-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
సామాజిక సాహిత్య కళా రంగాల్లో ‘పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్’ చేస్తున్న కృషిలో భాగంగా సుప్రసిద్ధ కవి, రచయిత, నాటక కర్త, మేధావి, సామాజిక సంస్కర్త పొట్లపల్లి రామారావు రచనల్ని ప్రచురించింది. ఆయన శత జయంతి ఉత్సవాల్ని 2017లో ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించింది. దానికి కొనసాగింపుగా తెలుగులో ఉత్తమ సాహిత్యకారుల్ని గౌరవించాలనే సంకల్పంతో ‘పొట్లపల్లి రామారావు సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏటా పొట్లపల్లి రామారావు జయంతి సందర్భంగా నవంబర్ 20న ఒక సుప్రసిద్ధ సాహితీ వేత్తకు, ఒక యువ రచయితకు చెరో రూ.25 వేల నగదుతో పురస్కారాలను అందజేస్తోంది.
2020 సంవత్సరానికి గానూ జీవన సాఫ్యల పురస్కారానికి ప్రముఖ కవి, కథకుడు జూకంటి జగన్నాథం, ‘వ్యతిరిక్త ప్రవాహం’ కవితా సంపుటి రచయిత సత్యోదయ్(వరంగల్లు)కు సాహితీ పురస్కారానికీ ఎంపికయ్యారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.ఎ.కె. ప్రభాకర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కోవిడ్ నేపథ్యంలో పురస్కార గ్రహీతలకు త్వరలో సన్మానసభ ఏర్పాటు చేస్తాం.
- కె.రామకృష్ణారెడ్డి, పొట్లపల్లి ఆదిత్య రామ్
పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్ , హైదరాబాదు
జూకంటి జగన్నాథం
రాజన్న సిరిసిల్లా జిల్లా తంబళ్లపల్లెలో 65 సంవత్సరాల కిందట జన్మించారు జూకంటి జగన్నాథం. తెలంగాణ తొలిదశ ఉద్యమం తర్వాత ఎమర్జెన్సీ దరిమిలా కలం పట్టిన వాళ్లలో అగ్రగామి జగన్నాథం. నాలుగున్నర నాల్గున్నర దశాబ్దాలుగా కవిగా కథకుడిగా జూకంటి అలుపు లేకుండా తెలంగాణ నేలతల్లి ఆత్మని ఆవిష్కరిస్తున్నాడు. తెలంగాణ ‘తల్లి కొంగు’ పట్టుకు నడుస్తూనే దేశం మొత్తాన్ని అంగడి సరుకుగా మార్చిన పాలకుల ప్రజా వ్యతిరేక రాజకీయాల్ని ఆయన తన కవిత్వంలో ఎంతో ఆగ్రహంతో ఆవేదనతో చిత్రించారు. ప్రపంచీకరణ ప్రయోగ శాలలో సామాజిక సంపదని వ్యక్తుల పరం చేసిన ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ రహస్యాల్ని ఆయన కవిత్వంలో బట్టబయలు చేశాడు. మనవ సంబంధాల్లోని పరాయీకరణ మూలాల్ని జూకంటి బలంగా పట్టుకున్నారు. ఆయన కవిత్వంలో తెలంగాణ నుడికారం వింత హొయలు పోతుంది. 14 సంపుటాల జగన్నాథం కవిత్వం నిండా ఇక్కడి ప్రజల గుండె గోస వినిపిస్తుంది. ఆయన కవితలెన్నో కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘వైపని’ కథకుడిగా ఆయన విలక్షణమైన గొంతు వలస వేదనని పలికింది. కథలోనైనా కవిత్వంలోనైనా మనిషి, సమాజం ఆయన జీవధాతువు. మలిదశ ప్రత్యేక రాష్ట్రోద్యమం బలంగా నడుస్తున్న కాలంలో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా (2007-2013) బాధ్యతలు నిర్వహించిన జూకంటి ప్రస్తుతం అఖిల భారత తెరవే అధ్యక్షులు.
సత్యోదయ్
సత్యోదయ్ అనే కలం పేరుతో కవిత్వం రాసే ఉదయ భాస్కర్ బండి స్వస్థలం వరంగల్లు. ముప్పయి ఆరేళ్ల ఈ యువకవి వృత్తి రీత్యా కంప్యూటర్ నిపుణులు. ప్రవృత్తి రీత్యా కవి. కవిత్వంలో నూతన అభివ్యక్తి ఈయన సొంతం. ఆధునిక జీవితంలో చోటు చేసుకుంటున్న అనేక వైరుధ్యాల్ని అర్థం చేసుకోడానికి, వాటిని కవిత్వంలోకి తర్జుమా చేయడానికి కొత్త ప్రతీకలనూ, అభివ్యక్తినీ డిక్షన్ని రూపొందించుకున్నారు. ఆధునికతలో దాగున్న పురాతన మానవుడి మౌలికమైన ఆలోచనల్ని సత్యోదయ్, కొత్త పదచిత్రాల ద్వారా తన కవిత్వంలో ఆవిష్కరించారు. అది ‘వ్యతిరిక్త ప్రవాహం’ సంపుటిగా వెలువడింది.