లోకానికి వెలుగుదివ్వె

రచయిత: పి.రాజేశ్వరరావు (80963 14553); పుటలు: 92; వెల: Rs60; ప్రతులకు: నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు, ప్రగతి పబ్లిషర్స్‌ హైదరాబాదు

లోకానికి వెలుగుదివ్వె

శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అయిన గౌతమబుద్ధుడు చాలామందికి ఆరాధ్యదైవం. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయ్యాయి. అలాంటి బుద్ధుడి జీవితం, బోధనలు, సూక్తులను ఈ ‘గౌతమ బుద్ధుడు’ పుస్తకంలో వివరించారు పి.రాజేశ్వరరావు. సిద్ధార్థుడి బాల్యం ఎలా గడిచింది? ఇంటినీ, నగరాన్ని విడిచి ఎందుకు వెళ్లిపోయాడు? లాంటి విషయాలను ఆయన పినతల్లి, భార్య, శిష్యుల మాటల్లో వివరించారు. నిర్వాణమంటే ఏమిటి? కుల విభజనకు కారణం కర్మా? జన్మా? లాంటి సందేహాలకు సమాధానాలు, బుద్ధుడి నిర్వాణానంతరం భౌతిక కాయాన్ని ఏం చేశారు? తదితర ఆసక్తికర విషయాలనూ ప్రస్తావించారు. ఇంకా అక్షర క్రమంలో పొందుపరిచిన బుద్ధుడి సూక్తుల్లో కొన్ని మాతృభాషా సంబంధితం కావడం విశేషం. ‘మాతృభాషల్లో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం వల్ల రాదు’, ‘తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోని పదాలూ సరిపోవు’, ‘చెడు పని కన్నా చెడు ఆలోచన చెడ్డది’ లాంటి మాటలు ఆలోచింపజేస్తాయి. కుల, మత, వర్గరహిత సమాజాన్నీ ఆకాంక్షించే వాళ్లకి తగిన కార్యాచరణ స్ఫూర్తిని కలిగించే రచన ఇది.

 - రమేశ్‌ తమ్మినేని

జీవితానుభవాలు

రచయిత: అంబటిపూడి వెంకటరత్నం: పుటలు: 19+189; వెల: 100/-; ప్రతులకు: ఎ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి, చందానగర్‌, రంగారెడ్డి 99498 49583

జీవితానుభవాలు

అంబటిపూడి వెంకటరత్నం అంతరంగ తరంగాలే ఈ వ్యాసతరంగాలు. ఇందులో భాష, చారిత్రక, కవిత్వ, కవుల వ్యక్తిత్వ, జీవితానుభవ వ్యాసాలు ఉన్నాయి. వాటిలో శ్రీమాత - అరవిందుల తత్త్వదర్శన వ్యాసమే అన్నింటా ఆణిముత్యం. వీరు అరవిందుల తత్త్వాన్ని, శ్రీమాత జీవితాన్ని ఇందులో సంక్షేపించారు. ‘‘పురుషుడు ఎప్పుడూ సమాధిలో ఉంటాడు. ఆయనయొక్క ఇచ్ఛాశక్తియే లోపలి నుంచి వికసిస్తుంది. ఆ ఆద్యాశక్తి సర్వదా జాగరూకుడైన శివునితో కలిసి ఉన్న అర్ధనారీశ్వరి’’. అది అరవిందుల తంత్రసాధన అంటారు. మన పూర్వులందరూ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటే ఆరోహణ ప్రక్రియ మాత్రమే చెప్పారు. కానీ అరవిందులు అవరోహణ పద్ధతిని అనుసరించి ‘‘ఈ అవరోహించిన ఆత్మకు దివ్యజీవమును ఈ జీవితముననే లభ్యమగుననియు, ఈ విధానమునకు తానే కర్తననియు, ఇదే శ్రీమాత లక్ష్యమనియు’’ చెప్పారు. ఇంత తేలికగా అరవిందుల్ని దర్శింపజేసిన రచయిత ధన్యులు.
తమ జీవితానుభవ వ్యాసంతో అందరూ అంగీకరించని, హేతువుకు అందని వ్యక్తిగత అనుభవాలెన్నో ఉదాహరించారు. ఆయన చెప్పిన ‘అర్ధరాత్రి ఇళ్లపై రాళ్లు పడటం’ అనేది నాకూ అనుభవమే! ‘సత్యం-అహింస’ అనే వ్యాసంలో సత్యాహింసలు రెండూ ధర్మం అనే మూడోదాన్ని ప్రతిష్ఠించేదిగా ఉండాలని భావించారు. జయదేవునికి, పిచ్చయ్య శాస్త్రికి పోలిక చెప్తూ ‘‘గీర్వాణభాషను పుటంపెట్టి మెత్తదనం కూర్చి పోతపోసినాడు జయదేవుడు, తెనుగు వెన్నతో గీర్వాణపుటచ్చున విగ్రహము కూర్చినారు శాస్త్రిగారు’’ అన్న రచయిత వివేచనాశక్తి అద్భుతమని చెప్పక తప్పదు. ఇలా పూర్వ నవీన వాదాలను సమన్వయపరచి ఆనందాన్నిచ్చే సాధనమే రసమని నిర్ణయించారు. అలానే సౌందర్యంలోని భిన్నత గురించి చెబుతూ ‘ఒక గులాబియందు గణికభావం, మల్లికయందు గృహిణీభావం, పద్మమునందు పట్టమహిషీభావం నాకు గోచరిస్తుంది ఎందుకు!’ అని ఆశ్చర్యపోతారు కవి. ఇలా మనకు ముందుతరం వ్యాసకర్తల రచనల రుచి గ్రహించాలనుకొనేవారు తప్పక ఈ పుస్తకం చదవాల్సిందే. వారి రచనాశైలి, చెప్పటంలో గంభీరత, ఆలోచనలలోని లోతు అనుభవించాల్సిందే!

- చింతలపూడి వెంకటేశ్వర్లు

కాబోయే పాత్రికేయుల కోసం..

రచయిత: డా।। పమ్మి పవన్‌కుమార్‌; పుటలు: 204; వెల; Rs144; ప్రతులకు; ఎస్‌.ఆర్‌. బుక్‌లింక్స్‌, విజయవాడ 94919 62759

కాబోయే పాత్రికేయుల కోసం..

సమాజ గమనాన్ని అతి వేగంగా, అత్యంత గరిష్ఠ స్థాయిలో ప్రభావితం చేసేవి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. సమాజ అభివృద్ధికి సైతం ఇవే దిక్సూచులు. ఈ రంగాల్లో నిపుణులకు అవకాశాలు మెండు. ఆ దిశగా స్వీయ శిక్షణ పొందేందుకు, పత్రికా రచనలోని ప్రాథమిక సూత్రాల పట్ల అవగాహన పెంచుకునేందుకు డా।।పమ్మి పవన్‌కుమార్‌ ‘ప్రసార మాధ్యమాలు - భాషా నైపుణ్యాలు’ పేరుతో గ్రంథం రచించారు. పత్రికారంగ చరిత్ర, అభివృద్ధి, వికాస దశలు, ప్రసార మాధ్యమాల్లో ఉపయోగిస్తున్న భాష, ఇందులో రావాల్సిన మార్పులు, సామాజిక మాధ్యమాల పరిచయం, వాటిలోని భాష వంటి అంశాలన్నింటినీ ఇందులో విశ్లేషణాత్మకంగా వివరించారు. వార్తా రచనలో అనువాద సమస్యలు, పద్ధతులు, విలేకరులు ఉపసంపాదకులుగా, సంపాదకులుగా ఎదగటానికి అవసరమైన ప్రమాణాలు కూడా పొందుపరిచారు. పాత్రికేయ రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఆకరగ్రంథంగా నిలుస్తుంది.

 - కప్పగంతు రామకృష్ణ

అక్షరామృత కలశం

రచయిత: డా।। కె.వి.రమణ; పుటలు: 114; వెల: Rs50; ప్రతులకు: శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్‌, హైదరాబాదు, 93913 43916

అక్షరామృత కలశం

మనిషి జీవిత పరమావధి నిత్యానందానుభూతి. ఆ అనుభూతిని అందుకోడానికి ఉపకరించే ఎన్నో అంశాలను సమగ్రంగా, సుబోధకంగా ఆవిష్కరించారు డా।। కె.వి.రమణ. అధ్యాపకుడిగా, ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న రమణ, తన జీవితాన్ని అద్భుతంగా మధించి అమృత కలశాన్ని ఆవిర్భవింపజేశారు. ‘అమృతవర్షిణి’తో తన భావపరంపరను అభివ్యక్తీకరించారు. 50 వ్యాసాల పరంపరగా కొనసాగిన ఈ భావవీచిక ఎన్నో విషయాలను స్పృశిస్తుంది. మన ఘన చరిత్ర, వారసత్వం, ఆర్షధర్మం, నడవడిక, జీవన వైవిధ్యం, సామాజిక సంక్లిష్టతలు, సంస్కృతి సంప్రదాయాలు ఇలా ఎన్నో నేపథ్యాంశాల్ని రమణీయంగా వ్యక్తీకరించారు. వ్యక్తిత్వ వికాసానికీ, వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకోవడానికీ, అంతర్వీక్షణతో తనను సంస్కరించుకోవడానికి ఉపయుక్తమయ్యే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. చదివింపజేసే సరళ సుబోధకమైన శైలి, వాక్య నిర్మాణ కౌశలం, వస్తువు ఎంపిక, అంశం ఎత్తుగడ, ముగింపుల్లో విభిన్నత్వం పుస్తకంలో అదనపు ఆకర్షణలు. జీవన సారాంశాన్ని అక్షరాల్లో చిత్రిక పట్టిన రచయిత నైపుణ్యం ఇందులో కనిపిస్తుంది.

 - డా।। కావూరి రాజేశ్‌ పటేల్‌

ఇద్దరు ప్రజాకవుల భావసారూప్యత

రచయిత: యానాద్రిరాజు(97018 57260); పుటలు: 235; వెల: Rs100; ప్రతులకు: బి.రాజశేఖర్‌రాజు, షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా; ప్రధాన పుస్తక కేంద్రాలు.

ఇద్దరు ప్రజాకవుల భావసారూప్యత

‘భక్తి కొలది వాడే పరమాత్ముడు/ భుక్తిముక్తి దానే యిచ్చు భువి బరమాత్ముడు’ అని పరమాత్మ తత్వాన్ని కీర్తించాడు అన్నమయ్య. వేమన కూడా అంతే... ‘భక్తియున్న చోట పరమేశ్వరుండుండు/ భక్తిలేని చోట పాపముండు’ అంటాడు. ఇదొక్కటే కాదు ప్రజాకవులుగా పేరుగాంచిన ఈ ఇద్దరి పలుకుల్లో ఎన్నో పోలికలు ఉన్నాయి. జానపదుల భాషకు కావ్య గౌరవం కల్పిస్తూ పాటలు కట్టి తొలితెలుగు వాగ్గేయకారుడుగా అన్నమయ్య నిలిచిపోతే... వందలాది ఆటవెలది పద్యాల్లో సమాజ స్వరూపాన్ని వెల్లడించి, జనానికి దిశానిర్దేశం చేసి తెలుగువారి నాలుకల మీద నిలిచిపోయాడు వేమన. అన్నమయ్య, వేమనల తత్వంలో సామ్యాన్ని తగిన దృష్టాంతాలతో చూపిస్తూ యానాద్రిరాజు రాసిన పరిశోధనాత్మక పుస్తకం ఈ ‘అవే పదాలు’. కాలాలు వేరైనా ఈ కవుల మధ్య ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ఈ విషయాన్ని నిరూపిస్తూ సాగుతుందీ పుస్తకం.

- హర్ష

కవ్వించే... కదిలించే... కవితలు

రచయిత: జనార్ధన మహరి; పుటలు: 224; వెల:Rs.100; ప్రతులకు: సంపాదకుడు; అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు; క్రియేటివ్ లింక్స్, నల్లకుంట, హైదరాబాదు, 98480 65658

కవ్వించే... కదిలించే... కవితలు

ఈ రోజుల్లో కవిత్వం ఎవరు చదువుతున్నారండీ? అంటారు కొందరు. చదవడానికి అసలు మంచి కవిత్వం ఎక్కడ వస్తోందండీ? అంటారు మరికొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా... కవితా సంపుటాల అమ్మకాలు ఆశాజనకంగా లేవన్నది మాత్రం వాస్తవం. ప్రచురణ సంస్థల నుంచి సహకారం అంతగా లభించకపోతుండటంతో సొంతంగానే పుస్తకాలు ప్రచురించుకుంటున్న కవులు చాలామందే ఉన్నారు. అయితే, వాళ్ల పొత్తాల్లో పాఠకుల వరకూ వెళ్తున్నవెన్నో తెలియదు. తెలుగునాట ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఓ కవితా సంపుటి పదిసార్లు పునర్ముద్రణలకు వెళ్లిందంటే ఆశ్చర్యకరమే కదా. కవిత్వంలో విషయం ఉంటే... కవి భావప్రకటనలో కొత్తదనం కనిపిస్తే ఈనాటికీ కవిత్వానికి పాఠకాదరణ ఉంటుందని చెప్పడానికి ఆ పొత్తమే ఉదాహరణ. అదే జనార్దన మహర్షి వెన్నముద్దలు. ఇది పుస్తకం పేరే కాదు, కవిత్వంలో కొత్త ప్రక్రియ పేరు కూడా! వీలైనంత తక్కువ మాటలు వాడుతూ... సాధారణ పదాల్లోంచే అసాధారణ అర్థాన్ని సాధించడమే దీని ప్రత్యేకత. ఉదాహరణకు ‘పునరపి’ కవిత... ‘నానా చావు/ చచ్చి బతుకుతున్నాం/ ఇంత బతుకు బతికేది/ చివరికి చావటానికి...’! ఇందులో అన్నీ మామూలు మాటలే. కానీ వాటితో సాధించిన అర్థం మాత్రం తత్వ సమానం.

      అనేక విషయాల మీద ఇందులో జనార్దన మహర్షి వ్యంగ్య బాణాలు వేశారు. ‘‘అతను రెండు గుప్పెట్లు మూశాడు/ ఒకటి తెరిచాడు - ఏమీ లేదు/ రెండోది తెరవనన్నాడు/ ప్రపంచమంతా పడిగాపులు కాచింది/ అది తెరవకుండానే తెగ సంపాదించాడు/ చచ్చాకే... అందరూ గుప్పెట విప్పారు/ ... అందులోనూ ఏం లేదు’’ అంటూ లోకుల ఆశలనే పునాదుల మీద ఆకాశాన్ని తాకే భవంతులను నిర్మించుకునే కొందరు వ్యాపారుల మీద చురక వేస్తూనే, ఎండమావులను చూసి కుండలోని నీళ్లను పారబోసుకునే వాళ్లకూ కాస్త సెగ అంటించారు. ఈ శైలే పాఠకులను మైమరపింపజేస్తుంది. ఇందులో మనసును పట్టి లాగే మధుర కవితలూ ఉన్నాయి. ‘అమ్మో ముద్దా?/ తన పెదాలతో నా పెదాల్ని మూసేసింది/ పాతికేళ్లయ్యింది/ నేను నోరు విప్పితే ఒట్టు...’- చిక్కటి ప్రేమకు చక్కటి భావవ్యక్తీకరణ ఇది. గుండెలోతులను తడిమే కవితలకూ దీన్లో లోటులేదు. మొత్తమ్మీద మంచి రసానుభూతిని అందించే పొత్తమిది. 

- సత్యభారతి

తెలుగు సందళ్లు

సంపాదకులు: సాకం నాగరాజ (94403 31016), గంగవరం శ్రీదేవి; పుటలు: 136; వెల:Rs100; ప్రతులకు: రాజాచంద్ర ఫౌండేషన్‌, తిరుపతి, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లోనూ..

తెలుగు సందళ్లు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో సమాంతరంగా, తెలుగు సాహిత్యం, కళలను కూడా కాపుకాసుకునే ప్రయత్నంలో భాగంగా వెలువరించిన ప్రత్యేకసంచిక ఇది. పి.సత్యవతి, అట్టాడ అప్పలనాయుడు, కె.వరలక్ష్మి తదితరుల 20 కథలు, 12 ముఖాముఖీలు, వ్యాసాలు, కవితలు, బాతిక్‌ చిత్రాలతో అందంగా ఈ సంచికను తీర్చిదిద్దారు. ఇందులోని కథలు ఒకదాన్నిమించి ఒకటి జీవిత సత్యాలను విశదం చేస్తాయి. ముఖ్యంగా ‘బలగం, కన్నగాడి నాన్న, గోదావరి అగ్రహారం’ మనసును కుదుపుతాయి. తన సాహిత్య జీవితపు పునాదులు బాల్యానివే అన్న పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌, యదార్థ జీవన దృశ్యాలను కథల్లో ఒడిసిపట్టి, గుండెల్ని కదిలించే కమనీయ కథకురాలు అబ్బూరి ఛాయాదేవి, రాయలసీమ మాండలికాన్ని అక్షరామృతంగా మార్చిన నామిని, సినీసంగీత విజ్ఞాన సర్వస్వం వి.ఎ.కె.రంగారావు తదితరులు తెలుగు భాషాసాహిత్యాల ప్రస్థానంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకం. సాహిత్యమే ప్రజలను కలపాలన్న సింగమనేని ఆశ నెరవేరాలంటే ఇలాంటి తెలుగు భాషా సాహిత్యాల ప్రత్యేకసంచికలు ఇంకా ఎన్నో వెలువడాలి.

- కనకదుర్గ

అక్షర నీరాజనం

రచయిత: డా।। తిరుమల శ్రీనివాసాచార్య; పుటలు: 78; వెల: Rs80; ప్రతులకు: రచయిత, హైదరాబాదు, 040 27196507

అక్షర నీరాజనం

పాతిక పుస్తకాలు రచించి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన డా।। తిరుమల శ్రీనివాసచార్య మరో పద్యకావ్యమే  ఘంటసాల ప్రణుతిమాల. ఇందులో ఘంటసాల జీవిత విశేషాలన్నింటినీ వచనంతో పాటు అద్భుతమైన పద్యాల్లోనూ ఆవిష్కరించారు. ఘంటసాల జననం, విద్యాభ్యాసం, జైలు జీవితం, నాటకరంగ ప్రవేశం, సావిత్రితో వివాహం, ఆ తర్వాత మద్రాసు జీవితం గురించి కూడా ఎంతో సమాచారాన్ని అందించారు. చాలా సులభమైన శైలిలో పద్యాన్ని మళ్లీ మళ్లీ చదువుకునే పద్ధతిలో వచ్చిన కావ్యమిది.   ఘంటసాల సంగీత కచేరీలు జరిగిన వివిధ దేశాల పేర్లనూ పద్యాల్లో చక్కగా పొందుపరిచారు. ఘంటసాల యాభైరెండేళ్ల వయసులోనే పరమపదించడం ఓ విషాదం. దాన్ని వివరించే ‘ఘంటసాల నిర్యాణం’ ఘట్టం కంటతడి పెట్టిస్తుంది.

- కన్నోజు లక్ష్మీకాంతం
 

ప్రణయ కావ్యం

రచన: డా।। ధారా రామనాథశాస్త్రి; పుటలు:84; వెల:Rs100; ప్రతులకు: ఎ.వి.కె.ఫౌండేషన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాదు, 98491 23304

ప్రణయ కావ్యం

ముల్లోకాలను తన మువ్వల సవ్వడితో మురిపించిన సౌందర్యరాశి  ఊర్వశి ప్రణయగాథను సుమధుర కావ్యంగా మలిచి, ప్రముఖ నాట్యావధాని డా।। ధారా రామనాథశాస్త్రి అందించిన గ్రంథమే ఊర్వశి. ఊర్వశీ పురూరవుల ప్రణయగాథను రుగ్వేదం ఆధారంగా ఇందులో నిక్షిప్తం చేశారు. కొంత వాచ్య పద్ధతిలో మరికొంత సూచన పద్ధతిలో ఈ కావ్యాన్ని రూపుదిద్దారు. కథా రూపంలో  ఈ కావ్యం వేదం నేపథ్యంతో ప్రారంభమై, నాయికా నాయకుల వేదనతో కొనసాగినప్పటికీ... చివరికి యజ్ఞం కీలకంగా మారడం విశేషం! వివిధ ఖండికలతో సాగే ఆ కావ్యంలో ప్రణయ సన్నివేశాలను మాత్రాచ్ఛందస్సులో చక్కగా ఆవిష్కరించారు కవి. ప్రణయంతోపాటు వైదిక, తాత్త్విక సంబంధ అంశాలనూ జొప్పించడం విశేషం. ఊర్వశిని కావ్యనాయికగా ఉన్నతంగా చిత్రించడంలో సఫలీకృతులయ్యారు.

- దాస్యం సేనాధిపతి
 

  • Previous
  • 1234....................................................................73
bal bharatam