రావు గారి అబ్బాయి

‘బతుకు కోసం దేహం ఎన్నో దూరాలు పయనిస్తున్నా, మనసు మాత్రం మన ముంగిళ్లలోనే’’ అనే వాక్యం ఈ లఘుచిత్ర కథని క్లుప్తంగా చెప్పేస్తుంది. అమెరికా వెళ్లే ప్రతి అబ్బాయీ అమ్మానాన్నలను వదిలించుకుని వెళ్లిపోతున్నాడన్న వాదన తప్పు అని చెప్పే కథ ఇది. మొదటి నిమిషంలోనే తండ్రీ కొడుకుల మధ్య సంభాషణల్లో వాళ్ల జీవితాలు, ఆలోచనల గురించి అంతా చెప్పేసి చిత్రకథకి తెరదీయడం దర్శకుడు హరీష్‌ నాగరాజ్‌ చేసిన మంచి ప్రయోగం. అక్కడక్కడా ఆంగ్ల పదాలు వినిపించినా... మంచి తెలుగు సంభాషణలు, ఉచ్చారణ ఊరటనిస్తాయి. 
      ‘‘నీతో కాస్త మాట్లాడే సమయం’’ కావాలని కన్నకొడుకును అడిగిన తండ్రి... ‘‘నిన్ను బాగా చదివించి అమెరికా పంపి తప్పు చేశానేమో అనిపిస్తుంది’’ అన్నప్పుడు కొడుకు దూరంగా ఉన్నప్పుడు ఆ తండ్రి పడే బాధకు అద్దంపడుతుంది. ‘‘చిన్నప్పటి నుంచి మీరు నా గురించి ఎన్ని కష్టాలు పడ్డారో, ఆ జ్ఞాపకాలే నన్ను నడిపిస్తున్నాయి నాన్నా... మిమ్మల్ని నేను సరిగ్గా చూసుకోకపోయినా, మీరు నా గురించి గర్వంగా చెప్పుకునేలా చెయ్యలేకపోయినా ఆ ప్రేమకి అర్థం లేదు నాన్నా’’ అన్నప్పుడు ఆ కొడుకు మాటల్లో బాధ్యతనూ ఎంతో బాగా పలికించాడు హరీష్‌. గతాన్ని గుర్తుపెట్టుకుంటూ గమ్యం వైపు ప్రయాణిస్తున్న ఓ అబ్బాయి... తల్లిదండ్రులకీ అంతే విలువ ఇవ్వగలడని ఎంతో బాగా చూపించాడు. పాత్రధారులు కూడా బాగా నటించడంతో మనసుకి హత్తుకునేలా ఉందీ చిత్రం. ‘బతకడానికి ఎంత దూరం వెళ్లినా మనసు మీ దగ్గరే’ అని చెప్పి చిత్రాన్ని ముగించడం ఆకట్టుకుంటుంది. 40 వేల మందికి పైగా ఈ చిత్రాన్ని చూశారు.


మాది గుంటూరు. సినిమాల మీద ఇష్టంతో అయిదేళ్ల కిందట ఇంట్లోంచి వచ్చేశా. తెలిసినవాళ్ల ఇంట్లోనే ఓ సంఘటన చూశా. తండ్రి చనిపోతే, సెలవులు దొరకలేదని ఆఖరిచూపునకు కూడా రాలేదు ఓ అబ్బాయి. అప్పుడే అనిపించింది... డబ్బు మాయలో పడి అనుబంధాలను దూరం చేసుకుంటున్నారని. ఆ ఆలోచనల్లోంచే ఈ కథ పుట్టింది. చిత్రం విడుదలయ్యాక... అమెరికా, ఇంగ్లాండుల్లో ఉంటున్న చాలామంది ఫోన్లు చేశారు. కొందరైతే ఏడ్చేశారు కూడా.

- హరీష్‌ నాగరాజ్‌ 


 

రావు గారి అబ్బాయి

నటీనటులు: కిరీటి దామ‌రాజు, గురురాజ్ మానేప‌ల్లి

నిర్మాత: బీఎఫ్‌సీ (భోపాల్స్ ఫ్రెండ్స్ కేఫ్‌

రచన, దర్శకత్వం: హరీష్‌ నాగరాజ్‌bal bharatam