తెల్లకాగితం ఎదురుచూస్తున్నది తనపైన అక్షరాలు పంక్తులు పంక్తులుగా ప్రవహించేదెప్పుడా అని,
తెల్లకాగితం ఎదురుచూస్తున్నది
తనపైన అక్షరాలు
పంక్తులు పంక్తులుగా
ప్రవహించేదెప్పుడా అని,
బోసిగా ఉండటం కాగితానికి నచ్చదు.
అలాంటప్పుడు దానికి
ఎడారిలో వున్నట్టుగా వుంటుంది.
తన నిండా అక్షరాలు నిలబడ్డప్పుడు
తాను పచ్చని మొక్కల మధ్య ఉన్న
అనుభూతి కలుగుతుంది.
ఆ అనుభూతి పరిణతమవుతున్న దశలో
దానికి కలుపు మొక్కల్లాంటి
అక్షరాలు ఎదురవుతాయి.
కలుపు మొక్కలను పెరికివేస్తూ సాగిపోతే
కాగితం నిండా అక్షర సమృద్ధి
హరిత హరితంగా రూపొందుతుంది.
తనకు అక్షర స్పర్శలేని
ఆదిమ దశను స్మరించుకుని
అక్షర ప్రపూర్ణంగా ఉన్న
వర్తమాన దశను చూసుకుంటూ
కాగితం పొందే సంతృప్తి
తులలేనిది.
ఒక నిర్భావనాయుత సందర్భం వేదనాభరిత క్షణంలో నేనేమన్నానంటే ‘రాను ఇక్కడే ఉంటాను’
ఒక నిర్భావనాయుత సందర్భం
వేదనాభరిత క్షణంలో
నేనేమన్నానంటే ‘రాను ఇక్కడే ఉంటాను’
వాళ్లు వెళ్లిపోయారు డాలర్ ప్రపంచంలోకి
మెరుపు కలలతో ల్యాప్‌టాప్‌ని వెంటబెట్టుకొని
నా కడుపుతీపి ప్రవాసం వెళ్లమని చెప్తుంది
నన్ను కన్న మాతృభూమి తనను విడిచి వెళ్లొద్దని చెప్తుంది
అక్కడికెళ్తే ఊరు గుర్తొస్తుంది
ఇక్కడుంటే పిల్లలు గుర్తొస్తారు
బంధాల మధ్య సతమతమౌతూ నేను
పిల్లలంటారు,
ఇండియా మీద దిగులు పెట్టుకోకు అమ్మా!
కారు మీద, ఇంటి మీద జండా పెట్టుకుందాం
ఇండియా ఎంబసీ కెళ్లి ఇండిపెండెన్స్ డే
జరుపుకుందాం, జాతీయగీతం పాడుకుందాం,
అని పిల్లలంటారు!
ఇండియా అంటే జండా మాత్రమేనా?
ఇండియా అంటే జాతీయగీతం మాత్రమేనా?
ఇండియా అంటే ఇంకా చాలా ఉంది
ఇండియా అంటే అన్ని మతాల, భాషల
సంస్కృతుల సమ్మేళనం.
ఇండియా అంటేనే కలిసి బతకడం.
ఇది అచ్చంగా నా ఇండియా. నా సొంతం.
ఈ పలకరింపు, ఈ ఆప్యాయత మరో దేశం నేలమీద దొరుకుతుందా?
పేదరికం కానరాని సంపన్న దేశం అది
కార్లు తప్ప మనిషి జాడ లేని రోడ్లవి
పండగ సందడి తెలియని అపరచిత లోకం అది
ఫీలింగ్ ఇవ్వని విలాస జీవనం అది
ఓ వేకువ పొద్దు,
పిల్లలకు ఫిల్టర్ కాఫీ ఇస్తూ,
నేనన్నాను ‘వద్దులే, నాకిక్కడే బాగుంది’.
ఎప్పుడైనా ఎక్కడైనా ఓ ఎడ్లబండి ఎదురైతే నా బాల్యం గుత్తులు గుత్తులుగా పూతకొస్తది నాన్న ముందు తొట్లో గడ్డిమెత్తపై కూర్చొని రాజకుమారుడిలా దర్జాలుపోయిన చిత్రపటం కళ్లెదుట నిలబడ్తది
ఎప్పుడైనా ఎక్కడైనా
ఓ ఎడ్లబండి ఎదురైతే నా బాల్యం గుత్తులు గుత్తులుగా
పూతకొస్తది
నాన్న ముందు తొట్లో గడ్డిమెత్తపై కూర్చొని రాజకుమారుడిలా దర్జాలుపోయిన
చిత్రపటం కళ్లెదుట నిలబడ్తది
పగటీలి ఒకటిన్నరప్పుడు
కడపర్తి దాటి నెల్లిబండ గుట్ట సాలుగ రాంగానే
నేను అమ్మగర్భంలోంచి
భూమ్మీదపడ్డ పెత్తరమాస కథ
అమ్మమ్మోళ్ల ఎడ్లబండి పురాణం మనసుల మెదుల్తది
ఇప్పుడు
కార్లు కమాండర్ జీపులను చూసి కుటుంబాల ఆదాయాన్ని ఊహించినట్టే
అప్పట్లో
ఎడ్లు బండిని చూసి ఇండ్ల ఆందాన్ని
అంతస్తుని గణించేటోళ్లు
పెనిమిటికి ఎటువంటి అర్ధాంగి అవసరమో
బండికితగ్గ ఎడ్లూ అంతే అవసరమనేది
ఆ రోజుల్లో ఊర్ల ఫిలాసఫి
పండుగల్లో పెళ్లిళ్లలో జాతర్లలో
ఎడ్లబండ్లకు సెలబ్రిటీలకున్నంత డిమాండు ఉండేది
మా ఎడ్లే లేపాక్షి బసవన్నకు తమ్ముండ్లని
మా బండిది బాహుబలి గోత్రమని
నిరూపించుకునే కాపిటల్ కాంటెస్ట్‌లో
ఎడ్లను జవనాశ్వాల్లా అలంకరించేటోళ్లం
బండ్లను చైత్ర రథాల్లా పుదించేవాళ్లం
ఎడ్లూ బండ్లూ కేవలం
విడివిడిగా ఇండ్లకే కాదు ఉమ్మడిగా ఊరుకే వీటో హోదా
ఫలానా ఊరు నుంచి
ఫలానా వాళ్ల పెండ్లికి
ఎంతమంది చుట్టాలు వచ్చిండ్రనే
చర్చ కంటే
ఎన్ని బండ్లొచ్చినయన్నదే రచ్చబండ శిఖరాగ్ర సమావేశం
కట్టెలకు బండి కమ్మలకు బండి
రాయికి బండి రాశికి బండి
చౌడుకు బండి దౌడుకు బండి
మట్టికి బండి మంచినీళ్లకు బండి
సరుకులకు బండి సాయానికి బండి
కాన్పుకు బండి కాయకు బండి
బాడుగకు బండి బాసండ్లకు బండి
ఆడంబరానికి బండి ఆసుపత్రికి బండి
ఎడ్లబండి లేకుంటే ఎల్లేదికాదు
ఎనకట
అది కిషన్‌రావు దొర బండైనా
రామయ్యసేటు బండైనా
మా బండైనా మరెవరి బండైనా
మానుకోట టేకుచెట్లూ
మా ఊరి తుమ్మచెట్లూ
ఆలుమగలుగా మనుగూడిన బాంధవ్యం గాడెంలో పడి చకచకా ఉరికేది
వడ్లశంకరయ్య కమ్మరి బోజయ్యల హస్తకళ బాటెమ్మటి కోనార్క్ టెంపుల్‌లా ఉట్టిపడేది
కుండ కొలిచి ఎడ్లబండి కల్లంలో అంటగడితే
ఆ బలమే వేరు రైతుకు
ఎడ్లబండి నిండుభర్తితో ఇంటిముందాగితే
ఆ బర్కతే వేరు పంటలకు
నోముల కోటయ్య చెల్లెలి పెండ్లికి
ముప్పై ఆరు బండ్లల్ల
కురుమర్తికి పోయినప్పుడు
ఊరు యుద్ధానికి వెళ్తున్నంత ఉత్సాహం
పెండ్లికొడుకు గడ్డివామును
ఎడ్లు పక్క కింద నెమరేసి
తిరిగి వస్తుంటే గండికోట గెలిచినంత సంబురం
ఆట పాటల మేళవింపు ఎడ్లబండి
చేను చెమటల కౌగిలింత ఎడ్లబండి
చరిత్ర చెప్పుకునే నిర్మాణాలకు
శత్రువుల పన్నాగాలు పటాపంచలైన ఉదంతాలకు
ప్రబల సాక్ష్యం ఎడ్లబండి
కరవులపై దండయాత్రలో
ఊరును విజేతగా మలచిన చిత్రాంగద ఎడ్లబండి
నడక నాలుగు చక్రాలుగా సాగుతూ
నాలుగు యుగాలను మంత్రసమ్మితంగా నడీపున మోసుకొచ్చి
నాగరికతకు రహదారులు వేసిన మునివాహనం
ఎడ్లబండి
ఎడ్లబండి
పార్టీలకూ ప్రభలకూ రంగుల సంతకం
ఎడ్లబండి
పెద్దగట్టు లింగమంతులుకూ
ఊరి చింతల్ల పెద్దమ్మగుడికీ
భక్తులు సమర్పించిన నిండు బోనం
ఎడ్లబండి
సబ్బండ వర్ణాలను
ఒక తాటిమీదకు తెచ్చి మా ఊరును అస్సెంబ్లీకి పంపిన పెద్దసోషలిస్టు
నన్నూ నా దేశాన్ని
ఎవడైనా ఎక్కడైనా
బుల్లక్ కార్ట్ నేషన్ అని వెక్కిరిస్తే
వాడి బుల్ మార్కెట్ ముద్ద మొహంపైకి
ఎవరెస్టు
ఎత్తులేస్తది
నా ఎడమ కాలు
సన్నికల్లు రాయిలాంటి శరీరం
మణికట్టు మొదలు మోచేతిదాకా గాజులు
చెంపల నిండా గిరజాలూ
నుదిటి మీద ఇచ్చరూపాయంత బొట్టుతో
అచ్చం గుడిలోని అమ్మోరమ్మలా ఉండేది
ఇంకా చెప్పాలంటే
రైకేసుకోడం తెలియని పసిపిల్ల మా నాయనమ్మ
చేతుల్తో ఊరి పురిటిమాయలు తీసి
దబ్బపండులాంటి బిడ్డని చేతుల్లో పెట్టేక
అప్పటిదాక గూడుకట్టుకున్న
దిగులు మేఘం ఆవిరయ్యాక
ఆనందం కళ్లల్లో సుళ్లై తిరిగినప్పుడు
దేవతలా కనిపించి
తెల్లారేపాటికి మళ్లీ ఊరి చివరికి నెట్టబడ్డ
ఉలిపికట్టె మా నాయనమ్మ
మరోమాట చెప్పాలంటే మాయ
మర్మాలెరగని
మంత్రసాని మా నాయనమ్మ
ఊరిజనంలో సగమ్మంది
మా నాయనమ్మ చేతుల్లో పుట్టినోళ్లే
ఊరి జబ్బులు మొత్తం
మా నాయనమ్మ చేతిసలవ్వల్ల తగ్గినవే
ఊరికష్టాల్లో అన్నీ మా నాయనమ్మ నీళ్లుజల్లిన
చీపురుకట్టతో తరమబడ్డవే
చిన్నప్పుడు నాతో ఆడుకున్నప్పుడు
మామూలుగా అనిపించిన నాయనమ్మ
ఇన్నాళ్లకు గుర్తుకొచ్చి అనిపిస్తుంది
నిజంగా మా ఊరి మదర్ థెరీసా
మా నాయనమ్మ
మాట్లాడటం... మాట్లాడటం... మాట్లాడటం... మీ పిల్లలకు మాటలు తొందరగా రావాలంటే మీరు చేయాల్సిన పని ఇదొక్కటే. బుడి బుడి అడుగుల ప్రాయంలోని చిన్నారులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా ఆ పిల్లలకు ‘పలుకు’ స్వాధీనమవుతుంది.
మాట్లాడటం... మాట్లాడటం... మాట్లాడటం...
మీ పిల్లలకు మాటలు తొందరగా రావాలంటే మీరు చేయాల్సిన పని ఇదొక్కటే. బుడి బుడి అడుగుల ప్రాయంలోని చిన్నారులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా ఆ పిల్లలకు ‘పలుకు’ స్వాధీనమవుతుంది. అందుకే ఇంట్లో బామ్మలు ఎప్పుడూ అంటుంటారు... ఆ బుడ్డోడిని పలకరించండర్రా అని! అది వారి అనుభవం నేర్పిన విషయం. ఇప్పుడదే శాస్త్రీయంగానూ రుజువైంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ మధ్యనే ఓ ప్రయోగం చేశారు. 19 నెలల వయసులో ఉన్న 29 మంది పిల్లలను ఎంచుకున్నారు. వారికి దగ్గర్లో ఓ టేపు రికార్డరు పెట్టారు. 24 గంటల వ్యవధిలో ఆ శిశువులు విన్న మాటలు, శబ్దాలన్నింటినీ రికార్డు చేశారు. పిల్లలతో పెద్దలు నేరుగా మాట్లాడిన మాటలు, పెద్దలు ఫోన్లో మాట్లాడుకుంటుంటే చిన్నారుల చెవుల్లో పడ్డవి, పెద్దలు - పెద్దలు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు విన్నవి... ఇలా వర్గాల వారీగా ఆ మాటలను విభజించారు. తరువాత చూస్తే ఓ చిన్నారి 12 వేల మాటలను నేరుగా విన్నదట. అంటే.. అమ్మానాన్నలో, ఇంకెవరో కానీ ఆ పాపతో అన్నేసి మాటలాడారన్న మాట. ఇంకో శిశువుకేమో 670 ‘ప్రత్యక్ష’ మాటలే వినపడ్డాయట. ఆ తరువాత అయిదు నెలలకు అంటే, రెండేళ్ల వయసులో ఈ పిల్లల పదసంపదను పరిశీలించారు పరిశోధకులు. గతంలో నేరుగా ఎక్కువ మాటలు విన్న బుజ్జాయి మిగిలిన చిన్నారుల కంటే ఎక్కువ పదాలను పలుకుతోందని గుర్తించారు. కాబట్టి, అమ్మలూ నాన్నలూ... ఎన్ని పనులున్నా సరే, మీ కంటిపాపలతో మాట్లాడుతునే ఉంటారు కదా!