వినూత్న కథాకదంబం

ప్రచురణ: పాలపిట్ట బుక్స్‌: పుటలు: 352: వెల: Rs150: ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాదు-36, 98487 87284

వినూత్న కథాకదంబం

వర్తమాన తెలుగు కథనరీతులను ప్రతిఫలించే పాలపిట్ట వినూత్న కథా సంకలనమిది. ఇందులో వంశీకృష్ణ, విహారి, శిరంశెట్టి కాంతారావు, వసంతరావు దేశ్‌పాండే, చింతపట్ల సుదర్శన్, ఆకెళ్ల రవిప్రకాశ్‌ తదితర ప్రసిద్ధ కథకులతోపాటు ఇతర కథకులవి మొత్తం 48 కథలున్నాయి. వంశీకృష్ణ ‘ఎదురైన దృశ్యం’ కథలో తన అనుకున్న వ్యక్తి కోసం 30 సంవత్సరాల తర్వాత పరిగెడితే, ఆ ఆశ ఎండమావి లాంటిదని తేలుతుంది. ‘సంగెం ఒక చెలిమి ఊట’ కథ.. మన జీవితం మనది కాదు.. జీవన ప్రయాణంలో కొన్ని అనుభూతులు వెలుగుదారులు.. మనల్ని గుర్తుపెట్టుకుని వచ్చినవారికి మన ఆదరణ ఆప్యాయతలు చెలిమిఊటల్లా నిలుస్తాయని చెబుతుంది. ఈ కథాసంకలనం నిజంగా ‘వినూత్నమే’. అనుభూతి పరంగా అన్ని కథలూ నవచేతనతో వచ్చాయి. మంచి కథలను చదివామన్న తృప్తిని పాఠకులకు కచ్చితంగా అందిస్తాయి.

- డా।। టి.శ్రీరంగస్వామి

కడప మండల సాహిత్యం

ప్రచురణ: సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం: పుటలు: 15+618: వెల: 400: ప్రతులకు: యోగి వేమన విశ్వవిద్యాలయం, 1-1254, సి.పి.బ్రౌన్‌ రోడ్డు, యర్రముక్కపల్లె, కడప, 08562 255517

కడప మండల సాహిత్యం

తెలుగు సాహిత్య చరిత్ర రచనకు గణనీయంగా దోహదం చేసే గ్రంథమిది. నెలనెలా మన జిల్లా సాహిత్యం పేరిట జరిగిన కార్యక్రమంలోంచి వచ్చిన ఈ పొత్తంలో కడప జిల్లా సాహితీవేత్తల మీద 86 వ్యాసాలున్నాయి. ప్రాచీన ఆధునిక కాలాల్లోని వివిధ ప్రక్రియలకు చెందిన వ్యక్తుల్నీ, శక్తుల్నీ దర్శించడానికి ఇదో తోవదివ్వె. ఈ వ్యాసాల్లో చక్కటి అంచనా, అరుదైన సమాచారం, లోతైన విశ్లేషణ, అనుభూతి ప్రధానమైన భావప్రకటన కనిపిస్తాయి. ‘కడప జిల్లా కథానిక తొలిదశ’ వ్యాసం.. రాయలసీమ కథ 1926లోనే ‘మతభేదం’తో ప్రారంభమైందని తెలుపుతుంది. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ‘భారత కథానిధి’లో తొలితరం సీమకథలు వచ్చాయని చెబుతుంది. ఇలా మరికొన్ని నూతన అంశాలు వివిధ వ్యాసాల్లో శ్రమైకసాధ్యాలుగా వచ్చాయి. కడప మండల సాహిత్య వైవిధ్యాలకు ఇదో అఖండ జ్యోతిర్దర్శనం. 

- సన్నిధానం నరసింహశర్మ 

మంత్రముగ్ధం చేసే కథాగమనం

రచయిత: దగ్గుమాటి పద్మాకర్, పుటలు: 160: వెల: Rs200: ప్రతులకు: రచయిత, సిక్కోలు బుక్‌ ట్రస్ట్, శ్రీకాకుళం - 532001, 99892 65444

మంత్రముగ్ధం చేసే కథాగమనం

ఒక కోటీశ్వరుడు తీవ్ర ఆందోళనకు లోనవుతాడు. టైటానిక్‌ లాంటి నౌకకు కాగితపు పడవ అడ్డొచ్చిందంటూ తన బాధను మిత్రుడైన మానసిక వైద్యుడితో పంచు కుంటాడు. అది వ్యాపారంలో పోటీ కాదు, బంధుమిత్రులతో కలహం కాదు. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చర్యకు ఆ ధనవంతుడు ఉక్కిరి బిక్కిరవడమే ‘యూటర్న్‌’ కథ. కథ నడిచిన తీరుకు మంత్రముగ్ధులవుతారు పాఠకులు. కథాగమ నాన్ని విమానంతో పోల్చవచ్చు. మొదట రన్‌వే మీద సాగి, ఆకాశంలో విహరించి ఆనక గమ్యం చేరినట్లు దగ్గుమాటి పద్మాకర్‌ కథలు చక్కటి ఎత్తుగడ, నడక, ముగింపు లతో అలరిస్తాయి. ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ కథలో సహోద్యోగులైన రవిబాబు, లలితలు ఓ తరుణంలో శారీరకంగా దగ్గరవుతారు. పర్యవసానాలను రచయిత స్పష్టంచేయరు. ఇలాంటి భావజాలం నచ్చని వారు సైతం  కథాకథనాలను మాత్రం వ్యతిరేకించలేరు. ఇందులోని 17 కథలూ ఆలోచింపచేసేవే. 

  - వి.నాగరత్న

ఆనాటి సంస్థాన చరిత్ర

రచయిత: ఆచార్య బిరుదురాజు రామరాజు: పుటలు: 76: వెల: Rs40: ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాదు, 040 29703142

ఆనాటి  సంస్థాన చరిత్ర

తెలుగు జానపద సాహిత్యం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  మొట్టమొదటి పరిశోధన బిరుదురాజు రామరాజు చేశారు. ఆయన సేకరించిన చారిత్రక కథాగేయం సదాశివరెడ్డి కథ. దీని ఆధారంగా తెలుగు వీరుడు పేరిట ఆయనే ఓ నవల రాశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నిరుడు దీన్ని పునర్ముద్రించింది. బిరుదురాజు రామరాజు ఈ నవలను సరళ తెలంగాణ పదబంధాలతో, సహజ వర్ణనలతో తీర్చి దిద్దారు. పుటల దృష్ట్యా రచన చిన్నదైనా, ఓ సమగ్ర చరిత్ర వ్యక్తమవుతుంది. సంస్థాన పాలనలోని ఎత్తులు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇందులో విరివిగా కనపడతాయి. కొంతమంది దృష్టిలో వేట అంటే క్రూరజంతువులను చంపడం కాదు.. స్వార్థం కోసం మనుషులను వేటాడటమని అర్థవుమతుంది. రచయిత ఈ నవలలో వందల సామెతలను ప్రయోగించారు. దాంతో రచన అల్ప పదాల్లో అనల్పార్థాలతో ఆసక్తికరంగా కొనసాగింది. 

- ఎలగందుల సత్యనారాయణ

‘దీప తోరణం’

రచయిత్రి: కన్నెగంటి అనసూయ; పుటలు: 177; వెల:Rs 120; ప్రతులకు: రచయిత్రి, హైదరాబాదు, 92465 41249

‘దీప తోరణం’

బంధాలు, అనుబంధాలు, మానవీయ విలువలు, సామాజిక స్పృహ, జీవన సత్యాల సమాహారంగా పాఠకుల మనసును హత్తుకునే 15 కథల సంపుటం దీప తోరణం. పిల్లలకు లభించే అదనపు సౌకర్యాలు, ఏకాంతం, ఇచ్చే ‘అతి’ స్వేచ్ఛ, సెల్‌ఫోన్ల సంస్కృతి ఎలాంటి అనర్థాలకు దారితీసే అవకాశముందో ‘జీవితాల్ని శాసించేవి’ కథలో రచయిత్రి స్పష్టం చేశారు. అంటరానితనం పేరిట దూరంపెట్టిన వర్గంలోని వ్యక్తే.. ఆపత్సమయంలో రక్తదాతగా నిలిచి ప్రాణం పోసిన తీరు ‘ఏది మురికి..? ఎవరు మురికి?’ కథలో సమసమాజ ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ‘ఎప్పటికీ సజీవంగా’, ‘ఆ చల్లని నీడలో’ తదితర కథలు దేనికదే ప్రత్యేకం. చక్కని శిల్పం, ఆకట్టుకునే కథన శైలి, కొసమెరుపులు అనేక కథల్లో కనిపిస్తాయి.

- సాయిచిరంజీవి

బహుముఖ ప్రజ్ఞాశాలి

పుటలు: 188; వెల: Rs100; ప్రతులకు: వోలేటి పార్వతీశం, హైదరాబాదు, 040 27643692, కిన్నెర పబ్లికేషన్స్‌ 98660 57777

బహుముఖ ప్రజ్ఞాశాలి

‘‘మృదుమధురమైన కంఠస్వరం, స్పష్టమైన వాచికం. ప్రసన్నమైన హావభావ వ్యక్తీకరణ... గల వ్యక్తి వోలేటి పార్వతీశం’’ అని ఆయన సృజనాత్మక ప్రతిభను కొనియాడుతూ ఓ కవి చేసిన వ్యాఖ్యలివి. రేడియో, దూరదర్శన్‌లతో అనుబంధం ఉన్నవారికి పార్వతీశాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పద్యాల తోరణం, మహాకవులకు నీరాజనం, అవధానం, ఆణిముత్యాలు తదితర ప్రసారాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను మొట్టమొదట ప్రసారం చేసి దూరదర్శన్‌కి ప్రత్యేకతను సంపాదించిపెట్టారు. పార్వతీశం పదవీ విరమణ వేళ... తనతోటి ఉద్యోగులు, కవులు, పండితులు, ప్రముఖులు దాదాపు 80 మంది వరకూ ఆయనను అక్షర అక్షతలతో ఆశీస్సులందించారు. అదే ఈ ‘వాగ్విలాసం’.  పార్వతీశం బహుముఖీన ప్రతిభకు ఇది అద్దం.

- పార్థు

త్రిభాషా కావ్యం

రచయిత: అంబటిపూడి వెంకటరత్నం; పుటలు: 197; వెల:Rs100; ప్రతులకు: ఎ.వి.సుబ్రహ్మణ్యశాస్త్రి, చందానగర్, రంగారెడ్డి, 99498 49583

త్రిభాషా కావ్యం

అంబటిపూడి వెంకటరత్నం భావకవితా యుగం నాటి కవి. ఆరోజుల్లో ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం-  మూడు భాషల్లోనూ కావ్యం వెలయించారు. ఆయన బహుభాషా పాండిత్యానికి ఈ చంద్రశాల నిలువుటద్దం. ఇందులో కథ కేవలం కల్పితం. సమకాలీన సమస్యను తీసుకుని, దానికి తనదైన పరిష్కారాన్ని సూచించారు. బాల్యస్నేహితుణ్ని ప్రేమించి, అనుకోని పరిస్థితుల్లో ఆ అబ్బాయి చనిపోతే ఆ అమ్మాయి పెద్దలమాట మన్నించి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. కానీ, వరుణ్ని తాకొద్దంటుంది. అతడు ‘సరే, అంటూ నువ్వు అడిగేవరకు ముట్టుకోనులెమ్మని’ ముసుగు తన్నేస్తాడు. తర్వాత అభిప్రాయాలు గ్రహించి కొంతకాలానికి ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ కావ్యం దుఃఖంతో మొదలై సుఖాంతమవుతుంది. ఆధ్యాత్మిక భావసంపదను అందిస్తూ, భారతీయ దాంపత్య ధర్మానికి భంగం కలగకుండా సాగుతుంది.

- చింతలపూడి వేంకటేశ్వర్లు

తెలుగుతల్లికి వ్యాసమాలిక

సంకలనం: వి.ఎస్‌.రాఘవాచారి; పుటలు: 504;వెల: Rs500; ప్రతులకు: సంకలనకర్త, లక్ష్మీపురం, తిరుపతి, 99088 37451

తెలుగుతల్లికి వ్యాసమాలిక

దశాబ్దంపాటు నాటకరంగానికి అక్షరసేవలు అందించింది కళాదీపిక మాసపత్రిక. కారణాంతరాలతో రెండేళ్ల కిందట ఆగిపోయింది. అయితే, ఆ పదేళ్లలో నాటకరంగం మీద ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలను అందించింది. సాహిత్య, పరిశోధనాత్మక వ్యాసాలనూ ప్రచురించింది. వాటన్నింటిలోంచి 110 మేలిమి వ్యాసాలను ఏర్చికూర్చి ‘కళాదీపిక’ సంకలనంగా తెచ్చారు వి.ఎస్‌.రాఘవాచారి. ‘తెలుగు నాటకం భాషా ప్రయోగాలు’ నుంచి ‘మాతృభాషకు మరణశాసనం’ వరకూ భాషాసాహిత్యాలు, కళలకు సంబంధించి సవిస్తార వ్యాసాలు ఇందులో ఉన్నాయి. రచయితలందరూ చెయ్యితిరిగిన వారే కావడంతో ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. సంప్రదింపు గ్రంథంగానూ ఉపయోగపడే అరుదైన పొత్తమిది.

- కేశజ్ఞ

పర్యాటకులకు దిక్సూచి

రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్‌; పుటలు: 256; వెల: 250; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్, హైదరాబాదు; 040 24224458/59

పర్యాటకులకు దిక్సూచి

ఏనుగుల వీరస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’తో తెలుగులో యాత్రారచనలు మొదలయ్యాయి. తర్వాతా కొన్ని వచ్చాయి. కానీ వాటి సంఖ్య, సమగ్రత తక్కువే అయినా సుదూరప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇవి ఉపయోగపడతాయి. పర్యటనకు వెళ్లే ముందు ఏయే అంశాలను అధ్యయనం చెయ్యాలి, ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలన్న విషయాల్లో దిక్సూచిగా నిలుస్తుంది ముత్తేవి రవీంద్రనాథ్‌ రాసిన ఈ ‘మా కేరళయాత్ర’. ఇందులో తమ కేరళయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. అనంత పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్, అట్టుకల్‌ జలపాతం, పెరియార్‌ అభయారణ్యం వంటి ప్రదేశాల గురించి వివరించిన తీరు బాగుంది. అలానే అక్కడి చరిత్ర, సంస్కృతీవైభవం, ఆచార వ్యవహారాలు, జీవన స్థితిగతుల గురించి విపులంగా రాశారు.    

- శాంతి

bal bharatam