ఆడపిల్లలనందరినీ ఒక్క చోట చేర్చి... కొమ్మ కొమ్మనూ రిల్లి... రుబ్బురోల్లతో గిరగిరా తింపేసి ఎగదోసిన చేతుల నిండా పగడాలు నింపేసి
ఆడపిల్లలనందరినీ ఒక్క చోట చేర్చి...
కొమ్మ కొమ్మనూ రిల్లి...
రుబ్బురోల్లతో గిరగిరా తింపేసి
ఎగదోసిన చేతుల నిండా పగడాలు నింపేసి
రకరకాలైన ఆకుల పైన చేరి
అందమైన రూపాలను అరచేతుల్లో అచ్చేసే
గోరింట తోటే అమ్మాయిలందరికీ...
ఆ జన్మ చుట్టరికం!
ఆ గోరింట...
ఆటాడే పాపాయి చేతుల్లోనేనా
ఒళ్లంతా మందారాలను విరబూయిస్తుంది!
అల్లరి అమ్మాయి అర చేతుల్లో
పచ్చపచ్చని కోకతో ఠీవీగా కొలువుతీరి
ఆకలంటూ అమ్మ చేతి కమ్మని ముద్దలు
కడుపార తినే కానుకిస్తుంది!
ఆ గోరింటే...
తన వరుని తలపులతో
సిగ్గుపడిన నవ వధువు
బుగ్గల కెంపులు
ఆమె అరచేతుల్లోన
ఎర్రని గులాబీలుగా విరబూయిస్తుంది!
అదే గోరింట...
ఆషాఢ మాసాన...
విరహవేదనతో ఒళ్లంతా సెగలైనా
కొత్తజంట తపనలను
తన చెలిమితో చల్లబరిచి
ఎదలోని ఊసులను అరచేతుల్లో
గన్నేరుగా విరబూయిస్తుంది!
పండుగైనా... వేడుకైనా...
ముత్తైదువుల చేతులను
ముద్దుగా ముస్తాబు చేసే గోరింట
ఔషధ గుణాలనెన్నింటినో
తన నిండా నింపుకున్న పెరటి మొక్క!
ఆ గోరింటే...
కాలుష్యపు కోరల చిక్కి
చిక్కిపోతూ ముగ్గుబుట్టలను తలపించే తలకట్టులకు
కొత్త రంగులనిచ్చి
ముఖానికి కొంగొత్త అందాలనిస్తుంది!
నాటి నుంచి నేటి వరకూ
మగువలందరి మనసు మెచ్చిన
ఏకైక నేస్తం ఈ గోరింటేనేమో...!
అది ఈనాడు
కాస్త కొత్తరూపు దాల్చి
శంఖాకారపు పొట్లాలలో ఒద్దికగా ఒదిగి
తన వయ్యారి నడకలతో
ఆధునిక వంపు సొంపుల
నయగారాలెన్నో పోతున్నా...
ఏనాడూ లలనామణుల
అరచేతులనొదలని
సహజ సౌందర్య పట్టమహీషే....!
ఒకసారి వేకువఝాము విచ్చుకున్నపుడు ఒక మెత్తని పాట నెమలీకలా తాకింది నేనా వానలో అమాంతం తడిసిపోయాను
ఒకసారి
వేకువఝాము విచ్చుకున్నపుడు
ఒక మెత్తని పాట
నెమలీకలా తాకింది
నేనా వానలో
అమాంతం తడిసిపోయాను
పాత దుఃఖాలను
చరణాలలో కరిగిస్తూ
నన్ను నేను బ్రతికించుకోవచ్చునని
అప్పుడే తెలుసుకున్నాను
ఆనక పనుల కుంపట్లో
కాగుతూ నేను
గాలిపల్లకి మోసుకొచ్చిన
చల్లని గీతాన్ని తాగి
తేలికపడ్డాను
పాట ఊపిరిలో
లోపలికంటా ఇంకి
నా మనసును
లోతుగా స్పృశించింది
అంతలోనే గీతం
పల్లవి అందెలతో
మళ్లీ ఘల్లున మోగింది
నరనరాలలోకి ప్రవహించే
ఆ స్వరాల నదిలోని గలగలలను
శ్రద్ధగా చెవినొగ్గి విన్నాను
మృదువైన పాట
అంతే మృదువుగా
అర్ధమవడం మొదలుపెట్టింది
ఒంటరి ఏకాంతంలోని ఖాళీలను
రాగాలతో పూరించుకుంటుంటే
అణువణువులో
తెలియని పరిమళమేదో పూసింది
ఎప్పటినుండో
ఒత్తిళ్లతో మసిబారిన మనసు చిమ్నీ
ఒక్కసారిగా తళతళా మెరిసింది
సెలయేటి అలలాంటి
సున్నితమైన పాట
చిన్న చేపపిల్లలా నన్నెత్తుకుని
సముద్రాన్ని చేసింది
ఉన్నట్టుండి నాలో
ఏవో అనుభూతి పుటలు
తిరగేయడం మొదలైంది
కనురెప్పలపై
రంగురంగుల క్షణాలు
పక్షుల్లా వాలాయి
నన్ను కదిలించిన
వెన్నెల దృశ్యాలేవో
తీగలుగా సాగి
స్వర్గతీరాలదాకా నడిపించాయి
పాట శిఖరాగ్రాన్ని తాకగానే
అణువై ముడుచుకున్న నేను
అనంత ఆకాశానయ్యాను
సీతాకోకలాంటి ఆ గీతం
మరింత అందంగా
పురి విప్పింది కొన్ని ఘడియలలా
నన్ను దోచుకోగానే
నేను అచ్చంగా
పాత నాలాగే అగుపించే
ప్రక్షాళన జరిగింది
అయినా పాట ఎవరికైనా
లాలించే అమ్మే తెలుసా
నేనైనా పాటైనా
అక్షరాల కొమ్మలకు మొగ్గతొడిగే
తోబుట్టువులమే కదా
నిరంతరం మోగుతూండే ఫోను ఇందరు నాకున్నారని, ఇందరికి నేను కావాలని గర్వంగా నాకు వినిపించి, కలిపించే ఫోను ప్రాముఖ్య రాగ ప్రస్తారాన్ని బహురీతుల పలికించే ఫోను
నిరంతరం మోగుతూండే ఫోను
ఇందరు నాకున్నారని, ఇందరికి నేను కావాలని
గర్వంగా నాకు వినిపించి, కలిపించే ఫోను
ప్రాముఖ్య రాగ ప్రస్తారాన్ని బహురీతుల పలికించే ఫోను
‘‘నా’’ చిరునామాకి ఘనధామంగా నిలుస్తున్న ఫోను
అన్ని చోట్లా నా గుర్తింపులకి అంకెల్ని అరువిచ్చే ఫోను
ప్రత్యూష వేళ గీతాసందేశాలను వినిపించే ఫోను
వేల మైళ్ల దూరాలను వేలెడు ఎడంలోకి తెచ్చే ఫోను
వేల వేల హృదయ శకలాలను ఒక్కటిగా అతికే ఫోను
దిగులుగా చెవికి వేలాడే ఎద కమలాన్ని విప్పార్చే ఫోను
ఒంటరి జీవితాలకి తోడూ వెలుతురూ అయిన ఫోను
గతాన్ని ఫొటోలతో బంధించి,
మనసుని ఆత్రేయ గీతాల్లోకి కుదించి
మనిషి తీర్చలేని ఎన్నో మానసిక అవసరాలను తీర్చే ఫోను
మూగబోయింది...
ఉలుకూ పలుకూ లేకుండా మూలపడింది...
బతుకు పాతబడిందనే దానికి సూచనగా
మనిషిని మూలబడ్డాననే మాటకు గుర్తుగా...
ఎన్నో వేల లక్షల మాటలు వినిపించిన ఫోను
ఆ ఒక్క మాటను చెప్పలేక మూగబోయింది....
.............................
మాటామంతీ లేని బతుకు
ఫేస్బుక్కులో తెరపేజీ లాటిది
ఫేసే ఉంటుంది, మనసూ మాటా కాదు
మాట అవసరం తీరిందంటే అర్థం,
మనిషి అవసరం తీరిందని కాదు...
బతుకు అవసరమే తీరిందని...
‘‘మీ ఫోన్ నంబర్ ఇవ్వరా? మాట్లాడాలని’’
ఉన్నట్లుండి ఫేస్‌బుక్‌లోనే వచ్చే ఓ మెసేజి
మళ్లీ గుండెకు కొత్త ఊపిరి అందిస్తుంది
బతుకును, మనుషుల మధ్యకు మారుస్తుంది..
అంతర్జాలంలోంచి మనిషిని అంతరంగ ప్రపంచంలోకి
స్వరం ఆసరాగా సున్నితంగా నడిపిస్తుంది...
మనిషికి వరం, ఓ స్వరం! మనదనిపించే స్వరం!!
ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించే స్వరం...
పరికరాలు మారితేనేం, పలకరింపుంటే చాలు
శేషించిన బతుకులకు అదే పదివేలు....
విషాదం పిండిన ఒక జీవం సందర్భంలోంచి
ఆమె గొంతు ఆత్మగా మాట్లాడుతోంది!
జీరబోయిన కంఠ స్వరంతో అంతర్వేదన దుఃఖంలా తన్నుకొస్తుంటే,
నిన్నూ నన్నూ కలిపే అజ్ఞాత బంధమేదో
లోలోపట గుక్కపట్టి ఏడుస్తోంది!
ఆమె చిట్టిపాపాయి కాదు లాలించడానికి జోలపాడటానికి!
పశువుల మేతకెళ్లి శవమై బూడిదగా మారిపోయింది
చుట్టూ మనుషులున్న నవ నాగరిక సమాజంలో
అత్యాచారానికి గురైన ఆమె జీవచ్చవం
చితి మంటల్లో దేహంగా దగ్ధమైంది
నిజం నింగికి తెలుసు దేవుడికి తెలుసు అంటే లాభం లేదు
నిజాల్ని నిర్భయంగా నొక్కిచెప్పే మానవీయ గొంతులు కావాలి
సమాధులెప్పుడూ అబద్ధం చెప్పవు నిజాల్నే చెబుతాయి
రాక్షసత్వం పైశాచికంగా మారితే పడిన మూగ సంఘర్షణంతా
మూసుకుపోయిన చట్టంకళ్లకే తెలియాలి
పేగుబంధాన్ని దూరం చేసుకున్న ఆ కన్నతల్లి కడుపుకోతకి
సాక్ష్యంగా ఎవరు నిలబడతారు?
కాలం తలవొంచి న్యాయస్థానం గుండెచప్పుళ్లని
గ్రంథస్థం చెయ్యలేం కదా
రేపో మాపో వ్యవస్థ కొత్త చరిత్రని తిరగేస్తుంది
శవ రాజకీయం చేస్తున్న సందర్భాల్ని నిలదియ్యాలిప్పుడు
ఎందుకంటే
గురజాడ చెప్పినట్టు-
దేశమంటే మట్టి కాదు
ఆత్మఘోషతో బద్ధలయ్యే మనుషులే..!!
దారిపొడుగునా అక్షరాల్ని విత్తుకుంటూ పోతున్నాను గడపకీ గడపకీ మధ్య గుండెకీ గుండెకీ మధ్య ఖాళీ కనపడిన చోటల్లా
దారిపొడుగునా అక్షరాల్ని
విత్తుకుంటూ పోతున్నాను
గడపకీ గడపకీ మధ్య
గుండెకీ గుండెకీ మధ్య
ఖాళీ కనపడిన చోటల్లా
అక్షరాల్ని నాటుతున్నాను
ప్రతి మనసు తలుపునూ తట్టి
గుండె గుమ్మంలో పడేలా
కొన్ని అక్షరాల్ని విసిరేసి
నవ్వుతూ నిష్క్రమిస్తున్నాను
అక్షరాల గుర్రాన్నెక్కి
అరణ్యాల్ని దాటుతున్నాను
అక్షరాలకు రెక్కలతికించి
సముద్రాల్ని అధిరోహిస్తున్నాను
అక్షరాల తాళ్లను విసిరి
పర్వత శిఖరాల్ని ముద్దాడుతున్నాను
మనసు మూలల్లోకి అక్షరాల్ని పంపించి
లోకం చూడని లోతుల్ని ఆవిష్కరిస్తున్నాను
మతాలు కులాలు దాటి ప్రవహిస్తున్నాను
నేలంతా గాలిలా విస్తరిస్తున్నాను
వేల మైళ్ళ వేగంతో ఒక కాంతి కిరణాన్నై
భూగోళాన్ని చిటికెలో చుట్టేస్తున్నాను
శూన్యాన్నై విశ్వమంతా వ్యాపిస్తున్నాను
ఎన్ని సార్లు నరకబడ్డా
మళ్లీ మళ్లీ పునరుజ్జీవనం
పొందే అరటిపాదులా
ఎంతలా తొక్కిపెడితే
అంత విసురుతో పైకి లేస్తున్నాను
కెరటాల్ని మించిన స్పూర్తితో
ఉరకలెత్తుతున్నాను
భూమధ్యరేఖ మీద నిలబడి
ఉత్తర దక్షిణ ధృవాల్ని అక్షరాలతో
పెనవేస్తున్నాను
కత్తులూ కుయుక్తులూ విఫలమైన చోట
కొన్ని అక్షరాల్ని చల్లి
శాంతిపూలు పూయిస్తున్నాను
అక్షరాల పల్లకిలో నేనే రాజునై
నేనే బోయీనై విహరిస్తున్నాను
ఎల్లలులేని నా దారిలో
ఎండమావులపై అక్షరధారల్ని వర్షించి
జీవనోత్సాహం నింపుతున్నాను
లిపి పుట్టుక నుండీ ఇప్పటివరకూ
పుట్టిన ప్రతి అక్షరాన్నీ గుండెల్లో పొదువుకుని
మానవతా మహా కావ్యాన్ని రాస్తున్నాను
గుండెను తడిమే వాక్యాల్ని నిర్మించి
పుటలుగా పేరుస్తున్నాను
విశ్వమానవుడికి ప్రేమతో
నా మహా కావ్యాన్ని అంకితమివ్వనున్నాను
నాలుగు వాక్యాల్ని చల్లి
నాలో మానవతా దీపాల్ని వెలిగించిన
ప్రతి కవికీ వినమ్రతతో నమస్కరిస్తున్నాను!