కలలను సాధించే క్రమంలో ప్రేమను వదులుకోవాల్సి రావచ్చు. కానీ నిజాయితీతో తమ సాధనపట్ల అంకితభావాన్ని చూపగలిగితే ప్రేమ తిరిగి వస్తుంది, లేదా మంచి జ్ఞాపకంగానైనా ఉంటుంది.
విజయవంతమైన పుస్తక రచయితగా, ఒక సినిమాకు రచన కూడా చేస్తున్న ప్రేమ్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది విలేఖరి. అందులో భాగంగా అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావనకు తెస్తూ, రచనా వ్యాసంగం ఎలా మొదలైందని అడుగుతుంది. చిన్నప్పటి నుంచి మొహమాటం ఎక్కువనీ, అందుకే చురుగ్గా ఉండేవాడిని కాదనీ, పుస్తకాలు చదువుతూ తన అనుభవాలన్నింటినీ నోట్‌బుక్‌లో రాస్తూ ఉండేవాడినని చెబుతాడు. ఎవరినైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు ప్రేమ్ తన గతం గురించి చెబుతాడు.
ప్రేమ్, స్నేహ, అజయ్ స్నేహితులు. ఎప్పుడూ థ్రిల్లర్ కథలే రాసే ప్రేమ్‌ను ప్రేమ కథలు రాసి గొప్ప రచయితవు కావాలని ప్రోత్సహిస్తుంది స్నేహ. బిర్యానీ చేసేవారి బట్టి రుచి మారినట్టే, రాసిన విధానం మీదే మామూలు ప్రేమకథలు కూడా గొప్పగా మారతాయని చెబుతుంది. తనను అర్థం చేసుకునే స్నేహితురాలే తనకు భార్య అయితే జీవితం సంతోషంగా ఉంటుందనే అభిప్రాయాన్ని స్నేహకు చెబుతాడు ప్రేమ్. మొదట సందేహించినా తర్వాత ఒప్పుకుంటుంది. కానీ ఆమె తండ్రి మాత్రం రచయితకు జీవితం ఉండదని, ఏదైనా ఉద్యోగం చేస్తానంటే పెళ్లికి ఒప్పుకుంటాననీ అంటాడు. తన ప్యాషన్‌ను వదులుకోవడం ప్రేమ్‌కి ఇష్టం లేకపోవడంతో విడిపోతారు. ఇదంతా జరిగి రెండేళ్లయిందని చెబుతూ గతాన్ని ముగిస్తాడు ప్రేమ్. ఒకరోజు కాఫీ షాప్‌లో ప్రేమ్‌కు అనుకోకుండా కనిసిస్తుంది స్నేహ. ఆమెకు పెళ్లయ్యిందా? తర్వాత ఏంటి అన్నదే ఈ చిత్ర కథాంశం. పరిపక్వతతో కూడిన పాత్రలను రాసిన విధానం బాగుంది.
నటీనటులు: కళ్యాణ్ సిద్, సురభి, సతీష్ సరిపల్లి
నిర్మాత: కళ్యాణ్ సిద్
రచన, దర్శకత్వం: డి.సురేంద్ర