హాంగ్‌ కాంగ్‌లో తెలుగు సంస్కృతోత్సవం!

హాంగ్‌ కాంగ్‌లో తెలుగు వారందరు కలిసి సంక్రాంతి పండగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తెలుగు సాంస్కృతికోత్సవంలో పిల్లలు అనేక నృత్య - నాటికలు ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్‌ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు సామెతలు, శ్లోకాలు - పద్యాలని చిన్నారులు ముద్దు ముద్దుగా చెబుతుంటే అందరి హృదయాలు కరతాళ ధ్వనులు చేశాయి. తెలుగు సినిమా పాటలకు కూడా చిన్నారులు నృత్యాలు చేశారు.  
    ‘బుజ్జాయిలతో భోగి’ కార్యక్రమాన్ని హాంగ్‌ కాంగ్‌ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షకురాలు జయ పీసపాటి గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లాంటౌ ఐలాండ్‌లోని టుంగ్‌ చుంగ్‌లో ఉన్న బుజ్జి బుజ్జి పిల్లలకు  సంబరంగా భోగిపళ్లు పోశారు. ముచ్చటగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇంటికి దూరంగా ఉన్నా, కొంత బెంగ తీరిందని ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఈ సందర్బంగా జయ పీసపాటి మాట్లాడుతూ.. యునెస్కో  శాంతి, సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా తాము ఇండో - చైనీస్‌ ఫ్యూజన్, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నామని చెప్పారు.