‘దీప తోరణం’

రచయిత్రి: కన్నెగంటి అనసూయ; పుటలు: 177; వెల:Rs 120; ప్రతులకు: రచయిత్రి, హైదరాబాదు, 92465 41249

‘దీప తోరణం’

బంధాలు, అనుబంధాలు, మానవీయ విలువలు, సామాజిక స్పృహ, జీవన సత్యాల సమాహారంగా పాఠకుల మనసును హత్తుకునే 15 కథల సంపుటం దీప తోరణం. పిల్లలకు లభించే అదనపు సౌకర్యాలు, ఏకాంతం, ఇచ్చే ‘అతి’ స్వేచ్ఛ, సెల్‌ఫోన్ల సంస్కృతి ఎలాంటి అనర్థాలకు దారితీసే అవకాశముందో ‘జీవితాల్ని శాసించేవి’ కథలో రచయిత్రి స్పష్టం చేశారు. అంటరానితనం పేరిట దూరంపెట్టిన వర్గంలోని వ్యక్తే.. ఆపత్సమయంలో రక్తదాతగా నిలిచి ప్రాణం పోసిన తీరు ‘ఏది మురికి..? ఎవరు మురికి?’ కథలో సమసమాజ ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ‘ఎప్పటికీ సజీవంగా’, ‘ఆ చల్లని నీడలో’ తదితర కథలు దేనికదే ప్రత్యేకం. చక్కని శిల్పం, ఆకట్టుకునే కథన శైలి, కొసమెరుపులు అనేక కథల్లో కనిపిస్తాయి.

- సాయిచిరంజీవి

బహుముఖ ప్రజ్ఞాశాలి

పుటలు: 188; వెల: Rs100; ప్రతులకు: వోలేటి పార్వతీశం, హైదరాబాదు, 040 27643692, కిన్నెర పబ్లికేషన్స్‌ 98660 57777

బహుముఖ ప్రజ్ఞాశాలి

‘‘మృదుమధురమైన కంఠస్వరం, స్పష్టమైన వాచికం. ప్రసన్నమైన హావభావ వ్యక్తీకరణ... గల వ్యక్తి వోలేటి పార్వతీశం’’ అని ఆయన సృజనాత్మక ప్రతిభను కొనియాడుతూ ఓ కవి చేసిన వ్యాఖ్యలివి. రేడియో, దూరదర్శన్‌లతో అనుబంధం ఉన్నవారికి పార్వతీశాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పద్యాల తోరణం, మహాకవులకు నీరాజనం, అవధానం, ఆణిముత్యాలు తదితర ప్రసారాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను మొట్టమొదట ప్రసారం చేసి దూరదర్శన్‌కి ప్రత్యేకతను సంపాదించిపెట్టారు. పార్వతీశం పదవీ విరమణ వేళ... తనతోటి ఉద్యోగులు, కవులు, పండితులు, ప్రముఖులు దాదాపు 80 మంది వరకూ ఆయనను అక్షర అక్షతలతో ఆశీస్సులందించారు. అదే ఈ ‘వాగ్విలాసం’.  పార్వతీశం బహుముఖీన ప్రతిభకు ఇది అద్దం.

- పార్థు

త్రిభాషా కావ్యం

రచయిత: అంబటిపూడి వెంకటరత్నం; పుటలు: 197; వెల:Rs100; ప్రతులకు: ఎ.వి.సుబ్రహ్మణ్యశాస్త్రి, చందానగర్, రంగారెడ్డి, 99498 49583

త్రిభాషా కావ్యం

అంబటిపూడి వెంకటరత్నం భావకవితా యుగం నాటి కవి. ఆరోజుల్లో ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం-  మూడు భాషల్లోనూ కావ్యం వెలయించారు. ఆయన బహుభాషా పాండిత్యానికి ఈ చంద్రశాల నిలువుటద్దం. ఇందులో కథ కేవలం కల్పితం. సమకాలీన సమస్యను తీసుకుని, దానికి తనదైన పరిష్కారాన్ని సూచించారు. బాల్యస్నేహితుణ్ని ప్రేమించి, అనుకోని పరిస్థితుల్లో ఆ అబ్బాయి చనిపోతే ఆ అమ్మాయి పెద్దలమాట మన్నించి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. కానీ, వరుణ్ని తాకొద్దంటుంది. అతడు ‘సరే, అంటూ నువ్వు అడిగేవరకు ముట్టుకోనులెమ్మని’ ముసుగు తన్నేస్తాడు. తర్వాత అభిప్రాయాలు గ్రహించి కొంతకాలానికి ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ కావ్యం దుఃఖంతో మొదలై సుఖాంతమవుతుంది. ఆధ్యాత్మిక భావసంపదను అందిస్తూ, భారతీయ దాంపత్య ధర్మానికి భంగం కలగకుండా సాగుతుంది.

- చింతలపూడి వేంకటేశ్వర్లు

తెలుగుతల్లికి వ్యాసమాలిక

సంకలనం: వి.ఎస్‌.రాఘవాచారి; పుటలు: 504;వెల: Rs500; ప్రతులకు: సంకలనకర్త, లక్ష్మీపురం, తిరుపతి, 99088 37451

తెలుగుతల్లికి వ్యాసమాలిక

దశాబ్దంపాటు నాటకరంగానికి అక్షరసేవలు అందించింది కళాదీపిక మాసపత్రిక. కారణాంతరాలతో రెండేళ్ల కిందట ఆగిపోయింది. అయితే, ఆ పదేళ్లలో నాటకరంగం మీద ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలను అందించింది. సాహిత్య, పరిశోధనాత్మక వ్యాసాలనూ ప్రచురించింది. వాటన్నింటిలోంచి 110 మేలిమి వ్యాసాలను ఏర్చికూర్చి ‘కళాదీపిక’ సంకలనంగా తెచ్చారు వి.ఎస్‌.రాఘవాచారి. ‘తెలుగు నాటకం భాషా ప్రయోగాలు’ నుంచి ‘మాతృభాషకు మరణశాసనం’ వరకూ భాషాసాహిత్యాలు, కళలకు సంబంధించి సవిస్తార వ్యాసాలు ఇందులో ఉన్నాయి. రచయితలందరూ చెయ్యితిరిగిన వారే కావడంతో ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. సంప్రదింపు గ్రంథంగానూ ఉపయోగపడే అరుదైన పొత్తమిది.

- కేశజ్ఞ

పర్యాటకులకు దిక్సూచి

రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్‌; పుటలు: 256; వెల: 250; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్, హైదరాబాదు; 040 24224458/59

పర్యాటకులకు దిక్సూచి

ఏనుగుల వీరస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’తో తెలుగులో యాత్రారచనలు మొదలయ్యాయి. తర్వాతా కొన్ని వచ్చాయి. కానీ వాటి సంఖ్య, సమగ్రత తక్కువే అయినా సుదూరప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇవి ఉపయోగపడతాయి. పర్యటనకు వెళ్లే ముందు ఏయే అంశాలను అధ్యయనం చెయ్యాలి, ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలన్న విషయాల్లో దిక్సూచిగా నిలుస్తుంది ముత్తేవి రవీంద్రనాథ్‌ రాసిన ఈ ‘మా కేరళయాత్ర’. ఇందులో తమ కేరళయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. అనంత పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్, అట్టుకల్‌ జలపాతం, పెరియార్‌ అభయారణ్యం వంటి ప్రదేశాల గురించి వివరించిన తీరు బాగుంది. అలానే అక్కడి చరిత్ర, సంస్కృతీవైభవం, ఆచార వ్యవహారాలు, జీవన స్థితిగతుల గురించి విపులంగా రాశారు.    

- శాంతి

పాఠకుల కథలు

రచయిత : ఆకెళ్ళ శివప్రసాద్‌; పుటలు: 204;వెల :Rs150; ప్రతులకు: రచయిత, హైదరాబాదు, 99495 93996

పాఠకుల కథలు

పత్రికలు, రేడియో, టీవీ, సినిమా మాధ్యమాల రచయితగా ఆకెళ్ళ శివప్రసాద్‌ సుపరిచితులు. కథ, నవల, నాటకం, రూపకం, ధారావాహిక, బాలసాహిత్యం, అనువాదం తదితర రచనా ప్రక్రియల్లో అనుభవజ్ఞులు. పలు పత్రికలకు ఆయన రాసిన 27 కథల సంపుటి ‘కిటికీలోంచి వాన’. ముప్ఫయ్యేళ్ల క్రితం ‘భారతి’ సాహిత్య మాసపత్రికలో ‘కిటికీలోంచి వాన’ కథ ప్రచురితమవడం ఈ రచయిత ప్రౌఢతనూ నిరూపిస్తుంది. అదే ఈ సంపుటికి శీర్షికయింది. ఇందులోని అన్ని కథలూ దేనికదే విశిష్టతను సంతరించుకొని ఉత్సుకతతో చదివించేలా ఉన్నాయి. కథాకథనంలో, శైలీవిన్యాసంలో నేర్పూ, నైపుణ్యం కనిపిస్తాయి. ఇందులో భీమారావు బొమ్మలు, ఊహకందని ఇతివృత్తాలతో కూడిన కథలూ ప్రత్యేకాకర్షణలు. అయితే పరిణత పాఠకులకూ, సగటు సామాన్య పాఠకులకూ కలిగే అనుభూతులు చాలావరకు విభిన్నంగా ఉంటాయి. 

- ఎ.వి.జనార్దనరావు

తిరుమలేశునికి పద్యాలమాల

రచయిత: రేగడమిల్లి కృష్ణకిరణ్‌; పుటలు: 63; వెల: Rs40; ప్రతులకు: ఆర్‌.సరోజ, పాయకరావుపేట, విశాఖపట్నం, 92477 14379

తిరుమలేశునికి పద్యాలమాల

నీవై చేసిన సృష్టిలో నణువునే నే నన్న నా భావనన్‌ నీవే గల్గగ జేసినావు...’ అంటూ రేగడమిల్లి కృష్ణ కిరణ్‌ కలియుగ దైవం వేంకటేశ్వరుని మీద రాసిన 101 పద్య సుమహారమే ఈ వేంకటేశ్వరా. ఇందులో శతకం ఒక్కటే కాకుండా, తన తాతయ్య అచ్చనశాస్త్రి, తాను విద్యాభ్యాసం చేసిన కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం, శివాజీ, కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి, కృత్తివెంటి పేర్రాజుపంతులు తదితరుల ఔన్నత్యాన్ని పొగడుతూ రాసిన పద్యాలు రమణీయమైన శైలిలో సాగాయి. తినుచు దినుచును నిద్రింతు తినుటమాని/ ఎంత నమ్మకమోయి నీకెంత హాయి/ తల్లిపైగల విశ్వాసముల్లమందు/ నిలుపుకొను మయ్య మీసాలు మొలుచునాడు.. అంటూ తేట తెలుగులో రాసిన ‘పసివాని పద్యాలు’ ఇప్పటి పిల్లలకు చెప్పేందుకు పనికివస్తాయి. 

- గోవింద

తెలుగుదనం...

రచయిత: డా।। ద్వా.నా.శాస్త్రి; వెల:Rs80; ప్రతులకు: రచయిత, గాంధీనగర్, హైదరాబాదు, 98492 93376

తెలుగుదనం...

తెలుగును కాపాడుకోవాలి.. మాతృభాషను సంరక్షించుకోవాలి.. సాహిత్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలి. ఇవి భాషా ప్రేమికులు చెప్పే మాటలే. ఎందుకంటే కేవలం మన మాతృభాష అయినందువల్లనేనా? తెలుగు భాషోద్ధరణాభిలాషకు మూలం తెలుగు మీద జాలి, దయ, కరుణలేనా? ఇలా... సాహితీ వేత్తలు, రచయితలు, పండితశిక్షణ విద్యార్థులు తదితర స్థాయులవాళ్లు అడిగిన ప్రశ్నలకు డా।। ద్వానాశాస్త్రి ఇచ్చిన ఆసక్తికర సమాధానాలే ఈ ‘పలకరిస్తే ప్రసంగం’ పుస్తకం. వాస్తవానికి ఇదొక పొత్తం కాదు. వినూత్న ప్రసంగ అవధానానికి అక్షర రూపం. ఇది చదివిన వాళ్లకు తెలుగుభాష మీద ఉన్న చిన్న చూపును తుడిచేస్తుంది. తెలుగు గొప్పదనాన్ని, ప్రత్యేకతను, సాహితీ విశేషాలను సాహితీ రహస్యాలను తన సమాధానాలతో క్లుప్తంగా, సూక్ష్మంగా, అబ్బురంగా వివరించారు. 

- డి.శ్రీనివాసరావు

ఇలా మాట్లాడాలి

రచయిత: ఉషశ్రీ, పుటలు: 56; వెల: Rs50; ప్రతులకు: ఉషశ్రీ మిషన్, విజయవాడ, 80085 51231

ఇలా మాట్లాడాలి

మహాభారతంలో పాండవుల పక్షాన ద్రుపద పురోహితుడు, శ్రీకృష్ణుడు- కౌరవుల తరఫున విదురుడు, సంజయుడు రాయబారులుగా వ్యవహరించారు. రాయబారి అంటే ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లు ప్రవర్తించాలి. భారతంలో రాయబారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ ‘ఉద్యోగపర్వంలో’ని కొన్ని సన్నివేశాలను ఓ పత్రికలో ధారావాహికగా రాశారు ఉషశ్రీ. అది ‘ఎవరు ఎలా మాట్లాడతారు?’. ఇందులో ‘మధ్యవర్తిని పంపుతున్నారా?’, ‘మాటల మాటున రాజనీతి’, ‘ఏ తీరున బోధించాలి’, ‘పనికి ఫలితంతో పనిలేదు’ తదితర వ్యాసాలు 18 ఉన్నాయి. ఇవి చదువుతుంటే ఎదుటివారి మనసును, వారి అంతరార్థాన్ని గ్రహించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. అంతేకాక ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుస్తుంది. ఈ రచనలన్నీ ఉషశ్రీ గారి పెద్దమ్మాయి గాయత్రీదేవి పుస్తకంగా పాఠకులకు అందించారు. 

 - లీల

    1234........................................................61
  • Next
bal bharatam