అభ్యుదయ కవితా పతాకం

కవి: శిఖామణి; పుటలు: 16+107; వెల: Rs120; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి, పాలపిట్ట బుక్‌హౌస్‌లు హైదరాబాదు, నవోదయ పబ్లిషర్స్‌ విజయవాడ

అభ్యుదయ  కవితా పతాకం

ఒక మాట చెప్పి వెళ్లు! కవితాసంపుటి చదువరికి తన్మయత్వం కలిగిస్తుంది. శిఖామణి తన కవిత్వాను భవం ‘‘చుబుకాన్ని చుంబిస్తున్న తల్లి తన్మయత్వపు వివశంలా ఉండాలి!’’ అంటారు. తనకు తాను ‘‘బీజాక్షరమై మళ్లీ ఒకసారి కొత్తగా మొదలవ్వాలి’’ అని కోరుకుంటారు. ఈ పుస్తకం పేరే శీర్షికగా అందించిన కవిత చదివాక, కవి ఎవరి పక్షమో ఇట్టే తెలిసిపోతుంది. అభాగ్యులను తయారుచేస్తున్న ఆక్టోపస్‌ లాంటి వ్యవస్థకు ఆయన వ్యతిరేకమని అర్థమవుతుంది. నిజమైన అభ్యుదయం కోరుకునే మనుషులకు అలా సాంత్వన, ధైర్యం, విశ్వాసం కలుగుతాయి. తాము ఒంటరివాళ్లం కాదు అనే స్పృహ గొప్ప ఉచ్ఛ్వాసమై గుండె పొంగుతుంది. కరడుగట్టిన సమాజంలోని సున్నిత మనసులకు కవి ప్రధాన ప్రతినిధిలా అనిపిస్తారు. మామూలు మాటల్లో కవితాత్మని పొదిగి సజీవ సౌందర్యాన్ని నింపుతారు. ‘‘నాలుగు కాళ్ల పశువును పూజించండి/ కానీ రెండు కాళ్ల మనిషిని కూడా ప్రేమించండి’’ లాంటి పంక్తులతో వర్తమానావర్త ప్రాప్తకాలజ్ఞ రాజకీయపు చీకటి కోణాలు అర్థమైపోతాయి. ఈ కవితలను చదువుతుంటే కళ్లూ, మనసూ అశ్రుపూరితాలవుతాయి.    

 - నడిమింటి
 

సలపరించే సీమ గాయాలు

సంపాదకత్వం: డా।।అప్పిరెడ్డి హరినాథరెడ్డి; పుటలు: 112; వెల: Rs50; ప్రతులకు: కోనాపురం ఈశ్వరయ్య, 1/244, మడకశిర రోడ్డు, ఆల్విన్‌ కాలనీ, పెనుకొండ, అనంతపురం - 515110, 73866 23864
 

సలపరించే  సీమ గాయాలు

నీళ్లే బతుకు, నీళ్లే మెతుకు, నీళ్లే నాగరికత. నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లయినా తాగి బతకమన్నాడు ఓ కవి. రాయలసీమ నీటికరువు.. ఎడారిసేద్యం చేసే రైతు.. సాగునీరు, తాగునీరూ లేక భవిష్యతులో మానవ మనుగడ సాగించలేని భయానక స్థితి పొంచివున్న నేపథ్యంలో ‘రాయలసీమ సాంస్కృతిక వేదిక’గా పెగిలిన గొంతులివి. తడి ఆరిన సీమ గొంతుకలివి. ‘‘నా పల్లె జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తోంది’’ అన్న రాఘవేంద్ర, కన్నీటి సీమకు ఒయాసిస్సుల్ని వాగ్దానం చేస్తున్న రాజకీయ నేతల మోసాన్ని నిలదీసిన రాధేయ, నీళ్లకోసం ఉద్యమించి తీరాలన్న గంగరాజు, సీమ పౌరుషం ఉద్యమస్వరమై గర్జించాలన్న తవ్వా ఓబుళరెడ్డి, రేపటి రాష్ట్ర ఎజెండాలన్నీ సీమ సమస్యలే అంటున్న ఖలందర్‌, సీమహక్కుల కోసం తెలివితో తెగబడాలని పిలుపునిస్తున్న జూ।। చంద్రహాస... ఇలా, ఒకరా ఇద్దరా 43 మంది కవులు తడియారిన సీమగొంతులై, క్షతగాత్రులై ఇందులో కవితాగానం చేశారు. ‘సీమ దాహం తీర్చే కవుల ప్రయత్నం’ అంటూ డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి రాసిన ముందుమాట సీమ ఉద్యమ తీవ్రతకు హెచ్చరికగా ఉంది.               

 - డా।। రాధేయ
 

మమతల మణిదీపికలు.. ఈ కథలు

రచయిత: ఎస్‌.వి.రంగారావు; పుటలు: 90; వెల: Rs150; ప్రతులకు: కథా ప్రపంచం, ఇస్కాన్‌ దేవాలయం ఎదురుగా, కేటీ రోడ్‌ తిరుపతి, 95535 18568

మమతల మణిదీపికలు.. ఈ కథలు

నటుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఎస్వీ రంగారావు రచయితగా చాలా తక్కువమందికి తెలుసు. ప్రభావవంతమైన కథలు రాసి సాహితీలోకానికి అందించారాయన. స్వాతంత్య్రనంతర కాలపు సామాజిక పరిస్థితులు, వైరుధ్యాలు, భావోద్వేగాలను తన కథల్లో బలంగా చిత్రించారు. వాటన్నింటినీ సేకరించి ఎస్‌.వి.రంగారావు కథలు పుస్తకంగా ‘కథా ప్రపంచం’ వెలువరించింది. ఈ కథలన్నీ సంస్కరణాత్మక ఆలోచనలకు అద్దంపట్టేవి. జీవితప్రయాణంలో ఆకస్మికంగా ఎదురయ్యే సంఘటనలూ... వ్యక్తుల పరిచయాలూ... ఆ ప్రభావాలూ మనిషిని ఎంతగా దహించి వేస్తాయో ‘సంక్రాంతికి సంక్రాంతికి’ కథ తెలియజేస్తుంది. ‘అగస్టు-8,’ ‘విడుదల’ లాంటి కథలు ఆ కాలపు యుద్ధపరిస్థితులకూ... ప్రజల దైన్యతకు అద్దం పడతాయి. సామాజిక కట్టుబాట్లు దాంపత్యసుఖాలను బంధించేంత బలంగా ఉండకూడదని చెప్పే ‘పసుపు- కుంకుమ’ కథ రచయిత భావాలను పట్టిచ్చేది మాత్రమే కాదు సామాజిక రుగ్మతలను ఎత్తిచూపేది కూడా. ఇవి చిన్నకథలే అయినా చిక్కని భావస్ఫురణ కలిగినవి. బతుకులోని మాధుర్యాన్ని చవిచూపించేవి.    

 - మనోహర్‌
 

అచ్చమైన శాస్త్రీయ విప్లవ గ్రంథం

రచయిత: బి.స.బంగారయ్య; పుటలు: 44+194; వెల: Rs200; ప్రతులకు: సాహితీ సర్కిల్‌, 402, ఘరోండ అపార్ట్‌మెంట్స్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానద్వారం దగ్గర, ఒకటో సందు, హైదరాబాదు-07, 99519 42242

అచ్చమైన శాస్త్రీయ విప్లవ గ్రంథం

తెలుగు మీద సంస్కృత ఆధిపత్యాన్ని సకారణంగా, ఆలోచనాత్మకంగా, శాస్త్రీయంగా ప్రశ్నించే పూర్తి కొత్త చూపు పొత్తం ఈ నుడి - నానుడి. తెలుగు‘వాడి’ ప్రశ్నలు, ఆవేదనలు, భాషలోని లోగుట్టులు, మన నిర్లిప్తతలు, చేయాల్సిన పనులు తదితర ఎన్నో విషయాలను ఆరు అధ్యాయాల్లో ఎరుకపరచారు రచయిత. ‘భార్యకు బదులు పెళ్లాం, భర్తకు బదులు మొగుడు, రక్తం బదులు నెత్తురు అనే తెలుగు మాటలు ఉన్నాయి కదా, వాడుకోలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ తెలుగును మర్చిపోతున్నాం’ అన్న మాటలు ఆలోచనాత్మకమైనవి. ‘భాషల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవా?’ అనే వారికీ సూటిగా బదులిస్తారు రచయిత. మనదంటూ మనకు మాటల కలిమి ఎక్కువ ఉంటేనే పుచ్చుకోవడం ఉంటుంది. మనదంతా పోగొట్టుకుని ఎక్కువ తెచ్చుకోవడమే ఉంటే అది అడుక్కోవడం అవుతుందంటారు. ఎన్నో సంస్కృత, ఆంగ్ల పదాలకు చక్కటి తెలిగింపులూ ఈ పొత్తంలో కనపడతాయి. ఇది ‘తెలుగు ప్రజల- ప్రజల తెలుగుకు సిద్ధాంత గ్రంథం’ అన్న సంపాదకుల మాటలు అక్షరసత్యాలు. అంతేకాదు, ఇది తెలుగు భాషా సంస్కరణ కోరే ఓ శాస్త్రీయ విప్లవగ్రంథం.

- గౌతమి

అంతం వరకు అనంతం

రచయిత్రి: కె.లలిత; పుటలు: 239; వెల: Rs200; ప్రతులకు: వి.రమేష్‌బాబు, 1-3-183/40/70 /501, చంద్ర అపార్ట్‌మెంట్స్‌, గాంధీనగర్‌, బాకారం, హైదరాబాదు-80, 95055 18441

అంతం వరకు అనంతం

జీవిత చరిత్రలు, ఆత్మ కథలు, ఆధునిక అధ్యయనాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈ అంతం వరకు అనంతం రావడం విశేషం. వాదాలే వారసత్వంగా కొనసాగుతున్న తరాలు కనుపర్తి వారి కుటుంబ నేపథ్యంలో కనిపిస్తాయి. పుస్తక రచయిత్రి తండ్రి గాంధేయవాది. తర్వాతి తరంలో రచయిత్రి మార్క్సిస్టు స్త్రీవాదిగా తమ జీవిత ప్రయాణం సాగించారు. కాలానికి ఎదురీదిన ఎంతోమంది అసామాన్యుల్లో లలిత తల్లిదండ్రులున్నారు. ముఖ్యంగా కనుపర్తి సీత రజాకార్ల ఉద్యమం గురించి చెప్పిన విషయాలు విశేషమైనవి. విలువలతో జీవించాలనుకునే వారి కష్టాల కడగండ్లు ఈ పుస్తకం చూపిస్తుంది. 
జీవిత చరిత్రలే సామాజిక ఉద్యమాలైన అపురూప గ్రంథాలలో ఇదీ ఒకటి.      

- డా।। ప్రభల జానకి
 

అగ్నిధార

రచయిత: డా।। దాశరథి కృష్ణమాచార్య; పుటలు: 84; వెల: Rs60; ప్రతులకు: పున్న అంజయ్య, ప్రధాన కార్యదర్శి, 6-2-954/2, మీర్‌బాగ్‌ కాలనీ, నల్లగొండ - 508001, 93966 10639

అగ్నిధార

సాయుధ తెలంగాణ పోరాటానికి గొంతుకిచ్చి, దొరల ఏలుబడిమీద అగ్నిధార కురిపించిన దాశరథి కవితల సమాహారమిది. ఇందులో కవితలన్నీ దొరల దాష్టికాలనూ, దురాగతాలనూ ఎండగట్టేవే. రజాకార్లు సారస్వత పరిషత్తు పందిళ్లను తగలబెట్టినప్పుడు దాశరథి ఉగ్రుడై నినదిం చిన కవితలన్నీ ఇందులో ఉన్నాయి. ధిక్కారస్వరం వినిపించాడనే నెపంతో జైలుకి పంపించినప్పుడు జైలు గోడల మీద బొగ్గుతోరాసిన ఈ కవితలు అప్పటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. సామాన్యుని సైతం పోరుబాట పట్టించిన దాశరథి కవితలను ‘అగ్నిధార’ పేరిట ‘సాహితీమేఖల’ 1949లో తొలిసారి ముద్రించింది. ఇప్పుడు దాన్ని పునర్ముద్రించారు. ఈ అగ్నిధార.. సమరశీల అస్త్రంగా ఈనాటికీ క్రియాశీలకంగా నిలుస్తుంది.      

 - సాహితీసుధ
 

చిట్టి పదాల్లో గట్టి భావాలు

రచయిత్రి: డా।। పి.విజయలక్ష్మీ పండిట్‌; పుటలు: 64; వెల: Rs50; ప్రతులకు: ఆర్‌.సి.రెడ్డి పబ్లికేషన్స్‌, అశోక్‌ నగర్‌ క్రాస్‌ రోడ్స్‌ హైదరాబాదు-20, 93473 19751

చిట్టి పదాల్లో గట్టి భావాలు

సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించే విశ్వపుత్రిక హైకూలు ఇవి.

ప్రాకృతిక   దృశ్యాలు, సామాజిక సంఘటనలకు రచయిత్రి స్పందనలు వీటిలో కనిపిస్తాయి.

‘‘వరుణుని కరుణకై/ నింగినంటిన చూపు-/ రైతుల ఆత్మఘోష’’...

అలా అలతి పదాలతో అనంతార్థాన్నిచ్చే హైకూలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి.    

- రమేశ్‌ తమ్మినేని

మార్గాలు వేరైనా...

ర: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పుటలు: 256; వెల: Rs200; ప్రతులకు: ప్రిజమ్‌ బుక్స్‌ ప్రై. లిమిటెడ్‌, 1865, 32వ క్రాస్‌, 10వ మెయిన్‌, బెంగళూరు-560070, 080 26714108

మార్గాలు వేరైనా...

మల్లాది వెంకట కృష్ణమూర్తి  ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో వెలువరించిన పుస్తకాలలో గమ్యం ఒకటే మార్గాలు ఎన్నో ఒకటి. మన ప్రపంచంలో అనేక మతాలు, గ్రంథాలు, పూజార్లు, అలాగే అంశాలు కూడా. దయ, వినయం, అంగీకారం, విశ్వాసం, జ్ఞానం, క్రమశిక్షణ, శరణాగతి లాంటి అంశాల మీద సమగ్ర అవగాహన కల్పించే నేపథ్యంతో ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా అందించారు. ‘‘ఎవరైతే ప్రపంచంలోని అన్ని మతాలను ఓ పెద్ద కుటుంబంగా చూడగలరో, వారు పరమాత్మను చక్కగా అర్థం చేసుకున్నవారవుతారు; మనకు అందే సూచనలను పట్టుకో, వాటిని పోగొట్టుకోకుండా, జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే అదే నీ జీవితం’’... ఇలా మల్లాది అన్ని మతాల సారాన్ని, వాటిల్లోని సూక్తులను, వివరణలను ఈ పుస్తకంలో గుదిగుచ్చారు. జీవితపథంలో ఈ పొత్తం పాఠకులకు ఓ మార్గదర్శకం.    

- డా।। టి.శ్రీరంగస్వామి

మర్చిపోలేని కవిత్వం

రచయిత: సౌభాగ్య; పుటలు: 64; వెల: Rs50; ప్రతులకు: విశాలాంధ్ర నవచేతన బుక్‌హౌస్‌ శాఖలు; అమరావతి పబ్లికేషన్స్‌, 4-21-81, చైతన్యపురి, గుంటూరు-7, 92915 30714

మర్చిపోలేని కవిత్వం

సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర, తన తమ్ముడు దివంగత మహేంద్ర డైరీల్లోని కవితల్ని సేకరించి ‘పర్వవేలా తరంగాలు’ కవితా సంపుటిని  తెచ్చారు. ఆ కవిత్వం మీద, కవి తత్వం మీద సౌభాగ్య రాసిన విశ్లేషణాత్మక పుస్తకమే ఈ భావోద్వేగ పరవశుడు మధురాంతకం మహేంద్ర కవిత్వం. మహేంద్ర కవితల్లో అంతులేని ఉద్వేగం, అనంత దుఃఖం, తపన, ఆవేశం, బాధ కనిపిస్తాయి. ‘‘అతను చిత్రమైన కవి, వ్యక్తిత్వమున్న కవి, స్వేచ్ఛలోని మాధుర్యం తెలిసిన కవి, తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుని ఆనందవిహారం చేసే కవి, విషాదపు జీరను విహ్వలగానం చేసుకునే కవి’’ అంటూ రచయిత తన భావాల్ని, అభిప్రాయాల్ని సుస్పష్టంగా వ్యక్తపరిచారు. ఆర్ద్రమైన మహేంద్ర కవితల్ని ఈ పుస్తకం ద్వారా మరోసారి మననం చేసుకోవచ్చు.

- గీతాశ్రీనివాస్‌

bal bharatam