సరళంగా... శాస్త్రీయంగా

రచయితలు: ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు; పుటలు: 434; వెల: Rs300; ప్రతులకు: టి.శోభనాద్రి, ఇం.నం. 4-8-12, గుణదల, విజయవాడ-520005

సరళంగా... శాస్త్రీయంగా

తెలుగు వ్యాకరణం అనగానే గుర్తుకు వచ్చేది బాలవ్యాకరణం. వాస్తవానికి చిన్నయసూరి వ్యాకరణం రాసింది ప్రాచీన కావ్యాలకు, అప్పటి భాషా స్వరూపానికి, ప్రయోగాలకే అయినా, ఇప్పటికీ తెలుగుభాషకు ప్రామాణిక వ్యాకరణం అంటే ఇదే. దీని తర్వాత వచ్చిన వ్యాకరణాలన్నీ సూరి రచనకు అనుసరణలే తప్ప స్వతంత్రాలు కావు. మరోవైపు.. కాలక్రమంలో తెలుగు విద్యార్థులకు వ్యాకరణం ఓ నచ్చని, భయపడే అంశంగా మారింది. వ్యాకరణ గ్రంథాల్లో ఉండే క్లిష్టమైన వివరణ ఇందుకు కారణమని అధ్యాపకులే ఒప్పుకుంటున్నారు. ఈ లోపాన్ని తీరుస్తూ, ఆధునిక భాషా సిద్ధాంతాలకు అను గుణంగా, సరళ శాస్త్రీయ వివరణతో బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రాయటంలో ఈ రచయితలు కృతకృత్యులయ్యారు. మూలగ్రంథంలో లేని వ్యాకరణ సంజ్ఞాకోశాన్ని ఇందులో చేర్చడం మరో ప్రత్యేకత.

- కప్పగంతు రామకృష్ణ

భాషా మూలాల, సమస్యల అధ్యయనాలు

సంపాదకులు: డా.కె.ముత్యం; పుటలు: 213, వెల: Rs150; ప్రతులకు: తెలుగు విభాగం, శాతవాహన విశ్వవిద్యాలయం, మల్కాపూర్‌ రోడ్‌, కరీంనగర్‌ - 505001

భాషా మూలాల, సమస్యల అధ్యయనాలు

ఆసక్తిపరులకూ శక్తిమంతులకూ ఇది స్థిమితంగా అధ్యయనం చేయాల్సిన గ్రంథం. నేటి ప్రపంచీకరణలో తెలంగాణ భాష, తెలుగు భాష, గిరిజన భాషలు ప్రామాణికత - అమలు అస్తిత్వం అనే దీర్ఘనామంతో వచ్చిన మూడు విభాగాల పొత్తమిది. కలగాపులగంగా కనబడినా అన్యోన్యాశ్రితాలైన సంబంధితాలైన వ్యాస సంపుటి ఇది. భాష విషయంలో వైవిధ్య సౌందర్యాల్నీ, ప్రత్యేకతల్నీ వైరుధ్యాలుగా భావించరాదు. సమన్వయ ధోరణులూ మార్గదర్శక ఆలోచనలూ అవసరం. రవ్వా శ్రీహరి, బి.ఎస్‌.రాములు, పోరంకి, సామల రమేష్‌బాబు లాంటి వారి వ్యాసాలతోపాటు మరికొందరు భాషాభిజ్ఞుల, పరిశోధకుల స్థాయిగల పత్ర సమర్పణా వ్యాసాలుండటం ఈ గ్రంథ ప్రయోజనాన్ని ద్విగుణీకృతం చేశాయి. ‘చదువవేస్తే ఉన్న మతి పోయినట్టు’ అని ఓ సామెత. నిజానికి ఉన్న మతే ఉండటానికి గ్రంథాధ్యయనం ఎందుకు? ఉన్న మతి, ఉన్నతమవడానికి తర్కబద్ధ ఆలోచనలు పెంపొందడానికే గ్రంథాధ్యయనం చేయాలి. భాషా సమస్యలు, వర్తమాన అవసరాల ఆచరణ లాంటివెన్నో గ్రహించడానికి ఇలాంటి గ్రంథాల అధ్యయనం అత్యవసరం.

- నంధాన్నిస

నవ్విస్తాయి.. మురిపిస్తాయి

రచయిత: చిట్టెన్‌ రాజు; పుటలు: 190, వెల:Rs50; ప్రతులకు: జె.వి.పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌, 80963 10140; నవోదయ బుక్‌హౌస్‌, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

నవ్విస్తాయి.. మురిపిస్తాయి

‘‘రట్టున్‌ సేయుచు రసమున్‌ హిట్టున్‌ చేయుచు సభలను, హిహిహీ పుట్టై విట్టుకు విట్టున్‌ కొట్టెడి చిట్టెన్‌ రాజుకు సరసులు జేజే కొట్టున్‌’’ అన్న జొన్నవిత్తుల మాటలు అక్షరసత్యాలు అనిపిస్తాయి..  అమెరి‘కలకలం’ కథలూ కమామీషులూ పుస్తకం చదువుతుంటే! హాస్య రచయితగా గుర్తింపు పొందిన చిట్టెన్‌రాజు తన అమెరికా ప్రయాణానికి ముందూ- వెనుక అనుభవాలను, చిన్నా- పెద్దా సంఘటనలతో కలిపి, ఎలాంటి అరమరికలు లేకుండా సరదా కథలుగా అల్లేశారు. కథలొక్కటే సరిపోవంటూ! తాను పాల్గొన్న కార్యక్రమాల తాలూకు అనుభవాలను ‘కమామీషులు’గా జోడించారు. పైగా కాస్త అతిశయోక్తి, వ్యంగ్యం, స్వోత్కర్ష వగైరాలను రంగరించి మరీ వీటిని రాశానని నిష్కర్షగా చెప్పేశారు.

- తులసి

కదిలించే హృదయాల కళా ఉపాసన

రచయిత: కిరణ్‌కుమార్‌ సత్యవోలు (97032 22329); పుటలు: 216; వెల: Rs150; ప్రతులకు: వాసిరెడ్డి పబ్లికేషన్స్‌, బి-2, టెలికాం క్వార్టర్స్‌, కొత్తపేట, హైదరాబాదు -500060, 90005 28717

కదిలించే హృదయాల కళా ఉపాసన

కళ మనుషులకు సాంత్వననిచ్చే ఓ ఆయుధం. దాన్ని ఆశ్రయించని హృదయాలు పాషాణాలు అంటారు పెద్దలు. అయితే కళాకారుల హృదయాల్లో బద్దలైన అగ్నిపర్వతాల సెగలను పట్టించుకునేవారు లేరు. కళకు అంకితమైన కుటుంబాల గాథలు కన్నీటిని జ్వలించేవే. ఈ పిపాసి నవలలో రచయిత కళాకారుల నేపథ్యాన్ని పెట్టుకుని వాళ్ల మధ్య సంఘర్షణలను తనదైన శైలిలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కళకు అంకితమైన పాటల రచయిత మహాదేవ. అయితే ఈ కళ కారణంగానే తన భార్యను కోల్పోతాడు. కళ పట్ల ఉన్న పిపాస, తీవ్రమైన ఆరాధన అతన్ని ప్రపంచంనుంచి దూరంగా ఉంచేస్తుంది. తల్లి మరణానికి తండ్రే కారణమని కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోవడాన్ని సహించలేకపోతాడు. నచ్చజెప్పే ప్రయత్నాలేవీ ఫలితాన్నివ్వవు. కొడుకుతో ఒక్క పాటైనా బాగుందని అనిపించుకోవాలన్న కోరిక మహాదేవను తొలిచేస్తూ ఉంటుంది. తుదిఘడియల్లో కొడుకు కపర్ది తండ్రిని అర్థం చేసుకునే వేళ, అంతా పరిధి దాటిపోతుంది. కాలం అంతే.. జాలి లేకుండా కదలిపోతూనే ఉంటుంది అన్న ముగింపు బీటలువారిన కళాకారుడి హృదయానికి ప్రతీకగా నిలుస్తుంది.              

- సురా

క్రాంతిదర్శికి అక్షర నివాళి

సంపాదకురాలు: కె.ఉషారాణి; పుటలు: 290; వెల: Rs200; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్‌, 27-1-54, కారల్‌మార్క్స్‌ రోడ్‌, గవర్నర్‌పేట, విజయవాడ - 520002, 0866 2577533; శాఖల్లో...

క్రాంతిదర్శికి అక్షర నివాళి

‘‘నా లోపలి భావాలను అత్యంత శక్తిమంతంగా, సమర్థవంతంగా నా చుట్టూవున్న సమాజానికి చేరవేసే ఒక సాధనంగా, ఒక మాధ్యమంగానే నేను కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని చూస్తాను. నేను కవినా, రచయితనా, సామాజిక శాస్త్రవేత్తనా, హేతువాదినా, నాస్తికుడినా అని నా గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నన్ను నేను బాధ్యత ఎరిగిన ఒక సాధారణ సామాజిక కార్యకర్తగా భావించుకోవడమే అత్యంత గౌరవప్రదమైనదిగా భావిస్తాను’’ అన్న నిగర్వి చిత్తజల్లు వరహాలరావు. సి.వి.గా సుప్రసిద్ధులైన ఈయన ఓ దశలో తెలుగు సాహితీరంగంలో కొండెక్కుతున్న ప్రజాచైతన్య దీప్తులను ఒంటిచేత్తో కాపుగాసిన సాహితీవేత్త.  ఈయన్ను స్మరించుకుంటూ వెలువరించిన పొత్తమే మన తరం ప్రజాస్వరం సి.వి. ఇందులో ఆయన రచనల మీద వివిధ సందర్భాల్లో పలువురు రాసిన వ్యాసాలున్నాయి. అలాగే, గతంలో సి.వి. ఇచ్చిన ముఖాముఖీలనూ దీన్లో పొందుపరిచారు. సాంస్కృతిక విప్లవంతోనే దేశ ముఖచిత్రాన్ని మార్చగలమన్న సి.వి. సమగ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేయాలన్న ఆసక్తిని కలిగిస్తుందీ పుస్తకం.              

- తథాగత

వరంగల్‌ జిల్లా పత్రికల సేవ

రచయిత్రి: డా।।నమిలకొండ సునీత; పుటలు:20+320 ; వెల: Rs300; ప్రతులకు: రచయిత్రి, 5-6-177/సి, ఎన్జీవోస్‌ కాలనీ, కామారెడ్డి-503111, 99084 68171; విశాలాంధ్ర, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, శాఖల్లో...

వరంగల్‌ జిల్లా పత్రికల సేవ

ఓరుగల్లు కాకతీయుల హృదయ సీమ. ఈ ప్రాంత చరిత్ర, వారసత్వం మహోన్నతం. ఎంతో విశిష్టత కలిగిన ఈ ప్రాంతంలో ఎన్నో పత్రికలు తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు కృషి చేశాయి. ముఖ్యంగా మాతృభాష అధ్యయనం, అధ్యాపనాలకు ఏమాత్రం అవకాశం లేని నిజాం రాజ్యంలో 1922లోనే ‘తెనుగు’ అనే వారపత్రికను ఒద్దిరాజు సోదరులు వరంగల్‌ జిల్లాలో ప్రారంభించారు. ఈ జిల్లాలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని రకాల పత్రికల సమగ్ర వివరాలను డా.నమిలకొండ సునీత వరంగల్‌ జిల్లా పత్రికలు: నాడు-నేడు (సాహిత్య సేవ) గ్రంథంలో అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన గ్రంథాన్ని మిత్రుల సూచన మేరకు ముద్రణ రూపంలో తెచ్చారామె. జిల్లా నుంచి వెలువడిన, వెలువడుతున్న 170కి పైగా పత్రికల వివరాలు, వాటి స్వరూప స్వభావాలు, సంపాదకీయాల పరిశీలన, భాష, సాహిత్యం, సంస్కృతి సేవ లాంటి ఎన్నో అంశాలను ఇందులో వివరించారు. ఆయా పత్రికల సంపాదకులు, పాత్రికేయుల వివరాలను వారి చిత్రాలతో సహా అందించడం విశేషం.                

- వేణుబాబు

రాయలు అచ్చమైన తెలుగువాడే!

రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్‌; పుటలు: 222; వెల:Rs200; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, బండ్లగూడ, హైదరాబాదు-68; విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ-04, 0866 2430302

రాయలు అచ్చమైన తెలుగువాడే!

కులం అనేది ఒక భావన.. ఓ మానసిక స్థితి అన్నారు బి.ఆర్‌.అంబేడ్కర్‌. భౌతిక రూపం లేకపోయినా సరే, ఈ కులం భారతీయ సమాజాన్ని  రకరకాలుగా చీల్చింది. దేశవాసుల మధ్య అది గీసిన విభజన రేఖలు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి విషయాన్నీ కులం కోణంలోంచి చూడటం ఎక్కువైంది. ఆఖరికి చారిత్రక వ్యక్తులకు కూడా కులాల రంగులు పూసి వర్తమానంలో కాట్లాడుకోవడమూ మనం చూస్తోందే. ఇదే నేపథ్యంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వంశమూలాల మీద కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని చారిత్రక విషయాలు మరుగునపడిపోతున్నాయి. అవేంటో చెబుతూ.. రాయలు అచ్చమైన తెలుగువాడు, ఫలానా కులానికి చెందిన వాడు అంటూ శాసనాలు, చారిత్రక ఆధారాల ద్వారా ఈ పుస్తకంలో నిర్ధరించారు రవీంద్రనాథ్‌. అయితే, రచయితే చెప్పినట్టు- శ్రీకృష్ణదేవరాయులు వంటి గొప్ప పాలకుడు ఏ కులం వాడో తేలిపోయి ఆయన్ని ఎవరు తమవాడని ప్రకటించుకున్నా ఆయనకు, ఆయన కీర్తికి కొత్తగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. 

- సత్యభారతి

మనసు తట్టే చిట్టి కథలు

రచయిత: ఎ.ఎన్‌.జగన్నాథశర్మ (99854 67222); పుటలు: 372; వెల: Rs300; విశాలాంధ్ర, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌లు

మనసు తట్టే చిట్టి కథలు

నవ్య వారపత్రికలో ‘మొదటిపేజి’ శీర్షికతో వచ్చిన రచనల సంకలనమే ‘జగన్నాథశర్మ మొదటి పేజి’. మన చుట్టూ జరిగే సంఘటనలనే వస్తువులుగా తీసుకుని, చక్కటి కథలుగా (మొత్తం 180) అల్లారు. ఇవి పాఠకుణ్ని నవ్విస్తాయి.. కవ్విస్తాయి.. ఏడిపిస్తాయి.. బుజ్జగిస్తాయి. ‘అరే.. ఇవి మనకు సంబంధించిన కథలే కదా’ అనిపిస్తాయి. ‘ఓ బొజ్జ గణపయ్య’లో నవరాత్రి సంబరాలు, ‘బోగిమంట’లో పిల్లలంతా కలసి చెట్లకొమ్మలు, కోళ్ల గూళ్లు, విరిగిన మంచాలు సేకరించడం లాంటివి పాఠకుల జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. ఎప్పటికీ తీర్చుకోలేనిదంటూ ‘తల్లిఋణం’ కథలో అమ్మ గొప్పతనాన్ని చక్కగా చెప్పారు. ‘మల్లేష్‌ ఆటో సర్వీస్‌’, ‘రిక్షారాణి’ లాంటివి స్ఫూర్తి కథలు. ‘అమ్మఒడి’, ‘హ్యేపీ న్యూ ఇయర్‌’, ‘నాన్నా నీ మనసే వెన్న’, ‘ట్రంకుపెట్టె’ లాంటివి కుటుంబ అనుబంధాలకు అద్దంపడతాయి. ‘..చుట్టం చూపుగా వచ్చిపోయేవాళ్లు ముఖ్యం కాదోయ్‌! మనతో కలిసిమెలిసి ఉండేవాళ్లు ముఖ్యం! రేపు లేచినదగ్గర్నుంచీ చూసేది కాలనీ వాళ్లని గాని, కన్నుకి అందనంత దూరంగా ఉన్న నీ వాళ్లనీ, నావాళ్లనీ కాదు’ లాంటి మాటలు (‘ఇరుగు పొరుగు’లో) ఆలోచింపజేస్తాయి.  

- గణేశ్‌ 

కశ్మీరు అందాలు చూసొద్దాం రండి!

రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్‌; పుటలు: 216,  వెల: Rs250; ప్రతులకు: నవచేతన, విశాలాంధ్ర పుస్తక విక్రయకేంద్రాలు. 98491 31029

కశ్మీరు అందాలు చూసొద్దాం రండి!

కశ్మీర్‌కు భూతల స్వర్గమని పేరు. అక్కడ ఆకాశాన్నంటే మంచు కొండల్ని, రమణీయ జలపాతాల్ని చూసి ఆనందించాలని ప్రతీ భారతీయుడి కోరిక. అలాంటి వారికి కరదీపిక ముత్తేవి రవీంద్రనాథ్‌ రచించిన మా కాశ్మీరయాత్ర. యాత్రికులు ఏవైనా ప్రదేశాలను చూడటానికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమికమైన జాగ్రత్తల్ని రచయిత చక్కగా చెప్పారు. పుస్తకం చదువుతుంటే ఆయనకు ఉన్న చారిత్రక అవగాహన, పరిశీలనాదృష్టి పాఠకులకు ద్యోతకమవుతుంది. కశ్మీర్‌ పర్యటనలో ఎదురైన మధురమైన అనుభవాల్ని, చేదు సంఘటనల్ని వివరిస్తూనే తన శ్రీమతికి చెబుతున్నట్లుగా ఆ ప్రాంత చరిత్రను, కశ్మీర్‌ సమస్య పూర్వాపరాల్ని నిశితంగా వివరించారు రచయిత. చివరలో ఈ పుస్తకానికి అనుబంధంగా చేర్చిన ‘మా పోలవరం యాత్ర’ కూడా పాయసంలో జీడిపప్పులా పాఠకులని అలరిస్తుంది. కశ్మీర్‌ మీద ఓ విజ్ఞానదాయక సంప్రదింపు (రిఫరెన్స్‌) గ్రంథమిది.

- గొడవర్తి శ్రీనివాస్‌

bal bharatam