్లు మరమత్తు చేసుకుంటున్నారు. కాకి  ఎద్దులపై వాలి అర్రుమెడపై పుండును వెతుకుతోంది.
సంక్రాంతి సందడి

సంక్రాంతి సందడి

పిల్లలు, పెద్దలున్‌ తలకు పేరిమితోడుత స్నానమాడియున్‌ ఉల్లము తృప్తిజెందునటు ఉత్పల వస్త్రములన్‌ ధరించి, ఈ పల్లెలు, పట్టణంబులలొ పట్టుగ కాన్పడ దేశమాత, తా కొల్లగ సంతసింపదొకొ కోరిన కోర్కెలుదీర తృప్తిగాన్‌ గుండెల నిండుగా వెలుగు, గోదములందున ధాన్యరాశులన్‌ వండెడు శాకపాకములు, వచ్చియు జేరెడు బంధువర్గముల్‌ నిండుగ పారు ఏరులును, నిద్దురలేపెడు కోర్కెతంపటుల్‌ పండుగ రోజునన్‌ మనకు పావనమందగ కానుపించదే గొబ్బితట్టెడు వనితల గొడవలటుగ గంగిరెద్దుల సందడి గడపగడప దాసు దీవనలొకవైపు దరికి జేర సంకురాతిరి దెచ్చెను సకల శుభము అలుక బూనియు అటకెక్కె అల్లుడకట దింప జూచిన మామకు దిగులుబుట్టె కోడిపందాల గొడవలు గొప్పవయ్యె గాలిపటములు ఎగిరెను గగనమందు కరకరలాడుగారెలును, కమ్మగజారెడు పాయసంబులున్‌ అరిశెలు, పూతరేకులును, ఆశను దీర్చెడిలడ్లు, జంతికల్‌ నురనురబోవు భాష్యములు, నోటికి తృప్తినియివ్వజూపగన్‌ కరవును దీర్చియిత్తరిని, కామిత మీయును జిహ్వకంతకున్‌  
పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

గాలి కెరటాలు చిగురు జొంపాలపైన సిరి జిలుగుతెరలు కదిలించి మురిపించె వూహలుయ్యాల జంపాల లూగసాగె పూర్వగిరి రాగయోగమై పొద్దుపొడిచె.     అంతములేని కాలమధురాద్భుత కావ్య సహస్రకోటి ప     ద్యాంతర పాదమొక్కటి వెలారినదింత మహోదయాంశువై     వింతల దొంతరల్‌ గగనవీధులు తాకగపేర్చుచున్‌; తద     శ్రాంత పదాలలోని యొక శబ్దలవాన విలీనమౌదునా! అక్క, బావ వరుసలతో నాదరాన పలుకరింతల పులకరింతలు చెలంగ, పల్లె అందాల పందేర మెల్లజనులు పొందితీర వలయు పొద్దుపొడుచు వేళ.     అల్లవిగో వినీల విమలాభ్రము ముద్దిడు వృక్షరాజముల్‌     చల్లని పల్లె తల్లి కనుసన్నల నన్నుల మిన్నలయ్యె, ఆ     పల్లములోన దూకు జలపాతము పుట్టిన గుట్టపైన న     ల్లల్లన మేయు పాడి పసరాలవి యెల్ల సుధాస్య దృశ్యముల్‌. అదె మన పల్లెవాగు! మనసంతయు దానికి పుణ్యభావమే! ఎదురుగ దానియొడ్డున మహీజము నందొక తల్లికొంగ అ ల్లదె తన చిన్నికూనలకు నాకలికేకల నోట పెట్టుచు న్నది చిరుచేపలన్‌; ప్రకృతి నాయము లోతులు చూడశక్యమే?     చతురత నీటిబిందియలు చంకన, నెత్తికి నెత్తుకొంచు వా     గు తరగలందు చిందిపడు కోమల కాంతులు మోములందు హ     త్తి, తిరిగి ఇంటికేగు యువతీమణు లాదెసదారి మొత్తమున్‌     సిత జలజాత పాతముగ జేయుదురల్లదె వింత చూడరే! పల్లెయె తాను, తానె సిరిపల్లెగ ప్రాణము ప్రాణమై, తరాల్‌ చెల్లిన రైతు జీవనమిసీ! కడునుద్ధృతమై అపాయముల్‌ వెల్లువలై సుడుల్‌ తిరుగ వేధల వీథులకెక్కె ముక్కలై; చిల్లులు పడ్డవేమొ విధి చిన్మయ కర్ణములష్ట దిక్కులన్‌.     కోతల యంత్రమంత్రములు గుట్టున బిడ్డల పొట్టకొట్టినన్‌     మా తలరాత యింతెయని మౌనముగా పడియుండి, తాతము     త్తాతల నాటియప్పు ఋణదాతలు నెత్తిన రుద్దుచుండగా     రైతులు వేరుదారి కనరాక శపించిన లోకమేమగున్‌? ఆకలి బుజ్జి బొజ్జలకు నన్నము పెట్టెడు పుట్టెడాశతో వేకువ జామునే కనులు విచ్చి, పొలమ్ముల దారిజొచ్చి, భూ లోక కుటుంబమెల్ల తనలో గలదంచు శ్రమించు రైతు బా ధాకర కృత్యమొప్పనక తప్పక పాల్పడె నాత్మహత్యకున్‌.     చేపవు తల్లియావులు; నిషేధములుండవు జల్గ రక్తదా     హాపర కాంక్షకున్‌; కనుల కందవు చేతులకందు మూలముల్‌;     దాపున కేగలేవు పరదైవము చూడ విషాద దృశ్యముల్‌;     పాపము పండ బారునెడ పర్యవసానము ఘోర శాపమౌ. విపణి దవానలంబు, ఋణవీథి పిశాచ విలోచనాకులం బు, పురుగుదండు రాక్షస సమూహము, నాగలి నాగుపాము, బొం దు పొలము బోరుబావి విషతోషణమై అరెరే! నిజమ్ము! పొ ద్దు పొడుచు వేళనే హలిక దుఃఖపయోధిని పొద్దు గ్రుంకెరా! *  *  *
తెలుగింటి సంక్రాంతి

తెలుగింటి సంక్రాంతి

తెలుగు లోగిలి వెలిగిపోతోంది, రంగురంగుల రంగవల్లుల, సోయగాలతో హొయలుపోతూ, ఇంటింటి వాకిలి మెరిసిపోతోంది! కుంకుమలద్దిన పసుపు గడపలు, తోరణాలై మామిడాకులు, వేలాడుతున్న వరికంకెలతొ, సింహద్వారాలు స్వాగతించాయి! తెలుగు కట్టూ, తెలుగు బొట్టూ, సంప్రదాయపు తీరుతెన్నులు, కొలువుతీరి, మరులు గొలిపాయి, పరుగులెట్టి పెద్దపండగ అరుగులెక్కిందీ! భోగిమంటలు మింటినంటే ఆనందమిచ్చాయి; బళ్ల నిండుగ ధాన్యరాశులు ఇంట చేరాయి, దండిగా, గోమాత లింటను పూజలందుకున్నాయి! బంధుజనుల కలయికలతో, నిండుగా నట్టిళ్లు నవ్వాయి! పిండివంటల ఘుమఘుమలతో వంటిళ్లు వెలిగాయి! పట్టు పావడాలు కట్టి కన్నెలు గొబ్బిళ్లు పెట్టి, కనువిందు చేశారు! ఆటలాడే గంగిరెద్దులు, ఆనందమిచ్చాయి, హరిదాసు పాటలు చెవులసోకి, ఆహ్లాదమిచ్చాయి! భోగిపళ్ల సందడులతో సంధ్యసుందరి సందడించింది! పసుపుకుంకుమ పంచుకొనగా అతివలంతా పేరంటమెళ్లారు! అలిగి అలుగక అల్లుళ్లు ఇంటను పేకాటలాడి పరవశించారు, అల్లర్లు చేసే మరదళ్లతోను సరసాల తేలారు! కనుల పండగ కాగా మనసు తేలిపోయింది, చిరకాల కోరిక తీరగా ఎద ఉప్పొంగిపోయింది! ఒక్కపెట్టున కన్నులింతగ విచ్చుకున్నాయి, చూసి మురిసినదంత ‘కల’యని నొచ్చుకున్నాయి.
ఇంటిగాలి

ఇంటిగాలి

హాస్టల్లో కుర్రాడికి ఇంటివైపు గాలి మళ్లింది. అన్నం తినబుద్ధి కాదు రెక్కలు లేనందుకు మొదటిసారి దుఃఖమొచ్చింది. మూడు రోజులుగా ఒకటే వాన. వానలోకి వాడు చెదిరిపోతున్నాడో వాడిలోకి వాన వ్యాపిస్తుందో అర్థం కాదు. చెరపట్టిన మబ్బుల్ని వదిలించుకొని కాల్వలుగా మారిన నీరు వడివడిగా నదివైపు పరుగులు పెడుతుంది. లేగదూడ అంబా అని అరిస్తే ఉలికిపాటు, ఏ రైలు కూత విన్నా అది వాళ్లూరికే వెళ్తున్నట్టు ఆ చీమలబారుకు మొదలెక్కడోగాని అన్నీ ఒకే బొరియలోకి వెళ్లిపోతున్నట్టు, పైకెగిరి మళ్లీ అతుక్కోలేని ఆకులు కిందనే మూల్గుతున్నట్టు. ఇంటివైపు గాలి మళ్లింది. అన్నం తినబుద్ధి కాదు వాడిని నా రెక్కల మీద ఎత్తుకొని పోయి వాళ్లమ్మ ముందు దించి రావాలని ఉంది.
విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మి

విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మి

విశ్వశాంతి సువర్ణ సుప్రభాత కిరణాల్లో భువిని సమతా పతంగాలు రివ్వున ఎగరగా, గుండె వాకిళ్ల మమతల తోరణాలు వ్రేలగా, స్వర్ణరథంలో వచ్చే సంక్రాంతి కల్యాణీ! స్వాగతం!! తెలుగు గుమ్మాల ముంగిట ముత్యాల ముగ్గుల్లో ముద్దుగా పూబంతుల గొబ్బెమ్మలను పేర్చి ‘గొబ్బిలక్ష్మి’ని పూజించే - కన్నెలను దీవించగా వేగవచ్చే - సర్వమంగళ‘దాయని’కి సుస్వాగతం!! గంగిరెద్దు కాలి మువ్వల - శుభకర స్వరాలు, బుడబుక్కలవాని - డమరుక - ధ్వనులు హరిదాసు - భక్తి కీర్తనలు - శుభాలందీయ సాగి వచ్చే - ‘సౌభాగ్యలక్ష్మి’కిదే స్వాగతం!! రైతన్నల - కష్టం ఫలించ - పంటసిరులనిచ్చి, పసిపాపలపై భోగిపళ్లు - శుభములై కురియ, ‘సర్వే జనాః సుఖినోభవంతు’- అని ఆశీర్వదించ తరలి వచ్చే- ‘శ్రీమహాలక్ష్మి’కి సుస్వాగతం!! కుల మత భేదాలు భోగి మంటల్లో కాలగా, అవినీతి బకాసురులు - అంతమొందగా యువజనులలో- చైతన్యకాంతులు విరియగా వేగవచ్చే - ‘సకలజన హితైషిణి’కి స్వాగతం!! తెలుగు కలాలు - పసిడి కాంతులు తేజరిల్ల ప్రతిగుండెలో అహింస, శాంతులు విరాజిల్ల తెలుగు వెలుగుల - స్వర్ణ క్రాంతి రథంలో విచ్చేస్తున్న - ‘విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మీ’! సుస్వాగతం !!
మకర సంక్రమణం

మకర సంక్రమణం

మార్గశిరం మొగ్గ తొడిగింది పుష్యమి మళ్లీ పురుడు పోసుకుంది ధనుర్మాసం ధాన్యలక్ష్మిని వదిలివెళ్లింది పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంటే సకల జనులే కాదు పంటచేలూ అభ్యంగన స్నానాలాడుతున్నాయి తుషార బిందువులతో! సంక్రాంతి సూర్యుడు కొత్తగా ఉదయించాడు. గోరువెచ్చని కిరణాలతో భోగిమంటలు పోటీపడుతూ తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని అనుభూతిని అందిస్తున్నాయి! బుడబుక్కలవాని డమరుకం నిద్రమత్తును గమ్మత్తుగా వదిలిస్తుంటే జంగమదేవరల జానపదాలు సుతిమెత్తగా సుప్రభాతం పాడుతున్నాయి డూడూ బసవన్నల విన్యాసాలు బద్ధకాన్ని అందంగా పారదోలుతున్నాయి ‘హరిలో రంగ హరి’ ఆలపిస్తూ హరిదాసు పాశ్చాత్య సంగీతాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తున్నాడు ఆహ్లాదమంతా ఆరుబయట నాట్యం చేస్తోంటే పాపాయిలా పండగ బోసినవ్వులు రువ్వుతోంది! అందుకే అన్నారు. భోగి భోగభాగ్యాలకు నిలయం! మకర సంక్రమణం మధురానుభూతుల సమ్మేళనం! కనుమ పాడిపంటల ప్రతిఫలం! ఇది నిత్యనూతన సత్యం.