Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation

తెలుగు వెలుగు కోసం...


samp-2
ramoji foundation

అమ్మభాష ఎంతో తియ్యన. అది ప్రేమ చెమ్మ తగిలిన రుచులూరే గోరుముద్దల బువ్వ. తేనెకన్నా జున్నుకన్నా కలకండకన్నా మధురమైనదని విదేశీయులు సైతం ప్రస్తుతించిన తెలుగు, నేడు వన్నె తరిగి మన్నన కొరవడి చిన్నబోతుండటం భాషాభిమానులందరినీ ఖిన్నుల్ని చేస్తోంది. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు' అంటూ ఒకప్పుడు కైమోడ్పులందుకున్న భాషకు సేద తీర్చి సాంత్వన కూర్చి గత ప్రాభవ పునరుద్దరణకు శాయశక్తులా పాటుపడటం మన తక్షణ కర్తవ్యం. కదలబారుతున్న భాషా పునాదులను గట్టి పరచి, మకరందాల ఊటను రేపటితరాలు కోల్పోకుండా చూసేందుకు- తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువు 'ఈనాడు' నిష్టగా చేపట్టిన నిబద్ద కృషి 'తెలుగు వెలుగు'.
      'మరో జన్మంటూ ఉంటే మళ్లీ తెలుగు మాతృభాషగా కావాలి, ఉండాలి' అని కోరుకున్నారు రాయప్రోలువారు. ఆ రుచి తెలియక, అంతటి అనురక్తి లేక నేటితరం విద్యార్థుల్లో అత్యధికులు మాతృభాషలో రాయలేని, పట్టుమని పది వాక్యాలు మాట్లాడలేని దుస్థితిలోకి కూరుకుపోతున్నారు. ఇళ్లలో అమ్మ, నాన్న పిలుపులే కాదు- అత్తయ్య, బాబాయి, మావయ్య, పెదనాన్నలాంటి వరసలూ వినిపించడం లేదు. ఈ దుస్థితికి తెలుగు వర్ణమాల బిత్తరపోతోంది! మాతృభాషలో ప్రాథమిక విద్య నేర్వని ఏ పిల్లవాడైనా మేధావిగా ఎదగలేడన్నది ప్రామాణిక సత్యం. ఈ యథార్థాన్నీ గ్రహించలేని స్థితికి తల్లిదండ్రుల్ని నెట్టుకుపోతున్న సంక్లిష్ట వాతావరణంలో తెలుగు జిలుగులు విరజిమ్మేందుకు దోహదపడటం- ఏటికి ఎదురీత, కత్తి మీద సాము. అలాగని తటపటాయించడానికి, చేతులు కట్టుకు కూర్చోవడానికి ఇక ఎంతమాత్రం వీల్లేదు. మన భాషను సంస్కృతిని నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం, జాప్యం, అలసత్వం- తెలుగు జాతి ఉనికికీ మనికికీ పెను ప్రమాదం.
      ఆరులక్షల పదాలున్న తెలుగు, తమిళం వంటివి రెండున్నర లక్షల పదాలు కలిగిన ఆంగ్లంకంటే సంపన్న భాషలనేవారు రామ్మనోహర్ లోహియా. కేవలం వాడుకలో లేకపోవడంవల్లే మన మాటలు, భాషలు వెనకబడుతున్నాయన్నది ఆయన ఫిర్యాదు. కొన్నేళ్ళుగా ఈ పతనవేగం పెరగడం చూస్తూనే ఉన్నాం. ఆ జోరుకు అడ్డుకట్ట వేయడమే 'తెలుగు వెలుగు' తొలి లక్ష్యం. 
      కర్ణాటక, మహారాష్ట్రలకన్నా ముందే స్వభాషా ఉద్యమం మొగ్గతొడిగిన గడ్డ ఇది. నాటి ఉద్యమ స్పూర్తిని తిరిగి పొంగులు వారించేలా చేయగల అపార పదసంపద, ప్రాభవ చరిత మనకున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం, అనంతరమూ ప్రతిష్టాత్మక పత్రికలెన్నో మన ప్రాచీన, ఆధునిక భాషాసాహిత్యాలను పరిపుష్టీకరించడంలో కీలకమయ్యాయి. ఆ కోవలోనే... భాషాభిమానులందరికీ వేదికగా నిలవాల్సిన బృహత్తర బాధ్యతను ఇప్పుడు 'తెలుగు వెలుగు' స్వీకరిస్తోంది. 
      అన్నమయ్య రాసిన 32వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుమలవాసుడి చేరువన ఒక చీకటికొట్లో పడి ఉన్న సంగతి ఏడు దశాబ్దాల క్రితం వరకు ఎవరికీ తెలియదు. తేటతెలుగు తీయందనాన్ని చవులూరించేలా అక్షరీకరించిన అలాంటి మరుగున పడ్డ మాణిక్యాల వెలికితీతా నిరంతర యజ్ఞంగా సాగాలి. 'బావా ఎప్పుడు వచ్చితీవు...' లాంటి పద్యాలు జనం నాలుకల మీద కదలాడేవి. అలా చేసిన తిరుపతి వేంకట కవుల వంటి ప్రతిభామూర్తుల రచనలతోపాటు త్యాగయ్య పంచరత్నాలు, కదిరీపతి శుకసప్తతి, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు, రంగాజమ్మ యక్షగానం, ఎన్నెన్నో నీతి శతకాలు... తెలుగు భాషను సుసంపన్నం చేశాయి. సౌష్టవం చేకూర్చాయి. అంతటి విలువైన సంపదను చేజార్చుకోకూడదు. తల్లినుడి పై స్పానిష్ ప్రజల విశేష అభిమానమే ఆ భాషాభివృద్ధికి అమేయంగా దోహదపడుతున్నట్లు అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి. అంతకు మించిన పట్టుదలతో తెలుగువారందరం కంకణ బద్దులం కావాల్సిన తరుణమిది.
      మన భాషా సాహిత్యాలను నిలబెట్టుకోవడానికి 'తెలుగు వెలుగు' తల పెట్టిన బృహత్ యజ్ఞానికి- 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...' అంటూ విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కలిసి వస్తారని దృఢంగా విశ్వసిస్తున్నాము.

bal bharatam