నాలుగు వైపులా నదుల నీళ్లతో ఉబ్బి తబ్బిబ్బులౌతూ విద్యుదుద్రేకపు హోరుతో దీక్షాభ్యుదయ కిమ్మీరంగా ఇంద్రధనుసుపైకి దూకుతున్న శాబ్దిక నిమ్నోన్నతాలు
నాలుగు వైపులా నదుల నీళ్లతో
ఉబ్బి తబ్బిబ్బులౌతూ
విద్యుదుద్రేకపు హోరుతో
దీక్షాభ్యుదయ కిమ్మీరంగా
ఇంద్రధనుసుపైకి దూకుతున్న
శాబ్దిక నిమ్నోన్నతాలు
అలలై లేస్తున్న సముద్రమంటే నాకిష్టం....
ఉభయ సంధ్యల నడిమింటి
ఉన్నిద్ర తేజాన్ని
ఆవిరి పట్టి ఊదేస్తూ - మబ్బుల్ని పోగేసి
తనని తనలోకి లాక్కొని - విడుదల చేస్తూ
ప్రాణధారల్ని కురిపించే
రూపాంతర వరిష్టాపగరాశి
సముద్రమంటే నాకిష్టం....
మానవేతిహాసంలోని
ప్రారంభ పరభృతమే
మానిషాదం కదా
కోల్పోయిన జీవితాన్ని సాధించిన
రుసి కూత కైదువు ఊపిరి మెలిక
రాగ బాణాన్ని సంధించి విడిచిన
ఆత్మ పరీత కర్తవ్య కార్ముకం
సముద్రమంటే నాకిష్టం....
ఇదంతా నా మస్తిష్క హోమశాలలో
ఇంధన సంక్రాంత భావ పరిణామమే!
సముద్రమంటే నాకిష్టం - సముద్రం నా ఆదర్శం..
పచ్చని చెట్టును చూస్తే నాకు వరమివ్వడానికి ప్రత్యక్షమైన దేవతలా కనిపిస్తుంది.. నీడనిచ్చే కొమ్మలు తల నిమురుతున్నట్టు
పచ్చని చెట్టును చూస్తే నాకు
వరమివ్వడానికి ప్రత్యక్షమైన
దేవతలా కనిపిస్తుంది..
నీడనిచ్చే కొమ్మలు తల నిమురుతున్నట్టు
పండ్లనిచ్చే కొమ్మలు నా పేగుల ఆర్తనాదాలు విని ప్రేమతో భోజనం పెడుతున్నట్టు
ఒక దృశ్యం నా కళ్ళముందు దృగ్గోచరమౌతుంది..
ఈర్ష్యతో ఇదంతా తొంగిచూస్తున్న సూర్యున్ని
గాలి సహాయంతో కసురుకుంటూ
పూలవానను నా మీదకు పురమాయిస్తుంది..
పచ్చని కళను ప్రతిఫలింపజేసిన
చెట్టుతల్లికి పాదాభివందనం
ఆత్మీయతా వల విసిరి
అనుక్షణం మనిషిని కాపాడుతున్న
అడవితల్లికి వందనం
చెట్టు నా బాల్యాన్ని గుర్తుచేస్తుంది
చిరుజల్లులు పడుతున్నప్పుడు
అమ్మ చీరకొంగై అడ్డుకున్నట్టు
ఆకులు ఆనందంగా అలా
ఊగుతుండడం చూస్తుంటే
ఇప్పటికిప్పుడు
తల్లి కనుసన్నల్లో ఆడుకుంటున్న
పిల్లాడినైపోతున్నా నేను..
ఆకు చాటున దాగిన ఆ పిందెలను చూస్తుంటే
అమ్మ ఒడిలో ఒదిగిపోయిన మధుర జ్ఞాపకాలు
మదిలో మెదులుతున్నాయి
ఔషదాలకు నిలయమైన చెట్టు
ఆసుపత్రిలా కనిపిస్తుంది
ఆయువును పెంచే పెన్నిదిలా ఆశీర్వదిస్తుంది
త్యాగాలకు తన దేహాన్ని చిరునామగా చూపించి
ప్రకృతి ప్రసాదించిన పచ్చల పతకమై నిలుస్తుంది
మనిషి జీవనయానంలో ఓర్పు సంతకం చేసి తీర్పునిస్తుంది
చెట్టంటే.. నాలుగు కొమ్మలు
నలభై కాయలు కాదు
ఒక వసంతానికి నిలువెత్తు సాక్ష్యం!
నాల్గు తరాలను నడిపించే చైతన్యం!!
పరుల మేలు కోసమే పుడమిపై జన్మనెత్తిన మహోన్నతమైన అవతారం!!
తూర్పు నుంచి వచ్చినవాళ్లూ పడమటి నుంచి వచ్చినవాళ్లూ వచ్చిన తొవ్వలు మర్చిపోతారు బతకొచ్చినవాళ్లూ
తూర్పు నుంచి వచ్చినవాళ్లూ
పడమటి నుంచి వచ్చినవాళ్లూ
వచ్చిన తొవ్వలు మర్చిపోతారు
బతకొచ్చినవాళ్లూ
చూసి పోదామని వచ్చినవాళ్లూ
ఎలాగో సర్దుకొని
ఇక్కడే ఇమిడిపోతారు
వ్యాపారం మీద వచ్చినవాళ్లూ
వ్యవహారం చక్కబరుస్తాడని
పెద్దమనుషుల దగ్గరకు వచ్చినవాళ్లూ
ఇక్కడే ఉండిపోతే
బాగుండునని కలలుగంటారు
కొడుకును కాలేజీలో
చేరుద్దామని వచ్చినాయన
చూసీ చూసీ కొడుకు దగ్గరకే వచ్చేస్తాడు
బదిలీలతో ఊరు నుంచి ఊరు తిరిగే ఉద్యోగస్థుడు
ఇక్కడికొచ్చాక ఊళ్లు తిరగడం మాని
తానే తిరుగుతుంటాడు
దూర దూరాన కల్లోలాలను చూస్తుంటం
ఇక్కడ వాన కురిస్తే
కడవల కొద్దీ పూలు కురుస్తే
ఉత్తరాన మంచు రూపమెత్తిన పులి
బలహీనుల్ని మింగేస్తుంటది
ఇక్కడ ప్రియురాలు
స్పర్శను నిరాకరించినంతటి పలవరింత
అక్కడా అక్కడా
గాలీ మంటా కలిసి ఊరేగుతుంటవి
మన దగ్గర గాలికి గాలీ
సెగకు సెగా
ఏ కొద్దిరోజులో
జులాయీగా మనల్ని తరుముతుంటయి
నిజమైన ఆకలేసిన వాళ్లకు
ఈ నగరమొక అన్నపూర్ణ
అందుకే ఇక్కడికి వచ్చినవాళ్లెవరూ
మళ్లీ వెనక్కి వెళ్లరు
ఇక లెగవే.. పండగ పూట ఇప్పటిదాకా పడుకుంటారా! అని అమ్మ కసురుతుంటే.. అక్కడెలాగూ కుదరదుగా, కాసేపు పడుకోనీవే! అని నాన్న నచ్చజెబుతుంటే..
ఇక లెగవే.. పండగ పూట ఇప్పటిదాకా పడుకుంటారా! అని అమ్మ కసురుతుంటే..
అక్కడెలాగూ కుదరదుగా, కాసేపు పడుకోనీవే! అని నాన్న నచ్చజెబుతుంటే..
వంట గదిలోంచి అమ్మ గాజుల చప్పుడు ప్రేమగా చిరాకుపెడుతుంటే..
మరిగిన పాలు కాఫీ పొడితో కలిసిన పరిమళం మనసును తట్టిలేపుతుంటే..
లేస్తే ఆ మధురానుభూతులన్నీ చెదిరిపోతాయేమోనని సందేహం
మినప సున్నుండే మొదట తినాలి..
ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ పెట్టిన రూల్
సున్నుండలోని కమ్మదనం అమ్మను మరిపిస్తుంటే
పరమాన్న మాధుర్యం, పులిహోర కమ్మదనం
తెలుగింటి పిండి వంటల వైభోగాన్ని కళ్లకుకడుతున్నాయి
ఈ చిలకాకుపచ్చ చీర నీకు బాగుంటుందని కొన్నానమ్మా
అరిసె తినమ్మా.. జంతికలు బాగావచ్చాయే... ఒకటి తినరాదూ
అమ్మ ప్రేమకు అంతెక్కడ?
పోనీ వేడివేడిగా పకోడీలేయనా?
నీకిష్టం కదా, అరటికాయ బజ్జీలు వేయనా?
చాలమ్మా, నీ మాటలకే కడుపు నిండిపోతోంది
ముక్కనుమ రోజు మన వాటా ఏట మాంసంతో పాటు
ఇంకెవరన్నా అమ్మితే ఇంకో వాటా కొనుక్కురండి
పిల్ల కిందటేడు ఏటమాంసం పలావు బాగుందని అంది
ఈసారి కూడా చేసిపెడతా.. నాన్నకు ఆర్డరేస్తున్న అమ్మ
నిన్ను మించిన నలభీములెవరమ్మా!
పండగ ముగిసి అత్తారింటికి బయల్దేరే వేళయ్యేసరికి
అమ్మ కళ్లలో నీటి తెర
ఇంకో రెండు రోజులుండమ్మా అల్లుడుగారికి నాన్న నచ్చజెబుతాడులే
బతిమాలుతున్న అమ్మను చూస్తుంటే
ఎందుకమ్మా బిడ్డలంటే ఇంత ప్రేమ అనాలనిపించింది
కానీ అమ్మను ఆ మాట అడగకూడదని గుర్తొచ్చింది
ఎందుకంటే అమ్మంటేనే పండగ
అమ్మతో ఉండటమే పెద్ద పండగ (పెద్ద పండగకు పుట్టింటికొచ్చిన ఓ తెలుగింటి ఆడపిల్ల మనోగతం)
పగలు, రాత్రీ పోటీ పడ్డట్టు వెనక ఎవరో తరుముతున్నట్టుండేది.. కాలం తాళంచెవి మర్చిపోయి మరలా వెనక్కి తిరిగినట్టుంది..
పగలు, రాత్రీ పోటీ పడ్డట్టు
వెనక ఎవరో తరుముతున్నట్టుండేది..
కాలం తాళంచెవి మర్చిపోయి
మరలా వెనక్కి తిరిగినట్టుంది..
ఇది పరీక్షా సమయం
కలం కదలడం లేదు
అందరు మేల్కొని నిద్రపోతున్నారు!
భవిష్యత్‌ను లెక్కేసుకుంటూ ఉండడమా ఊడడమా
అంతా సందిగ్ధం!
చాలీ చాలని జీతంతో సరిపెట్టుకుంటూ
సాగుతున్న బతుకు
ఇప్పుడు సందిగ్ధంలో పడింది,
గ్రహణం తరవాత బతుకు
మొర్రేనా’ అని.....
ఉదయం, అస్తమయాలను లెక్కేసుకుంటూ
కాలక్షేపానికి కబుర్లు
చెబుతున్నాము తప్పా..
కాలం ఎటుతిరుగుద్దో ఇప్పుడు
నాలుగు కూడలిలో
నలిగిపోతుంది బతుకు...
మరమరాలలో దాగిన మర్మం తెలియాలి ఇప్పుడు,
అవి బొరుగులే కావచ్చు
బతుకు పేలాలవడమేనా అని!
వడ్లగింజలా మొలకెత్తలేమా అని!
కాలం వెనక్కి నడుస్తుందన్న
కఠిన సత్యం ఎరగాల్సిందే
ఉద్యోగం భ్రమలు తొలగిపోతున్నయి
ఉన్న ఉద్యోగం సద్యోగమవుద్దేమోననే
ఆందోళనలో ఆదమర్చి నిద్రపోలేక
మెలుకువరాక రెప్పలు దిగాలుగా
ఇంటి పైకప్పు వైపు చూస్తున్నాయి!
భార్యా, పిల్లలు, చదువులు
సంధ్యలు పెండ్లిండ్లు పేరంటాలు
లాంచనాలు జ్ఞప్తికొచ్చి గుండె
గుభేలుమంటుంది..
తుమ్మితే ఊడిపోయే ప్రయివేటు ముక్కు...
ఎంతకాలం ఉంటుందీ అంటావా!?
తప్పదు, ఇప్పుడు కరవు కొలువుకి
ఎసరుబెట్టుద్దేమొనని ఒకటే బెంగ!
అయినా నా పిచ్చిగానీ కాలం ఆగలే
మనమే ఎక్కడో
ఆలోచనలో ఆగిపోయాము
ఒక్కసారి తిరిగి చూసుకుందాం......!
కాలానికి వైరస్ గ్రహణం
పట్టింది!
విడవడానికి సమయమెంతైనా పట్టొచ్చు!!
మట్టి గూట్లో రిక్తహస్తాలతో పుట్టిన మట్టి మనిషీ! తరిగిపోతున్న జీవజలాల్లో మలినపడిన జలపాతపు హోరు విన్నావా?
మట్టి గూట్లో
రిక్తహస్తాలతో పుట్టిన మట్టి మనిషీ!
తరిగిపోతున్న జీవజలాల్లో
మలినపడిన జలపాతపు
హోరు విన్నావా?
తరలిపోతున్న జంతుజాలాల్లో
వినిపించే ఆక్రందనలేవైనా
నీ గుండెను తడిమేనా?
శిఖరాగ్రాల నిలబడి
విజయ గర్వంతో విర్రవీగుతున్న
వెర్రి మనిషీ!!
విషాదాల ఉపద్రవాల్ని
వెంటబెట్టుకుని
గాలి సవ్వడికే ఉలికిపడే
నీ ఉనికి ప్రశ్నార్థకం కాకేమిటి?
విషవలయాలో
విలయాకారాలో
ప్రమాద ఘంటికలే నలువైపులా
గాలిసైతం గేలిచేస్తే
ఊపిరి కూడా ధైర్యంగా పీల్చలేని
పిరికి మనిషీ!!
నీళ్లులేక
నీడలేక
బతకలేక
చావురాక
చేతులారా చేసుకున్నపాపానికి
ఉసురుతీసే విషపుగాలుల్లో
వికృతి ఆకృతిదాల్చిన ప్రకృతి
నీ నరనరాల్లోనే విస్తరించదు
నలుదిక్కుల్లో ప్రతిధ్వనిస్తుంది
ఇప్పటికైనా మేలుకో
ఓ మట్టిమనిషీ!!
ఇది పోరాట సందేశం కాదు
ప్రకృతి ఆరాట సంతాపం
రాసుకున్న రాతల్లోనో
చేసుకున్న ప్రతినల్లోనో
లేదు రేపటి భవిత
మరొక్కసారి
మట్టిపొరల్ని తవ్విచూడు
చెక్కుచెదరని చరితలో
స్వచ్ఛమైన గాలి పీల్చిన జ్ఞాపకం
నేల గంధాలు పూస్తుంది
ఆ గతాల గుండెల్లోంచి
వీలైతే మళ్లీ పుట్టడానికి ప్రయత్నించు!!