అచ్చ తెలుగులో వేద సారం

వేదవాణి: సీడీ వెల: రూ.100; సీడీలకు: యం.వి.నర్సింహారెడ్డి; 98491 10922

అచ్చ తెలుగులో వేద సారం

వేదాలు భారతీయ వాఙ్మయానికి మూలం. ఇవి ప్రపంచ సాహిత్యంలోనే అతి ప్రాచీనమైనవి. వేదం ‘విద్‌’ ధాతువు నుంచి ఆవిర్భవించింది. విద్‌ అంటే తెలుసుకోదగింది. ప్రతి ఒక్కరూ వేదాల సారాన్ని గ్రహించాలి. భారతీయ జీవన విధానం శ్రుతుల్లో చెప్పిన దానిని అనుసరించి సాగుతుంది. ప్రపంచంలో మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి అని చెప్పిన వేదాలను మహర్షులు ఎంతో ప్రయత్నంతో దర్శించారు. అందుకే వారు మంత్ర ద్రష్టలే కానీ, కర్తలు కారు. అవి పరమాత్మనుంచి వెలువడ్డ దివ్య వాక్కులు. తెలుగులో వేదాలకు అనువాదాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ కొన్నీ మామూలు పాఠకులకు కొరుకుడుపడవు. అందుకే యం.వి.నర్సింహారెడ్డి నాలుగు వేదాలను సరళ తెలుగు వచనంలోకి అనువదించారు. వాటి సారాంశాన్నే సీడీగా తీసుకొచ్చారు. ఇందులో ప్రతీ వేదానికి పరిచయం, వాటి సారాంశాన్ని కాట్రగడ్డ లక్ష్మీనరసింహారావు స్పష్టంగా చదివి వినిపించారు. 

- చింతలపల్లి

వివక్ష పూరించిన సమర శంఖం

రచయిత: డా।। బద్దిపూడి జయరావు; పుటలు: 112; వెల: Rs75; ప్రతులకు: రచయిత, విస్సన్నపేట, కృష్ణా జిల్లా, 99490 65296

వివక్ష పూరించిన సమర శంఖం

సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాల కష్టాలు, కడగండ్లనే కాకుండా వాళ్ల ధిక్కార స్వరాన్ని పదునైన కలంతో అక్షరీకరించారు కవి బద్దిపూడి జయరావు. తన పూర్వీకులు దరువుల మీదో, చెరువుల దగ్గరో, కరవుల కాలంలోనో కవిత్వమై కలవరించి ఉంటారని నమ్మిన జయరావు... కొత్త నెత్తురు కవితా సంపుటిలో తన వర్గం ఎదుర్కొన్న అణచివేతనే కాకుండా, నవతరం భవిష్యత్‌ కార్యాచరణను కూడా ప్రకటించారు. ‘పిడికెడు బువ్వకోసం పొద్దున పిండి ఎన్నెల దండెం మీదేసినోళ్లం... సుజల సుఫల గీతాలకు దూరంగా నిత్యం కళేబరాల మధ్య నెత్తుటి గాలి పీల్చుకుంటూ ఎదిగినోళ్లం’. అలాగని కవితలన్నీ కష్టాలు కడగండ్లకే పరిమితం కాదు. అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని నీలిమేఘాలు కవితలో కళ్లకు కట్టారు. వాకపల్లి, లక్షింపేట ఘటనలకు స్పందనగా అక్షర బాణాలు సంధించారు. అంబేద్కరిజాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించారు కవి.

 - గరిడేపల్లి సత్యనారాయణ

ఈ కథనం... గీతాసారం

రచయిత్రి: డా।। కె.వి.కృష్ణకుమారి; పుటలు: 256; వెల: Rs100; ప్రతులకు: సాహితి ప్రచురణలు, సూర్యారావుపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌.

ఈ కథనం... గీతాసారం

భగవద్గీతకు ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ ఆ బోధలే ఆధారంగా వచ్చిన చక్కటి నవల ‘కర్మయోగి’. ఇంతటి క్లిష్టమైన ప్రక్రియను చిన్న వయసులోనే సాధించిన రచయిత్రి అభినందనీయులు. కథలోని ఇతివృత్తం రచయిత్రి కుటుంబానిదే. అందులో పాత్రల స్వభావాలకి అనుగుణంగానే చిన్నచిన్న మార్పులను చేయడంతో, పఠనాసక్తిని ఇనుమడిస్తుంది. రచయిత్రి పెదతాత రామకృష్ణయ్య జీవితంతో మొదలవుతుంది కథనం. ఆయన అణువణువూ కృష్ణభక్తితో నిండిన స్థితప్రజ్ఞుడు. ఆ భక్తిని ఆరాధిస్తూ అనుసరించే తమ్ముడు కృష్ణారావు. కృష్ణభక్తిలో మునిగితేలుతున్న అన్నదమ్ములని ఐహికానికి మరల్చాలని ప్రయత్నించే తల్లి తులసమ్మ. వీరందరి మధ్యా జరిగే జగన్నాటకమే ‘కర్మయోగి’. 45 ఏళ్ల క్రితం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ కథనం ఇప్పుడు నవలా రూపంలో ముద్రణ పొందింది. గీతలో చెప్పిన కర్మయోగానికి, కథా భాష్యంగా నిలిచింది.

- సూర్య

నవ్వు పుట్టించే కథలు

సంకలనకర్తలు: వియోగి, ఏవిఎం, రమేశ్, కృష్ణమూర్తి; పుటలు: 480; వెల: Rs200; ప్రతులకు: టి.కె.విశాలాక్షిదేవి, కర్నూలు, 99639 26610
 

నవ్వు పుట్టించే కథలు

తిరుమలశ్రీ, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, వేదగిరి రాంబాబు, రమణశ్రీ వంటి 56 మంది రచయితల హాస్య కథల సంపుటి ‘హాస్యకథ-2011’. ఇందులోని కథలన్నీ పలు పత్రికల్లో ప్రచురితమైనవే. ‘సీతారాముడి హోటల్లో సినేమా’, బొబ్బట్ల బ్రహ్మానందం, మంత్రిగారి సమాధి, ప్రయాణంలో పదనిసలు,...’ వంటివి విభిన్న అంశాలతో పాఠకులకు గిలిగింతలు పెడతాయి. ‘బామ్మగారి పిజ్జా’లో పట్టణంలో ఉంటున్న మనవలకు పిజ్జా తయారుచేసి పెట్టాలన్న మామ్మ గారి కోరిక, అందుకు ఆమె పడే కష్టాలూ, మినప రొట్టెనే పిజ్జా అనుకుని లాగించిన పిల్లల చేష్టలు కడుపుబ్బ నవ్విస్తాయి. అలానే ‘కోటిలింగం’లో బాసు, భామల అనుగ్రహాల కోసం బాసుకోటి, భామకోటి రాసే లింగం పాత్ర అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రతీ కథా నవ్వుల పువ్వులను పూయిస్తుంది. అక్కడక్కడ ఏవిఎం కార్టూన్లు చక్కిలిగింతలు పెడుతుంటాయి.

- వీరబాబు బెహరా 

చిరస్మరణీయం

సేకరణ - వివరణ: కొంపెల్ల రామకృష్ణమూర్తి; వెల: Rs30; పుటలు: 50; ప్రతులకు: టాగూరు పబ్లిషింగ్‌ హౌస్‌; హైదరాబాదు, 2756830

చిరస్మరణీయం

ధర్మమే జయిస్తుంది, అధర్మం కాదు. సత్యం జయిస్తుంది, అసత్యం కాదు. క్షమ జయిస్తుంది, క్రోధం కాదు. విష్ణువు జయిస్తాడు, రాక్షసుడు కాదు. ఇలాంటి నిత్యసత్యాలను ప్రతిబింబించే యాభై శ్లోకాలను సేకరించి వాటికి అర్థాలు, విశ్లేషణలతో ‘స్మరణీయ సందేశాలు’గా అందించారు కొంపెల్ల రామకృష్ణమూర్తి.
      కావ్యామృత రసాన్ని ఆస్వాదించడం, సజ్జన సాంగత్యం అనేవి రెండూ సంసారమనే విషవృక్షానికి అమృతతుల్య మైన ఫలాలు. మానవ వికాసానికీ, లక్ష్యాలకు దోహదపడే సందేశాత్మక సంస్కృత శ్లోకాలను పురాతన ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి సంగ్రహించి వాటికి తనదైన శైలిలో ఉపమానాలు జోడించి అన్ని తరాలవారికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు రచయిత. 

- ఆకుల ఉమాకర్‌

జ్ఞానయజ్ఞం

రచయిత: వి.శ్రీరామరెడ్డి; పుటలు: 119; వెల: Rs80; ప్రతులకు: రచయిత, ఓబుళరెడ్డిపల్లి, కడప, 80083 72218

జ్ఞానయజ్ఞం

సత్యం, ధర్మం, భక్తి, విశ్వాసాలు మహద్భాగ్యంగా స్వీకరించి ఆచరిస్తే మానవజన్మకు సార్థకత చేకూరుతుంది. ఆకాశవాణి శ్రోతలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన తన వ్యాసాలను, కొన్ని సందేశాత్మక రచనలను కలిపి ‘జ్ఞానసుధ’గా తీసుకొచ్చారు ఎ.శ్రీరామరెడ్డి. ద్రవ్యయజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్ఠమైంది. ధర్మార్థ కామ మోక్షాలను ప్రతిబింబించే ఇతివృత్తాలను ఎన్నుకొని, వేదోపనిషత్తుల సారాన్నీ, మహాత్ముల మాటలను, వేమన, సుమతి శతకాల పద్యాలను సందర్భోచితంగా ఉపయోగించి భావవ్యక్తీకరణ చేశారు. నేటి సమాజంలో మనిషి సుఖశాంతులతో జీవించడానికి అవసరమైన విషయాలను సులభశైలిలో వివరించారు. 54 లఘువ్యాసాల కావ్యం బుధజనులతో పాటు సామాన్యులనూ ఆకట్టుకుంటుంది.  

- ఉమాకర్‌

రసవత్ప్రబంధాలు

కవి: డా।। తిరుమల కృష్ణదేశికాచార్యులు; పుటలు: 374; వెల: Rs.250; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాదు; 98487 87284

రసవత్ప్రబంధాలు

అనుపమ మార్దవ హృద్యము
లనిల చలత్కేసరములు నగు పూసురటుల్‌
గొని వనవిహరణ సంశ్రమ
మును దొలగించెను దరిసెనముల్‌ రసికులకున్‌

      సరళ సుందరమైన శబ్దశబలత, సుకుమారమైన భావనా సౌందర్యం కలిగిన వసంతరుతు వర్ణనా సంబంధియైన ఈ పద్యం చదవగానే ప్రాచీన ప్రబంధాలు స్ఫురణకు రావడం సహజం. కానీ అత్యంత ఆధునిక కవి, అందులోనూ విదేశంలో ఉంటున్న డా।। తిరుమల కృష్ణదేశికాచార్యుల ‘మహాశిల్పి జక్కన’ కావ్యంలోనిదీ పద్యం. ఆచార్యులు రాసిన ‘మహాశిల్పి జక్కన’, ‘హనుమప్ప నాయకుడు’ అనే రెండు పద్య కావ్యాలను కలిపి ‘కావ్యనందనం’ పేర వెలువరించారు. 
      ఈ రెండూ కూడా చారిత్రక కథా వస్తువులే కానీ, ఆచార్యుల కలంలో అవి అద్భుత పద్య ప్రబంధాలుగా జాలువారాయి. ఇష్టదేవతా ప్రార్థన, సుకవి స్తుతి, ఆశ్వాసాంత పద్యాలు... ఇలా ప్రాచీన పద్యకావ్య సంప్రదాయంలో ఈ గ్రంథాలున్నాయి. అంతమాత్రమే కాదు, నన్నయ మొదలు ప్రాచీన కవులందరి పోకడలు ఈ కావ్యాల్లో కనిపిస్తాయి. మూలకథలను స్వకపోల కల్పనాశక్తితో మార్పులు చేసి కథాకావ్యాలుగా మలిచారు. 
      ‘మహాశిల్పి జక్కన’ ఆరు ఉల్లాసాల ప్రబంధం కాగా, ‘హనుమప్ప నాయకుడు’ ఆరు ఆశ్వాసాల పద్య గ్రంథం. రమణీయార్థ ప్రతిపాదకములైన సంస్కృత భాషా సమాస బాహుళ్యమే కాక అచ్చతెలుగు పదాలను అలతి అలతిగా నవ్యరీతుల్లో ప్రయోగించడంలో ఆచార్యులు అగ్రగణ్యులు. కథాకథన శిల్పం కరతలామలకమైనందువల్ల వీరి వర్ణనలు, కల్పనలు కథాగతికి పోషకములే కానీ ఎక్కడా అవరోధాలు కాజాలవు. ‘వర్ణనా నిపుణః కవిః’ అన్న సూక్తి ఈ కవి విషయంలో సార్థకం.
      జక్కన కథ ప్రసిద్ధమే కాని, చారిత్రక ఆధారాలు ఇదమిత్థంగా కానరావు. కథలు, కావ్యాలు, చలనచిత్రాలు ఉన్నప్పటికీ, వాటికి భిన్నంగా రసనిస్తులంగా కథలో అవసరమైన మార్పులు చేసి కావ్యాన్ని రచించారు. విద్యార్థి దశలో చదివిన సురవరం ప్రతాపరెడ్డి రాసిన వీరగాథ హనుమప్ప నాయకుని చరితను వీరరస ప్రధానమైన పద్యకావ్యంగా రూపొందించారు. ఈ రెండు కావ్యాల్లోనూ అనేక నూతన ఛందోరీతులను ప్రయోగంలోకి తెచ్చారు ఆచార్యులు. కొన్ని ఛందస్సుల పేర్లే చిత్రంగా ఉన్నాయి. ‘డయానా, నయాగరా, మార్గరీటా, ఓల్గా’ ఇత్యాది ఛందస్సుల లక్షణాలను కూడా ఆయనే స్వయంగా గ్రంథాల్లో తెలిపారు. ఈ ఛందస్సుల నామౌచితిని కూడా పేర్కొని ఉండాల్సింది. 

- చారి

దళిత స్త్రీ ఆత్మగౌరవ పోరాటం

రచయిత్రి: డా।। ఎం.ఎం.వినోదిని; పుటలు: 32; వెల:Rs 50; ప్రతులకు: రచయిత్రి, ఎర్రముక్కలపల్లి, కడప, 94404 56087.

దళిత స్త్రీ ఆత్మగౌరవ పోరాటం

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ ప్రచురించిన ‘స్టేజింగ్‌ రెసిస్టాన్స్‌’ నాటకానికి అనువాదమే ఈ ‘దాహం’. దళిత స్త్రీ ఆత్మగౌరవ పోరాటం ఇందులో ప్రధాన ఇతివృత్తం. కొన్నాళ్ల క్రితం వరకూ... ఇంకా చెప్పాలంటే... ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని మారుమూల పల్లెల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకు ఈ నాటకం అద్దంపడుతుంది. నాటకమంతా ఒక ఊళ్లో దళితవాడ సమీపంలో ఉన్న తాగునీటి బావి నేపథ్యంగా సాగుతుంది. తామే తవ్వుకున్న ఊరబావి దగ్గర గొంతెండిపోతున్నా గుక్కెడు నీళ్లు తాగేందుకు అగ్రకులాల దయకోసం పడిగాపులు పడాల్సిన దైన్యాన్ని ఈ నాటకం కళ్లకు కడుతుంది. సహనం నశించిన ఓ దళిత మహిళ చూపిన తెగువ... ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అగ్రకులాల కుట్రలకు వ్యతిరేకంగా దళితులు ఎలా పోరాడారన్నది ఆసక్తికరంగా సాగుతుంది. కేవలం ఐదు సన్నివేశాలు మాత్రమే ఉన్న ఈ చిన్న నాటకంలో రచయిత్రి దళితవాడల్లోని భాష, యాసను ప్రతిభావంతంగా చిత్రీకరించారు.

- సత్యనారాయణ

‘రజనీగంధ’లో కవిత్వమంతా సుగంధమే

రచయిత: పాపినేని శివశంకర్‌; పుటలు: 100; వెల:Rs75; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు; 85008 84400

‘రజనీగంధ’లో కవిత్వమంతా సుగంధమే

సాహిత్యంతో పరిచయమున్న వాళ్లందరికీ పాపినేని శివశంకర్‌ సుపరిచితులే. ఆయన కలం నుంచి వచ్చిన పదో పుస్తకమే ‘రజనీ గంధ’. 2005-13 మధ్య పలు పత్రికల్లో అచ్చయిన వాటితోపాటు మరో యాభై కవితలున్నాయి ఈ పుస్తకంలో. అక్కడక్కడా కొన్ని కవితలు తేలిగ్గా కనిపించినా చాలా వరకు బలీయమైనవే. ప్రతీ కవితలో శిల్పంతో పాటు భావసంపద సమృద్ధిగా కనిపిస్తుంది. శబ్దాల డమడమలు లేకుండా అచ్చమైన వచన కవిత్వంలా రాయడం ఈయన ప్రత్యేకత. కనుక ప్రతి కవితా ఎదురుగా కూచుని మాట్లాడుతున్నటుంటుంది. ‘జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ! దాన్ని పరిమళ భరితం చేసుకొమ్మని చెప్పానంటాడు’ ఓ కవితలో. మరో చోట ‘మరణం లేని ఇంటి నుంచి గుప్పెడు ఆవాలు తేలేనట్టు, ఏదీ పోగొట్టుకోని వాణ్ని నువ్వె ప్పటికీ చూడలేవంటాడు’. ఇలాంటి కవితాత్మక వాక్యాల సుగంధ పరిమళమే ఈ ‘రజనీగంధ’.    

- కె.ఎల్‌.కాంతం

bal bharatam