తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu స‌న్న‌పురెడ్డి న‌వ‌ల‌కు తానా పుర‌స్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నవలల పోటీలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘కొండపొలం’ బహుమతి గెలుచుకుంది. 2019 సంవత్సరానికి నిర్వహించిన ఈ పోటీలో బహుమతి కింద రూ.2 లక్షలు రచయితకు అందిస్తారు. 1963 ఫిబ్రవరి 16న కడప జిల్లా బాలరాజుపల్లెలో వెంకటరామిరెడ్డి జన్మించారు. ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతూ అదే గ్రామం నుంచి నిరంతర సాహితీ సేద్యం చేశారు. ఇప్పటి వరకూ ఎనిమిది నవలలు, మూడు కథా, ఒక కవితా సంపుటాలు వెలువరించారు.2017లో కూడా తానా నవలల పోటీలో వెంకటరామిరెడ్డి ‘ఒంటరి’ నవల మరో రెండు నవలలతో సంయుక్తంగా బహుమతి అందుకుంది. 2017లో రాసిన ‘చినుకుల సవ్వడి’ నవల చతుర పత్రిక బహుమతి గెలుచుకుంది. 1998లో తొలిసారి రాసిన ‘కాడి’, 2007లో వెలువరించిన తోలుబొమ్మలాట నవలలు ఆటా పురస్కారం దక్కించుకున్నాయి. ‘కొత్తదుప్పటి, బతుకు సేద్యం, సన్నపురెడ్డి కథలు’ కథా సంపుటాలు ఆయన కలం నుంచి జాలువారాయి. వెంకటరామిరెడ్డి కథలు పలు కథా సంకలనాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇతర భాషల్లోకీ అనువాదమయ్యాయి. తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తేవడానికి 1997లో తానా తొలిసారి నవలల పోటీ నిర్వహించింది. అందులో చంద్రలత ‘రేగడివిత్తులు’ నవల 1.30 లక్షల పూర్తి బహుమతి గెలుచుకుంది. 2019కి వెంకటరామిరెడ్డి నవల రూ.రెండు లక్షల పూర్తి బహుమతి దక్కించుకుంది. తెలుగు నవలకు సంబంధించి ఇప్పటి వరకూ ఇదే అతి పెద్ద బహుమతి. తానా 22వ మహాసభల సందర్భంగా కథాసాహితి సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయి. విజేతకు త్వరలో బహుమతి ప్రదానం చేస్తామని, పుస్తకాన్ని ప్రచురిస్తామని తానా అధ్యక్షులు సతీష్‌ వేమన, నవలల పోటీ కార్యనిర్వాహకులు డాక్టర్‌ జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ అధ్యక్షులు చంద్ర కన్నెగంటి తెలిపారు.  

వెనక్కి ...

chef
bal bharatam