అచ్చతెలుగు ప్రేమ కథా చిత్రం

నుడికారాలు, సామెతలు, చక్కని పలుకుబళ్లతో ప్రతి పలుకులో మంజుల రాగంగా మోగుతుంది మన తెలుగు భాష. అయితే, రోజువారీ మాటల్లో మనం వాడే తెలుగు పదాలెన్ని? ఆంగ్లం మోజులో అమ్మలాంటి మన భాషకు మనమే ఎలా అన్యాయం చేసుకుంటున్నాం?  ‘ఒక తెలుగు ప్రేమకథ’ చిత్రంలో వీటి గురించి వివరించే ప్రయత్నం చేశారు దర్శకులు బి.సంతోష్‌ కృష్ణ.
      సినిమా అంటేనే వ్యాపారమయమైన తరుణంలో మన భాష, సంస్కృతి గొప్పదనాన్ని తెలియజెప్పే చిత్రాలను ఆశించడం ఎడారిలో ఒయాసిస్సు కోసం వెతకడం లాంటిదే! నిజానికీ నాగరికత పేరుతో పర భాషా పదాలు మన జీవితాల్లోకి చొచ్చుకురావడానికి సినిమా ఓ కారణం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మభాష గురించి ఆలోచించి చక్కని చిత్రం రూపొందించారు సంతోష్‌ కృష్ణ.  
      బీటెక్‌ పూర్తి చేసిన నచికేత ఉద్యోగ ప్రయత్నాలేవీ చేయకుండా, తండ్రి తిట్లు పట్టించుకోకుండా కాలం గడిపేస్తుంటాడు. కళాశాలలో చదివే రుగ్వేద ఒక్క ఆంగ్లం మాట కూడా వాడకుండా పూర్తి తెలుగులో మాట్లాడుతుంటుంది. అమ్మభాష పరిరక్షణకు పరిశోధనలు చేస్తుంటుంది. ‘తిని తిరిగితే ఎవరూ పిల్లనివ్వర’ని ఓరోజు నచికేతను తిడతాడు తండ్రి. నెలరోజుల్లో ఒకమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తానని సవాల్‌ చేస్తాడు నచికేత. అనుకోకుండా కలిసిన రుగ్వేదను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.   
      తెలుగు మాట్లాడ్డం కూడా సరిగా రాని నచికేతను అసహ్యించుకుంటుంది రుగ్వేద. ఒక్క పదిహేను రోజులు పూర్తిగా తెలుగులో మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తానంటుంది. దానికి ఒప్పుకుంటాడు నచికేత. ఒక ట్రాన్స్‌మిటర్‌ పెన్‌ను అతనికిచ్చి ఆ రోజు నుంచి అతనేం మాట్లాడినా వింటానంటుంది. పందెంలో మూడుసార్లు ఇంగ్లీషు పదాలు వాడొచ్చని చెబుతుంది. అతణ్ని వదిలించుకోడానికే అలాంటి పందెం కట్టిందని, ఇంగ్లీషు లేకుండా మాట్లాడటం అసాధ్యమని నచికేత స్నేహితులు గేలి చేస్తారు. మరి ఆ పందెంలో అతను గెలిచాడా? అతనికి ఎదురైన అనుభవాలేంటి? అన్నదే అసలు కథ. 
      ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర ఆచార్య చక్రవర్తులను తెలుగుకు ప్రతినిధిగా మలిచారు దర్శకుడు. ఇంగ్లీషు పదాలకు ఆయన తెలుగు నిఘంటువు తయారు చేస్తారు. దాన్ని ప్రచురించి పాఠశాలలు, కార్యాలయాల్లో ఉచితంగా పంపిణీ చేస్తే తెలుగు వాడుక పెరిగి భాష బతుకుతుందని భావిస్తారు. కానీ ప్రచురణ కర్తలు ఒప్పుకోకపోవడంతో పిచ్చివాడిలా తిరుగుతుంటారు. సిగరెట్‌ని తెలుగులో ఏమంటారని స్నేహితుల్ని నచికేత అడిగితే, అక్కడికొచ్చిన చక్రవర్తుల ‘సీమబీడీ’ అనే పదాన్ని తాను సృష్టించినట్లు చెబుతారు. ఇందులోని పాటలు కూడా తెలుగు భాష విశిష్టతకు అద్దం పట్టేవే. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ సినిమా చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ చిత్రాన్ని డిజిక్వెస్ట్‌ ఇండియా ప్రై.లి. పతాకంపై కె.బసిరెడ్డి నిర్మించారు. తెలుగు మన మూలం, దాన్ని నేర్చుకోవడం సంస్కారం, భాషను ప్రేమించడం మన నేలకు మనం చూపే కృతజ్ఞత అని చాటిచెప్పే ఈ చిత్రం ఈ కాలానికి ఓ కనువిప్పు! (శ్రేయాస్‌ ఈటీ ఆప్‌లో చిత్రాన్ని చూడవచ్చు) - కార్తీక్‌ 


మాది సిద్దిపేట. బీటెక్‌ పూర్తి చేసి సినీ రంగంలోకొచ్చాను. కొన్ని లఘుచిత్రాలు తీసి పురస్కారాలూ అందుకున్నాను. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైనప్పుడు తెలుగు భాష నేపథ్యంగా సినిమా తీయాలనిపించింది. అయితే ఉపన్యాస ధోరణిలో కాకుండా హాస్యప్రధానంగా, ప్రేమకథగా, సందేశాత్మకంగా ఈ చిత్రం మలచాను. ఈ సినిమాలోని ఆచార్య చక్రవర్తుల పాత్రకు మహా నిఘంటువు నిర్మాణాన్ని తలపెట్టిన రామోజీరావుగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. తెలుగు మీద ప్రేమతో రూ.30 లక్షలు ఖర్చుపెట్టి మేం చేసిన ఈ ప్రయత్నాన్ని ఎందరో ప్రముఖులు మెచ్చుకోవడం సంతృప్తినిచ్చింది. 

- బి.సంతోష్‌కృష్ణ, దర్శకులు 

అచ్చతెలుగు ప్రేమ కథా చిత్రం

నటీనటులు: మహేంద్ర, లావణ్య, సమ్మెట గాంధీ

నిర్మాత: కె.బసిరెడ్డి

రచన, దర్శకత్వం: సంతోష్‌ కృష్ణbal bharatam