కువైట్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. కువైట్‌ మహా నగరంలోని సముద్ర తీరాన ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు స్వాతంత్ర్య వేడుకల్ని వైభవంగా నిర్వహించుకున్నారు. కువైట్‌లో భారత రాయబారి జీవసాగర్‌ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులంతా జైహింద్‌ నినాదాలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీకి పూలమాలలు వేసి ఆయన త్యాగాల్ని స్మరించుకున్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పంపిన సందేశాన్ని అంతా విని ఆనందించారు. ఈ సందర్భంగా జీవసాగర్‌ మాట్లాడుతూ.. భారతీయులు తమ తెలివితేటలతో, విశ్వాసపాత్రంగా ఉంటూ కువైట్‌లో మంచి పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు. చట్టాలను గౌరవిస్తూ మనుగడ సాగించాలని విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని.. అన్ని రాష్ట్రాల ప్రజలకు సమభావనతో సేవలందిస్తోదని చెప్పారు. అనంతరం తెలుగు, తమిళ, మళయాల, హిందీ, అస్సామీ తదితర భారతీయ సంఘాలకు చెందినవారు ఆలపించిన దేశభక్తి గేయాలు అందరినీ అలరించాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ పెండ్యాల ఝాన్సీరాణి, వాణీ శ్రీపాదరావు, వర్ధిని చివుకుల, సునీత నాయిని, జ్యోతి సింగనమల బృందగానం ఆలపించి ఆహూతుల మన్ననలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ హోటళ్లు ఉచితంగా ఫలహారాలను పంచి అతిథులను ఆనందపరిచాయి.

- పెండ్యాల వెంకటేశ్వరరావు, కువైట్‌