-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలెన్నో కావాలిప్పుడు అన్నారు మహాకవి శ్రీశ్రీ. గతం మూలాలలో దాగిన వాస్తవాలను వెలికితీసి తెలుగు జాతి మూలాలపై వెలుగు నింపే కథకులు కావాలిప్పుడు. భావజాలాలలో చిక్కిన చరిత్ర శకలాలను కలాలతో కూర్చి మన వెనుక తరాల కథలను ఇతిహాసాలుగా మలచగల రచయితలు రావాలిప్పుడు. తెలుగువాళ్లలో చారిత్రక అవగాహన తక్కువ అనేది వాస్తవం. ముఖ్యంగా బడి చదువుల్లో చరిత్రకి ప్రాధాన్యం తగ్గిపోతుందనే ఆవేదన అందరికీ ఉంది. గత డిసెంబరు నెలలో హైదరాబాదు, విజయవాడ నగరాల్లో నిర్వహించిన సదస్సుల్లో దాదాపు 150 మంది రచయితలు, సాహిత్య ప్రియులు, చరిత్రకారులు, పత్రికా, ప్రచురణ రంగాల్లో ప్రముఖులు పాలుపంచుకున్నారు. వారందరి అభిప్రాయాల్లో, చరిత్రను మనసులకెక్కే విధంగా చిన్నలకు, పెద్దలకు కథల రూపంలో చెప్పాలి అనే విషయం స్పష్టంగా వినిపించింది. టీవీ, సినిమా లాంటి ప్రసారమాధ్యమాల్లో చరిత్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేది మరో అభిప్రాయం. అందుకు కావాల్సిన సామాగ్రి సమకూర్చడం కూడా రచయితల బాధ్యతే. కానీ చారిత్రక నేపథ్యంలో కథారచన చేయాలంటే సృజనకి తోడుగా చారిత్రక అవగాహన కూడా కావాలి. దానికి కొంత పరిశోధన, తగిన వనరులు అవసరం. చరిత్రను, స్థల ప్రాముఖ్యాలను, మౌలిక సమాచారాన్ని సులభంగా అందజేయగల నిపుణుల ఆవశ్యకత కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, వర్తమాన రచయితలకు చారిత్రిక నేపథ్యంలో కథారచనకి అవసరమైన సహకార సౌలభ్యాలు అందించేందుకు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, ఇతర నిపుణులతో ఒక కార్యశాల తలపెట్టారు. ఫిబ్రవరిలో విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గునేందుకు ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు.
- సాయి పాపినేని, 98450 34442