సాహితీ నిధుల హృదయ దర్శనాలు

రచయిత: డా।। ద్వానాశాస్త్రి; పుటలు: 16+287; వెల: Rs250; ప్రతులకు: నీలకమల్‌ పబ్లికేషన్స్‌, సుల్తాన్‌బజార్‌ రోడ్డు, హైదరాబాదు 

సాహితీ నిధుల హృదయ దర్శనాలు

వ్యక్తి పూజలకన్నా శక్తి పూజలు అవసరం. తెలంగాణ సాహిత్యశక్తుల పూజాగానం చేసిందీ తెలంగాణ సాహిత్య రత్నాల వీణ. 110 శీర్షికల్లో ఏడుగురు ప్రాచీన కవులు, 103 ఆధునిక రచయితల గ్రంథ, వ్యక్తిత్వ ప్రతిభా పాండిత్యాలు, ప్రశంసలూ ఇందులో ఉన్నాయి. నవతర, యువతర ప్రాతినిధ్య సాన్నిధ్యాలు న్నాయి. ఈ పొత్తం ద్వారా తెలంగాణ సాహిత్య గృహప్రవేశానికి ద్వారాలంకరణలు చేశారు ద్వానాశాస్త్రి. తెలుగుజాతి గర్వించదగ్గ కవులు అందెశ్రీ, గోరటి వెంకన్న తదితరుల రత్నప్రభలను నైపుణ్యవంతంగా చెప్పారు. గద్దర్‌, లోకేశ్వర్‌ లాంటి వారి గురించి తెలుసుకోదగ్గ అంశాలూ ఉన్నాయి. ‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణ ఆత్మగౌరవ పతాకగా అనిపిస్తుంది. కవుల, సాహితీవేత్తల, వివిధ రచయితల గురించి రాసిన ఈ గ్రంథంలో ఆ సంచిక గురించి రాయడం ఓ బాధామయ చరిత్రాంశకు గుర్తింపు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఈ పుస్తకం తొలిపుట విప్పుటలోనే డా।।కె.వి.రమణాచారి అన్నట్లు ‘సరైన సమయంలో వచ్చిన సరైన పుస్తకం’.

 - నంధాన్నిస

వ్యథార్థ జీవితాలు

రచయిత: డా।। దిలావర్‌; పుటలు: 198; వెల:Rs100; ప్రతులకు: ఎం.డి.అక్బర్‌, సిల్‌ క్యాంపస్‌, పాల్వంచ, ఖమ్మం 

వ్యథార్థ జీవితాలు

రైతు కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్‌ దిలావర్‌ ఆ వర్గం జీవితాలనే కాదు అట్టడుగు వర్గాల బతుకు వెతలనూ తన కథల్లో సృజించారు. అలాంటి కథల సంపుటే ఈ ‘చంద్రుడు గియ్యని బొమ్మలు’. ‘మరో శాకుంతలం, తీజ్‌’ కథల్లో దగా పడిన లంబాడీ స్త్రీలను పరిచయం చేస్తారు. ‘శవాలు కాస్తున్న చెట్టు, ఉరితాళ్లు, నగ్నసత్యం’ కథలు మరణాన్ని ఆశ్రయించే దిగులు పడిన జీవితాలను హృదయ విదారకంగా చిత్రిస్తాయి. ‘అమ్మా నన్ను చంపేసేయ్‌’లో గర్భస్థ శిశువు ఆక్రోశం, ‘ఎడారి బతుకులు’ కథలో ప్రవాసంలో పేదవాడి వేదన కనిపిస్తాయి. ‘నీ పెద్దోడొచ్చిండమ్మ..’ కథలో మరణశయ్య మీద ఉన్న తల్లి జ్ఞాపకాలను కథకుడు నెమరు వేసుకుంటాడు. జీవితంలో నుంచి వచ్చిన ఈ కథలన్నీ మనల్ని ఓ కొత్త లోకంలోకి తీసికెళ్లి ఆలోచనలో పడేస్తాయి.  

 - పార్థసారథి

కట్టెలు కొట్టి..గేదెలు అమ్మి...

20

కట్టెలు కొట్టి..గేదెలు అమ్మి...

టీ అమ్మే కుర్రాడు..

కామన్వెల్త్‌లో సత్తా చాటిన తెలంగాణ కుర్రాడు హుసాముద్దీన్‌.. . పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ బాక్సర్‌.. ఒకప్పుడు టీలు కూడా అమ్మాడు. అతని నాన్న షంషుద్దీన్‌ కూడా బాక్సరే. అయితే బాక్సర్‌గా కెరీర్‌ కొనసాగించలేక కుటుంబం కోసం టీస్టాల్‌ నడిపేవాడు. హుసాముద్దీన్‌ తండ్రికి సాయంగా ఉంటూ టీలు అమ్మేవాడు. ఆరుగురు అన్నదమ్ములున్న ఆ కుటుంబంలో అందరూ బాక్సర్లే కావడం విశేషం. ఒకవైపు టీ అమ్ముతూ.. చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి సాయంగా ఉంటూనే హుసాముద్దీన్‌.. అతని సోదరులు తండ్రి దగ్గర బాక్సింగ్‌లో కోచింగ్‌ తీసుకునేవాళ్లు. హుసాముద్దీన్‌ బాక్సింగ్‌లో వేగంగా ఎదిగాడు. 2009 జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సత్తా చాటిన అతను.. జాతీయ సీనియర్‌ టోర్నీలోనూ స్వర్ణంతో మెరిశాడు. 2012 టామెర్‌ కప్‌, 2014లో చైనా ఓపెన్‌, 2015 ప్రపంచ మిలటరీ క్రీడల్లో పతకాలతో సత్తా చాటాడు.

ఓ ‘మానవి’ స్వప్నం


రచయిత: చంద్రలత; పుటలు: 110; వెల:Rs125; ప్రతులకు: ప్రభవ పబ్లికేషన్స్‌, పొగతోట, నెల్లూరు, 0861 2333767; అన్ని పుస్తక కేంద్రాల్లో

ఓ ‘మానవి’ స్వప్నం

సంప్రదాయం, భయం, వెనుకబాటు తనం నీడల్లో పెరిగి ఓ అమాయకపు ఆడపిల్ల ‘నీల’ జీవితమే ఈ వాళ్లు... వీళ్లు... పారిజాతాలు నవల. నిశ్శబ్ద హింస ధ్వనిలో... సామూహిక విషాదంలో గాయాలపాలైన ఓ మానవి కథ ఇది. నిశితంగా పరిశీలిస్తే ‘కల్పన’గా అనిపించినా, వాస్తవ దృశ్యాలనే ప్రతిబింబిస్తుందీ రచన. రెండు విభిన్న పార్శ్వాల మధ్య ‘నీలు’ జీవితాన్ని చిత్రిస్తారు రచయిత్రి చంద్రలత. మొదటిది కుంచించుకుపోతున్న అభద్రతా జీవితం. రెండోది విశాలమవుతున్న సరికొత్త ప్రపంచంలో నీలు జీవితం. ఈ వస్తువును గతంలో అందరు రచయితలూ తీసుకున్నా, చంద్రలత మాత్రం ఓ ప్రత్యేక విశ్లేషణతో ఆసక్తిగా కొనసాగించారు. పాఠకులు ఎక్కడా అలసట, విసుగూ చెందరు. ఈ నవల్లో రచయిత్రి అక్కడక్కడా చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యానాలు కవితాత్మకంగా సాగుతూ పాఠకులను మెప్పిస్తాయి.  

- డా।। రాధేయ 

 

కృష్ణాతీర పత్రికలు... చారిత్రక సందర్భాలు

రచయిత: కప్పగంతు రామకృష్ణ; పుటలు: 354; వెల; Rs162; ప్రతులకు; శ్రీరాఘవేంద్ర పబ్లిషర్స్‌, విజయవాడ 0866 2421052;ఎస్‌.ఆర్‌. బుక్‌లింక్స్‌, 0866 2436959

కృష్ణాతీర పత్రికలు... చారిత్రక సందర్భాలు

తెలుగు పత్రిక రంగ చరిత్ర నిర్మాణంలో కృష్ణాజిల్లా పాత్ర నిరుపమానం. తొలి తెలుగు దినపత్రిక ‘దేశాభిమాని’ ఇక్కడి నుంచే వెలువడింది. కొన్నేళ్ల కిందటి వరకూ తెలుగు పత్రికా రంగ రాజధాని విజయవాడే. అలాంటి కృష్ణాజిల్లా పత్రికా రంగం మీద డా।। కప్పగంతు రామకృష్ణ చేసిన పరిశోధన ఫలితమే ఈ పుస్తకం. ఈ ప్రాంతం నుంచి వెలువడిన దాదాపు అయిదు వందల పత్రికల వివరాలను ఆయన ఇందులో క్రోడీకరించారు. ఈ జిల్లా నుంచి సంపాదకులుగా ఎదిగి, తెలుగునాడు మీద తమదైన ముద్ర వేసిన పాత్రికేయ దిగ్గజాల స్ఫూర్తిగాథలనూ పొందుపరిచారు. వీటితో పాటు కాలానుగుణంగా తెలుగు పత్రికా రచనలో వచ్చిన మార్పులు, భాషకు అవి చేసిన సేవ తదితర అంశాలనూ సృశించడంతో పరిశోధనకు నిండుదనం వచ్చింది. ‘ఈ పుస్తకాన్ని చదవమని విశ్వవిద్యాలయాల జర్నలిజం విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహించాలి’ అన్న ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రధానాచార్యులు ఎం.నాగేశ్వరరావు మాటలు ఆచరణీయాలు.  

  - సత్యభారతి

అవ్యవస్థపై ధర్మాగ్రహం

రచయిత: రవికాంత్‌; పుటలు: 76; వెల: Rs70; ప్రతులకు: పద్మాంజలి, 18-25-9/2, కృష్ణనగర్‌, రాజమండ్రి. 96424 89244

అవ్యవస్థపై ధర్మాగ్రహం

సమాజంలో మానవత్వం అడుగంటి అమానవీయత పెరిగిపోతున్నప్పుడు మనిషి అంతులేని అసహనానికి గురవుతాడు. అతడే గనుక కవి అయితే తన భావసంచలనాన్ని కవిత్వం ద్వారా ప్రకటిస్తాడు. రవికాంత్‌ ‘ముఖం లేని మనిషి’ కూడా అలాంటిదే. ‘రంగు మారదు/ వాసన మారదు/ కోరలు ఉండవు/ మనుసంస్కృతిని పోలిన రూపం/ తరాలు గడచినా/ ఉనికి చెదరదు/ వాడి చేష్టలు ధర్మవిరుద్ధం’ అంటూ తనను భంగపరచిన అవ్యవస్థపై ధర్మాగ్రహం ప్రకటిస్తారు. మరో కవితలో ‘ఆత్మలు ఖాళీ చేసిపోయిన/ వొట్టి దేహాలు...’ అంటూ ఒక మరణ ఛాయాచిత్రాన్ని కవిత్వంగా మలచి మన కళ్లల్లో సైతం తడి చిప్పిల్లచేస్తారు. ఇలాంటి భావ కవితలే ఈ పుస్తకమంతటా కనిపిస్తాయి.  

- సూరారం శంకర్‌

పద్యాన్ని హృద్యంగా పలికించిన కలం

రచయిత: దొరవేటి; పుటలు 105; వెల: Rs60; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుసందు, కాచిగూడ క్రాస్‌రోడ్స్‌, హైదరాబాదు.

పద్యాన్ని హృద్యంగా పలికించిన కలం

ముఖాన్ని చూసి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కొద్దో, గొప్పో అంచనా వేయొచ్చన్నది పెద్దల మాట. దీనిప్రకారం చూస్తే కవి ‘దోరవేటి’ తన పొత్తానికి అంజలి - 2 అని నామకరణం చేయడం ఆసక్తికరం. సంప్రదాయబద్ధమైన రీతిలో ‘శ్రీగణేశాయనమః’తో ‘అంజలి’ ప్రారంభించి దాదాపు 63 సాహితి సేవామృతాలను అందించారు ఈ పుస్తకంలో. ఎక్కడో ఓ కవి... ‘కవికి లోతగు హృదయమ్ము కలిగినపుడె, చెవికి జేరును సత్యముల్‌ చెవిటికైన’ అన్నట్లు సాగతుంది దొరవేటి రచనాశైలి. తనకు ఈ పద్యవారసత్వం ఎలా వచ్చిందో కూడా ఇందులో చెబుతారాయన.  సాహితీస్రష్టులు, రాజకీయ నాయకులు, సామాజిక పరిస్థితులు, మహోన్నత వ్యక్తులనూ తన రచనా వ్యాసంగానికి వస్తువులుగా స్వీకరించారు దొరవేటి. ఎంపిక చేసుకున్న వస్తువుకు అనుగుణంగా అర్థవంతమైన భావాలను  పలికిస్తూ రచన చేశారు. పద్యానికి చోటులేకుండా పోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి హృద్యమైన పద్యసేద్యానికి నడుంకట్టడం కవి సాహిత్యాభిలాషకు నిదర్శనం.  

 - పచ్చా పెంచలయ్య

జిజ్ఞాసువులకు కరదీపిక

రచయిత: డా।।ఎన్‌.రామచంద్ర; పుటలు: 161;    వెల:Rs140; ప్రతులకు: రచయిత,  ప్రొద్దుటూరు, కడప జిల్లా-516360, 92939 24501

జిజ్ఞాసువులకు కరదీపిక

సాహిత్యాభిమానులకూ, సాహిత్య విద్యార్థులకూ విషయ సేకరణ, పరిజ్ఞానపరంగా ఉపయోగపడే ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథం తేనె పల్కులు తీపి గుర్తులు. వివిధ అంశాల మీద పరిశోధకుడు, విమర్శకుడు, డా।। ఎన్‌.రామచంద్ర రాసిన 25 వ్యాసాల సంపుటి ఇది. ఇందులోని వ్యాసాల్లో కొన్ని పత్రికల్లో వెలువడ్డాయి. కొన్ని రేడియో ప్రసంగాలు. మరికొన్ని సాహిత్య సదస్సుల్లో సమర్పించిన పత్రాలు. నాచన సోమన, శ్రీశ్రీ, దాశరథి, తిలక్‌, శేషేంద్ర తదితరుల రచనలను విమర్శనాత్మక దృష్టితో చర్చిస్తారు వీటిలో. ‘ఏ సాంప్రదాయక ఆలోచనా వాసనలు సోకని అజంతా అంతో ఇంతో నిజమైన అధివాస్తవిక కవి’ అని ‘అధివాస్తవిక కవిత- ఒక పరిశీలన’లో చెబుతారు. ‘ఎంతగా వైదేశిక సంపర్కంతో కొత్త ధోరణులు జతకట్టినా స్వకీయమైన పద్ధతులే శాశ్వతంగా నిలబడిపోతా’యంటూ ‘ఆధునిక కవిత్వంలో నూతన వ్యక్తీకరణ’లను విశ్లేషిస్తారు. ప్రత్యేకంగా చలం పరంగా రాసిన అయిదు వ్యాసాలను చేర్చి ఆయన మూర్తిమంతాన్ని భిన్న కోణాల నుంచి ఆవిష్కరించారు. ఆ ముఖంగా అమర్చిన ‘సృష్టి- దృష్టి’ వ్యాసం పుస్తకానికి ప్రత్యేకాలంకారం.

 - ఎ.వి.జనార్దనరావు

లోకానికి వెలుగుదివ్వె

రచయిత: పి.రాజేశ్వరరావు (80963 14553); పుటలు: 92; వెల: Rs60; ప్రతులకు: నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు, ప్రగతి పబ్లిషర్స్‌ హైదరాబాదు

లోకానికి వెలుగుదివ్వె

శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అయిన గౌతమబుద్ధుడు చాలామందికి ఆరాధ్యదైవం. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయ్యాయి. అలాంటి బుద్ధుడి జీవితం, బోధనలు, సూక్తులను ఈ ‘గౌతమ బుద్ధుడు’ పుస్తకంలో వివరించారు పి.రాజేశ్వరరావు. సిద్ధార్థుడి బాల్యం ఎలా గడిచింది? ఇంటినీ, నగరాన్ని విడిచి ఎందుకు వెళ్లిపోయాడు? లాంటి విషయాలను ఆయన పినతల్లి, భార్య, శిష్యుల మాటల్లో వివరించారు. నిర్వాణమంటే ఏమిటి? కుల విభజనకు కారణం కర్మా? జన్మా? లాంటి సందేహాలకు సమాధానాలు, బుద్ధుడి నిర్వాణానంతరం భౌతిక కాయాన్ని ఏం చేశారు? తదితర ఆసక్తికర విషయాలనూ ప్రస్తావించారు. ఇంకా అక్షర క్రమంలో పొందుపరిచిన బుద్ధుడి సూక్తుల్లో కొన్ని మాతృభాషా సంబంధితం కావడం విశేషం. ‘మాతృభాషల్లో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం వల్ల రాదు’, ‘తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోని పదాలూ సరిపోవు’, ‘చెడు పని కన్నా చెడు ఆలోచన చెడ్డది’ లాంటి మాటలు ఆలోచింపజేస్తాయి. కుల, మత, వర్గరహిత సమాజాన్నీ ఆకాంక్షించే వాళ్లకి తగిన కార్యాచరణ స్ఫూర్తిని కలిగించే రచన ఇది.

 - రమేశ్‌ తమ్మినేని

bal bharatam