పాటల సాగు

రచయిత : మాసాయిపేట యాదగిరి; పుటలు : 112; వెల: Rs50; ప్రతులకు: రచయిత, 98492 47751; విశాలాంధ్ర, మైత్రి బుక్‌హౌస్‌.

పాటల సాగు

ఉద్యమ అస్తిత్వ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన కవితలు ‘మనాది’ యాది పాటలు. సామాజిక పొరల్లో నిక్షిప్తమైన అంతరాల్ని అంతేస్థాయిలో ప్రశ్నించారు. ‘అంటరానితనమా! నీవు యాడికెల్ల పుడితివే’ అన్న కవితా పంక్తిలో కవి మనసులోని ఆవేదన బయటికొస్తుంది. ‘కాళ్లల్ల బెట్టుకు, దూపాకలి, తల్లికోడి ప్రేమ, కాళ్లు కడిగి తోలిన..’ వంటి అభివ్యక్తీకరణలు కవి సామాజిక అనుబంధానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ‘గంజిలోన ఉప్పు లెక్క.. కలుపుకోని తిర్గుతవు చెల్లెమ్మా’ అన్న వ్యక్తీకరణ, ‘ఒద్దు బిడ్డో మంది కండ్లల్లైతవు నీవు’ అన్న అభివ్యక్తి-కవి జనపద భాషకు నిదర్శనాలుగా కనబడతాయి. ఇంకా అగ్రవర్ణాల దాడిలో అవమానాలను ముందుంచే పాటలూ ఉన్నాయి. 

- శ్రీనివాస్‌ దరెగోని

ఆధ్యాత్మిక కోణంలో...

రచయిత: అల్లు భాస్కరరెడ్డి; పుటలు: 192; వెల: Rs100; ప్రతులకు: సన్నిధి పబ్లికేషన్స్, నెల్లూరు, 0861 2353255

ఆధ్యాత్మిక కోణంలో...

జీవరాసులలో మానవజన్మ ఉత్కృష్టమైంది. మంచీ, చెడూ తెలుసుకునే జ్ఞానసంపద మనిషికే ఎక్కువ. ప్రతిమనిషికీ చావు, పుట్టుకలు సమానమే, కానీ ఈ రెంటి మధ్య మనిషి ఎలా ప్రవర్తించాడనేది తన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మానవతా విలువలు పూర్తిగా దిగజారిపోతున్న రోజుల్లో మానవ జీవితాన్ని నీతి, నియమాలనే పట్టాలపైన నడిపేందుకు దైవాంశసంభూతులైన మహాత్ములు ఉదయిస్తూంటారు. వారిలో వెంకయ్య స్వామి ప్రసిద్ధులు. నిన్న మొన్నటి దాకా నలుగురిలో తిరుగుతూ తనదైన శైలిలో భగవదనుగ్రహాన్ని పంచిన మహా అవధూత. ఆయన లీలలు కోకొల్లలు. ఆయన ఎంతమంది జీవితాల్లో ఎలాంటి మహాద్భుతాలు కనబరిచారో ‘విశిష్ట సత్సంగం’లో రచయిత అల్లు భాస్కరరెడ్డి చక్కగా వివరించారు. ఇది చదివిన ప్రతీవ్యక్తి చూపూ ఆధ్యాత్మికం వైపు మరలుతుందనడంలో సందేహం లేదు! 

- చిత్ర

సానుకూల ఆలోచనలకు...

అనువాదం: జమలాపురం విఠల్‌రావు; పుటలు: 255; వెల:Rs200; ప్రతులకు: ఎ.చిదంబరం, హైదరాబాదు, 94410 23311

సానుకూల ఆలోచనలకు...

ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాటలు రెండున్నాయి. ధ్యానం, యోగం. తత్వజ్ఞానాన్ని తనలో మిళితం చేసుకున్న యోగాన్నీ, భౌతికంగా వ్యాయామంతో మానసిక ఆనందానికి దారులు వేసే ధ్యానాన్నీ ముడివేసి ఆత్మజ్ఞానాన్ని వెతుక్కునే ప్రయత్నమే జీవితం. అటువంటి జీవనానికి ప్రయోగాత్మక పరిశీలనతో సానుకూల ఆలోచనల పరిధిని పంచుకునే దిశగా ఈ పుస్తకం ‘కన్నులు మూయండి.. మనసును తెరవండి’ సాయపడుతుంది. ఆచార్య నభనీలానంద రాసిన ఈ పొత్తాన్ని జమలాపురం విఠల్‌రావు తెలుగులోకి అనువదించారు. ఆధ్యాత్మిక సాధనకు వాస్తవిక మార్గదర్శని అనే పుస్తక ఉపశీర్షిక చర్చించిన అంశాల విస్తృతిని తెలియజేస్తుంది. ఆద్యంతమూ సోదాహరణంగా సాగే రచయిత వ్యాఖ్యానం ఈ పుస్తకాన్ని పాఠకులకు మరింత చేరువ చేస్తుంది.

 - వందన 

అవిశ్రాంత అంతర్జాల కృషి

రచయిత: గబ్బిట దుర్గాప్రసాద్‌; పుటలు: 408, వెల: Rs300; ప్రతులకు: రచయిత, సరసభారతి, ఉయ్యూరు, 99890 66375

అవిశ్రాంత అంతర్జాల కృషి

అంతర్జాలం ద్వారా సంస్కృత కవుల గురించి పరిచయం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు గబ్బిట దుర్గాప్రసాద్‌. ‘అపరశంకరులు - శంకర భగవత్పాదులు’ మొదలుకొని, 1960లో జన్మించిన కర్ణాటక సంస్కృత కవి, శతావధాని ఆర్‌.గణేష్‌ వరకు, 146 మంది సంస్కృత కవులకు సంబంధించిన కాలనిర్ణయం, జీవిత విశేషాలు, రచనలు, వాళ్ల ప్రత్యేకతలను సంక్షిప్త పరిచయాలతో ‘గీర్వాణ కవుల కవితా గీర్వాణం’ పేరుతో రాశారు. ఇదే పేరుతో పుస్తకం కూడా వెలువరించారు. ఇందులో సంస్కృత పండితులకు మాత్రమే తెలిసిన అనేక విషయాలను జన సామాన్యంలోకి తెచ్చారు. సంస్కృతి పట్ల లేదా మన సాహితీమూలాల పట్ల ఏ మాత్రం ఆసక్తి ఉన్నా, అభిరుచి ఉన్నా ఈ గ్రంథం బాగా చదివిస్తుంది. 

- ఉపదేష్ట అగ్నివేష్‌

వ్యాస మణిహారం..

రచయిత: డా।। ఎ.గోపాలరావు; పుటలు: 292; వెల: Rs150; ప్రతులకు: రచయిత, విజయనగరం, 94404 35262

వ్యాస మణిహారం..

ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, సంస్కృతాంధ్ర సాహిత్యాలు, సామాజిక సాహిత్య రంగాల ప్రముఖుల విశేషాలను అందించిన వ్యాసాల సమాహారం ‘వ్యాసమంజూష’. ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలను, వివిధ ఆధ్యాత్మిక, దినపత్రికలలో ప్రచురితమైన 45 వ్యాసాలను సంపుటిగా అందించారు డా।। ఏ. గోపాలరావు. ఇందులో సుందరకాండ పర్వాన్ని ‘సుందరకాండ సౌందర్యం’గా వ్యాఖ్యానించారు. ‘ఉపనిషద్వాని’ వేద విజ్ఞానాన్ని వివరించింది. ‘తస్మైశ్రీ గురవేనమః’ గురుస్వరూపాన్ని ఆవిష్కరించింది. దేవభాష సంస్కృతం ప్రాముఖ్యతను ‘సంస్కృత సంస్కృతి’లో వివరించారు. వ్యాస పరిధి పరిమితమైనా రచయిత సంస్కృత పాండిత్యం, విషయ పరిజ్ఞానం, సందర్భోచిత వాఖ్యానాలు, పరిశోధనాత్మక సాహిత్యాంశాలు వ్యాసాలకు పరిపూర్ణతను చేకూర్చాయి. 

- ఎ.ఉమాకర్‌

నాయకనాయకుని జీవన కోణాలు

సంపాదకులు; ప్రొ.కె.శ్రీనివాసులు; పుటలు: 133; వెల:Rs75; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్‌ 92474 71361

నాయకనాయకుని జీవన కోణాలు

నిండా త్యాగశీలం కలిగిన కొండా లక్ష్మణ బాపూజీ జీవన సంఘటనలను, ఉద్యమ కార్యాచరణలను, ఆలోచనలను వివరిస్తూ పలువురు రాసిన వ్యాస సంపుటి ‘కొండా లక్ష్మణ బాపూజీ దార్శనికత’.  ఇందులో వ్యాస రచయితలు విమలక్క, బి.ఎస్‌.రాములు, ఎం.వేదకుమార్, కె.కొండలరావు, అల్లం నారాయణ తదితరులు తమవంతు ఉద్యమ పాత్ర వహించిన వారే అవడం వల్ల కొండా లక్ష్మణ బాపూజీని తమ సమీప దర్శనాలతో సారాంశ విశేషాంశాలను ఇవ్వడానికి వీలు కలిగింది. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన ఏ విధంగా పాల్గొన్నారు, ఏ విధంగా ఇతరులకు స్ఫూర్తినిచ్చారు అనే అంశాలు ఈ పుస్తకంలోని ఉద్యమం, స్మృతులు, ఇంటర్వ్యూలు, కవితలు అనే విభాగ రచనల ద్వారా సువ్యక్తమయ్యాయి. 

 - నంధాన్నిస

జీవన చిత్రణం

రచయిత: దాట్ల దేవదానం రాజు; పుటలు: 159; వెల: Rs100; ప్రతులకు: రచయిత, జాక్రియానగర్, యానాం, 94401 05987

జీవన చిత్రణం

‘కళ్యాణపురం’ యానాం కథలు- 2 పేరుతో యానాం సంస్కృతీ సంప్రదాయాలను మరో కోణంలో ఆవిష్కరించారు రచయిత దాట్ల దేవదానం రాజు. యానాం ప్రజల జీవన చిత్రణతో సాగే కథల్లో అక్కడి మానవ సంబంధాలు, ఆచార వ్యవహారాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మొదటి కథ ‘కళ్యాణపురం’ ద్వారా ఫ్రెంచి వారు భారతీయ ఆచార విషయాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టమవుతోంది. ‘మన్యంవోరి మేడ’ కథ ద్వారా గత 150 ఏళ్లలో సామాజిక విలువలు ఎలా పతనమయ్యాయో తెలుస్తుంది. ‘గోడకు అవతల’, ‘అభయం’, ‘మళ్లీ బాల్యం’, ‘జగమంత కుటుంబం’ తదితర 16 కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కథల్లో బాల్య వివాహాలు, త్యాగం, స్వార్థం, సహనం, తిరుగుబాటు వంటి కోణాలన్నీ స్పృశించారు. 

- డి.శాన్వి

నృత్యనాటికా సమాహారం

రచయిత్రి: పి.బాలా త్రిపుర సుందరి; పుటలు: 172; వెల: అమూల్యం; ప్రతులకు: రచయిత్రి, సత్యనారాయణపురం, విజయవాడ, 94934 85102

నృత్యనాటికా సమాహారం

ఏ సందేశాన్నయినా, ఏ విషయాన్నయినా కళ్లకు కట్టినట్లు చెప్పగలిగే అవకాశం నృత్యాంశాలకు ఉంటుంది. అందుకే విద్యాలయాల ఉత్సవాల్లోనూ ఏదో ఒక నృత్యాంశం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ అంశం ఎంచుకోవాలి? అంశానికి తగిన సాహిత్యం ఎలా సమకూర్చుకోవాలి? అనేవి పిల్లలకూ, ఉపాధ్యాయులకూ పెద్ద సమస్య. ఈ సమస్యను తీరుస్తూ 18 నృత్య రూపకాలను ‘నూపురనాదం’ పుస్తకంగా తీసుకొచ్చారు పిల్లలమర్రి బాలాత్రిపుర సుందరి. ‘దేవీ విజయం, లవకుశ, కృష్ణలీలలు, క్షీరసాగర మథనం’ వంటి పురాణగాథలతో కూడిన నృత్యాంశాలతో పాటు ‘పండుగలు, గలగలా గోదారి, కృష్ణవేణి, కృషితో నాస్తి దుర్భిక్షమ్‌’ వంటి ఆధునిక అంశాల మీదా కొన్ని రూపకాలున్నాయి. విద్యార్థుల వాచకం, అభినయాలకు తగినట్లు వారి స్థాయులను దృష్టిలో ఉంచుకుని తేలికైన పదాలతో పద్య, గద్యాలు రచించారు.

- కప్పగంతు రామకృష్ణ

తెలుగులో ‘భజగోవిందం’

రచయిత: వాసిష్ఠ; పుటలు: 51; వెల: Rs40; ప్రతులకు: కృపాసాగర్‌ కుండే, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాదు 92468 21650

తెలుగులో ‘భజగోవిందం’

ఆదిశంకరాచార్యుల ‘భజగోవిందం’ ఎన్నిసార్లు విన్నా చెవులకు ఇంపుగానే ఉంటుంది. అందులో వేదాంతం అంతర్లీనం. మనిషి ఎలా బతకాలో చెబుతుంది. ‘భజగోవిందం’లోని 30 శ్లోకాలకు ‘గోవిందా హరి గోవిందా’ పేరుతో 30 తెలుగు గేయాలు రాశారు వాసిష్ఠ. గేయాలతో పాటూ వాటి భావాలను కూడా హృద్యంగా వర్ణించారు. ఉదాహరణకు పన్నెండో శ్లోకానికి... 
పగళ్లూ రాత్రులు ప్రాతః సంధ్యలు/ పరిపరి ఋతువుల పునరావృతులు/ ఆగక సాగే కాల క్రీడలు
ఆయువు తీరును తీరవు ఆశలు అంటూ కాలాలు పరుగెడుతూ ఆయువులను నశింపజేస్తున్నా మనిషి ఆశకు మాత్రం అంతం కనిపించట్లేదు అంటారు. ‘‘దేహము నందున ఊపిరి యాడగ/ తన పరివారము చూతురు బాగుగ/ దేహమ్మును ఆ ఊపిరి వీడగ/ తన సతి భయపడు కాయము కానగ’’... ఇలా ప్రతి శ్లోకానికీ తెలుగు భావాలను వివరించడంలో రచయిత కృతార్థులయ్యారు.

- వీర

bal bharatam