కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వేరే గత్యంతరం లేక చాలా మంది పెళ్లిళ్లని వాయిదా వేసుకున్నారు. తప్పదనుకున్నవాళ్లు అతి తక్కువ మందితో వివాహ తతంగం ముగించారు. ఈ లాక్డౌన్ సమయంలో పెళ్లిచూపులు ఇతివృత్తంతో సరదాగా సాగే చిత్రమిది. పెద్దల సూచనలతో స్కైప్ వీడియో కాల్లో పెళ్లిచూపులకు ఒప్పుకుంటుంది శాలిని. ఈ పెళ్లిచూపుల్లో జరిగే సంభాషణలే తర్వాతి చిత్రమంతా. గతానికి, ఇప్పటికి పెళ్లిచూపుల్లో వచ్చిన వ్యత్యాసాల గురించి చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. శాలిని సంపాదన విని పవన్ లెక్కలేసుకోవడం, అతని గురించి అడిగితే తప్పించుకోవడం తమాషాగా అనిపిస్తాయి. చివరికి పవన్ని పెళ్లిచేసుకోవడానికి శాలిని అంగీకరించిందా లేదా అన్నది చూసి తెలుసుకోవాల్సిందే. వినోదభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుందీ చిత్రం. సోనియా సింగ్, పవన్ సిద్దూల నటన బాగుంటుంది.
నటీనటులు: సోనియా సింగ్, పవన్ సిద్దు
నిర్మాత: పవన్ సిద్దూ
రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్