ఎక్కడో పాకిస్థాన్లోని చీనాబ్ నదీతీర వాసులు.. మన గోదావరి చెంతకు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. దశాబ్దాల నుంచి కష్టాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. అయితే.. వాళ్లు తమ భాషను మర్చిపోలేదు. సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టలేదు. కాలప్రవాహంలో సంవత్సరాలకు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతున్నా, తమదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. వారే.. ఆదిలాబాదు జిల్లాలోని ముల్తానీలు.
నేటి పాకిస్థాన్లోని పంజాబు ప్రాంతానికి చెందిన ముల్తానీలు ఏనాడో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. దిల్లీ, పంజాబు, మహారాష్ట్రలోని ఖండాల, మర్వాడ, పూసద్, అంబజోగి, పర్బనీ, చిక్లి, మధ్యప్రదేశ్లోని సాకూర్, హిసర్దాస్టేషన్, రాజస్థాన్లోని సూరజ్, తెలంగాణలోని మోడ్తాడ్ ప్రాంతంతో పాటు ఆదిలాబాదు జిల్లాలోని ఇచ్చోడ మండలంలో వీళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ మండలంలో దాదాపు 15 వేల మందికి పైగా ముల్తానీలు కనిపిస్తారు. గుండాల, కేశవ్పట్నం, ఎల్లమ్మగూడ, జోగిపేట, సిరికొండ తదితర గ్రామాల్లో వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ వీరు జీవిస్తున్నారు. అప్పట్లో సర్దార్ అలీ అనే ఉద్యోగితో పాటు ఆంగ్లేయుడు హైమన్డార్ఫ్లు కొలాం, గోండు గిరిజనులతో పాటు ముల్తానీల సంక్షేమానికి కృషిచేశారు. ముల్తానీలకు గిరిజనులుగా గుర్తింపు ఇప్పించడంతో పాటు 4365 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కేటాయింపజేశారని కేశవ్పట్నం ముల్తానీ పెద్దలు షేక్ గులాంనబీ, షేక్ ఈసా చెప్పారు. ఏజెన్సీ చట్టం తర్వాత తాము ‘గిరిజనేతరులం’ అయ్యామన్నది వారి వాదన.
పశువులు, మేకలను మేపుకుంటూ సంచార జీవులుగా ముల్తానీలు ఈ గడ్డ మీదకి వచ్చారు. క్రమేణా స్థిరనివాసితులయ్యారు. వీళ్ల భాష బంజారా పలుకుకు దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకు బంజారాల మాదిరిగానే అమ్మను ‘అయ్యు’ అని అంటారు. అలాగే, దాన్ (ఆహారం), బా (తండ్రి), పుపు (అత్త), చోరి- ఛోరా (పిల్లలు)... ఇలా చాలా పదాలు ఈ రెండు భాషల్లోనూ ఒకేలా ఉంటాయి. ‘ఖానా ఖాల్దొకా’ (అన్నం తిన్నావా) లాంటి వాక్యాలూ రెండింట్లోనూ కలుస్తాయి. భాషతో పాటు బంజార మహిళలు ధరించే ఘాగ్రా, గూంఘట్, చెవులకు దిద్దులు, కమ్మలు, మోచేతి వరకు గాజులు, మెడలో అనేక రకాల హారాలు.. ముల్తానీ స్త్రీల వేషధారణలోనూ కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వీటిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ముల్తానీలు ముస్లిం సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. రోజుకు అయిదు సార్లు మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. రంజాన్ రోజుల్లో ఉపవాసదీక్షలు పాటిస్తారు. బక్రీద్ వేడుకలు నిర్వహిస్తారు. వివాహం లాంటి సందర్భాల్లోనూ పూర్తిగా ముస్లిం పద్ధతులనే అనుసరిస్తారు. అయితే, ఏటా అక్టోబరు 27న జరుపుకునే ‘ఉర్సు’ ఉత్సవాలు మాత్రం వీళ్లకి ప్రత్యేకం. గ్రామాల్లో ఆ రోజు సామూహికంగా భోజనాలు చేసి, ఖవ్వాలీలతో సంతోషంగా గడుపుతారు.
మెరుగైన జీవితాల కోసమో.. భద్రత కోసమో ఇంత దూరం వలసవచ్చారు ముల్తానీలు. కానీ, వాళ్ల నివాస ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ఒకరిద్దరు ముల్తానీ నాయకులు తప్ప మిగతావారంతా పేదలే. ఆదిలాబాదు జిల్లాలోని ముల్తానీల్లో ఒక ఉద్యోగి కూడా లేడు. కనీసం డిగ్రీ, ఆపై చదివిన యువత లేరు. ఆరేడు తరగతులు పూర్తికాగానే పిల్లలు వ్యవసాయ పనుల్లోకి దిగిపోతున్నారు. లేకపోతే పశువుల కాపరులుగా మారుతున్నారు. పాలకులు ప్రత్యేక దృష్టి సారిస్తేగానీ ముల్తానీల జీవితాల్లో వెలుగులు నిండవు. దాంతో పాటు వీళ్ల భాషా సంస్కృతులనూ పరిరక్షించాలి.