కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

అమ్మ...

అమ్మ...

నా కళ్లల్లో వచ్చే కన్నీటిని తుడుచుకుంటుంటే అమ్మ నాకో కథ వినిపించింది... బహుశా నా బాధను మరిపించడానికేమో! రాజు, రాణి, ప్రజలు, కష్టాలు, పోరాటాలు ఓడిపోవడాలు, ఒకరిచేతుల్లో మరొకరు చనిపోవడాలు విన్నాక నా బాధ చాలా చిన్నదైపోయింది... ఆ కథ ఇప్పటికీ గుర్తుంది... కానీ అమ్మ ఒడిలో ఒడిసిపట్టుకున్న స్పర్శ గుర్తుంది... ఎదురుగా చేదబావి, పక్కనే పారిజాతం పూలు దేవుని గది, అమ్మచేసే పూజ ప్రసాదం అంటూ చేతిలోపెట్టిన కలకండ ఇంకా నా జీవితాన్ని స్పృశిస్తాయి ఆప్యాయంగా ఏదైనా సరే ఎదుర్కోవాలి అనే నిజాన్ని నా గుండెలో నిలిపింది అమ్మ! నా గోరే నాకు గుచ్చుకున్నప్పుడు వచ్చిన రక్తాన్ని నోటిలో పెట్టుకుని లాలిస్తుంటే అమ్మలో నాకు డాక్టరు కనిపించేది... నా చెంపలపై జారుతున్న అశ్రువుల్ని తన కొంగుతో తుడిచేస్తూ ‘నాతల్లి’ కదా! అన్నప్పుడు గుండెనిండా ఎక్కడలేని ధైర్యం వచ్చేది... ఇప్పటికీ అమ్మ చెప్పిన కథ అమ్మలాగా నన్ను అల్లుకునే ఉంది ఎన్ని కన్నీళ్లు కార్చినా ఎంత రక్తం చిందించినా అమ్మ చెప్పిన నిజం నన్ను ఓదార్చుతూనే ఉంది... అమ్మ నోటిలో పెట్టుకున్న నా వేలికి ఇప్పటికీ ఎంతో గర్వం... కుంపటి వేడిని చేత్తో పట్టుకుని పొట్టపై కాచే ఆ ప్రేమ ఇప్పటికీ నాకెంతో ఆనందం!
వసంతోదయం

వసంతోదయం

రాత్రీ పగలన్న ధ్యాస లేదు ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి ముల్లులా గుచ్చుకునే చేదు జ్ఞాపకాల జాడలు వెంటాడుతున్న విషాదభరిత దుఃఖాలు జీవన పరుగుపందెంలో  నెమ్మదైన పరుగో, వేగవంతమైన పరుగో ఆగిపోయావా అంతే సంగతులు స్వప్నాలు మారిపోతాయి. ఆకాశంలో చివరంచును చూడలేం సముద్రంలో నీటిలేమిని చూడలేం మనుషుల్లో మర్మాన్నీ కనుక్కోలేెం కొమ్మచివరన కళ్లు తెరుస్తున్న చిగురాకులు మొగ్గలు విచ్చుకున్న దృశ్యాలు గడ్డిపోచలతో గూడు కడుతున్న పిచ్చుకలు లేతకిరణాల్లో మెరుస్తున్న మంచుముత్యాలు నీ చుట్టూ విలసిల్లుతున్న అద్భుతాలివి దేన్నయినా నిశితంగా పరిశీలించు ఎదగడానికి ఊతమిస్తాయి సరైన మాటలు బాటను చూపిస్తాయి ఆచరణలోకి నడిపిస్తాయి. లోలోపలికి విస్తరిస్తున్న కొద్దీ అన్వేషణల్ని సైతం ఆస్వాదిస్తావు. మేఘాలు మోసే నీటి ఆవిరి వర్షపు చుక్కలుగా జాలువారుతాయి. దప్పిక గొన్న పంటలు దాహార్తిని తీరుస్తాయి. మనకెప్పుడూ పడిలేచే కెరటమే ఆదర్శం నేర్చుకునే క్రమంలో గాయాలు సహజమే నిర్విరామ శ్రమతోనే విజయాలని మరువకు చదవడమో యజ్ఞం దూసుకుపోవడమో సవాలు ప్రశ్నలను సంధించడమో విజ్ఞానం సానబెట్టుకోవడమొక అనివార్యత సమస్త పర్యావరణమూ శోధనాలయమే బండరాళ్లను కొలిచే బొమ్మలుగా  మనోహర రూపాలుగా మలుస్తూ సజీవం చేస్తున్న శిల్పి ఒక దాత అనాథలైన గోరంత దీపాలకు పునర్జన్మనిచ్చే వాళ్లంతా మహాదాతలు నేర్చిన ఫలవంత జ్ఞానం మోసాలపై, అవినీతిపై, కుతంత్రాలపై ఎక్కుపెట్టిన విల్లయినప్పుడే వసంతోదయం.. వసంతోత్సవం...!
పాళీ పెన్ను

పాళీ పెన్ను

అటక మీద దస్తావేజులు తిరగేస్తుంటే హఠాత్తుగా గుర్తొచ్చింది ఎక్కడెక్కడ వెతికానో తన కోసం! ‘మీ దగ్గర ఉందా?’ అని అడిగిన చోటల్లా జవాబు లేని ఎదురు ప్రశ్నొకటి ‘‘ఏ కాలంలో ఉన్నారు సార్‌?’’ ఎన్నిచోట్ల తిరిగానో తన కోసం! మొత్తానికి దొరికిందొక చోట! చిన్నప్పుడు చేతుల్లో ఆడుకుని నా జ్ఞానానికి మెరుగులు దిద్ది దూరమయిపోయిన నేస్తం... చేతకాకో... చేయి తిరక్కో వంకర టింకరగా వర్ణమాల రాస్తే గురువు గారి బెత్తం దెబ్బలు రుచి చూపించిన నేస్తం! ‘ఇలాంటిదొకటుందా?’ అంటూ నా శిష్యులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నేస్తం! ఇన్నాళ్లకు దగ్గరయ్యింది. మీ కళ్లతో చూడకండి స్లిమ్‌గా ఉండే జీరోసైజు కాదు. బొద్దుగా ఒద్దికగా జేబులో ఒదిగిపోయింది. ఎదసవ్వడి విన్నదేమో! గుండెగుట్టు విప్పి చెబుతానంది! ఖాళీ కడుపుతో ఉంది కదా కాస్త ఇంధనం నింపమంది మొరటుగా కన్పించినా మనసు చెప్పిన ఊసులను పొందికగా పేర్చేసింది. ముద్దులు కురిపించి, సుద్దులెన్నో చెప్పి జోలపాడి నిద్రపుచ్చిన అమ్మలా హృదయానికి దగ్గరై నిశ్చింతగా ఉండమని ధైర్యం చెప్పింది. ‘నువ్వూ... నీ ఛాదస్తం’ అని నవ్వుకున్నా సరే కుప్పలు తెప్పలుగా దొరికే ‘యూజ్‌ అండ్‌ త్రో’లున్నా సరే మోజు తీరలేదు దీని మీద చేతితో దొరకబుచ్చుకొని మునివేళ్లతో తడుముతుంటే అందాల సుందరి మెలికలు తిరిగినట్టయింది పాలరాతి బొమ్మలా నునుపు తేలిన దేహం మీద ముసుగు తొలగిస్తే  బంగారపు వర్ణం నంది తిమ్మనకీ అందని నాసికం శుక్రాచార్యునికి ఎరువిచ్చిందేమో? ఒక్కటే నయనం నాలుక - కలకత్తా కాళిక ఎన్ని కావ్యాలను వర్ణించి సృజించిందో? ఎంత మందితో స్నేహం చేసిందో? బయట పెట్టలేక సతమతమై మనసు పడే ఎన్ని గింజులాటకు నేనున్నానని మార్గం చూపిందో? ఎన్నెన్ని ప్రేమ లేఖలకు సాక్ష్యమయ్యిందో? ప్రపంచ భాషలన్నీ తెలిసినా మౌనం వహించి మౌన భాషకూ లిపిని తయారు చేసింది.  కవితా వస్తువు తనే అన్నప్పుడు సంగతులన్నీ చెప్పేసింది. మారిపోయిన వాటితో మారలేక ఆదరించే పెద్ద మనసు కోసం  హృదయాన్ని ద్రవంగా మార్చి  వేయి మెదళ్ల కదలికలను సిరాచుక్కలు చేసి ఎదరు చూస్తూ నిల్చొంది పాళీ పెన్నుగా... సమాజానికి దన్నుగా!    
జీవితం

జీవితం

జీవితాన్ని నేలపైన ఆరేస్తే రేపటి కథ రంగుల రాట్నంలో చిక్కుకుపోయింది జీవితాన్ని అందంగా గాజుల పెట్టెలో భద్రపరచుకుంటే జీవితం కన్నా గాజుల పెట్టె గురించి ఆలోచన మొదలయ్యింది పల్లెలో పోగొట్టుకున్న జీవితాన్ని పట్టణంలో వెతుక్కుంటుంటే, మనసు కన్నీటి బొట్టుని రాల్చింది పగటిపూట చూడాల్సిన ప్రపంచాన్ని రాత్రి చీకటిలో వడగట్టి చూస్తుంటే, నక్షత్రాలు నేలరాలిపోయాయి గుండెబరువును తూయాలని చూస్తే  సరితూగే కొలమానం లేదన్నది ప్రపంచం బ్రహ్మ సృష్టిస్తున్నాడనుకుంటే, మనిషి సృష్టించడం మొదలుపెట్టాడు సృష్టికి ప్రతిసృష్టి అందంగా కనపడుతున్న ప్రళయంలా ఉంది మనసు మాటను రాయిపై చెక్కటానికి నేను శిల్పిని కాను నీటిపై రాయడానికి నీటిగుణం నాలో అక్షరాన్ని నిలిపే లక్షణం లేదన్నది అక్షరాన్ని అమృతంగా ఒంపుకుంటే అక్షరం తన ఒడిలో నాకు చోటిచ్చి జోలపాడింది.
స్మృతులుగా తెగిపడుతూ...!

స్మృతులుగా తెగిపడుతూ...!

వాళ్లు, రాతిరి కొమ్మ మీంచి కూసే... రాగరంజిత కలకూజితాలు! పద్యమే తామైనట్టు - తామే పద్యమైనట్టు కళామతల్లి పాదాలచెంత తలవాల్చిన కమనీయ పద్యమాలికలు! నాలుకమీద పద్యపాదాల్ని నాట్యమాడించి పురాణపాత్రల్లోకి పరకాయప్రవేశం చేసిన పరమసిద్ధులు! కష్టాల గరళాన్ని దిగమింగి కంఠసీమలో పద్యాలపంట పండించిన హాలికులు! కన్నీటికుంచెతో రంగస్థలం మీద అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించిన కళాకారులు! ఆకలికేకల్ని హార్మోనియంతో శృతిజేసి రాతిరి గుమ్మానికి రాగతోరణాలు కట్టిన పాలెగాళ్లు! పండగసంబరాల్లో పల్లెను పెళ్లికూతుర్ని జేసి పద్యాలపల్లకీలో ఊరేగించిన బోయీలు! రేయంతా వెలిగిన ఆ రాగదీపాలకు చెమటచుక్కల చప్పట్లహోరే చమురయ్యేది! చివికిన చీనాంబరాలు, ఢాకా రేకులాభరణాలు రేయికద్దిన రంగుల కలలఅద్దం పొద్దు దూరేసరికి భళ్లున పగిలిపోయేది! ‘జీవితమూ ఒక నాటకరంగమే కదూ....’ వైరాగ్యంతో ఒకడు మౌనంగా నడచిపోయే దృశ్యం! రాతిరిపూసిన రాగాలచెట్టు మీంచి పద్యం పావురమై ఎగిరి పొద్దుగట్టు మీద పల్లెవాసుల పెదాలమీద వాలే జ్ఞాపకం! మనకది నాటకమే... కానీ వారికది జీవితం! అప్పులకోసం తాళిని తాకట్టు పెట్టి  కామందు దొడ్లో కంబారిగా మారినపుడు అతడో హరిశ్చంద్రుడే! ఆకలిసర్పం కాటేసిన కొడుకును తలచుకొని శోకమూర్తిగా మారినపుడు ఆమె ఒక చంద్రమతే! కళ్లవెనుక చీకటిని దాచిపెట్టి - వాళ్లు రంగస్థలాన్ని రసాధిదేవతలై రక్తి కట్టించినపుడు పల్లెపల్లెంతా పులకించిపోయేది! కళకోసమే బతుకునంకితం జేసుకున్న తరాలసంస్కృతీ వారసత్వాన్నిప్పుడు కాటేసింది కేబుల్‌ కట్లపాము! గూగుల్‌ గూట్లో.... రెక్కలు తెగిన పక్షయింది పద్యం! సైబర్‌ చితిమంటల్లో కాలిపోతోంది సనాతన కళారూపం! రీళ్లరాకాసి నీడలో... రంగస్థలమిపుడొక శ్మశానఘట్టమయ్యేచోట  కాలంచెక్కిట ఘనీభవించిన కన్నీటిచారికలై....వాళ్లు! ఆ సామూహిక సమాధుల మీద స్మృతులుగా తెగిపడుతూ....మనం!!  
అథ యోగానుశాసనం

అథ యోగానుశాసనం

తనువు పద్మాసనం వేస్తే మనసు మర్కటాసనం వేస్తుంది! పద్మమో, శలభమో మయూరమో, మరోటో దేహం వంచి చేసే ప్రతి కోణం ఉనికితో అనుసంధానం కోసమే! ‘నువ్వే’ మూలాధారం అయితే నువ్వెప్పటికీ మూలం వదిలిరాలేవు! నువ్వు ఒక్కడివి కావు బహుముఖాలతో నువ్వొక గుంపువి! ఓ నేర్పరి, ఓ తీర్పరి ఓ మాయగాడు, ఓ ఆశపోతు..  ఎన్ని అందమైన అరలు నీలో!. విషయ భారాలు, ఆశలూ భ్రమలు, నమ్మకాలు, ఊహలు. ఎన్ని మందమైన పొరలు నీలో! భుజంగాసనం  విషం చిమ్మకూడదని నీకు నేర్పకపోతే.. మండూకం దుర్భర నిర్జల తావులలో సైతం నిబ్బరంగా వుండాలని చెప్పకపోతే..      నువ్వింకా భ్రమల్లోనే..    వ్యర్థ విన్యాసాలు చేస్తూ విషయభారాలు మోసే గంగిరెద్దులానే.. గుంపు గందరగోళం వదిలి నిశ్శబ్దంగా నిన్ను నువు కోల్పోయి ఉన్నదంతా ఖాళీ చేసి పొరలన్నీ ఒలిచేసి నువ్వు నువ్వు లా వస్తే!.. యోగం మరో పుస్తకం కాదు నీ బుక్‌ షెల్ఫ్‌లో పడుకోదు! యోగం మరో జ్ఞానపుపొర కాదు నీ చుట్టూ మందంగా అల్లుకోదు.! యోగం  నిన్ను ఉనికితో మమేకం చేసే ఓ అద్భుత ధ్యాన శాసనం! యోగం నిన్ను పరివర్తితుణ్ని చేసే నిశ్శబ్ద అనుశాసనం.! అథ యోగాను శాసనం..
నా కవిత్వమంటే...

నా కవిత్వమంటే...

శ్వేత నీలికాంతి ధారల్లో ఎంత తడిచినా చిరగని కాగితంపై చెరగని అక్షరాలకు నా కవిత్వమంటే సముద్రానికున్నంత సహనం ఉంది అలల వరుసలపై కలల అక్షరాలని రాసి నురగ నవ్వుల తీరానికి నా కవిత్వమంటే సముద్రానికున్నంత అలసట ఉంది విడిచొచ్చిన పొలిమేర బక్కచిక్కిన పంటకాలువ ఊడలూగిన మర్రిచెట్టు బరిగీసి గిరికీలు కొట్టిన పల్లెతల్లి ఒడికి నా కవిత్వమంటే సముద్రానికున్నంత పనితనముంది ధూళిపొరలను నోరార చవిచూస్తూ ఏడ్చిఏడ్చి మేఘాలతో ముఖం కడుక్కుంటున్న  ఆకాశానికి నా కవిత్వమంటే స్తన్యం మీదగా తుళ్లిపడ్డ అమ్మఅశ్రువుకున్నంత తియ్యందనముంది  చెట్ల వెనుక చిరుచీకటి కిటికీలోంచి తొంగిచూస్తూ సంధ్య వారలో జారుతున్న అస్తమయానికి వదిలెళ్లిన గూడును చేరుకునే  గువ్వల జంటకున్నంత గుబులు ఉంది శిశిరాన్ని తరుముతూ వసంతాన్ని తడుముకుంటూ సొనలుకారుతూ వగరుల చిగురులు తింటున్న కోయిలకి నా కవిత్వమంటే... పొదుగును గుద్దుతూ కడుపారా తాగి గంతులేసే లేగ గిట్టలకున్నంత పొగరుంది  పునాదులు కూలిన రాజసౌధాల మీద నుంచి ఎగిరిపోయిన పావురాళ్లకు నా కవిత్వమంటే రాలినాకుల గలగలలకు రెపరెపలాడిన  ఆ రెక్కలకున్నంత బెదురుతనముంది.  తడిసిన ఆ నీలికాంతి ధారకి రాలినాకుల గలగలలకు నా కవిత్వమంటే  అక్షరానికున్నంత ఆనందం ఉంది   
పండుతోంది కాబోలు

పండుతోంది కాబోలు

లేడిలా పరుగెత్తిన పాదాలిపుడు నడవడానికి జాగ్రత్తలు చెప్పుకుంటున్నాయి వేలిచివరి లోకాన్ని తీర్చిదిద్దిన చేతులిపుడు వేళ్లాడిస్తూ ఊరికే గొణుక్కుంటున్నాయి పంచరంగుల్ని ఆవిష్కరించిన కళ్లు మసక వెలుగుల్ని చిత్రిక పడుతున్నాయి చెరకు గడల్ని నమిలి పిండేసిన పళ్లు ఒక్కొక్కటిగా పుచ్చిచచ్చి సెలవు తీసుకుంటున్నాయి సంగీతానికి తలలూపిన చెవులు నిశ్శబ్ద సామ్రాజ్యానికి తలుపులు తెరుస్తున్నాయి కాటుక కళ్లకు గేలమేసిన కుటిల కుంతలాలు తెల్లబడి, పల్చబడి బోసిపోతున్నాయి గళమెత్తి పాడినపాట, పెదవివిప్పి ఆడినమాట గొంతుక దాటిరాక లోనే గుడగుడ మంటున్నాయి కంకర్రాళ్లను పిండి, గుండచేసిన కడుపు మరమరాలను మర  పెట్టలేకపోతోంది బాణాకర్రలా నిగడదన్నిన వెన్ను విల్లులా ఒంగిపోతోంది నెమ్మది నెమ్మదిగా కాయం పండుతోంది కాబోలు.
హృదయంలో మేధస్సు 

హృదయంలో మేధస్సు 

ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఒక్కొక్క జీవి, ప్రకృతి రచించిన ఒక్కొక్క కవితా చరణంలాగా ముందుకొస్తుంది.  అందమైన పొందికలో సృష్టి తన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది కవిత్వం అర్థం కాని వారికి విశ్వరహస్యాలేం అర్థమవుతాయి?  జీవ ఆవిర్భావమే ఒక మహాకవిత్వమయినప్పుడు అది అర్థం కావాలంటే హృదయంలో మేధస్సు ఉండాలి మేధస్సులో హృదయముండాలి ఎడారుల్లో సముద్రాల్ని, సముద్రాల్లో ఎడారుల్నీ చూడగలగాలి కూలిపోతున్న చెట్లలో మొలకెత్తుతున్న గింజల్ని  మొలకెత్తుతున్న గింజల్లో విశ్వవ్యాప్తమౌతున్న జీవ ఆవిర్భావాన్నీ చూడగలగాలి పిచ్చివాడా! నువ్వు అర్థం చేసుకుంటే నిజాన్ని మించిన అందం లేదు  విజ్ఞానాన్ని మించిన కవిత్వం లేదు  ప్రతి జీవి అందమైందే కానీ ప్రతి జీవినీ అర్థం చేసుకోగలిగే చేవ కేవలం మనిషికే ఉంది! ఇన్ని సూర్యుల మధ్య, ఇన్ని గ్రహాల మధ్య ఇన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో  ఒక చిన్ని భూగ్రహం మీద పుట్టిన వాడు మనిషి కొలతలు లేని, ఎల్లలు లేని విశ్వాంతరాళాల్లో పరిభ్రమిస్తున్న వాడు మనిషి సత్యమనే అందం కోసం తపించి పోవడమే కాదు  ప్రాణాన్ని త్యాగం చేయడం కూడా తెలిసినవాడు అందమైన వాక్యాలతో రాస్తున్నదే కవిత్వం కాదు  సత్యాన్వేషణలో రాయబడేదంతా ఒక మహాకవిత్వం ఎందుకు కాదూ?  అందమైన భావనకు అక్షరరూపమిచ్చేవాడే కవి అయితే అదే అందమైన భావనను ప్రత్యక్షం చేయించేవాడు ఇంకెంత మహాకవి? కవిత్వానికి ఎల్లలు చెరిపేస్తున్న కవి వైజ్ఞానికుడు! ఏ ఆకృతీ లేని చిన్న బండరాయిని తొలిచి రూపం ఇచ్చేవాడే శిల్పి అయితే,  ఆదీ, అంతం లేని విశ్వాంతరాళాన్ని మానవ శ్రేయస్సు కోసం నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పి?
    1234........................................45
  • Next