విద్యావ్యవస్థకు మేలుకొలుపు

సంకలనకర్త: పేరిశెట్టి శ్రీనివాసరావు; పుటలు: 22+223; వెల: Rs350; ప్రతులకు: పేరిశెట్టి వెంకట సీతాదేవి, సాయిరామ్‌ రెసిడెన్సీ, మారుతీనగర్, విజయవాడ-4, 99892 42343

విద్యావ్యవస్థకు మేలుకొలుపు

ఆధునిక సరళ తెలుగు వచనంలో ఇప్పుడు కొండంత సాహిత్యం సామాన్యుల్ని సైతం మురిపిస్తూందంటే దానికి మూలకారకులు ప్రాతస్మరణీయులు తెలుగు భాషా వైతాళికులు గురజాడ, గిడుగు. వీరి గురించి పూర్తి వాస్తవాలు చాలామందికి తెలియవు. గురజాడ అనగానే కన్యాశుల్కం అందులోని కొన్ని సంభాషణలు, పాత్రలు, గుర్తొస్తాయి. ‘దేశమును ప్రేమించుమన్నా’- ఇదీ గుర్తుకొస్తుంది. వ్యావహారిక భాషకోసమే కాకుండా ఆయన విద్యావ్యవస్థలో మార్పు కోరి నిర్మాణాత్మక కృషిచేశారు. ‘ఎలిమెం టరీ, మిడిల్, హైస్కూలు విద్య నుంచి కాలేజీ పాఠ్యాంశాల్ని వేరుచేసి పరిశీలిస్తే తీర్థానికి తీర్థమే ప్రసాదానికి ప్రసాదమే’ అని నొక్కివక్కాణించారు. మాతృభాషా బోధన గురించి గిడుగు చేసిన కృషి గురించీ కొందరికే తెలుసు. ఇలాంటి అపూర్వ విషయాలు.. పరిశోధనాత్మక వ్యాసాలుగా ఈ పుస్తకంలో కొలువు దీరాయి. భాషాభిమానులకు ఇదో కరదీపిక.  

- ఎర్రాప్రగడ రామమూర్తి

అభ్యుద‌య భావ‌కాంతులు

ప్రచురణ: సాహిత్య అకాడమి; పుటలు: 131; వెల: రూ.50; ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాదు - 500004, 040 29703142

అభ్యుద‌య భావ‌కాంతులు

సురవరం, దాశరథి, కాళోజీ, దేవులపల్లి, కప్పగంతుల, వానమామలై లాంటి వారంతా యుక్త వయసులోనే నవ భావాలతో కలంపట్టారు. ఇరవయ్యో శతాబ్దం మొదటి, రెండు దశకాల్లో జన్మించిన వీరు జాతీయోద్యమం, అప్పటి తెలంగాణ దుస్థితి తదితరాలకు స్పందించి తమ ఆలోచనలకు అక్షరాకృతి  ఇచ్చారు. పద్య, గేయ రూపాల్లో అభ్యుదయ కాంతులను ప్రసరింపజేశారు. సుప్రసిద్ధ తెలంగాణ కవులు తమ యవ్వన ప్రాయంలో రాసిన రచనల సంకలనాన్ని ప్రత్యూష పేరిట 1950లో ‘సాధన సమితి’  వెలువరించింది. నేటి యువ రచయితలకు  స్ఫూర్తిని కలిగించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. నాటి మేటి కవుల సామాజిక చింతనకు ఈ పొత్తం నిలువుటద్దం. 28 మంది సుప్రసిద్ధ కవులు, రచయితల రచనలతో పాటు వారి జీవనరేఖలను సంక్షిప్తంగా పొందుపరచి పుస్తకానికి మరింత శోభను చేకూర్చారు. 

- దాస్యం సేనాధిపతి

ఆధ్యాత్మిక ప్రసంగ సుధ

తెలుగుసేత: మద్దూరి/ కస్తూరి రాజ్యశ్రీ; పుటలు: 304; వెల: Rs200; ప్రతులకు: కె.వి.రాఘవరావు, సి-804, అపర్ణ సైబర్‌జోన్, నల్లగండ్ల, హైదరాబాదు-19, 98490 92368

ఆధ్యాత్మిక ప్రసంగ సుధ

ఆధ్యాత్మిక భూమి భారతదేశంలో పూర్వాచార్యుల సిద్ధాంతాల్ని కరతలామలకం చేసిన గురువులెందరో ఉద్భవించారు. వారిలో పరమార్థానంద ఒకరు. ఆయన ప్రసంగాల సమాహారమే వేదాంత జీవన విధానం. దేవుడున్నాడా? పార్థన ఎలా చెయ్యాలి? సన్యాసమంటే ఏంటి? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం తదితరాల గురించి వివరిస్తూ, నమక చమక మంత్రాల పరమార్థాన్ని బోధిస్తూ అనువాదం అనిపించకుండా చక్కటి తెలుగులో సాగుతుందిది.

- ఎస్‌.సీతాలక్ష్మి

అనుభూతుల ఆవిష్కరణ

రచయిత్రి: సి.ఉమాదేవి; పుటలు: 176; వెల: Rs120; ప్రతులకు: జ్యోతి వలబోజు, హైదరాబాదు, 80963 10140; ప్రముఖ పుస్తక కేంద్రాలు

అనుభూతుల ఆవిష్కరణ

కథ, నవల, పద్యం, కవిత, వ్యాసం వంటి ప్రక్రియలు ఉమాదేవి సమీక్షామాలికలో చక్కగా ఒదిగిపోయాయి. భక్తి ప్రబోధ కాల్ని, విప్లవ సాహిత్యాన్నీ ఒకే అనురక్తితో సమీక్షించారు. తాను చదివిన పుస్తకాల్లోని రసాత్మక అనుభూతుల్ని పాఠకులతో పంచుకునే ప్రయత్నం చేశారు. అరవై అయిదు గ్రంథాల ఈ సమీక్షా కదంబంలో ఆయా రచయితల, రచనల విలువను, అంతరాత్మనూ ఆవిష్కరించి చదువరుల ముందుంచడానికి చేసిన కృషి అభినందనీయం.

- అనిసెట్టి శాయికుమార్‌

అమ్మ భాష కోసం...

సంపాదకుడు: అడపా రామకృష్ణ; పుటలు: 42; వెల: Rs50; ప్రతులకు: అడపా రామకృష్ణ, డోర్‌నెం. 43-21-21, వి.ఆర్‌.నగర్, దొండపర్తి, విశాఖపట్నం - 530016, 95052 69091

అమ్మ భాష కోసం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యలో అమ్మభాషను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, మాతృభాషా మాధ్యమాన్ని సమర్థిస్తూ ప్రముఖులు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు, ప్రసార మాధ్యమాల్లో చేసిన ప్రతిపాదనల్ని తెలుగు విలాపంగా తెచ్చారు అడపా రామకృష్ణ. ఇందులో కవితలున్నాయి. సంపాదకీయ వ్యాసాలున్నాయి. భాషాభివృద్ధికి చేసిన సూత్రీకరణలు, నిర్వచనాలున్నాయి. అమ్మ భాష ప్రాముఖ్యాన్ని బలంగా వినిపించే పొత్తమిది.

- స్రవంతి

మమకారపు మాల

రచయిత: డా. తాళ్ళపల్లి యాకమ్మ, పుటలు: 115: వెల: Rs100: ప్రతులకు: సోమారపు వీరస్వామి, ఇం.నం. 1-6-64, నర్సంపేట్‌ రోడ్, గుమ్మునూరు, మహబూబాబాద్‌- 506 101, 98499 63491

మమకారపు మాల

అనుబంధాల పరిమళాల చుట్టూ అల్లుకున్న భావోద్వేగాల కలయికే ఈ 11 కథల సంపుటి. మల్లెపూలంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేని కూతురికి, నాన్న ఇచ్చిన కానుకే పదిలమైంది. గురువుల ప్రోద్బలంతో విద్యార్థి ఎంత ఎత్తుకు ఎదగొచ్చో మరో కథ వివరిస్తుంది. వివాహిత సీత తనకు ఎదురైన కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొని స్ఫూరిగా నిలుస్తుంది. ఇలా ఇందులోని కథలన్నీ మనసు వీణను మీటేవే.

- రాజ్యలక్ష్మి

‘గురు’తరమైన బాధ్యత

రచయిత్రి: శీలా సుభద్రాదేవి; పుటలు: 164; వెల: Rs150; ప్రతులకు: రచయిత్రి, 217, నారాయణాద్రి, ఎస్‌.వి.ఆర్‌.ఎస్‌. బృందావనం, సరూర్‌నగర్, హైదరాబాదు 500035. 81068 83099

‘గురు’తరమైన బాధ్యత

‘ఇస్కూలు కతలు’ పేరు చూడగానే ఏముంటాయ్‌ దీనిలో పిల్లల కథలేగా అనిపిస్తుంది. కానీ లోతైన అంశాలను గుదిగుచ్చిన పుస్తకమిది. ఒక ఉపాధ్యాయిని జీవితంలోని సంఘటనలు, ఒడుదొడుకుల్ని కథలుగా మలిచారు. టీచర్లంటే కేవలం పాఠాలు చెప్పడం, మార్కులు వెయ్యడమే కాకుండా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎలా ఉండాలో ఈ కథల్లోని అరుంధతి టీచర్‌ని చూస్తే తెలుస్తుంది. విలువలతో కూడిన విద్య ఆవశ్యకతను చెప్పే పొత్తమిది.

- నాగమణి

మానవీయ కోణాలు

రచయిత్రి: వురిమళ్ల సునంద (భోగోజు), పుటలు: 232; వెల: Rs150; ప్రతులకు: భోగోజు ఉపేందర్‌రావు, ఇ నెం. 11-10-694/5, బురహాన్‌పురం, ఖమ్మం  ఫోన్‌ 9441815722

మానవీయ  కోణాలు

పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలే ఇతివృత్తా లుగా వచ్చిన కథా సంపుటి బహు‘మతులు’. ఇందులోని 21 కథల్లో మానవీయ కోణాల్ని రచయిత్రి సున్నితంగా ఆవిష్కరించారు. ‘బహుమతి’ కథలో గురు శిష్యుల అనుబంధం మనసుని తాకుతుంది. బాబాలు చేసే మోసాలు, దేవుడి పేరుతో జరిగే అన్యాయాల్ని వివరించే కథ ‘పూనకం’. ఆయా పోటీల్లో గెలుపొందిన, వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథలతో వచ్చిన పొత్తమిది.

- దీప్తి

జీవితానుభవ అక్షర తోరణాలు

రచయిత్రి: డా।। మద్దాళి ఉషాగాయత్రి; పుటలు: 25+166; వెల: Rs100; ప్రతులకు: రచయిత్రి, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాదు-13, 99890 41777

జీవితానుభవ  అక్షర తోరణాలు

డా।। మద్దాళి ఉషాగాయత్రి వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగిని ప్రవృత్తి రీత్యా సంగీతం, సాహిత్యం, నృత్యం ముప్పేటలుగా అల్లుకున్న కథా రచయిత్రి. ఈమె రచించిన 18 కథలతో వచ్చిన పొత్తమే కడదాకా కలిసి. ఈ కథలన్నిటిలో అనుబంధాల్ని, జీవితానుభవాల్ని చక్కగా తెలియజెప్పారు. ఈ సంపుటిని ఏకబిగిన చదివితే కలిగే ఆనందం కార్తీక పౌర్ణమినాటి జ్వాలాతోరణం అన్న కె.వి.రమణాచారి మాటలు అక్షరసత్యం.

- సునంద

bal bharatam