పరాశక్తే పరబ్రహ్మ

రచయిత: డా।। క్రోవి పార్థసారథి; పుటలు: 38+693; వెల:Rs468; ప్రతులకు: రచయిత, 23-11/1-10/2, ఓగిరాలవీధి, సత్యనారాయణ పురం, విజయవాడ-11, 9866820574
 

పరాశక్తే పరబ్రహ్మ

మానవుడు నియమబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో, తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలో వివరిస్తాయి వేద వ్యాసుడి బ్రహ్మసూత్రాలు. వీటికి ప్రపంచ సాహిత్యంలో ఉన్నత స్థానం ఉంది. అదేకోవలో శ్రీవిద్యోపాసన విధానంలో బ్రహ్మసూత్రాలకు భాష్య రచన చేశారు పార్థసారథి. దేవీభాగవతం, లలితా సహస్రం, సుభగోదయ స్తుతి, సౌందర్యలహరి తదితరాల ఆధారంగా పరాశక్తే పరబ్రహ్మ అని ఈ గ్రంథంలో నిరూపించారు. పూర్తిగా అద్వైత సిద్ధాంతాన్నిప్రతిపాదిస్తూ రచన సాగింది. అయినప్పటికీ ద్వైత సిద్ధాంత విషయాలను అవసరమైనచోట్ల ప్రస్తావించటం, ఆయా సందర్భాల్లో ఉపనిషత్తుల కథల్ని కూడా చేర్చటంతో పాఠకులకు మరింత స్పష్టమైన అవగాహన కలుగుతుంది.

- డా।। రామకృష్ణ
 

హాస్యనవలా ‘కంఠాభరణం’

రచయిత: పానుగంటి లక్ష్మీనరసింహారావు; పుటలు: 144; వెల: Rs85; విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు, నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాదు

హాస్యనవలా ‘కంఠాభరణం’

ఆంధ్ర షేక్‌స్పియర్‌గా పేరొందిన పానుగంటి రాసిన హాస్యనాటకం కంఠాభరణం. ఈ నాటకం వెలువడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి దాన్ని పునర్ముద్రించింది. నూరేళ్లయినా వన్నె తరగని నాటకమిది. దీన్ని ఆస్వాదించాలంటే మాత్రం చదువరులకు నాటి తెలుగు సమాజం స్థితిగతుల గురించి కొంతైనా అవగాహన ఉండాలి. సామాజిక దురాచారాల్ని ఎండగట్టడంలో పానుగంటి శైలి అనితరసాధ్యం.
హాస్యరసాన్ని పండించటంలోను ఆయన ఈ శైలినే కొనసాగించారు. మరీ ముఖ్యంగా సర్కస్‌ చూడటానికి వెళ్తానని భార్య అడిగినప్పుడు సోమావధాని చెప్పే మాటలు కడుపుబ్బా నవ్విస్తాయి.          

- గొడవర్తి శ్రీనివాసు
 

విజ్ఞాన ధారలు

రచయిత: ముక్తవరం పార్థసారథి; పుటలు: 254; వెల: Rs200; ప్రతులకు: మిసిమి ప్రచురణలు, కళాజ్యోతి ప్రాసెస్‌ ప్రై.లి., 1-1-60/5, ముషీరా బాదు, హైదరాబాదు-20, 99495 16567
 

విజ్ఞాన ధారలు

మూడు విభిన్న అంశాలకు చెందిన రచనల సమాహారం ఈ మిసిమి వ్యాసాలు. రచయిత పత్రికావ్యాసాలకు ఇది పుస్తక రూపం. ఇందులోని జర్మన్‌ రచయిత ఆర్థర్‌ షోపెన్‌హావర్‌ రచనల సందేశం సాహిత్యపరమైనదైతే, జన్యువుల పరిచయం వైజ్ఞానిక దృష్టికోణంలో చాలా ముఖ్యమైంది. తెలుగులో దీనికి సంబంధించిన సమాచారం పెద్దగా లేదు.ఆ లోటును తీరుస్తూ జనరంజక శైలిలో జన్యువుల లోతుపాతులను వివరించారు రచయిత. అలాగే, ప్రపంచ చరిత్రలో అతికీలక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన వారి కథనాలను మరో భాగంగా అందించారు. సోక్రటీస్‌ మరణం, బోస్టన్‌ టీపార్టీ.. ఇలా ఆయా కథనాలను చదువుతుంటే ఆ ఘటనలన్నీ కళ్ల ముందు నిలుస్తాయి.    

- సత్యభారతి
 

ఉతికి ఆరేసిన సాకిరేవు కతలు

రచయిత: మూరిశెట్టి గోవింద్‌; పుటలు: 128; వెల: Rs120; ప్రతులకు: పూదోట శౌరీలు, 1-2-740, రాకాసిపేట, బోధన్‌ -503180 నిజామాబాద్‌ జిల్లా, 90101 53505

ఉతికి ఆరేసిన సాకిరేవు కతలు

సాకిరేవు కతలు పుస్తకంలోని 20 కథల్లో ప్రతిదీ దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్నా అన్నీ కలిసి ముత్యాలదండలా అమరిపోయాయి. పల్లె జీవితాలను ఉన్నదున్నట్టు రాయడం అంత సులభం కాదు. అయితే, రచయితలో ఈ ప్రతిభ పుష్కలం. గ్రామాల్లో కనిపించే కుల వ్యత్యాసాలు, భేదభావాలను ఎత్తిచూపుతూనే, వరసలు పెట్టి పిలుచుకునే ఆత్మీయతను బాగా వివరించారు. ముఖ్యంగా ఓ కులాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కులానికీ గ్రామానికి మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి చెబుతూ ఎవరినీ నొప్పించని శైలిలో కథల్ని ఆసక్తిగా చదివింపజేస్తారు. ‘కంబాలమిట్ట సాకిరేవు, పల్లెబతుకు సిన్నదయింది’ లాంటి కథలన్నీ మెప్పించేవే.      

- కన్నోజు లక్ష్మీకాంతం

చిన్నారుల కోసం...

రచయిత: కల్లూరు రాఘవేంద్రరావు; పుటలు: 96; వెల: Rs80; ప్రతులకు: రచయిత, 26-4-982, త్యాగరాజనగర్‌, హిందూపురం-515201, 94932 71620

చిన్నారుల కోసం...

ఆరోగ్య సూత్రాలైనా, విజ్ఞానదాయక విషయాలన్నా మాటల్లో చెబితే పిల్లలు వినకపోవచ్చు. కానీ ఈ చిలకల తోట పుస్తకంలోని గేయాల్లా చెబితే తప్పకుండా వింటారు. ఇందులోని గేయాలన్నీ విజ్ఞానపు వీచికలే. ‘‘గురువు జ్ఞానమూర్తిరా / గురువు జ్ఞాన జ్యోతిరా’’ అంటూ గురువు గురించి హితబోధ చేస్తుంది ‘జ్ఞానమూర్తి’ గేయం. ‘‘లెక్కలంటే నీకు అంత కష్టమా!/ ఒక్కసారి మనసు పెట్టి నేర్వుమా!/ తొలగి తీరేనులే మనసు మురిసేనులే..’’ అంటూ గణితం మీద భయాన్ని పోగొడుతుంది ఇంకో గేయం. ‘ఆరోగ్య సూత్రాలు, నదుల పుట్టుక, కొలమానాలు’ మొదలైన గేయాలన్నీ జ్ఞానాన్ని అందిస్తాయి. ‘బుద్ధి నేర్చిన మనిషి’ లాంటి గేయకథలు నీతిని ప్రబోధిస్తాయి.      

- శాంతి

జీవితానికి వేసిన కొత్త పోస్టర్‌

కవి: మోహన్‌ రుషి (83417 25452); పుటలు: 100; వెల: Rs120;  ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాదు

జీవితానికి వేసిన కొత్త పోస్టర్‌

తెలుగు కవిత్వంలో మూసధోరణులను బద్దలు కొట్టుకొచ్చే సందర్భాలు వేళ్ల మీద లెక్కెట్టొచ్చు, శ్రీశ్రీ, పఠాభి, మో, ఇస్మాయిల్‌ వీరి వెంట మన అవగాహనను బట్టి ఇలా కొన్ని పేర్లనూ ఉట్టంకించవచ్చు. వరుస చివర్న మోహన్‌ రుషిని విస్మరించ లేం. ‘జీరోడిగ్రీ’తో మొదలు పెట్టిన ఒరవడి ఉరకలెత్తి స్క్వేర్‌ వన్‌గా ముందు కొచ్చింది. వివిధ సందర్భాలను మృదువుగా కవిత్వం చేయడమే మోహన్‌ రుషిత్వం. మర్యాదరామన్నలా నటించే లోకానికి ఈ రాతలు వాతల్లాంటివి. తెరదించిన ఉక్రోషం లోకహితానికే ఉపయోగించడం సాహిత్యలక్ష్యంగా వాడుక భాషలో వ్యంగ్య కవిత్వం రాస్తున్నారీయన. పుటుక్కున విరుగుతున్న బంధాల చప్పుళ్లని తను వింటూ, మన హృదయాలకు చేరేస్తున్నారు!    

- యశస్వి
 

అభ్యుదయ కవితా పతాకం

కవి: శిఖామణి; పుటలు: 16+107; వెల: Rs120; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి, పాలపిట్ట బుక్‌హౌస్‌లు హైదరాబాదు, నవోదయ పబ్లిషర్స్‌ విజయవాడ

అభ్యుదయ  కవితా పతాకం

ఒక మాట చెప్పి వెళ్లు! కవితాసంపుటి చదువరికి తన్మయత్వం కలిగిస్తుంది. శిఖామణి తన కవిత్వాను భవం ‘‘చుబుకాన్ని చుంబిస్తున్న తల్లి తన్మయత్వపు వివశంలా ఉండాలి!’’ అంటారు. తనకు తాను ‘‘బీజాక్షరమై మళ్లీ ఒకసారి కొత్తగా మొదలవ్వాలి’’ అని కోరుకుంటారు. ఈ పుస్తకం పేరే శీర్షికగా అందించిన కవిత చదివాక, కవి ఎవరి పక్షమో ఇట్టే తెలిసిపోతుంది. అభాగ్యులను తయారుచేస్తున్న ఆక్టోపస్‌ లాంటి వ్యవస్థకు ఆయన వ్యతిరేకమని అర్థమవుతుంది. నిజమైన అభ్యుదయం కోరుకునే మనుషులకు అలా సాంత్వన, ధైర్యం, విశ్వాసం కలుగుతాయి. తాము ఒంటరివాళ్లం కాదు అనే స్పృహ గొప్ప ఉచ్ఛ్వాసమై గుండె పొంగుతుంది. కరడుగట్టిన సమాజంలోని సున్నిత మనసులకు కవి ప్రధాన ప్రతినిధిలా అనిపిస్తారు. మామూలు మాటల్లో కవితాత్మని పొదిగి సజీవ సౌందర్యాన్ని నింపుతారు. ‘‘నాలుగు కాళ్ల పశువును పూజించండి/ కానీ రెండు కాళ్ల మనిషిని కూడా ప్రేమించండి’’ లాంటి పంక్తులతో వర్తమానావర్త ప్రాప్తకాలజ్ఞ రాజకీయపు చీకటి కోణాలు అర్థమైపోతాయి. ఈ కవితలను చదువుతుంటే కళ్లూ, మనసూ అశ్రుపూరితాలవుతాయి.    

 - నడిమింటి
 

సలపరించే సీమ గాయాలు

సంపాదకత్వం: డా।।అప్పిరెడ్డి హరినాథరెడ్డి; పుటలు: 112; వెల: Rs50; ప్రతులకు: కోనాపురం ఈశ్వరయ్య, 1/244, మడకశిర రోడ్డు, ఆల్విన్‌ కాలనీ, పెనుకొండ, అనంతపురం - 515110, 73866 23864
 

సలపరించే  సీమ గాయాలు

నీళ్లే బతుకు, నీళ్లే మెతుకు, నీళ్లే నాగరికత. నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లయినా తాగి బతకమన్నాడు ఓ కవి. రాయలసీమ నీటికరువు.. ఎడారిసేద్యం చేసే రైతు.. సాగునీరు, తాగునీరూ లేక భవిష్యతులో మానవ మనుగడ సాగించలేని భయానక స్థితి పొంచివున్న నేపథ్యంలో ‘రాయలసీమ సాంస్కృతిక వేదిక’గా పెగిలిన గొంతులివి. తడి ఆరిన సీమ గొంతుకలివి. ‘‘నా పల్లె జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తోంది’’ అన్న రాఘవేంద్ర, కన్నీటి సీమకు ఒయాసిస్సుల్ని వాగ్దానం చేస్తున్న రాజకీయ నేతల మోసాన్ని నిలదీసిన రాధేయ, నీళ్లకోసం ఉద్యమించి తీరాలన్న గంగరాజు, సీమ పౌరుషం ఉద్యమస్వరమై గర్జించాలన్న తవ్వా ఓబుళరెడ్డి, రేపటి రాష్ట్ర ఎజెండాలన్నీ సీమ సమస్యలే అంటున్న ఖలందర్‌, సీమహక్కుల కోసం తెలివితో తెగబడాలని పిలుపునిస్తున్న జూ।। చంద్రహాస... ఇలా, ఒకరా ఇద్దరా 43 మంది కవులు తడియారిన సీమగొంతులై, క్షతగాత్రులై ఇందులో కవితాగానం చేశారు. ‘సీమ దాహం తీర్చే కవుల ప్రయత్నం’ అంటూ డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి రాసిన ముందుమాట సీమ ఉద్యమ తీవ్రతకు హెచ్చరికగా ఉంది.               

 - డా।। రాధేయ
 

మమతల మణిదీపికలు.. ఈ కథలు

రచయిత: ఎస్‌.వి.రంగారావు; పుటలు: 90; వెల: Rs150; ప్రతులకు: కథా ప్రపంచం, ఇస్కాన్‌ దేవాలయం ఎదురుగా, కేటీ రోడ్‌ తిరుపతి, 95535 18568

మమతల మణిదీపికలు.. ఈ కథలు

నటుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఎస్వీ రంగారావు రచయితగా చాలా తక్కువమందికి తెలుసు. ప్రభావవంతమైన కథలు రాసి సాహితీలోకానికి అందించారాయన. స్వాతంత్య్రనంతర కాలపు సామాజిక పరిస్థితులు, వైరుధ్యాలు, భావోద్వేగాలను తన కథల్లో బలంగా చిత్రించారు. వాటన్నింటినీ సేకరించి ఎస్‌.వి.రంగారావు కథలు పుస్తకంగా ‘కథా ప్రపంచం’ వెలువరించింది. ఈ కథలన్నీ సంస్కరణాత్మక ఆలోచనలకు అద్దంపట్టేవి. జీవితప్రయాణంలో ఆకస్మికంగా ఎదురయ్యే సంఘటనలూ... వ్యక్తుల పరిచయాలూ... ఆ ప్రభావాలూ మనిషిని ఎంతగా దహించి వేస్తాయో ‘సంక్రాంతికి సంక్రాంతికి’ కథ తెలియజేస్తుంది. ‘అగస్టు-8,’ ‘విడుదల’ లాంటి కథలు ఆ కాలపు యుద్ధపరిస్థితులకూ... ప్రజల దైన్యతకు అద్దం పడతాయి. సామాజిక కట్టుబాట్లు దాంపత్యసుఖాలను బంధించేంత బలంగా ఉండకూడదని చెప్పే ‘పసుపు- కుంకుమ’ కథ రచయిత భావాలను పట్టిచ్చేది మాత్రమే కాదు సామాజిక రుగ్మతలను ఎత్తిచూపేది కూడా. ఇవి చిన్నకథలే అయినా చిక్కని భావస్ఫురణ కలిగినవి. బతుకులోని మాధుర్యాన్ని చవిచూపించేవి.    

 - మనోహర్‌
 

bal bharatam