నాటి చలం ఉత్తరాలు

సంపాదకులు: డా।। కె.అరుణజ్యోతి; పుటలు:102; వెల: Rs135; ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు, హైదరాబాదు, 90521 16579

నాటి చలం ఉత్తరాలు

చలం... స్త్రీ స్వేచ్ఛకోసం కలంతో, జీవితంతో యుద్ధం చేసిన వ్యక్తి. 60 ఏళ్ల తర్వాత మళ్లీ చలాన్ని మరికొంత చదివే అవకాశం కలిగింది. కామేశ్వరికి 1957-60ల మధ్యకాలంలో చలం రాసిన ఉత్తరాలివి. డా।। కె.అరుణజ్యోతి సంపాదకత్వంలో ‘చలం నాన్న లేఖలు’గా వచ్చాయి. సమాజం, సౌందర్య దృష్టి, స్త్రీ స్వేచ్ఛ, ఆనందం... వీటన్నింటి సమాహారం ఈ లేఖలు.
      ఓల్గా, మృణాళిని, వాడ్రేవు వీరలక్ష్మి, శివలక్ష్మి రాసిన ముందు మాటలు ఉత్తరాల్లోని చలం భావాలను మరింత లోతుగా అర్థం చేసుకోడానికి ఉపయోగపడతాయి. పుస్తకం చివర కామేశ్వరి.. చలంతో ఏర్పడిన పరిచయాన్ని, అనుబంధాన్ని వారి కుటుంబంతో ఆనందంగా గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. సెల్‌ఫోన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఉత్తరాల్లోని మమకారాన్ని, అక్షరాల్లోని అనురాగాన్ని చలం భావాల తాత్వికతను ఈ పుస్తకం పట్టి చూపిస్తుంది.

- అల్లూరి రవీంద్రబాబు

ఎన్నో ప్రతిఫలనాలు

రచయిత: ఎం.ఎస్‌.నాయుడు; పుటలు:182; వెల:Rs120; ప్రతులకు: వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాదు, 90005 28717

ఎన్నో ప్రతిఫలనాలు

అద్దం ఎప్పుడూ వాస్తవాన్ని చెప్పదు, అందం చూపిస్తుంది, అది శాశ్వతం కాదని ఆ రోజు సెలవియ్యదు. కాలానుగుణంగా గ్రహించాలంతే... గాలి అద్దం కవితా సంపుటి అలాంటిదే. ఇందులో ఎన్నో అద్దాల ప్రతిఫలనాలు. మనమెలా తలాడిస్తూ అద్దాలలోకి చూపులతో నెట్టబడతామో, అలాగే కొన్ని మనలోనికీ ప్రయాణిస్తాయి. మార్మికత, అధివాస్తవికత కలగలిసిన శిల్పం రచయితది. ‘అదృష్టం’ కవితలో ‘‘పూలలోని సోమరి పువ్వొకటి/సముద్రస్నానానికి సిద్ధమైంది/అలలన్నీ రమ్మంటున్నా/ కాలిరేకును కూడా కదపలేదు పువ్వు/తీరానికి కోపమొచ్చి/పూలనేలను నీళ్లలోకి తోసింది/సముద్రం సిగ్గుపడుతోంది అలల్తో/సోమరి అలొకటి/పువ్వుతో లేచిపోయింది’’ అంటారు. ఈ ప్రతీకల్లో ఎవరికే రంగులు కనిపించినా జీవితం ప్రతిఫలించినట్టే. రసాస్వాదనకు చెందిన విషయమిది.

- సతీష్‌

జేబులో పట్టే జోకుల పొత్తం

రచయిత: ‘హాస్యబ్రహ్మ’ శంకరనారాయణ; పుటలు:108; వెల:Rs36; ప్రతులకు: ఎస్‌.ఆర్‌.బుక్‌లింక్స్, విజయవాడ, 94919 6275

జేబులో పట్టే జోకుల పొత్తం

ఉరుకుల పరుగుల జీవితంలో కితకితలెప్పుడో మరిచిపోయామని బాధపడేవాళ్లు ఎక్కువైపోయారు. ఎవరైనా జోకేస్తే నవ్వాలని గుర్తుపెట్టుకుని బతికేవాళ్లూ ఉన్నారు. చతురోక్తుల కోసం చకోరాల్లా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటివాళ్ల కోసమే ఈ శంకరాలు తోసుకువచ్చారు రచయిత శంకరనారాయణ. ఈ పుస్తకాన్ని నగరంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు జేబులోంచి తీసి చదివేయొచ్చు. ‘ప్రేమ గుడ్డివాణ్ని చేస్తుంది.. పెళ్లి కుంటివాణ్ని చేస్తుంది..’ లాంటి చెణుకులు పాఠకుణ్ని కుదిపాక ప్రేమ, పెళ్లి రెండూ మగాణ్ని మూగాణ్ని చేస్తాయని ఎందుకు చెప్పలేదబ్బా అని ఆలోచిస్తాడు. ఈ పుస్తకంలో పొట్టచెక్కలయ్యే చతుర్లున్నాయి, పెరట్లోకెళ్లి మూతిబిగించుకు నవ్వాల్సిన పటాకీలూ ఉన్నాయి. భాషాశ్లేషలకు నవ్వీనవ్వీ శోషొచ్చిపడినా ఆశ్చర్యంలేదు. అందుకేనేమో చివరిపుట సంఖ్య 108.

- అనంతానంద

మరో రెండువేల ఏళ్ల తర్వాత...

రచయిత: డా. చిత్తర్వు మధు; పుటలు:204; వెల:Rs140; ప్రతులకు: సాయివెంకటరమణ బుక్‌ డిస్ట్రిబ్యూటర్స్, హైదరాబాదు, 96767 99500

మరో రెండువేల ఏళ్ల తర్వాత...

తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ రాయగలిగినవారు తక్కువమంది ఉండటమో, రాసినా అచ్చు వేసే వాళ్లు లేకపోవడమో... కారణమేదైనాగానీ మన దగ్గర ఈ తరహా నవలలు చాలా తక్కువ. రాస్తే మాత్రం కచ్చితంగా ఆదరణ లభిస్తుందని చిత్తర్వు మధు ఇంతకుముందే నిరూపించారు. బైబైపొలోనియా, ఎపిడెమిక్‌ ధారావాహికలతో పాఠకులకు ఆయన పరిచితుడే. అంగారక గ్రహ యాత్ర నేపథ్యంలో సాగే ఆయన ‘కుజుడికోసం’ నవల కూడా అందర్నీ ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా ‘నీలి ఆకుపచ్చ’ నవలను తెచ్చారు. కథాకాలం నాలుగో సహస్రాబ్ది (అంటే క్రీ.శ 4వేల సంవత్సరం తర్వాత). అత్యాధునిక రోబోలు, యుద్ధాల నేపథ్యంలో దేశాల మధ్య విభజన జరిగిపోయి భూమి కేవలం జోన్లుగా మిగలడం, ఆదేశమివ్వగానే వాహనాలు నడవడం లాంటి ఊహలు ఆసక్తికరం. సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో ఉండాల్సిన బిగిని రచయిత చివరిదాకా అలాగే కొనసాగించారు.

- ముఖర్జీ

చైతన్య ప్రవాహాలు

సంకలనం: డా।। యం. జయరాం, కలం ప్రహ్లాద్‌; పుటలు:80; వెల:Rs80; ప్రతులకు: కలం ప్రహ్లాద్, ఆదోని, కర్నూలు జిల్లా, 99853 55456

చైతన్య ప్రవాహాలు

అ.ర.సం కర్నూలు జిల్లాశాఖ వెలువరించిన కవితా సంకలనమే ‘కర్నూలు కవిత’.  వర్తమాన భారతీయ సమాజం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ, ఉగ్రవాదం, కార్పొరేట్‌ విద్య, పర్యావరణం, అవినీతి, స్వచ్ఛభారత్‌.. వంటి అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించి 75మంది కవులు తమ కలాలకు పదునుపెట్టారు. ‘‘నిర్ల్లిప్తత, నిష్క్రియత సుడుల తాకిడి తట్టుకొని/ఉత్సాహం, నిరంతర క్రియాశీలతలో ఉత్తేజులు కండి/ ప్రజాహితం ధ్యేయంగా కొత్తపుంతల అన్వేషణకు పరితపించండి’’ అంటూ యువతకు పిలుపునిస్తుందో కవిత. గాడితప్పిన రాజకీయాల్ని ఎత్తిచూపే కవితలూ ఇందులో ఉన్నాయి. మరికొన్ని దోపిడీమీద దండెత్తాయి. శ్రమశక్తిని కీర్తించాయి. సామాజిక చైతన్యం కలిగించే కవితలకు ఇందులో లోటులేదు.  

- గీతా శ్రీనివాస్‌

కొనలు సాగే కొసర్లు

రచయిత: యశస్వి; పుటలు: 178; వెల: Rs120, ప్రతులకు: రచయిత, హైదరాబాదు shriyasaswi@gmail.com

కొనలు సాగే కొసర్లు

అచ్చంపు పచ్చదనాల అంచులు కుచ్చిళ్లు పోయాలని... మువ్వంపు పువ్వుల చిరునవ్వు, తళుకు, చురుకు, ఠీవి, తావి నావే కావాలని... విరిసే మనసు కొసలు రసరమ్యంగా తోడుకోవాలనుకునే భావకులను, ఆత్మీయతా ప్రేమికులను అలరించే కవితా సంపుటి ఇది. అమ్మప్రేమ, కన్నబిడ్డతో అనుబంధం, నేస్తాలతో ముచ్చట్లు, సహచరుల వీడ్కోలు, అమ్మలాంటి అక్క, చిన్న నాటి జ్ఞాపకాలు... ఇలా కొన్ని స్వీయానుభూతులు... బాంబు పేలుళ్లు, ప్రకృతి విలయాలు, పుష్కరాల్లో తొక్కిలాటలు, నలిగిపోతున్న పసిమొగ్గలు, మారణహోమాలు, జనహననాలు... కొన్ని సామాజికాంశాలు... ఒకటేమిటి నీలాకాశం కింద జరిగే సమస్తాల గురించి, వివిధ సముచితాల మీదా, అనుచితాల మీదా, వైపరీత్యాల మీదా స్పందనల గుచ్ఛం ఇది. కొన్ని సున్నితంగా, కొన్ని హాస్యంగా, మరికొన్ని లాలనగా, ఇంకొన్ని వేదనగా...!

- కృష్ణ బోసు

దిగంబర కవులు... మళ్లీ

ప్రచురణ: సాహితీ మిత్రులు (93929 71359); పుటలు:290;వెల:Rs200; ప్రతులకు: నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు

దిగంబర కవులు... మళ్లీ

ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘దిగంబర కవిత్వం’ ఒక సంచలనం. 1955- 1964 మధ్య సాహిత్యంలో ఉన్న స్తబ్దత, దృక్పథ రాహిత్యాన్ని చీల్చుకుంటూ గొంతు విప్పారీ దిగంబరులు! నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న... ఇదీ కవుల వరస. అన్ని రంగాల్లోనూ కాలుష్యం అలుముకోవడం ప్రారంభమైన కాలం అది. దాన్ని ప్రశ్నించాల్సిన సాహిత్యం ప్రభావవంతమైన పాత్ర పోషించని దుస్థితి. వీటన్నింటినీ ఎండగడుతూ వచ్చిందే దిగంబర కవిత్వం. ఒకానొక దశలో ఈ కవిత్వం ఒక వాదంగా, ఉద్యమంగా బలపడింది. ఎందరో కొత్త కవులకు ఊపిరులూదింది. మూడు దిగంబర కవితా సంకలనాలు కలిసి ఒకే సంపుటిగా నాలుగు దశాబ్దాల కిందట ప్రచురితం అయింది. తర్వాత ఇదిగో మళ్లీ ఇప్పుడే. కవిత్వం అంటే ఏమిటో, కవి అంతరంగ వేదన ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకునే కొత్త తరాలు చదవాల్సిన కవిత్వమిది.

- హర్షిత్‌.జె

సమాజమే ఇతివృత్తం

రచయిత్రి: సి.ఉమాదేవి: పుటలు: 187: వెల: Rs120: ప్రతులకు: జ్యోతి వలబోజు, హైదరాబాదు, 80963 10140; ప్రముఖ పుస్తక కేంద్రాలు

సమాజమే ఇతివృత్తం

సమస్యలు లేని ఇల్లు ఉండదు. పరిష్కారం కాని సమస్య ఉండదు. కేవలం సమస్యలనే ఏకరువు పెడితే ఇల్లు కళ తప్పుతుందని ‘అద్దం’ కథలో చక్కగా వివరిస్తారు రచయిత్రి. జీవితానుభవాలను మించిన ‘బతుకు పాఠాలు’ ఏముంటాయని మరో కథలో చెబుతూ ఆలోచింపజేస్తారు. మొత్తం 24 సి.ఉమాదేవి కథలు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథల సంపుటం ఇది. సామాజిక పోకడల్ని విభిన్న కోణాల్లో చిత్రించే ఈ కథలన్నీ ఆసాంతం చదివిస్తాయి.

 - మండవ దీప్తి

పువ్వాడ సాహితీ మధురిమ

సంకలనం: పువ్వాడ తిక్కన సోమయాజి: పుటలు: 360: వెల: Rs250: ప్రతులకు: సంకలనకర్త, నెం.97, ఎల్‌ఐసీ కాలనీ, విజయవాడ-520008

పువ్వాడ సాహితీ మధురిమ

కవి పాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం అనే ఈ పేరు చూడగానే ఇది సిద్ధాంత వ్యాసమేమోననిపిస్తుంది. కానీ, అనేక సిద్ధాంత గ్రంథాలయ్యే విషయాలు దీన్లో ఉన్నాయి. ఈ గ్రంథం మొదటి భాగంలో పువ్వాడ శేషగిరిరావు వ్యక్తిత్వం, కవిత్వాల మీద వ్యాసాలు, పద్య ప్రశంసలు న్నాయి. రెండో భాగంలో పువ్వాడ స్వీయ వ్యాసాలు, కవితలు; మూడో భాగంలో కుటుంబసభ్యుల అనుబంధం కనిపిస్తాయి. మొదటి రెండు భాగాల్లోని విషయాలు జిజ్ఞాసువులకు ఆసక్తి కలిగిస్తాయి.

- కాశ్వీ

bal bharatam