సృజనాత్మక వ్యాసావళి

రచయిత్రి: డా।। కొండపల్లి నీహారిణి; పుటలు: 296; వెల: Rs200; ప్రతులకు: కొండపల్లి వేణుగోపాలరావు, ప్లాట్‌.559, శ్రీశ్రీ హోమ్స్, హైదరాబాదు-58, 98494 68931

సృజనాత్మక వ్యాసావళి

విభిన్న సాహితీ ప్రక్రియల్లో అనేక మంది సృజనకారులు  చేసిన రచనల ప్రత్యేకతను విడమరిచే సాహిత్య విమర్శావ్యాసావళి ఈ సృజన రంజని. ‘ఆధునిక మహిళల అభ్యుదయ కవిత్వం’ అనే వ్యాసంలో ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో’అనే జానపద గీతంతో మొదలై, అనేక మంది ఆధునిక స్త్రీవాద సాహితీ కిరణాల్ని పరిచయం చేశారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కాళోజీ పడ్డ తపన, కాలువ మల్లయ్య కథల్లోని మానవీయ దృక్కోణాలను వివరించే వ్యాసాలతో పాటు ఇతరాలూ రచయిత్రి పరిణతికి అద్దం పడతాయి. ‘భాషా... నీ వికాసమెక్కడ’ వ్యాసంలో తెలుగు భాష ఏకత్వాన్ని శాస్త్రీయంగా వివరించారు. భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చక్కటి సూచనలు చేశారు. తెలుగు సాహిత్యం.. ప్రత్యేకంగా తెలంగాణ సాహిత్య సౌరభాల్ని ఆస్వాదించాలనుకునే వారంతా తప్పని సరిగా చదవాల్సిన సంకలనమిది. 

- అనిశెట్టి శాయికుమార్‌

జాతీయాల లోగుట్టు...

రచయిత: : యం.వి.నరసింహారెడ్డి; వెల: Rs100; పుటలు: 152; ప్రతులకు: శ్రీరమణ బుక్‌డిపో, జగిత్యాల, 99891 22035

జాతీయాల లోగుట్టు...

తియ్యదనం, అమృతత్వం, సుమధుర పరిమళం కలిసిన కమ్మనిభాష తెలుగు. జాతీయాలు, నానుడులు, లోకోక్తులు, సామెతలు తెలుగుభాషను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. వాటిలో 193 జాతీయాల పూర్వాపరాలు, అర్థాలను వివరిస్తూ ‘తెలుగు జాతీయాలు’ గ్రంథంగా రూపొందించారు యం.వి.నర్సింహారెడ్డి. తమిళనాడులో ‘కుంభకోణం’ గ్రామంలో ఆంగ్లేయులు మొదటి ఇంగ్లిషు పాఠశాలను స్థాపించారు. ఆంగ్లవిద్య భారతీయులను మోసగించిందనీ, కుంభకోణం విద్య వల్లే మన సంస్కృతి సమసిపోయిందన్న భావంతో ఏ మోసం జరిగినా ‘కుంభకోణం’ అనడం జరుగుతోంది. పెద్ద ఎత్తున జరిగే అవినీతి పనులన్నింటికీ ఈ పదమే వాడుకలో ఉంది. ఇలా భాషాభిమానులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, పోటీపరీక్షలు రాసేవారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.    

- ఆకుల ఉమాకర్‌

చక్కటి కవితలు

రచయిత: ఎస్‌.ఆర్‌.భల్లం; పుటలు: 82; వెల:Rs100; ప్రతులకు: భల్లం సామ్రాజ్యలక్ష్మి; తాడేపల్లిగూడెం 98854 42642

చక్కటి కవితలు

రచయిత ఎస్‌.ఆర్‌.భల్లం తను పొందిన అనుభూతున్నింటినీ ‘వేకువపిట్ట’ కవితల మాలికగా తీసుకొచ్చారు. ఇందులో ఉన్న 58 కవితలు పలు పత్రికల్లో అచ్చయినవే. కవిత్వంతో కబుర్లాడి కబుర్లాడి, కరచాలనం చేసి అద్దుకున్నానంటున్న రచయిత కవిత్వంలోని రేఖల్ని, ధ్వనుల్ని, వర్గాలనూ వర్ణిస్తూ పసిబుగ్గ మీద ఇసుమంత ముద్దుపెడితే ఆ స్పర్శ ఇచ్చిన అనుభూతిని ‘బుజ్జాయి’ కవితలో చెప్పారు. అలానే, ‘సీతాకోక చిలుక’ రెక్కల సొగసుని చెలి అందాలతో పోల్చారు. మరో కవిత ‘మరచెంబు’ మరకల్ని పోగొడుతూ గతస్మృతుల్ని నెమరు వేసుకుంటే ఎలా ఉంటుందో వర్ణించారు. ఇలా సంపుటిలోనున్న కవి భావాలన్నీ పాఠకుల హృదయాలను నేరుగా హత్తుకునేలా ఉన్నాయి.

- తులసి

కవితా ప్రతిబింబాలు

అనువాదం: డా।। లంకా శివరామప్రసాద్, పుటలు:103; వెల:Rs100; ప్రతులకు: రచయిత, వరంగల్లు, 88978 49442

కవితా ప్రతిబింబాలు

విలియం బ్లేక్‌ 1757-1827 మధ్య కవిత్వాన్ని పండించిన ఆంగ్ల కవీ, చిత్రకారుడు. వైవిధ్యంగల జీవితం, భౌతికాతీత భావనల అనుభూతి కవితల వల్ల ఆయన అమరుడయ్యాడు. హరిత ప్రతిధ్వనులపైనా, పొగగొట్టం ఊడ్చే వ్యక్తి పైనా ఇలా కనపడే సమీప అంశాలపై దర్శనా వివశుడై అనుకున్న పద్ధతుల్లో ఇట్టే కవితలు రాస్తాడు. ఈ కవి తండ్రి - కవి బాల్య దశలో ఒక చిత్రకారుని దగ్గర సహాయకునిగా నేర్చుకో అంటే - నేనతని దగ్గర నేర్చుకోను. ఆయన ముఖంలో ఉరితీయబడి చచ్చేవాడి లక్షణాలు కనిపిస్తున్నాయని వెళ్లడం మానేశాడట. ఏడేళ్ల తర్వాత ఆ చిత్రకారుడు ఫోర్జరీ నేరం కింద నిజంగానే ఉరితీయబడ్డాడట! 
ఈ గ్రంథానికి ఆంగ్లంలో కె.సంధ్య రాసిన కవి జీవితాంశాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. 70 ఆంగ్ల కవితల్ని తమ అనువాదాల అద్దాల్లో బింబింపజేశారు డా।।లంకా శివరామప్రసాద్‌.    

- ‘మిణుగురు’

ప్రశ్నావళిలో సరికొత్త ప్రక్రియ

రచయిత: నియోగి; పుటలు:89; వెల: Rs120; ప్రతులకు: రచయిత, సత్తుపల్లి, ఖమ్మం, 95530 97319

ప్రశ్నావళిలో సరికొత్త ప్రక్రియ

‘ఉద్యమ స్వరానికి 100 ప్రశ్నలు’ ఇంటర్వ్యూ ల్లో ఓ కొత్త ప్రక్రియ. ఒక రచయితకు 100 ప్రశ్నలు సంధించడంలో రచయిత విజయవంతమయ్యారు. ఈ ప్రశ్న-జవాబులను పరిశీలిస్తే ఇద్దరు రచయితల విద్వత్తును చదివినట్లవుతుంది. 1969 నుంచి కలం పట్టి ‘నేను విప్లవ కవిని’ అని చాటిన దామెర రాములు సాహిత్యాన్ని ఆయన సమాధానాల్లోనే ఆవిష్కరించారు రచయిత. అర్థవంతమైన ప్రశ్నలకు విషయ పరిజ్ఞానంతో నిండిన సమాధానాలు రాబట్టారు. అవార్డుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు ‘సాహితీ లోకంలో కానరాని అభాగ్యులెందరో’ అంటూ రాములు సమాధానమివ్వడం ఆలోచింపజేస్తుంది. కవి వ్యక్తిగత ప్రవర్తన కన్నా అతడి కవిత్వం అందించే సందేశమే ప్రధానమన్న చర్చ ఆసక్తికరంగా ఉంది. కవిత్వంలో వస్తున్న అన్ని ప్రక్రియలపై చర్చించిన ఈ పుస్తకం వర్తమాన రచయితలకు దిక్సూచి.

 - బి.స్టాలిన్‌

అమృతధారా ప్రవాహం

రచయిత: అల్లెన వెంకట జనార్దన రావు; పుటలు: 158; వెల: Rs 99; ప్రతులకు: రచయిత, విశాఖపట్నం 0891 2704757

అమృతధారా ప్రవాహం

రామాయణంలోని ఉత్తరకాండ కథా భాగాన్ని శ్రీరామ పట్టాభిషేకం తర్వాత మహా ప్రస్థానం వరకు జరిగిన సంఘటనలను ఏర్చి కూర్చి ‘శ్రీరామ రాజ్యము’ పేరుతో ఎ.వి.జనార్దనరావు వెలువరించారు. సంక్లిష్టతకు ఏమాత్రం తావివ్వకుండా సరళమైన భాషలో వాక్యనిర్మాణాన్ని పొందుపరుస్తూ... 68 ఉపశీర్షికలతో అమృత ధారా ప్రవాహంలా రచనను కొనసాగించారు. నీతి ప్రబోధకంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకంలో ఉపకథలు శ్రీరాముని పరిపాలన దక్షతకు అద్దం పడతాయి. ప్రజల విన్నపాలు పట్టించుకోకపోతే ఊసరవెల్లిగా పుడతారనీ ‘నృగమహారాజు’ కథ, దేవాలయాధికారిగా పుట్టడమనే శిక్ష విధించమన్న ‘శునకం కోరిన న్యాయం’ రెండూ న్యాయ రక్షణను తెలియపరిచేలా ఉన్నాయి!

- డి.శాన్వి

ఎందరో మనవాళ్లు...

రచయిత: ఈతకోట సుబ్బారావు; పుటలు: 301; వెల: Rs200; ప్రతులకు: రచయిత, నెల్లూరు, 94405 29785 

ఎందరో మనవాళ్లు...

మనవాళ్ల’ గురించి తెలుసుకోవడంలో ఉన్న ఆ ఆసక్తే వేరు. చిన్న విషయమూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ‘ఆనాటి నెల్లూరోళ్లు’ పేరుతో పాత్రికేయుడు ఈతకోట సుబ్బారావు తీసుకొచ్చిన పుస్తకం ఆద్యంతం చదివించేలా ఉంది. నాటి శ్రీనాథుని నుంచి నేటి సింగీతం శ్రీనివాసరావు వరకు ఈ జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖుల వివరాలను పొందుపరిచి మంచి ప్రయత్నమే చేశారు. మరికొందరి పేర్లు ఉంటే బాగుండేదని అనిపించినా ఇలాంటి సందర్భాల్లో రచయితకు పరిమితులు ఉండటం సహజం. ఈ ప్రముఖులను కాలం ఆధారంగానో, రంగాల వారీగానో విభజించి ప్రచురించాల్సింది. అలానే బ్రౌన్‌ వంటి ప్రసిద్ధ వ్యక్తుల చేతిరాతను పూర్తి పుట రూపంలో చదవడానికి వీలుగా ఇవ్వాల్సింది. విషయ సేకరణ బాగుంది. ఈ పుస్తకాన్ని పరిశోధన గ్రంథంగా తీర్చిదిద్దితే మిగిలిన ప్రాంతాలవారికీ ఆదర్శ ప్రాయంగా ఉంటుంది.

- పి.శంకరరావు
 

తీర్ధయాత్రా దర్శిని

సంకలనం: ఓరుగంటి రామకృష్ణప్రసాద్‌; పుటలు:558; వెల:Rs300; ప్రతులకు: నవరత్న బుక్‌ హౌస్, విజయవాడ, 0866 2432813

తీర్ధయాత్రా దర్శిని

హిందువుల జీవితంలో తీర్థయాత్రలు చేయడం ప్రధానమైన కార్యం. ఉత్తరాన అమర్‌నాథ్‌ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు, పశ్చిమాన సోమనాథ్‌ నుంచి తూర్పున కామాఖ్య వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు కొలువైన భూమి మన భారతదేశం. వాటన్నింటిని చూసేందుకు అందరికీ అనుకూల పరిస్థితులు, స్తోమత ఉండకపోవచ్చు. ఆసక్తి ఉన్నా ఆరోగ్యం సహకరించక పోవచ్చు. అలాంటి వారికీ, కొత్తగా దర్శించాలనుకుంటున్న వారికి కరదీపిక ఈ ‘మన పుణ్యక్షేత్రాలు’. మనదేశం నలుమూలలా విస్తరించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలు ఇందులో పొందుపరచారు ఓరుగంటి రామకృష్ణప్రసాద్‌.
      కొన్ని దేవాలయలకు ఎంతో చారిత్రక ప్రశస్తి ఉంటుంది. కానీ చాలామందికి దాని గురించి అంతగా అవగాహన ఉండదు. ఈ పుస్తకంలో సంక్షిప్తంగా ఆలయ సమాచారం, అక్కడి శిల్ప సంపద, శాసనాల వివరాలు పాఠకులకు అందజేసి ఎంతో మేలుచేశారు రచయిత. ఇందులో ఒకప్పటి ‘వ్యాసపుర’ ఇప్పుడు బాసరగా ప్రసిద్ధి చెందిన విశేషాలు, చెన్నూరు అగస్త్యేశ్వరాలయంలో 410 ఏళ్ల నుంచీ వెలుగుతున్న అఖండదీపం, ఏడో శతాబ్దంనాటి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని యమధర్మరాజు సందర్శించి ఇక్కడే ఉండిపోవడం లాంటి ఆసక్తికరమైన విషయాలను అవసరమైన చోట ఉట్టంకించారు. అలానే శ్రీకాకుళం జిల్లా అనగానే అరసవిల్లి సూర్య నారాయణుని ఆలయం గుర్తుకొస్తుంది. దీన్ని 7వ శతాబ్దంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. అతి ప్రాచీన చరిత్ర ఉన్న శ్రీముఖలింగం ఆలయం క్రీ.శ. 573లో ప్రతిష్ఠించినట్లు ఉంది. ప్రస్తుతం నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని 17వ శతాబ్దం వరకూ వైకుంఠంగా పిలిచేవారు. ఇది చోళుల నాటిది. ప్రసిద్ధ దత్త క్షేత్రాలు, పంచ ప్రయాగలు, చార్‌ధామ్‌ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, కన్యకా పరమేశ్వరి క్షేత్రాలు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి నామాలు, అష్టయిశ్వర్యాలు, అష్టకష్టాలు, అష్టభోగాలు, అష్టగణపతులు, దేవతలు- వాహనాలు, యంత్రాలు నిక్షిప్తమైన ఉన్న ప్రముఖ దేవాలయాలు, పంచారామాలు ఇతర పుణ్యతీర్థాల గురించీ తెలుసుకోవచ్చు. చరిత్రతో పాటు ముఖ్య యాత్రస్థలాల మధ్యదూరం, అక్కడక్కడ ఆధ్యాత్మిక సూక్తులు ఇవ్వడం బాగుంది.  

- దీప్తి రావి

అనేక భావాల సమ్మేళనం

రచయిత్రి: డా।। సి.మృణాళిని; పుటలు: 221; వెల: Rs100; ప్రతులకు: రచయిత్రి, సనత్‌నగర్, హైదరాబాదు, 98490 65147

అనేక భావాల సమ్మేళనం

డా।। సి.మృణాళిని పలు సందర్భాల్లో వెలువరించిన 17 వ్యాసాల సముచ్ఛయమే ‘సకల’. ఇవి అప్పుడప్పుడు రాసినవి కావడం వల్ల ఇందులో ఏకసూత్రత ఉండదు. కానీ, ఏ వ్యాసానికి ఆ వ్యాసం ఒక పరిశిష్టతతో ఉంది. మాతామహులు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సారస్వతాలోకనం గురించి నిక్కచ్చిగా తన భావనలను అందించారు రచయిత్రి. రసికత్వం ఎలా ఉండాలన్న అంశంపై అనంతకృష్ణశర్మ చెప్పిన ప్రవృత్తి భోగాలు, నివృత్తి భోగాలను విడమర్చి చెప్పారు. ప్రవృత్తి భోగాలలో అన్నపానాదులను చేర్చలేదుకాని, ఇది ప్రవృత్తికి సంబంధించిందని అన్నారు. భక్తి, త్యాగం, వైరాగ్యం, శాంతి అనేవి నివృత్తి భోగాలని చెప్పారు. మనిషికి ప్రవృత్తి భోగాల మాదిరిగానే ఇవి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇవీ భోగాలేనని నిర్ధరించడం ప్రత్యేక విషయం. ఈ విషయం ఇంతకు పూర్వం ఏ విమర్శకుడూ స్పృశించని అంశమని అంటారు 
      ఆర్‌.ఎస్‌.సుదర్శనం విమర్శను ఉట్టంకిస్తూ... ‘‘సుదర్శనం గారి విమర్శ అర్థం కావాలంటే పాఠకుడు తన విజ్ఞాన పరిధిని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. విమర్శకుడిగా ఆయన అందించిన సూత్రాలు తెలుగు వచన సాహిత్యానికి చాలా ప్రయోజనకరమైనవన్నది స్పష్టం. ముఖ్యంగా కాలక్షేప రచనగా చాలామంది కొట్టి పారేసిన నవలా ప్రక్రియలో ఎన్ని లోతులున్నాయో, ఎంత వైవిధ్యం ఉందో, ఎంత జీవిత దర్శనం కనిపిస్తుందో తేటతెల్లం చేసిన సుదర్శనం గారికి కల్పనా సాహిత్య విమర్శకులు రుణపడి ఉంటారని’’ అంటారు. దాశరథి సోదరుల సాహిత్యంపై ఒక క్రమమైన విశ్లేషణను అందించారు. 
      ఈ సంపుటిలోని వ్యాసాల్లో ఆయా సాహిత్యకారుల సాహిత్య వివేచన చేయడంతో పాటు, వాళ్ల వ్యక్తిత్వాలనూ వివరించే ప్రయత్నం చేశారు. రచయిత్రి తాను చెప్పదలచుకున్న అంశం పట్ల నిర్దిష్టమైన దృక్కోణంతో వ్యాసాలు వెలువరించారు. పాఠకులకు ఆయా రచయితల పట్ల, రచనల పట్ల అవగాహన కలిగించడం, ఇంకా విస్తృతార్థంలో సాహిత్యం పట్ల అభిరుచిని పెంచేలా ఉంటాయి ఈ వ్యాసాలు. భాష, సినిమాలు నవలలు, స్త్రీవాద కవిత్వానికి సంబంధించిన వ్యాసాలూ ఈ సంపుటిలో ఉన్నాయి.

- డా।। టి.శ్రీరంగస్వామి
 

bal bharatam