కరోనా విలయంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు తెలుగువెలుగు.ఇన్ ఆధ్వర్యంలో రామోజీ ఫౌండేషన్ నిర్వహించిన ఈ రోజు వారీ కవితల పోటీ దిగ్విజయవంతం అయింది. పోటీకి ఆహ్వాన ప్రకటన వెలువడింది మొదలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని తెలుగు కవులు సమధికోత్సాహంతో స్పందిస్తూ వచ్చారు. సబ్బండ వర్ణాల సంవేదనల్నీ ఆవాహన చేసుకుని ఎప్పటికప్పుడు అద్భుతమైన కవితల్ని సృజించారు.
ఈ పోటీకి దాదాపు 20 వేలకు పైగా కవితలు వచ్చాయి. ఒక విపత్తు నేపథ్యంలో కేవలం 30 రోజుల వ్యవధిలో ఇన్ని వేల కవితలు వెలువడటం అరుదైన క్రతువుగా భావిస్తున్నాము. ఏ రోజుకారోజు ఎన్ని కవితలు వచ్చిందీ ప్రకటించాము. వచ్చిన ప్రతి కవితనూ రామోజీ ఫౌండేషన్ సంపాదకవర్గంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. రోజూ సుమారు 15 నుంచి 30 వరకూ మొదటి దశ వడపోతను దాటుకుని వచ్చేవి. వీటిలో భాష, శైలి, వస్తువు, సమకాలీనత, ప్రతీకలు, శిల్పం, ప్రయోగాలు, సందేశం... ఇలా పలుకోణాల్లో పరిశీలించి, చర్చించి బహుమతులకు ఎంపిక చేశాము. మొదటి మూడు స్థానాలకూ అర్హమైన కొన్ని కవితలు నిడివి ఎక్కువగా ఉండటం వల్ల అవకాశాన్ని కోల్పోయాయి. రోజూ అన్నింటికీ బహుమతులు ఇవ్వడం, ప్రచురించడం సాధ్యం కాదు. వస్తున్న కవితలను చూసి మొదట్లో 6 అనుకున్న బహుమతుల సంఖ్యను 8కి పెంచాము. కొందరు ఒకటి కన్నా ఎక్కువసార్లు బహుమతులు సాధించారు. బహుమతి వచ్చినా, రాకపోయినా కొంత మంది రోజూ క్రమం తప్పక కవితలను పంపడం ముచ్చట కలిగించింది. విజేతల్లో తొలిసారి కవితని రాసిన వారి నుంచి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల వరకూ ఉన్నారు.
ప్రథమ బహుమతి కవితలను ఈనాడు దినపత్రిక, ఈనాడు.నెట్లలో ప్రచురించాము. నెలరోజుల పాటు వరుసగా కవితలను ప్రచురించడం 46 ఏళ్ల ఈనాడు ప్రస్థానంలో ఇదే తొలిసారి. రోజూ ప్రథమ, ద్వితీయ, తృతీయ కవితలను నాలుగు కేంద్రాల నుంచి ప్రసారం అవుతున్న ఈ.ఎఫ్.ఎం. రేడియోలో వినిపించాము. ఆ ఆడియోలను ఫేస్బుక్, టెలిగ్రాం యాప్లో తెలుగువెలుగు ఛానల్లలో కూడా అందించాము. రోజూ 8 బహుమతి కవితలనూ తెలుగువెలుగు.ఇన్ లో ప్రచురించాము. ఉత్తమంగానే ఉన్నా ఈ పోటీలో బహుమతులు రాని చాలా కవితలు ఇతర పత్రికల్లో, సైట్లలో, ఫేస్బుక్లో, బ్లాగుల్లో ప్రచురితమయ్యాయి. ‘కరోనాపై కదనం’ పోటీ స్ఫూర్తితో రోజూ వివిధ కోణాల్లో కవితల్ని రాశామని చాలా మంది కవులు తెలియజేశారు. ఇదంతా ఎనలేని భాషా, సాహితీ సేవే.
సాహిత్య చరిత్రలోనే అరుదైన ఈ సందర్భంలో అపూర్వ కవితా సంపద పోగుపడింది. ఇదంతా భాష, సాహిత్య, సామాజిక పరిశోధకులకు, విశ్లేషకులకు అద్భుతమైన ముడి సరుకు. మరెక్కడా దొరకని సాహితీ నిధి. దీన్ని భద్రపరిచి, భావితరాలకు అందించాలని తలపెట్టాము. మాకందిన వాటిలో పునరుక్తులు, అభ్యంతరకర భావాలు, పదజాలం ఉన్న కవితల్ని మినహాయించి మిగిలిన అన్నింటినీ తెలుగువెలుగు.ఇన్ లో మూడు విభాగాలుగా ప్రచురించాలని భావిస్తున్నాము. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
ఆ విధంగా మన కవుల సృజన, ఆ కవితా సుమాలన్నీ శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయన్నది మా ఆకాంక్ష. బహుమతి కవితలకు త్వరలో పారితోషికాలను విజేతల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాము. తెలుగువెలుగు.ఇన్ లో ప్రచురించే మిగిలిన కవితలకు ఎలాంటి పారితోషికమూ ఉండదు. వాటిని కవి పేరు, ఫొటోలతో ప్రచురిస్తాము.
ఈ కవితా యజ్ఞంలో పాలుపంచుకున్న వారందరికీ నిర్వాహక సంస్థ రామోజీ ఫౌండేషన్, నిర్వహణ భాగస్వాములు ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈ.ఎఫ్.ఎం. సంస్థలు హృదయపూర్వక కృతజ్ఞతాంజలులను ఘటిస్తున్నాయి.
కరోనాపై మనం విజయం సాధించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ వెలుగుపూలు పూయాలని ఆకాంక్షిస్తూ....
- రామోజీ ఫౌండేషన్
ఎస్పి.బాలు అభినందన
2 తేదీన ప్రథమ బహుమతి పొందిన తంగెళ్ల రాజగోపాల్ ‘మనిషిని నేను’ కవితను ఈనాడులో చదివిన ప్రముఖ సినీ గాయకులు ఎస్.పి. బాలు ఆ కవిని అభినందిస్తూ, దాన్ని పాడి ఆడియోను మీడియాకు విడుదల చేశారు. 28వతేదీన ప్రథమ బహుమతి పొందిన దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి రచన ‘రోడ్లు చిగురించాలి’ని పాడి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవి రెండూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎజ్రాశాస్త్రి ‘ఎంత ఆర్ద్రంగా, ఆర్తిగా రాశారు’ అని ప్రశంసించారు. ‘మిత్రులారా చేతనైన సాయం చేద్దాం. ఆకలిని పూర్తిగా తుడిచెయ్యలేకపోవచ్చు. మనం చిన్న త్యాగం చేసైనా పది మందికీ సహకరిద్దాం. సర్వేజనా సుఖినోభవంతు’ అని బాలు పిలుపునిచ్చారు.