-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాన్ని 2021 ఏప్రిల్ 10, 11 తేదీల్లో మచిలీపట్టణంలోని వేడుక ఏసీ ఫంక్షన్ హాల్లో జరపాలని సంకల్పించాం. ఈ సందర్భంగా ‘మారిపోతున్న సామాజిక విలువలు - జాతి చైతన్యంలో రచయితల పాత్ర, కృష్ణాజిల్లా సాహితీ చైతన్యం’ తదితర అంశాల మీద సదస్సులు నిర్వహిస్తున్నాం. కవి సమ్మేళనాలు, సాహితీ కార్యక్రమాలతో పాటు స్వర్ణోత్సవ సంచికగా ఒక పరిశోధక గ్రంథ ఆవిష్కరణ, కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారాలు, వృద్ధ సాహితీ మూర్తుల సత్కారాలూ ఉంటాయి. ఈ స్వర్ణోత్సవంలో పాల్గొనాలనుకునేవారు 2021 మార్చి 10 లోపు ప్రతినిధిగా తమ పేరు నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. ప్రతినిధిగా నమోదైన వారికి మాత్రమే స్వర్ణోత్సవాల సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వారికే స్వర్ణోత్సవ ప్రశంసా పత్రం, భోజన, ఉపాహారాలు ఉంటాయి. నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతినిధిగా నమోదు కోసం మీ పేరు, చిరునామా, ఫోను నంబర్లను మాకు ఉత్తరం, ఎస్సెమ్మెస్, లేదా మెయిల్ ద్వారా మాత్రమే పంపించాలి. వాట్సప్, టెలిగ్రాంలలో పంపవద్దు. మీ వివరాలు అందగానే, ప్రతినిధిగా నమోదైనట్టు మీకు తెలియజేస్తాము. వసతి కోరుకునేవారు అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శిని ముందుగా సంప్రదించాలి. కరోనా కట్టడి నియమాల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులకు మాత్రమే అవకాశం కాబట్టి, గడువులోగా పేర్లు నమోదు చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని మనవి. కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ ప్రతినిధులుగా నమోదైన వారికి త్వరలోనే తెలియజేస్తాము.
భాషోద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ కృష్ణాజిల్లా రచయితల సంఘం నాలుగు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒకసారి జాతీయ తెలుగు రచయితల మహాసభలు, పది పర్యాయాలు కృష్ణాజిల్లా రచయితల మహాసభలు, పదిహేను జాతీయ సదస్సులు నిర్వహించింది. ప్రజల గుండె తలుపులు తడుతూ రచయితల పాదయాత్రలు జరిపింది. ఇరవైకి పైగా పరిశోధనా గ్రంథాలు ప్రచురించింది. వీటన్నింటి విజయవంతంలో మీ సహకారం మరవలేనిది. ఈ స్వర్ణోత్సవాన్నీ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణోత్సవానికి సంబంధించి మీ సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాము.
స్వర్ణోత్సవాల కార్యాలయం చిరునామా:
కృష్ణాజిల్లా రచయితల సంఘం, 24-388, గృహప్రియ ఫుడ్స్ భవనం, రామానాయుడుపేట సెంటర్, మచిలీపట్టణం 521001
ఇట్లు
- గుత్తికొండ సుబ్బారావు, కృష్ణాజిల్లా రచయిత సంఘం అధ్యక్షులు, 9440167697
ఈమెయిల్: guttikondasubbarao@gmail.com
- జి.వి.పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, 9440172642
ఈమెయిల్: purnachandgv@gmail.com